Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 17 కరెంట్ అఫైర్స్
Medicines Patent Pool: ఎంపీపీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ఫార్మా దిగ్గజం?
కరోనా వైరస్‌ను కట్టడికి తాము ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అంగీకరించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) బృందంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని నవంబర్ 16న ఫైజర్ సంస్థ తెలిపింది.
ప్రపంచ జనాభాలో 53 శాతం మందికి...
ఎంపీపీ సంస్థ నిరుపేద దేశాలకు తక్కువ ధరలకే మందుల్ని పంపిణీ చేస్తోంది. ఫైజర్ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53 శాతం మందికి కోవిడ్ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ఫైజర్ కంపెనీ రాయల్టీలను వదులుకోవడంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ మాత్రల్ని మార్కెట్‌లోకి తెస్తామని ఎంపీపీ పాలసీ చీఫ్ ఎస్టెబన్ బరోన్ చెప్పారు.
ఐవోసీతో ఎన్‌టీపీసీ జట్టు
పునరుత్పాదక విద్యుదుత్పత్తికి సంబంధించి ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్‌టీపీసీ, ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) చేతులు కలిపాయి. తక్కువ కర్బన ఉద్గారాలతో సొంత ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తికి కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) బృందంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్
ఎందుకు : కరోనా వైరస్‌ను కట్టడికి ఫైజర్ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి..
Kartarpur Corridor: కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఏ నది ఓడ్డున ఉంది?
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కలిపే కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను 2021, నవంబర్ 17వ తేదీ నుంచి తెరవనున్నారు. ఈ విషయాన్ని భారత హోం మంత్రి అమిత్ షా నవంబర్ 16న తెలిపారు. నవంబర్ 19వ తేదీ నుంచి గురునానక్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ఈ కారిడార్‌ను మూసివేసింది.
రావి నది ఓడ్డున...
సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి 2019, నవంబర్ 12న ఉన్న నేపథ్యంలో... 2019, నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్ ద్వారా భారత్‌లోని సిక్కు మతస్తులు పాకిస్తాన్‌లో ప్రార్థనా స్థలాలను సందర్శించేందుకు వీలు కలిగింది. 4.5 కిలోమీటర్ల ఈ కారిడార్ ద్వారా భారత యాత్రికులు వీసా లేకుండా పాకిస్తాన్‌లోని రావి నది ఓడ్డున ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చు.
గుర్దాస్‌పూర్ జిల్లాలో...
భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం, గుర్దాస్‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ పట్టణంలో గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారా ఉంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నరోవల్ జిల్లాలోని కర్తార్‌పూర్ పట్టణంలో కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, నవంబర్ 17వ తేదీ నుంచి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ పునః ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఎందుకు : భారత్‌లోని సిక్కు మతస్తులు పాకిస్తాన్‌లో ప్రార్థనా స్థలాలను సందర్శించేందుకు..
PM Modi: ఇటీవల ప్రారంభమైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఏ రాష్ట్రంలో ఉంది?
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన ‘పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే’ ప్రారంభమైంది. నవంబర్ 17న సుల్తాన్‌పూర్ జిల్లా కుదేబహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి మోదీ.. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ సీ–130జే విమానంలో ఈ రహదారిపై దిగారు. ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా సుల్తాన్‌పుర్ వద్ద నిర్మించిన 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ ఇందుకు వేదికైంది. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా... వైమానిక దళానికి చెందిన మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, ఏఎన్–32 యుద్ధ విమానాలు అద్భుత విన్యాసాలు చేశాయి. అవి ఈ రహదారిపై దిగి, తిరిగి ఆకాశంలోకి దూసుకెళ్లాయి.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే గురించి...
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో–ఘజియాపూర్ మధ్య 340.8 కి.మీ. పొడవునా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు.
- లక్నో– సుల్తాన్‌పూర్ హైవే మీదనున్న చాంద్‌సరాయ్ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. ఘజియాపూర్ జిల్లా హల్‌దారియా వరకు కొనసాగుతుంది.
- లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, ఆజమ్‌గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల(మొత్తం 9 జిల్లాలు) ఈ రహదారి వెళ్తుంది.
- దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది.
- ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది.
- దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం సుల్తాన్‌పూర్ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్ వే నిర్మించారు.
- ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, టాయిలెట్ సదుపాయాలు, మోటార్ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు.
- ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : లక్నో–ఘజియాపూర్ మధ్య అనుసంధానత పెంచేందకు..
ICC Schedule: 2029 చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
భారత్ వచ్చే పదేళ్ల కాలంలో ఏకంగా నాలుగు ఐసీసీ టోర్నమెంట్లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో ఇదివరకే ఖరారైన 2023 వన్డే ప్రపంచకప్‌తో పాటు కొత్తగా రెండు ప్రపంచకప్‌లు (వన్డే, టి20), ఒక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. నవంబర్ 16న విడుదలైన ఐసీసీ షెడ్యూల్ 2024–2031లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2024–2031 ఐసీసీ షెడ్యూల్
- 2024 టి20 ప్రపంచకప్: అమెరికా, వెస్టిండీస్
- 2025 చాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్
- 2026 టి20 ప్రపంచకప్: భారత్, శ్రీలంక
- 2027 వన్డే ప్రపంచకప్: దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే
- 2028 టి20 ప్రపంచకప్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
- 2029 చాంపియన్స్ ట్రోఫీ: భారత్
- 2030 టి20 ప్రపంచకప్: ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్
- 2031 వన్డే ప్రపంచకప్: భారత్, బంగ్లాదేశ్
DJSI: డోజోన్స్ ఇండెక్స్‌లో తొలి స్థానంలో నిలిచిన కంపెనీ?
