Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 25th కరెంట్ అఫైర్స్
World Air Quality Index : ఆసియా టాప్ - 10 కాలుష్య నగరాల్లో.. 8 భారత్ లోనే
ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి.
ISRO LVM 3 - M2 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. అక్టోబర్ 22న అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్‌సెంటర్ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్(ఎల్‌ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్, భారతి ఎంటర్‌ప్రైజెస్ భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్‌వెబ్‌తో న్యూస్పేస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్‌వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్ సేవలు అందించే గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది.
రాకెట్ పేరు మార్చారు
జీఎల్‌ఎల్‌వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్‌వెహికల్ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్‌ఎల్‌వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్ జీటీవోకి పంపట్లేదు. ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్‌ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్‌వెహికల్ ఎం3–ఎం2 రాకెట్ సొంతం.
ప్రయోగం ప్రత్యేకతలు
- ∙36 శాటిలైట్ల మొత్తం బరువు 5,796 కేజీలు.
- ∙ఇంతటి బరువును 43.5 మీటర్ల ఎత్తయిన ఒక భారతీయ రాకెట్ మోసుకెళ్లడం ఇదే తొలిసారి.
- ∙ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్‌తో తొలి వాణిజ్యపరమైన ప్రయోగం
- ∙ఈ రకం రాకెట్‌తో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాలు పంపడం ఇదే ప్రథమం
ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం
ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు.
చంద్రయాన్, గగన్‌యాన్ ఈ రాకెట్‌తోనే...
చంద్రయాన్–3 ప్రయోగానికి ఎం3–ఎం2 రకం రాకెట్‌నే వాడతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్‌కు సంబంధించి మానవ రహిత ప్రయోగం, మానవ సహిత ప్రయోగాన్ని ఈ రాకెట్‌లతో నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4 ప్రయోగాలకు చేస్తామన్నారు. నవంబర్ మొదట్లో పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్ ద్వారా ఓషన్‌శాట్ 3, డిసెంబర్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2, జీఎస్‌ఎల్‌వీ మార్క్2 రాకెట్ ద్వారా 4 నావిగేషన్ ఉపగ్రహాలు, పీఎస్‌ఎల్‌వీ సీ55 రాకెట్ ద్వారా సూర్యునిపై శోధనకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహ ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు. వన్‌వెబ్‌కు చెందిన మరికొన్ని శాటిలైట్లను 2023 తొలినాళ్లలో ప్రయోగిస్తామని ఇస్రో వెల్లడించింది. అంతకుముందు శుక్రవారం రాత్రి స్పేస్‌సెంటర్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్ విజయవంతంకావడంతో వాణిజ్యపరంగా ఇస్రోకు ఇది భారీ ఆదాయాన్ని తెచి్చపెట్టే అంతరిక్ష ఆయుధంగా మారింది. వాణిజ్యపర ప్రయోగాలకు ఇన్నాళ్లూ పీఎస్‌ఎస్‌వీ రాకెట్లు వాడారు.
China President : వరుసగా 3వసారి ఎన్నికైన జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే! బీజింగ్‌లోని ఆర్నేట్ గ్రేట్ హాల్‌లో అక్టోబర్ 23న సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీ జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగింది. 203 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు. జిన్‌పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 24 మందితో సీపీసీ పొలిట్‌బ్యూరోకూ సెంట్రల్ కమిటీ ఆమోదముద్ర వేసింది. జిన్‌పింగ్ సహా ఏడుగురు సభ్యులతో అత్యంత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జిన్‌పింగ్ మద్దతుదారులకే స్థానం దక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యాయని జిన్‌పింగ్ స్వయంగా ప్రకటించారు. సీపీసీ షాంఘై అధ్యక్షుడు లీ ఖియాంగ్.. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. చైనా ప్రీమియర్ (ప్రధానమంతి) లీ కెఖియాంగ్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రీమియర్‌గా లీ ఖియాంగ్ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడతారు?
