Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 19 కరెంట్‌ అఫైర్స్‌

Smoking

Smoking: అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశం?

ప్రపంచదేశాల్లో పదహారు నుంచి 64 ఏళ్ల వయసు వారు అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశాల్లో చైనా తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో నిలిచాయి. ‘ది ఇంటర్నేషనల్‌ కమిషన్‌ టు రీఇగ్నైట్‌ ది ఫైట్‌ ఎగెనెస్ట్‌ స్మోకింగ్‌’ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచబ్యాంకు తదితర సంస్థల నుంచి సేకరించిన గణాంకాలను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

నివేదిక ప్రకారం..

  • చైనా, భారత్‌లలో 16–64 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 50 కోట్ల మందికిపైగా పొగాకు తాగే అలవాటు ఉంది.
  • భారత్‌లో 25 కోట్ల మందికి పొగరాయుళ్లు ఉన్నారు. అధికంగా పొగాకు వినియోగిస్తున్న 16–64 ఏళ్ల జనాభా విభాగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.
  • ఇండియాలో మహిళల కంటే పురుషుల్లో పొగాకు వాడకం మూడు రెట్లు ఎక్కువ
  • పొగ తాగే అలవాటును త్యజించాలని భావించే జనాభా భారత్‌లో తక్కువే.
  • భారత్‌ పొగతాగడాన్ని వదిలేయాలని 37 శాతం మంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
  • భారత్‌లో స్మోకింగ్‌ను వదిలేస్తున్న పురుషుల శాతం ఇంకా 20శాతం లోపే ఉంది
  • పొగాకు నమలడం ద్వారా వచ్చే నోటి క్యాన్సర్‌ వంటి ఘటనలు భారత్‌లోనూ భారీగానే నమోదవుతున్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా దాదాపు 114 కోట్ల మంది పొగాకుకు బానిసలుగా మారారు. దీంతో ఏటా 80 లక్షల మంది రోగాలబారిన పడి తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
  • పొగాకు కారణంగా ఆర్థిక, సామాజిక అసమానతలు తలెత్తి ప్రపంచంలో ఏటా దాదాపు 2 ట్రిలియన్‌ డాలర్ల ప్రజాధనం ఖర్చవుతోంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : 16 నుంచి 64 ఏళ్ల వయసు వారు అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశాల్లో చైనా తర్వాత రెండో స్థానంలో భారత్‌.
ఎప్పుడు  : నవంబర్‌ 18
ఎవరు    : ది ఇంటర్నేషనల్‌ కమిషన్‌ టు రీఇగ్నైట్‌ ది ఫైట్‌ ఎగెనెస్ట్‌ స్మోకింగ్‌ సంస్థ
ఎక్కడ    : ప్రపంచ దేశాల్లో...

Badminton: బీడబ్ల్యూఎఫ్‌ అవార్డుకు ఎంపికైన భారత క్రీడాకారుడు?

Prakash Padukone

భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పడుకోన్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సముచిత రీతిలో గౌరవిస్తూ ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’కు ఎంపిక చేసింది. 1980లో ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ ప్రకాశ్‌ పడుకోన్‌ ఆ తర్వాత 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. రిటైర్మెంట్‌ తర్వాత కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ఓజీక్యూ ఫౌండేషన్‌ ద్వారా క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు.

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌–2021 ట్రోఫీ విజేత?
సీజన్‌ చివరి టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌–2021లో స్పెయిన్‌ తార గాబ్రిన్‌ ముగురుజా మెరిసింది. నవంబర్‌ 18న మొక్సికోలోని జపోపాన్‌లో జరిగిన ఫైనల్లో ముగురుజా 6–3, 7–5తో అనెట్‌ కొంటావీట్‌ (ఎస్టోనియా)పై గెలుపొంది తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా ఈ టోర్నీని నెగ్గిన తొలి స్పెయిన్‌ క్రీడాకారిణిగా ముగురుజా చరిత్రకెక్కింది. 1993లో అరంటా సాంచెజ్‌ వికారియో ఫైనల్లో ఓడింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’కు ఎంపికైన భారత క్రీడాకారుడు?
ఎప్పుడు : నవంబర్‌ 18
ఎవరు    : భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పడుకోన్‌
ఎక్కడ    : బ్యాడ్మింటన్‌ క్రీడలో విశేష ప్రతిభ కనబరిచినందుకుగాను..

Dhaka: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?

Jyothi Surekha

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2021లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం పతకం సాధించింది. మహిళల కాంపౌండ్‌ విభాగంలో నవంబర్‌ 18న జరిగిన ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్‌ యూహ్యూన్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

రిషభ్‌ యాదవ్‌ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
మరోవైపు పురుషుల కాంపౌండ్‌ విభాగంలో భారత ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ రజతాన్ని సాధించాడు. ఫైనల్లో అతడు 148–149తో కిమ్‌ జోంగ్‌హూ (కొరియా) చేతిలో ఓడాడు. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సురేఖ– రిషభ్‌ యాదవ్‌ (భారత్‌) జంట 154–155తో కిమ్‌ యున్‌హీ–చోయ్‌ యాంగ్‌హీ (కొరియా) ద్వయం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2021లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?
ఎప్పుడు : నవంబర్‌ 18
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ
ఎక్కడ    : ఢాకా, బంగ్లాదేశ్‌
ఎందుకు  : మహిళల కాంపౌండ్‌ విభాగంలో ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్‌ యూహ్యూన్‌పై విజయం సాధించినందున..

World Bank: ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశం?

remittances-india

విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడం(రెమిటెన్సులు)లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశంగా భారత్‌ నిలిచింది. ఈ విషయాలను వాషింగ్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ మేరకు నవంబర్‌ 18న ఒక నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాదిలో రెమిటెన్సుల రూపంలో భారత్‌కు రానున్న మొత్తం 87 బిలియన్‌ డాలర్లని (2020లో ఈ విలువ 83 బిలియన్‌ డాలర్లు) ప్రపంచబ్యాంక్‌ నివేదిక పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • భారత్‌ తర్వాత భారీగా రెమిటెన్సులు పొందుతున్న దేశాల్లో వరుసగా చైనా, మెక్సికో, ఫిలిప్పైన్స్, ఈజిప్టు ఉన్నాయి.
  • భారత్‌కు రెమిటెన్సులు 2022లో 3 శాతం పెరిగి 89.6 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని అంచనా.  
  • దిగువ, మధ్య స్థాయి ఆదాయ దేశాలకు  రెమిటెన్సుల మొత్తం 2021లో 7.3 శాతం పెరిగి 589 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.  
  • 2020తో పోల్చితే రెమిటెన్సుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండే వీలుంది. కోవిడ్‌–19 సవాళ్ల తీవ్రత తగ్గడం దీనికి కారణం.
  • కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో పలు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ ఇబ్బందుల పరిష్కారానికి, సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వ నగదు బదిలీ కార్యక్రమాలకుతోడు రెమిటెన్సుల తోడ్పాటు ఎంతగానో ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశంగా భారత్‌
ఎప్పుడు : నవంబర్‌ 18
ఎవరు    : ప్రపంచ బ్యాంక్‌
ఎక్కడ    : ప్రపంచంలో...
ఎందుకు : విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నందున..

Global Innovation Summit: ఫార్మా రంగ ఆవిష్కరణల తొలి శిఖరాగ్ర సదస్సు

ఫార్మాస్యూటికల్‌ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ నవంబర్‌ 18న ప్రారంభమైంది. వర్చువల్‌ విధానంలో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్‌తో సహా వివిధ దేశాల ప్రముఖులు హాజరైన ఈ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ... భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.

సిడ్నీ డైలాగ్‌లో మోదీ ప్రసంగం..
‘ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూషన్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో నవంబర్‌ 18న నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్‌) ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. క్రిప్టోకరెన్సీ దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఫ్యూచర్‌ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫార్మాస్యూటికల్‌ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగం
ఎప్పుడు  : నవంబర్‌ 18
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రసంగించేందుకు...

Cricket: టి20 ప్రపంచకప్‌–2021లో విజేతగా నిలిచిన దేశం?

