Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 23 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu May 23rd 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Telugu Current Affairs Daily

Archery: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నీలో భారత్‌కు స్వర్ణం

Indian men's compound archery team

Gwangju 2022 Hyundai Archery World Cup Stage 2: దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ నగరం వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022లో భాగంగా మే 21న జరిగిన కాంపౌండ్‌ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి.

కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం..
పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్‌ గాంటియర్, జీన్‌ ఫిలిప్‌ బౌల్చ్, క్విన్‌టిన్‌ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్‌ జట్టును ఓడించింది. దీంతో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. 2022, ఏప్రిల్‌లో టర్కీలో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం.

కాంస్య పతక పోరులో..
కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పతక పోరులో అభిషేక్‌ వర్మ, అవ్‌నీత్‌ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్‌ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించి.. కాంస్య పతకం కైవసం చేసుకుంది.

వ్యక్తిగత విభాగంలో రజతం..
కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్‌ టోర్నీ ఆడుతున్న మోహన్‌ రామ్‌స్వరూప్‌ భరద్వాజ్‌ (భారత్‌) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్‌ 141–149తో ప్రపంచ నంబర్‌వన్‌ మైక్‌ షోలోసెర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నీ పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : మే 21 
ఎక్కడ    : గ్వాంగ్జూ, దక్షిణ కొరియా
ఎందుకు : ఫైనల్లో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 పాయింట్ల తేడాతో ఫ్రాన్స్‌ జట్టును ఓడించినందున..

Chess: సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?

Indian men's compound archery team

Daily Current Affairs in Telugu - Sports: సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2022లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ విజేతగా అవతరించాడు. పోలాండ్‌ రాజధాని నగరం వార్సా వేదికగా పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్‌ 14 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. మే 21న జరిగిన మూడు గేముల్లో ఆనంద్‌ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్‌ కేటాయించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆనంద్‌ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్‌ రాపోట్‌ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్‌ క్రిస్టాఫ్‌ (పోలాండ్‌) మూడో స్థానంలో నిలిచారు. మే 22 నుంచి బ్లిట్జ్‌ విభాగంలో టోర్నీ జరుగుతుంది.

స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జంట?
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌ వేదికగా మే 21న ముగిసిన స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ టోర్నీ–2022లో భారత స్టార్‌ సానియా మీర్జా–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 5–7, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నికోల్‌ మెలిచార్‌ మార్టినెజ్‌ (అమెరికా)–దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది.  ఫైనల్లో ఓటమి పాలైన సానియా–హర్డెస్కా జంటకు 5,400 యూరోల (రూ. 4 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : మే 21 
ఎవరు    : విశ్వనాథన్‌ ఆనంద్‌
ఎక్కడ    : వార్సా, పోలాండ్‌
ఎందుకు : ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్‌ 14 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచినందున..​​​​​​​

WHO: గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?​​​​​​​

Asha workers - who award

Daily Current Affairs in Telugu - Awards: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని కొనియాడింది.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ పురస్కారాలు ప్రకటించారు. ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా(Accredited Social Health Activist-ASHA)లు కూడా ఉన్నారు.

డబ్ల్యూహెచ్‌వో..
ఏర్పాటు:
ఏప్రిల్‌ 07, 1948 
ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్‌ల్యాండ్‌
ప్రస్తుత డెరైక్టర్‌ జనరల్‌: టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెసియస్‌  
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆశా వర్కర్లకు గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారం ప్రకటన
ఎప్పుడు : మే 22
ఎవరు    : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని..

Australia's new PM: ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?

new PM of Australia - Anthony Albanese

Telugu Current Affairs - Persons: ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రిగా లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌ బాధ్యతలు చేప్టటారు. మే 23న ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్‌బెర్రాలో జరిగిన కార్యక్రమంలో దేశ ప్రధానిగా ఆంటోనీ ప్రమాణ స్వీకారం చేశారు. మే 21న పార్లమెంటు ఎన్నికల విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆంటోనీ మాట్లాడుతూ.. వాతావరణం మార్పుల ద్వారా వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికే తాను పెద్ద పీట వేస్తానన్నారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 43 శాతం తగ్గిస్తానని, సోలార్‌ విద్యుత్, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.

కన్జర్వేటివ్‌ పాలనకు తెర..
ఆంటోనీ అల్బనీస్‌ నూతన ప్రధానిగా ప్రమాణం చేయడంతో.. ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమి పరిపాలనకు తెరçపడినట్లయింది. తాజా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు ప్రధానిగా స్కాట్‌ మారిసన్‌ తన ఓటమిని అంగీకరించారు. మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమి కంటే లేబర్‌ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం చూరగొనడంలోనూ విజయం సాధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
ఎప్పుడు : మే 23
ఎవరు    : లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌
ఎక్కడ    : కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా
ఎందుకు : తాజా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధించినందున..

Monkeypox: మంకీపాక్స్‌ అంటే ఏమిటీ? ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏమిటీ.. చికిత్స ఎలా..

Telugu Current Affairs and General Essay - Science and Technology: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌ల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్‌ కూడా ఈ వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్‌ విస్తరిస్తున్న తీరుని  పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్స్‌ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.

ఏమిటీ మంకీపాక్స్‌?:
స్మాల్‌ పాక్స్‌ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్‌ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్‌ కనిపించింది.

లక్షణాలివే..:
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది.

ఎలా వ్యాపిస్తుంది?:
తుంపర్ల ద్వారా, మంకీపాక్స్‌ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా  సోకుతుంది.

చికిత్స ఎలా?:
ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ వాడతారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు.

 

Largest Ice Sheet: ఏ మంచు ఫలకం కింద నగరమంత పెద్ద సరస్సు ఉందని తేలింది?

largest ice sheet

ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌ షీట్‌ అని రికార్డు ఉండగానే.. మరో రికార్డును తూర్పు అంటార్కిటికా హిమ ఫలకం సొంతం చేసుకుంది. దీని కింద ఒక నగరమంత వైశాల్యంలో ఓ పెద్ద సరస్సు ఉందని తేలింది. హిమ ఫలకంపై దాదాపు మూడేళ్లు ఏరియల్‌ సర్వే చేసిన చైనా శాస్త్రవేత్తలు.. దాదాపు 3.2 కిలోమీటర్ల కింద సరస్సు ఉన్నట్టు గుర్తించారు. ఈ సరస్సుకు ‘స్నో ఈగల్‌’అని పేరు పెట్టారు. దీని వైశాల్యం 370 చదరపు కిలోమీటర్లు, పొడవు 48 కిలోమీటర్లు, వెడల్పు 14.5 కిలోమీటర్లు, లోతు 198 మీటర్లు. ఈ సరస్సులో 3.4 కోట్ల ఏళ్ల నాటి నది అవక్షేపాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే గనక తెలిస్తే అంటార్కిటికా మంచుమయం కాకముందు ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు వీలుకానుంది

Plants in Lunal Soil: చంద్రుని మట్టిపై మొక్కల పెంపకం

జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)వెల్లడించింది. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్‌ జాతికి చెందిన అరబిడోప్సిస్‌ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్‌ కమ్యూనికషన్స్‌ బయాలజీ ప్రచురించింది.

Wheat Export Ban: గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన దక్షిణాసియా దేశం?

గోధుమ ఎగుమతులను నియంత్రిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై జీ7 దేశాలు చేస్తున్న విమర్శలకు చైనా స్పందించింది. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను నిందించినంత మాత్రాన ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభానికి పరిష్కారం లభించదని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది. దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్ కంటే ముందు గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను గౌరవిస్తామని ప్రకటించింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామంటూ.. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని విదేశీ వాణిజ్య కార్యాలయం(డి.జి.ఎఫ్‌.టి)భరోసా ఇచ్చింది.​​​​​​​

Fungal Diseases: ఇన్వాసివ్‌ కాండిడియాసిస్‌ సోకేందుకు కారణమైన ఫంగస్‌?

Antibiotics

యాంటీబయాటిక్స్‌ అతిగా వాడితే రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ఫంగల్‌ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్‌ కాండిడియాసిస్‌ సోకేందుకు కాండిడా అనే ఫంగస్‌ కారణం. ఈ ఫంగస్‌ సోకేందుకు యాంటీ బయాటిక్స్‌ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ బిర్మింగ్‌హామ్‌ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్‌) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది.

