Swami Vivekananda: స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి.. ఆయన చెప్పిన మాటలు ఇవే..
‘బలమే జీవనం.. బలహీనతే మరణం.. సమస్త శక్తి నీలోనే ఉంది..’ అని ధైర్యాన్ని నూరిపోస్తూ.. ‘లక్ష్యసాధనలో వంద నరకాలైనా అనుభవించేందుకు సిద్ధంగా ఉండు.. కానీ విజయాన్ని సాధించే దాకా విడిచిపెట్టకు..’ అని నిత్యం ప్రేరేపిస్తూ.. ‘అపార విశ్వాసం, అనంత శక్తి.. ఇవే నీ విజయ సాధనకు మార్గాలు..’ అని మార్గదర్శనం చేస్తూ.. యువతను విజయ శిఖరాలకు చేరుస్తున్న రియల్‌హీరో స్వామి వివేకానంద.
కేవలం ఆయన చెప్పిన మాటలే ఎంతోమంది యువతకు ప్రేరణపాఠాలుగా నిలిచాయి. తను అన్న ఒక్కో మాట వందలాదిమంది గుండెల్లో ఇప్పటికీ నిలిచిఉన్నాయి. ‘జీవితంలో ఓడిపోయాను. ఇక దేన్ని సాధించలేను..’ అని అనుకున్న వాళ్లను సైతం ఆయన రాసిన రాతలు విజేతలుగా నిలిపిన సందర్భాలున్నాయి. కేవలం 39ఏళ్ల జీవితంలో భారతజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన శక్తి వివేకానందది. జనవరి 12న ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోనూ వివేకుడి స్ఫూర్తితో ముందడుగేస్తూ.. సేవలు చేస్తున్న వారెందరో ఉన్నారు.
బడిని కట్టారు..
వారంతా యువకులు. బాగా చదువుకున్నారు. తలో ఉద్యోగ, ఉపాధులను చేసుకుంటున్నారు. కానీ.. సమాజసేవను మాత్రం విస్మరించలేదు. తాము సంపాదిస్తున్న చిన్నపాటి సంపాదనలో నుంచే కనీసం పదిశాతం సమాజసేవకు వెచ్చిస్తున్నారు. వాళ్లే.. నిర్మల్‌కు చెందిన కొంతం హర్షవర్ధన్, ప్రవీణ్, అజర్, రాహుల్, రాకేశ్, పవన్. వీరంతా కలిసి పలు సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు.
ప్రచారం లేకుండా..
కనీసం తమకు ప్రచారాన్ని కూడా ఆశించకుండా ఈ యువత చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. సారంగపూర్ మండలం రవీంద్రనగర్ తండాలో ఏడాదిక్రితం వరకు కనీసం బడికి సరైన గది లేదు. విద్యార్థులు కింద మట్టిలోనే కూర్చునేవారు. ఈ పరిస్థితిని గమనించిన ఈ స్నేహితులు వెంటనే ముందుకు వచ్చారు. తలా కొంత జమచేసిన మొత్తంలో నుంచి రూ.లక్షా 30వేలు ఖర్చుచేసి ఓ తరగతిగదిని కట్టారు. అవును.. ఈ గదిని కూడా వారే స్వయంగా పనిచేసి కట్టి ఇవ్వడం విశేషం.
విద్యార్థుల చెంతకు వివేకుడు..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన కౌటిక శ్రీనివాస్ నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్నాడు. విద్యార్థి దశ స్వామి వివేకానందుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. తనకు వచ్చే చిన్నపాటి వేతనంలో నుంచే ప్రతీ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున అందిస్తున్నాడు. పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేస్తున్నాడు. వివిధ కార్యక్రమాలు, పోటీలు పెడుతూ యువతకు వివేకానంద పుస్తకాలు అందిస్తున్నారు.
నరేంద్రుడి మాటలే ప్రేరణ..
చిన్నతనం నుంచే స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటికీ ఎప్పటికీ యువత, విద్యార్థుల కు నరేంద్రుడి మా టలు ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. తను చెప్పిన ప్రతీ విషయాన్ని వీలైనంత ఎక్కువమందికి చేర్చాలన్నదే నా ప్రయత్నం. – కౌటిక శ్రీనివాస్, ఆరోగ్యశ్రీ ఉద్యోగి, నిర్మల్