ప్రపంచంలోనే అత్యంత నిలకడైన అల్యూమినియం కంపెనీగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్–2021లో నిలిచినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీ మరోసారి తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నట్లు నవంబర్ 16న తెలియజేసింది. కంపెనీ తెలిపివన వివరాల ప్రకారం... ఎస్‌అండ్‌పీ డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండైసెస్(డీజేఎస్‌ఐ), కార్పొరేట్ సస్టెయినబిలిటీ అసెస్‌మెంట్(సీఎస్‌ఏ) ర్యాంకులలో హిందాల్కో ఇండస్ట్రీస్ అగ్రస్థానాన్ని పొందింది. డీజేఎస్‌ఐ ప్రత్యేక ప్రపంచ ఇండెక్స్ 2021లో చోటు సాధించిన ఏకైక అల్యూమినియం కంపెనీగా ఆవిర్భవించింది.
విశాఖలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు...
మురుగప్ప గ్రూప్ సంస్థ, ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. విశాఖపట్నంలోని తమ ఎరువుల కర్మాగారంలో కొత్తగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ 16న వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చిస్తోన్నట్లు సంస్థ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత నిలకడైన అల్యూమినియం కంపెనీగా.. డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్–2021లో తొలిస్థానంలో నిలిచిన అల్యూమినియం కంపెనీ?
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్
ఎక్కడ : ప్రపంచంలో...
BBB- Grade: భారత్ రేటింగ్‌ను నెగటివ్ అవుట్‌లుక్‌తో కొనసాగించిన సంస్థ?
భారత్ సావరిన్ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ వద్ద కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ– ఫిచ్ తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా, 2022–23లో 10 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది. ఈ మేరకు నవంబర్ 16న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఫిచ్ దేశానికి ఇస్తున్న రేటు ‘బీబీబీ మైనస్’ చెత్త (జంక్) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ.
మూడీస్ కూడా...
అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్... ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను ఇస్తోంది. ఇది కూడా జంక్ (చెత్త) స్టేటస్‌కు స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. మరో రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్‌అండ్‌పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తోంది.
ప్రాముఖ్యత ఎందుకు?
అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతి యేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ సావరిన్ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ వద్ద కొనసాగించిన సంస్థ?
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ– ఫిచ్
ఎందుకు : దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా..
McKinsey Global Institute: ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశం?
ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశంగా అమెరికాను రెండో స్థానానికి నెట్టి, చైనా అగ్రస్థానానికి చేరింది. స్విట్జర్‌ల్యాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఉన్న మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్.. నవంబర్ 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- స్థిరాస్తుల విలువలకు రెక్కలు రావడంతో గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద గణనీయంగా విస్తరించింది. ఈ ప్రయాణంలో ఎక్కువగా లబ్ది పొందింది చైనా, అమెరికాయే.
- ప్రపంచ సంపద నికర విలువ 2000 నాటికి 156 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, 2020 నాటికి 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
- ఒక దేశ పౌరుల చేతిలోని ఆస్తుల మొత్తం విలువను నికర విలువ లేదా నికర సంపద అంటారు.
- చైనా నికర విలువ 2000 నాటికి ఉన్న 7 ట్రిలియన్ డాలర్ల నుంచి 2020లో 120 ట్రిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇదే కాలంలో అమెరికా నెట్‌వర్త్ (నికర సంపద విలువ) రెట్టింపునకు పైగా పెరిగి 90 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
- ప్రపంచంలో 60 శాతం ఆదాయాం పది దేశాల వద్దే ఉంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్‌లు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్‌కే పెద్ద వాటా..
- మెకిన్సే అధ్యయనం ప్రకారం.. ప్రపంచ సంపదలో 68 శాతం రియల్ ఎస్టేట్ రూపంలోనే ఉంది. మిగిలిన మేర మౌలిక సదుపాయాలు, మెషినరీ, ఎక్విప్‌మెంట్, మేధో సంపత్తి హక్కుల రూపంలో ఉంది.
- మెకిన్సే ప్రపంచ సంపద అధ్యయనంలోకి ఆర్థికపరమైన ఆస్తులను తీసుకోలేదు. ఎందుకంటే వీటికి అంతే మేర అప్పులు కూడా ఉంటాయన్న అంచనాతో పరిగణనలోకి తీసుకోలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశంగా చైనా
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ– ఫిచ్
ఎందుకు : గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద గణనీయంగా పెరిగిన నేపథ్యంలో..
PM Modi: కాగ్ తొలి ఆడిట్ దివస్‌ను ఎప్పుడు నిర్వహించారు?
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నవంబర్ 16న తొలి ఆడిట్ దివస్‌ను నిర్వహించింది. న్యూఢిల్లీలోని కాగ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని, అందుకే ఆ రోజును ఆడిట్ దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. కొత్త ఆడిట్ ప్రక్రియ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌ను కాగ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఫార్ములావన్ క్రీడలో పాల్గొననున్న తొలి చైనీయుడు?
ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో చైనా దేశం క్రీడాకారుడు తొలిసారి కనిపించనున్నాడు. 2022 ఏడాది ఎఫ్1 సీజన్‌లో చైనాకు చెందిన గ్వాన్‌యూ జౌ అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఫార్ములా–2 విభాగంలో పోటీపడుతున్న 22 ఏళ్ల గ్వాన్‌యూ జౌతో ఆల్ఫా రొయెయో జట్టు ఒప్పందం చేసుకుంది. గత మూడేళ్లుగా ఆల్ఫా రొమెయోకు డ్రైవర్‌గా ఉన్న జియోవినాజి కాంట్రాక్ట్ ఈ సీజన్‌తో ముగుస్తుంది. వచ్చే సీజన్‌లో అతడి స్థానాన్ని గ్వాన్‌యూ జౌతో భర్తీ చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి ఆడిట్ దివస్ నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని..
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 16 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్