International Family Day: ప్రతి ఏటా ఏ రోజున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?

కుటుంబ ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. 1996 నుంచి ప్రతి ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘కుటుంబం–పట్టణీకరణ’అనే నినాదంతో ముందుకొచ్చింది. కుటుంబాల్లో ఆరోగ్యం, లింగ సమానత్వం, పిల్లల హక్కు లు, కుటుంబ సంక్షేమ వ్యవహారాలను చర్చించడం దీని లక్ష్యం. పౌర జీవనం పట్టణ ప్రాంతాల్లోకి మారినప్పుడు.. అక్కడి పోకడలకు అలవాటుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి అన్నింటిపైనా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకోవాలని కుటుంబ దినోత్సవం గుర్తు చేస్తుంది. 

2021-22 Financial Year: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎంత శాతం మోసాలు తగ్గాయి?

frauds-banks

ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జరిగిన మోసాలు 51శాతం తగ్గాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల్లో మొత్తం రూ.81,921.54కోట్ల విలువైన మోసాలు జరగ్గా.. 2021–22లో ఇవి రూ.40,295.25 కోట్లకు చేరుకున్నాయని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)ద్వారా వచ్చిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా అందించిన వివరాల్లో ఆర్‌బీఐ తెలిపింది. 2021–22లో పీఎస్‌బీల్లో మొత్తం 7,940 మోసాలు నమోదవగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9,933 సంఘటనలు జరిగాయి.

Warships: సూరత్, ఉదయగిరి యుద్ధ నౌకల డిజైన్ ను రూపొందించింది?

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ముంబైలోని మజగావ్‌ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్ ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ (డీఎన్‌డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాములను తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వాటిని తయారు చేసింది. 

  • ఐఎన్ ఎస్‌ సూరత్‌: ఐఎన్ ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్‌ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే.. విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి.. వాటిని ఎండీఎల్‌లో జోడించారు. దీనికి గుజరాత్‌ వాణిజ్య రాజధాని సూరత్‌ పేరు పెట్టారు.
  • ఐఎన్ ఎస్‌ ఉదయగిరి: దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్‌ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్‌(శివాలిక్‌ క్లాస్‌)కంటే దీన్ని మరింత ఆధునీకరించారు.

Anti-Conversion Bill: మత మార్పిడిలను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చిన రాష్ట్రం?

karnataka cm - anti conversion bill

కర్ణాటక మత మార్పిడి నిరోధక బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌ లేదా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీన్ని బలవంత, ప్రేరేపిత మత మార్పిడిలను నిరోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చింది. అసెంబ్లీ, శాసనమండలి వాయిదా పడినందున ఆర్డినెన్స్‌ తీసుకువస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై గతంలో ప్రకటించారు. కాగా గతేడాది డిసెంబర్‌ 23న ఈ బిల్లు కర్ణాటక విధాన సభ ఆమోదం పొందింది. అదే సమయంలో విధాన పరిషత్‌లో బీజేపీ మద్దతుదారుల సంఖ్య తక్కువగా ఉండటంతో నిలిచిపోయింది.

Reservations: పదోన్నతుల్లో దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్‌ కల్పించారు?

Reservations

నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ –34ను అనుసరించి.. ప్రభుత్వ విభాగాల్లో నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు(పీడబ్ల్యూబీడీలకు) రిజర్వేషన్లు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీచేయాలని సుప్రీంకోర్టు గత సెప్టెంబరులో కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు–గ్రూప్‌–సి, గ్రూప్‌–సి నుంచి గ్రూప్‌ బి, గ్రూప్‌–బి, గ్రూప్‌–బి నుంచి దానికంటే దిగువ స్థాయి వరకూ ఉన్న కేడర్లలోని మొత్తం ఖాళీల్లో 4శాతం పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించాలంటూ సిబ్బంది, శిక్షణ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యక్ష నియామకాలు 75శాతం మించని కేడర్లలో చేపట్టే పదోన్నతులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Buddha Statue: వేల ఏళ్ల నాటి బుద్ధుడి విగ్రహాలు