Australia Team-T20 world cup 2021

2021 ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్‌(పురుషుల) విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. నవంబర్‌ 14న యూఏఈలోని దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి తొలిసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌ కప్‌ను అందుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్‌ ఫించ్‌ సారథ్యం వహించగా, న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ వ్యవహరించాడు.

రూ. 11 కోట్ల 91 లక్షల ప్రైజ్‌మనీ..
విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు)... రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మొత్తం 289 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా జట్టు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021 ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్‌(పురుషుల) విజేత
ఎప్పుడు    : నవంబర్‌ 14
ఎవరు    : ఆస్ట్రేలియా జట్టు
ఎక్కడ    : దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్, యూఏఈ
ఎందుకు : ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ జట్టుపై విజయం సాధించినందున...

UN World Tourism Awards: యూఎన్‌డబ్ల్యూటీఓ పర్యాటక అవార్డుకు ఎంపికైన గ్రామం?

Bhoodan Pochampally

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి భూదాన్‌పోచంపల్లి గ్రామం ఎంపికైంది. రూరల్‌ టూరిజం, అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏటా ప్రపంచ పర్యాటక సంస్థ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 2021 సంవత్సరానికి భారత్‌ తరఫున తెలంగాణ నుంచి భూదాన్‌పోచంపల్లి, మేఘాలయా నుంచి కాంగ్‌థాంగ్, మధ్యప్రదేశ్‌ నుంచి లద్‌పురాఖాస్‌లు పోటీపడ్డాయి. వీటిలో భూదాన్‌పోచంపల్లి బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా ఎంపికైంది. 2021, డిసెంబర్‌ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్‌డబ్ల్యూటీఓ జనరల్‌ అసెంబ్లీ 24వ సెషన్‌ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వనున్నారు.

భూదానోద్యమానికి అంకురార్పణ..
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో భూదాన్‌పోచంపల్లి గ్రామం ఉంది. కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయమైన ఈ గ్రామానికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది.

సిల్క్‌సిటీగా పేరు..
భూదాన్‌పోచంపల్లి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. టై అండ్‌ డై పద్ధతిలో అంటే సిల్క్‌ దారానికి రంగులద్ది మగ్గాలపై ఇక్కత్‌ వస్త్రాలను రూపొందించడమనే కళ దేశంలో మరెక్కడా లేదు. వారి ప్రతిభతో పోచంపల్లికి ‘సిల్క్‌సిటీ’గా గుర్తింపు వచ్చింది. ఇక్కత్‌ వస్త్రాలకు 2004 జీఐ(పేటెంట్‌) గుర్తింపు వచ్చింది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ నుంచి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) బెస్ట్‌ టూరిజం విలేజ్‌ అవార్డుకు ఎంపికైన గ్రామం?
ఎప్పుడు : నవంబర్‌ 16
ఎవరు    : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి గ్రామం
ఎందుకు : ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున..

Amit Shah: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఎక్కడ జరిగింది?

Southern Zonal Council

ఆద్మాత్మిక నగరి తిరుపతిలో దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) 29వ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన నవంబర్‌ 14న జరిగిన ఈ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు పాల్గొన్నారు. సమావేశంలో అపరిష్కృత అంశాలతోపాటు పలు సమస్యల పరిష్కారాలపై చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు తమ వాదనలు వినిపించారు.

40 అంశాలకు పరిష్కారం..
తాజా  భేటీ సందర్భంగా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌కు సంబంధించి మొత్తం 51 పెండింగ్‌ అంశాలకుగాను 40 అంశాలను పరిష్కరించామని హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశాన్ని సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు. సమావేశాల్లో తెలంగాణ గవర్నర్‌–పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగసామి పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) 29వ సమావేశం 
ఎప్పుడు : నవంబర్‌ 14 
ఎక్కడ    : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : అపరిష్కృత అంశాలతోపాటు పలు సమస్యల పరిష్కారాలపై చర్చలు జరిపేందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 18 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Nov 2021 07:49PM

Photo Stories