Parliament: ఎన్‌ఎంపీ కింద ఎన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నారు?
బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్–ఎన్‌ఎంపీ) కార్యక్రమం కింద వచ్చే మూడేళ్లలో దాదాపు 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని(మానిటైజ్ చేయాలని) కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 9న కేంద్ర రహదారులు, పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్ లోక్‌సభకు తెలిపారు. ఎంపీ మిమీ చక్రవర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వీకే సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తిరుపతి ఎయిర్‌పోర్ట్ కూడా..
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించనున్న 25 విమానాశ్రయాలలో... భువనేశ్వర్, వారణాసి, అమృతసర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్‌పూర్, కాలికట్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మధురై, సూరత్, రాంచీ, జోధ్‌పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి(రేణిగుంట), హుబ్లి, ఇంఫాల్, అగర్తల, ఉదయపూర్, డెహ్రాడూన్, రాజమండ్రి విమానశ్రయాలు ఉన్నాయి.
2025 ఏడాదిలోపు..
దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను మానిటైజ్ చేయడం ద్వారా 2025 ఏడాది నాటికి సుమారు రూ. 20,782 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2021, ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 137 విమానాశ్రయాలలో నాలుగు విమానాశ్రయాలు మినహా అన్నీ కోవిడ్–19 మహమ్మారి కారణంగా నష్టాలను చవిచూశాయి. నాలుగు ఎయిర్‌పోర్ట్‌లలో కందాలా (0.11 కోట్లు), కాన్పూర్ చకేరీ (6.07 కోట్లు), బరేలీ (0.68 కోట్లు), పోర్ బందర్ (1.54 కోట్లు) ఉన్నాయి.
ఎన్‌ఎంపీ అంటే ఏమిటీ?
ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్–ఎన్‌ఎంపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కార్యక్రమం కింద తలపెట్టిన ఎన్‌ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తులను మానిటైజేషన్ చేసి రూ. 6 లక్షల కోట్ల విలువను కేంద్రం రాబట్టనుంది.
ఎన్‌ఎమ్‌పీ–ముఖ్యాంశాలు..
- ఎన్‌ఎమ్‌పీ ద్వారా ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ప్రభుత్వం ‘మానిటైజ్’ చేయనుంది.
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి.
- 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది.
వీటికే పరిమితం..
ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రా అసెట్స్‌కి మాత్రమే ఎన్‌ఎంపీ పరిమితమని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఆయా అసెట్స్ యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వాటిని తప్పనిసరిగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది’’ అని నిర్మల తెలిపారు.
చదవండి: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే మూడేళ్లలో దాదాపు 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : కేంద్ర రహదారులు, పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : ఎన్‌ఎంపీ కింద.. ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్