Gautama Buddha

బౌద్ధం జాడలు అరుదుగా కనిపించే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో.. సరిగ్గా బుద్ధుడి 2,566 జయంతి సమయంలో కొంత లోతైన పరిశోధనా వివరాలు వెలుగుచూశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపురంలోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో బుద్ధుడి జాడలపై తాజాగా చరిత్ర పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి పరిశోధించారు. పద్మాసనంలో, ధ్యానముద్రలో మహాపురుష లక్షణాలతో ఉన్న మూడడుగుల ఎత్తు, అంతే వెడల్పు, నాలుగు అంగుళాల మందంతో అర్ధ శిల్పరీతిలో చెక్కిన ఈ బుద్ధుడి శిల్పాలు.. చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సూర్యనారాయణ ఆలయ రంగమండపం కప్పు మీద విష్ణు దశావతారాల్లో భాగంగా చెక్కిన బుద్ధుడు, బోధివక్షం కింద పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా.. పైన వింజామరతో విద్యాధరుడు ఉన్నట్టు కనిపిస్తోంది. ఆలంపురం ఊరి వెలుపల పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం కప్పు మీద ఇదే నేపథ్యంలో ఉన్న బుద్ధుడి కుడి పక్కన బోధివృక్షం, ఎడమ పక్కన ఒక స్త్రీ శిల్పాలున్నాయి. వజ్రాయాన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమా లక్షణం కలిగిన బుద్ధుడి రూపాన్ని అమితాభ బుద్ధుడిగా పేర్కొంటారు. ఈ దేవాలయాల్లో.. బుద్ధుడి జాడలపై గతంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు బీఎస్‌ఎల్‌ హనుమంతరావు పరిశీలించి వెలుగులోకి తెచ్చారు.​​​​​​​చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 21 కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

General Essay - International

Council of State: ఇలాంటి వ్యవస్థ భారత్‌లోనూ ఉండివుంటే..

Economic Crisis - Sri Lanka

Telugu Current Affairs and General Essay - International: శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న అస్తవ్యస్త పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటును సూచిస్తున్నారు. ‘కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌’(జాతీయ మండలి)గా పిలిచే ఈ వ్యవస్థ ప్రభుత్వానికి సమాంతరంగా పని చేస్తుంటుంది. ఇది ప్రభుత్వానికి లోబడే తన కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది గానీ ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఈ వ్యవస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఆ వ్యవస్థ ఇచ్చే సలహా, సూచనలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది కూడా! ఇలాంటి వ్యవస్థ భారత్‌లోనూ ఉండివుంటే చాలా సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు. ఈ వ్యవస్థ ప్రభుత్వానికీ, పౌర సమాజానికీ మధ్య ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Monkeypox: మంకీపాక్స్‌ అంటే ఏమిటీ? ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏమిటీ.. చికిత్స ఎలా..

‘‘అవసరం అన్నీ నేర్పుతుందంటారు.’’ చాలాసార్లు విన్న నానుడే అయినా శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా బండారునాయకే కుమారతుంగ చేసిన ఓ వినూత్న ప్రతిపాదన వింటే ఇది గుర్తుకు రాకమానదు. శ్రీలంకలో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులకు దారితీసిన ప్రభుత్వ పాలనను మెరుగుపరిచేందుకు ఆమె ఒక ప్రతిపాదన చేస్తూ దీన్ని గుర్తు చేశారు. ‘‘అవసరం అన్నీ నేర్పుతుందన్నది నిజమే గానీ, ఆ ముఖ్యమైన అవసరం ఏమిటి?’’ అని ప్రశ్నిస్తే... చంద్రికా కుమారతుంగ ఇచ్చిన సమాధానం ఇది: ‘‘శ్రీలంక ప్రజలందరిలో రాజకీయ నాయకులపై విశ్వాసం పూర్తిగా పోయింది’’ అని చెప్పారు. నిజమే కదా... ఈ సమస్య మనది అంటే భారతదేశానిది కూడా కదా అనిపించింది. మరి, శ్రీలంకకు బండారునాయకే సూచిస్తున్న పరిష్కారం మనకూ అక్కరకు వస్తుందా? బహుశా ఆ ప్రణాళికతో మనమూ ప్రస్తుత అపనమ్మక పరిస్థితి నుంచి బయట పడవచ్చునేమో!