కమ్యూనిస్ట్ పార్టీ.. చైనా ప్రజలకు వెన్నెముక
ప్రపంచానికి చైనా అవసరం, చైనాకు ప్రపంచం అవసరం ఉందని షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికి చైనా కావాలని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థ నమ్మదగినది, స్వేచ్ఛాయుతమైనది అని పేర్కొన్నారు. పునాది బలంగా ఉందని వివరించారు. దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. మార్క్సిజం వైపు మొగ్గు చూపుతుండడంతోపాటు చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఘన కీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని జిన్‌పింగ్ వివరించారు. మార్గసూచి(రోడ్‌మ్యాప్) తయారు చేసుకున్నామని, శంఖం పూరించామని చెప్పారు. మన దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవికమైన ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
Also read: Supreme Court: ఐటీ చట్టం సెక్షన్ 66-ఏ కింద ప్రాసిక్యూట్ చేయరాదు
మూడు అత్యున్నత పదవులు
అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూర్ మరోసారి నియమించింది. ఆయనకు మూడు అత్యున్నత పదవులు దక్కాయి. దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తారు. పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్‌ఏ) జనరల్స్ ఝాంగ్ యుషియా, హీ వీడాంగ్‌ను సీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించారు. పలువురు సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్ మిలటరీ కమిషన్‌లో సభ్యులుగా అవకాశం లభించింది. ఆదివారం సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ (సీసీడీఐ) స్టాండింగ్ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్‌బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీ ఏది?
అంచెలంచెలుగా...
చైనా అధినేత షీ జిన్‌పింగ్ 1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్‌జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Also read: Top 9 Nuclear Warheads in the World ..
పొగడ్తలు, తెగడ్తలు...
1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగింది.
Also read: National: Weekly Current Affairs Quiz
MICT Badminton : సిక్కి జోడీకి టైటిల్
మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. అక్టోబర్ 23న జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–16, 21–18తో టాప్ సీడ్ తనీనా–కొసీలా మామెరి (అల్జీరియా) ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆకర్షి కశ్యప్ (భారత్) 24–22, 21–12తో ఇరా శర్మ (భారత్)పై నెగ్గి విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–23, 21–19, 21–17తో చలోంపన్–నాంతకర్న్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచి టైటిల్ దక్కించుకుంది.
T20 World Cup 2022 : పాకిస్తాన్ పై భారత్ విజయం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్ - 12, గ్రూప్ - 2 లో తమ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడిన భారత్.. చిరస్మరణీయ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్‌బోర్న్‌లో ప్రతీకారం తీర్చుకుంది.
Flying Saucer : గుట్టు తేల్చేందుకు నాసా కమిటీ
గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్‌ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్‌ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్‌ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమరి్పస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది.
Also read: Vitamin: General Science Biology..
ఇటలీ ప్రధానిగా Giorgia Meloni ప్రమాణం
నాజీ సిద్ధాంతాలను బలంగా నమ్మే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని (45) అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అతివాద నేత ప్రధాని కావడం ఇదే తొలిసారి. ఇటలీ తొలి మహిళా ప్రధానిగానూ ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని ఐదుగురు టెక్నోక్రాట్స్‌ను మంత్రులుగా నియమించుకున్నారు.
PM Rojgar Mela : 75,000 మందికి నియామక పత్రాలు
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 10 లక్షల కొలువుల భర్తీకి ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 22న లాంఛనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఉద్యోగాల సృష్టికి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయన్నారు.
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
‘‘అంతర్జాతీయంగా పరిస్థితి బాగాలేదు. పెద్ద ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. కరోనా వంటి మహమ్మారుల దుష్పరిణామాలు కేవలం 100 రోజుల్లో అంతమైపోవు. కరోనా వంటి సమస్యల నుంచి దేశాన్ని కాపాడడానికి ఎన్నో చర్యలు చేపట్టాం. మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి గత ఎనిమిదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలు అందజేస్తున్నాం. యువత కోసం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. ఈ దిశగా ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముఖ్యమైన మైలురాయి. యువతలో నైపుణ్యాలు పెంచి.. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలను పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా..
డ్రోన్ పాలసీని సరళీకృతం చేశాం. స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్షంపై పరిశోధనలకు ప్రైవేట్ సంస్థలకూ అవకాశం కల్పించాం. ముద్ర పథకం కింద రూ.20 లక్షల కోట్ల రుణాలిచ్చాం. ‘స్టార్టప్ ఇండియా’తో మన యువత దుమ్ము రేపుతోంది. మనదేశం చాలా రంగాల్లో దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా ఎదుగుతుండడం సంతోషకరం. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఉచితాలు పోవాలి: మోదీ
దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశాలను ఆయన రిమోట్ నొక్కి ప్రారంభించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్‌పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఉచితాలకు అడ్డుకట్ట పడాలని ఎంతోమంది కోరుకుంటున్నారని తెలిపారు. పీఎంఏవై కింద ఎనిమిదేళ్లలో 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామన్నారు. ఆ ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని పిలుపునిచ్చారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP