Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 18 కరెంట్‌ అఫైర్స్‌

4g Sevices

4G Mobile Services: కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన యూఎస్‌ఓఎఫ్‌ పథకం ఉద్దేశం?

గిరిజనులకు లబ్ధి చేకూరేలా మొబైల్‌ సేవలు లేని మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించేందుకు ఉద్దేశించిన యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్‌ 17న సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

యూఎస్‌ఓఎఫ్‌ పథకం–ముఖ్యాంశాలు

  • పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్‌) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ ఆధారిత మొబైల్‌ సేవలు అందించనున్నారు.
  • సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఆకాంక్ష జిల్లాల్లో 1,218 గ్రామాలకు 4జీ సేవలు అందించనున్నారు.
  • ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్‌ సేవలు విస్తరించనున్నారు.
  • విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్‌ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు.
  • సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్‌ పవర్‌ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) పథకానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్‌ 17
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : గిరిజనులకు లబ్ధి చేకూరేలా.. 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్‌) జిల్లాల్లోని మొబైల్‌ సేవలు లేని మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించేందుకు..

Union Cabinet: పీఎంజీఎస్‌వై పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?

PMGSY

ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్‌ 1, 2 లను సెప్టెంబరు, 2022 వరకూ కొనసాగించనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నవంబర్‌ 17న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది.

మంత్రి అనురాగ్‌ తెలిపిన వివరాల ప్రకారం...

  • రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రూ.33,822 కోట్లలో కేంద్ర వాటా రూ.22,978 కోట్లుగా ఉంది.
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తయ్యాయి.
  • 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్‌ 1, 2 లను సెప్టెంబరు, 2022 వరకూ కొనసాగించాలని నిర్ణయం
ఎప్పుడు : నవంబర్‌ 17
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం..

Lakhimpur Kheri violence: లఖిమ్‌పూర్‌ ఘటనపై ఎవరి నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు చేయనుంది?

లఖిమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటన కేసుల దర్యాప్తు ఇకపై మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ నేత్వత్వంలో కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాలోని ఐజీ ర్యాంక్‌ అధికారి పద్మజ చౌహాన్‌సహా... యూపీ మాతృరాష్ట్రం కాని ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ఇకపై రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)లో భాగస్వాములుగా ఉంటారని సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం నవంబర్‌ 17న వెల్లడించింది.

తొలుత ఏకసభ్య కమిషన్‌...
లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటనపై తొలుత అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏకసభ్య న్యాయ కమిషన్‌ పనితీరుపై సంతృప్తిగా లేమని... యూపీ కాకుండా వేరే రాష్ట్రానికి చెందిన జడ్జి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తామని భారత సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించడంతో... కేసుల దర్యాప్తుకు కొత్త పర్యవేక్షకుడిని సుప్రీంకోర్టు నవంబర్‌ 17న నియమించింది.

మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ గురించి...
పంజాబ్, హరియాణా హైకోర్టులో గతంలో జడ్జిగా సేవలందించిన జస్టిస్‌ జైన్‌.. హరియాణాలోని హిస్సార్‌లో 1958 అక్టోబర్‌ 1న జన్మించారు. బీకాం ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన పంజాబ్, హరియాణా హైకోర్టు బార్‌లో 1982లో పేరు నమోదు చేయించుకున్నారు. తర్వాత హిస్సార్‌ జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుంచి హైకోర్టులో కేసులు వాదించారు.

లఖిమ్‌పూర్‌లో ఏం జరిగింది? ఏమిటీ కేసు?

  • 2021, అక్టోబర్‌ 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖిమ్‌పూర్‌ ఖేరి జిల్లాలో... యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాల పర్యటన సందర్భంగా లఖీమ్‌పూర్‌ జిల్లాలోని టికునియాలో మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన జరిగింది.
  • ఆందోళన చేస్తున్న రైతుల మీదుగా కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు చెందిన కాన్వాయ్‌ దూసుకుపోవడంతో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ప్రతీకార హింసలో మరో నలుగురు హత్యకు గురయ్యారు. దీనిపై వచ్చిన లేఖనే ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించింది.
  • ఈ కేసులో మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ నిందితుడిగా ఉన్నారు. ఘటనలో రైతుల హత్య, జర్నలిస్టు హత్య, రాజకీయ కార్యకర్తల హత్య ఇలా మూడు ఉన్నాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ నేత్వత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్‌ 17
ఎవరు    : భారత సుప్రీంకోర్టు 
ఎందుకు : లఖిమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటన కేసుల దర్యాప్తు కోసం..

HImachal Pradesh: భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సదస్సు ఏ నగరంలో ప్రారంభమైంది?

పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు) సదస్సు(82వ సదస్సు) నవంబర్‌ 17న హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు జరగనుంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. పార్లమెంట్‌ సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, దేశ అభివృద్ధి పరుగులు పెట్టడానికి ఇదే తారక మంత్రమని మోదీ ఉద్బోధించారు.

నావికా దళంలోకి విశాఖపట్నం నౌక...
హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును కట్టడి చేసేందుకు ‘విశాఖపట్నం’యుద్ధనౌక (గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌), కల్వరీ రకం జలాంతర్గామి ‘వేలా’ను భారత నావికా దళం తీసుకోనుంది. విశాఖపట్నం నౌకను 2021, నవంబర్‌ 21న, వేలా సబ్‌మెరైన్‌ను 2021, నవంబర్‌ 25న నేవీలోకి స్వాగతం పలుకుతామని వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సతీశ్‌ నాందేవ్‌ గోర్మడే తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు) సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్‌ 17 
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : సిమ్లా, హిమాచల్‌ ప్రదేశ్‌
ఎందుకు : చట్టసభలకు సంబంధించిన విషయాలను గురించి చర్చలు జరిపేందుకు...

Men's Cricket: ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన భారతీయుడు?

Sourav Ganguly

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ క్రికెట్‌ కమిటీ (పురుషుల) చైర్మన్‌గా నియమితుడయ్యాడు. ఈ స్థానంలో గత తొమ్మిదేళ్లుగా భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే కొనసాగాడు. మూడేళ్ల పదవీ కాలానికి సంబంధించి గరిష్టంగా మూడు పర్యాయాలు చైర్మన్‌గా వ్యవహరించే వీలుంది. గరిష్ట పదవీకాలం కూడా ముగియడంతో కుంబ్లే తప్పుకోవడంతో గంగూలీని నియమించినట్లు నవంబర్‌ 17న ఐసీసీ తెలిపింది. మహిళల క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా వెస్టిండీస్‌ బోర్డు సీఈఓ జానీ గ్రేవ్‌ను నియమించారు.

ఈ కమిటీ ఏం చేస్తుంది...
ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ)కి ఇది సబ్‌–కమిటీ. క్రికెట్‌ ఆట విషయాలను చర్చిస్తుంది. అంపైర్లు, రిఫరీల నిర్ణయాలు, ఆటలో సాంకేతికత వినియోగం, శాశ్వత హోదా దరఖాస్తులు,  అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌లపై వచ్చే ఫిర్యాదుల్ని సమీక్షించి సీఈసీకి సిఫార్సు చేస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐసీసీ క్రికెట్‌ కమిటీ (పురుషుల) చైర్మన్‌గా నియమితులైన క్రికెటర్‌?
ఎప్పుడు : నవంబర్‌ 17
ఎవరు    : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ
ఎందుకు : ఇప్పటివరకు ఐసీసీ క్రికెట్‌ కమిటీ (పురుషుల) చైర్మన్‌గా ఉన్న భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పదవీకాలం యుగియడంతో..

Ordinance: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎన్నేళ్లకు కేంద్రం పెంచింది?

Emblem of India

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ల డైరెక్టర్లు ఇకపై ఐదేళ్ల వరకు కొనసాగేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 14న రెండు ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. అలాగే రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించేలా ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు వీరి పదవీ కాలం రెండేళ్లుగా ఉంది.

ఈడీ చీఫ్‌ పదవీకాలం ఏడాది పొడిగింపు
ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్రం మరో ఏడాదిపాటు పెంచింది. ఈ మేరకు నవంబర్‌ 17న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవంబర్‌ 17న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు విదేశాంగ కార్యదర్శి పదవీకాలాన్ని కూడా రెండు నుంచి ఐదేళ్లకు పెంచుతూ నవంబర్‌ 17న కేంద్రం ఉత్తర్వులిచ్చింది.

2018 నవంబరు 18న బాధ్యతలు...
1984 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో మరో ఏడాది పొడిగిస్తూ 2020లో కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎస్‌కే మిశ్రా పదవీ కాలాన్ని 2021, నవంబర్‌ 17వ తేదీ తర్వాత పొడిగించవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం ఆర్డినెన్స్‌ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది.

New Protocol: ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

postmortem

సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని నవంబర్‌ 15న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న విధానానికి ఇప్పుడు తెరపడింది. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’ అని మంత్రి పేర్కొన్నారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని ఆరోగ్య శాఖ తెలిపింది.

యోధా డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ ప్రారంభం
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యోధా లైఫ్‌లైన్‌ డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నవంబర్‌ 17న ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి, తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యరంగంలో సేవలందించే యోధ లైఫ్‌లైన్‌ను అత్యాధునిక కంప్యూటింగ్, మాలిక్యులార్‌ డయాగ్నోస్టిక్స్‌ రంగంలో విశేష అనుభం ఉన్న సుధాకర్‌ కంచర్ల స్థాపించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు అనుమతి
ఎప్పుడు : నవంబర్‌ 15
ఎవరు    : కేంద్ర ఆరోగ్యశాఖ
ఎక్కడ    : సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో...
ఎందుకు : గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా..

China-Taiwan Issue: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సమావేశం

US-China Presidents

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. నవంబర్‌ 16న జరిగిన ఈ భేటీ ఆత్మీయ పలకరింపులతో మొదలై హితబోధలు, తీవ్రమైన హెచ్చరికలతో సాగింది. చివరికి ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలన్న అంగీకారంతో సామరస్యపూర్వకంగా ముగిసింది. ‘తైవాన్‌ చైనాలో భాగం. తైవాన్‌ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఎవరైనా రెచ్చగొడితే , గీత దాటి ప్రవర్తిస్తే మేము ఏం చెయ్యాలో అది చేస్తాం’ అని జిన్‌పింగ్‌ అన్నారు. చైనా ఏకపక్షంగా తైవాన్‌ను య«థాతథస్థితిని మార్చాలని చూసినా, శాంతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే  గట్టిగా వ్యతిరేకిస్తామని బైడెన్‌ ప్రతి హెచ్చరికలు చేశారు.

ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ అవార్డు అందుకున్న ప్రముఖ వైద్యురాలు?
పాజిటివ్‌ డెంటల్‌ సీఈవో, ప్రముఖ దంత వైద్యురాలు పేర్ల సృజన ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ అవార్డు–2021 అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు సోనూసూద్‌ ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. స్మైల్‌ డిజైనింగ్‌లో సిద్ధహస్తురాలైన సృజన.. అనేక శాఖల ద్వారా వేలాదిమందికి సేవలందించారు.

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2021 ఎక్కడ జరగుతోంది?
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో నవంబర్‌ 17న కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలిచింది. అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రిషభ్‌ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం దక్కించుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం
ఎప్పుడు : నవంబర్‌ 16
ఎవరు    : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ 
ఎందుకు : తైవాన్‌ అంశంతోపాటు పలు అంశాలపై చర్చలు జరిపేందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 17 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Nov 2021 07:30PM

Photo Stories