ఇంతకీ చంద్రికా కుమారతుంగ సూచిస్తున్న కొత్త విషయం ఏమిటన్నదేనా మీ సందేహం! అక్కడికే వస్తున్నా. శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న అస్తవ్యస్త పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు ఆమె ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటును సూచిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రభుత్వానికి సమాంతరంగా పని చేస్తుంటుంది. ఇది ప్రభుత్వానికి లోబడే తన కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది గానీ ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఈ వ్యవస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అంతే కాకుండా... ఆ వ్యవస్థ ఇచ్చే సలహా, సూచనలను చాలా సీరి యస్‌గా పరిగణించాల్సి ఉంటుంది కూడా! ఆ వ్యవస్థ వివరాలేమిటో తెలుసు కుందాం గానీ... అంతకంటే ముందు ఒక్క విషయమైతే స్పష్టం. ఈ వ్యవస్థ ప్రభుత్వానికీ, పౌర సమాజానికీ మధ్య ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మాత్రం చెప్పగలం. 

శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ప్రతి పాదిస్తున్న కొత్త వ్యవస్థకు ‘‘కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌’’(జాతీయ మండలి) అని పేరు పెట్టారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండే ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌లో మొత్తం 36 మంది ఉంటారు. వీరిలో తొమ్మిదిమంది రాజకీయ నాయకులు. మిగిలిన 27 మంది పౌర సమాజంలోని వేర్వేరు రంగాలకు చెందినవారూ వాళ్ళను నామినేట్‌ చేస్తారు. అంటే... వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రైవేటు రంగానికి చెందిన వాళ్లు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు చెందిన వారన్న మాట. ఈ పౌర సమాజం నుంచి వచ్చినవారి సంఖ్య రాజకీయ నాయకులకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. సమా జంలోని ఓ విశిష్ట వ్యక్తి ఈ జాతీయ మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కావచ్చు గానీ... పదవీ విరమణ చేసినవారై ఉండాలి.

Palm Oil Exports: పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?

చంద్రికా కుమారతుంగ ఆలోచనల ప్రకారం ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ రెండు ముఖ్యమైన పనులు నిర్వహిస్తుంది. ‘‘పార్లమెంటులో చట్టం చేయడానికి ప్రతిపాదించేం దుకు ముందు గానే అతి ముఖ్యమైన చట్టాల ముసా యిదాలు, విధానాలను ఇది సమీక్షిస్తుంది.’’ ఆర్థిక వ్యవస్థ, పాలన, ఆరోగ్యం, విద్య వంటి అన్ని అంశాలకు సంబంధించిన విధానాలు, చట్టాలను నిశితంగా పరిశీలించి మార్పులు, చేర్పులు సూచిస్తుంది. కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ బాధ్యతల్లో ఇది మొదటిది కాగా... తను సొంతంగా చట్టాలనూ, విధానాలనూ మంత్రివర్గ కేబినెట్‌కు ప్రతిపాదించడం రెండోది. 

ఇదేదో యూపీఏ ప్రతిపాదించిన నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మాదిరిగా ఉందే అనుకుంటున్నారా? పాక్షికంగా నిజమే గానీ... కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ దీనికంటే విస్తృతమైందని చెప్పవచ్చు. నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మాదిరిగా ఇది సోనియాగాంధీ, ఆమె అభిమాను లకు మాత్రమే పరిమితం కాదు. అన్ని రకాల భావనలనూ, వాదన లనూ గౌరవిస్తుంది ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌! పైగా ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ సభ్యులు ఆయా రంగాల్లో నిష్ణాతులై ఉండాలి.

చంద్రికా కుమారతుంగ లెక్కల ప్రకారం ఈ ‘జాతీయ మండలి’ తాత్కాలిక ఏర్పాటు మాత్రం కాదు. శ్రీలంక ప్రభుత్వ వ్యవస్థలో శాశ్వత భాగస్వామిగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకారం లభిస్తే కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థ సభ్యులను సొంతంగా నియ మిస్తుందన్నమాట.

చంద్రిక ప్రతిపాదన చాలా సింపుల్‌. ఎలాంటి శష భిషలు లేనిది. సమాజంలో వేర్వేరు రంగాల్లో పేరెన్నికగన్న, గౌరవం ఉన్నవారి అభిప్రాయాలకు గళమిస్తుంది ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌. అదే సమయంలో ప్రభుత్వానికి తగిన మార్గదర్శనం కూడా చేస్తుంది. చట్టాలు, విధానాలపై విస్తృత స్థాయిలో చర్చలు మాత్రమే కాకుండా... మార్పులు, చేర్పులు కూడా జరుపుకొనే అవకాశం లభి స్తుంది. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే ఏకాభి ప్రాయంతో చట్టాలు, విధానాలు ఏర్పడతాయి కాబట్టి భవిష్యత్తులో సమస్యలు అతి తక్కువగా ఉంటాయన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుతం వార్తాపత్రికలు, కొన్ని టెలివిజన్‌ ఛానళ్లకు మాత్రమే పరిమితమైపోయిన ప్రజాస్వామ్య ప్రక్రియలు అనేకం పాలనలో భాగమవుతాయన్నమాట. 

ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్‌–1 ప్రయోగం

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ నిర్ణయాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా సంభవమే. కానీ చంద్రికా కుమారతుంగ అంచనాల ప్రకారం అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాలన పలుచనైనట్లే! ప్రభుత్వ విధానాలను, చట్టాలను పొగిడినా, తెగిడినా సరే ప్రభుత్వం జాతీయ మండలికి తగినన్ని అవకాశాలు ఇచ్చి దాని అభిప్రాయాలను, దృష్టికోణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. 

Daily Current Affairs in Telugu: 2022, మే 16 కరెంట్‌ అఫైర్స్‌

ఇది కొంచెం తిరకాసు వ్యవహారమే. తగు విధంగా సంప్ర దింపులు జరపడం అంటే? జాతీయ మండలి అభిప్రాయాలకు సముచిత పరిగణన ఇవ్వడం అంటే? మాటల గారడీతోనో, లేదా ఇతర మార్గాల ద్వారానో జాతీయ మండలికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే? ఇవన్నీ జరిగేందుకు అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఏదో నామ్‌ కా వాస్తే ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ను ఏర్పాటు చేయవచ్చు. అది కూడా నామమాత్రంగా పనిచేయనూవచ్చు. ఆ తరువాత వ్యక్తుల గౌరవం, నిబద్ధతలపై మనం ఆధారపడాల్సి వస్తుంది. 

భారత్‌లోనూ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ లాంటి వ్యవస్థ ఒకటి ఉంటే అర్థవంతంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. దేశం మొత్తం వర్గాలుగా విడిపోవడం పతాకస్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రభుత్వం ప్రజలను విడగొడుతోందన్న భావనలు బలపడుతున్న తరుణంలో ఇలాంటి వ్యవస్థ అవసరం ఒకటి కచ్చితంగా ఉందని అనిపిస్తోంది. 

Mathura: శ్రీకృష్ణ జన్మభూమిపై రాజుకున్న వివాదం

​​​​​​​మన దేశంలోనూ ఈ జాతీయ మండలి లాంటిది ఒకటి ఉండివుంటే 2016 నవంబరులో జరిగినట్లు పెద్ద నోట్ల రద్దు జరిగి ఉండేది కాదేమో! గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) అమలు చేయడంలోనూ ఇన్ని రకాల సమస్యలు ఉండేవి కావు. కోవిడ్‌ మొదలైన తొలినాళ్లలో కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఇచ్చి దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌లో పెట్టడమూ జరగకపోయేది. ఇలాంటి మూడు అంశాలు చాలవా? శ్రీలంక మాజీ అధ్యక్షులు చంద్రికా  కుమారతుంగ ప్రతిపాదిస్తున్న కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ వ్యవస్థ భారత్‌కూ ఎంతో అవసరమని చెప్పేందుకు!

Karan Thapar​​​​​​​

 

 

​​​​​​​

 

వ్యాసకర్త: 
కరణ్‌ థాపర్, సీనియర్‌ పాత్రికేయులు

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 May 2022 08:15PM

Photo Stories