Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 16 కరెంట్‌ అఫైర్స్‌

daily-current-affairs-telug

Wheat Exports: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?

wheat

దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ఎగుమతులపై నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) మే 14న విడుదల చేసిన నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది.

పొరుగు దేశాలకు..
లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఆధారంగా 2022, మే 13 వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గోధుమల ఎగుమతికి అనుమతినిస్తామని నోటిఫికేషన్‌ పేర్కొంది. అంతే కాదు ఆహార కొరతనెదుర్కొంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దేశాలకు గోధుమల ఎగుమతి జరుగుతుందని స్పష్టం చేసింది.

50 శాతం బంగ్లాదేశ్‌కే.. 
2021–22 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల గోధుమల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో 50 శాతం బంగ్లాదేశ్‌కే వెళ్లాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చాలా దేశాలు గోధుమల కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : మే 14
ఎవరు    : భారత్‌
ఎందుకు : భారత్‌లో గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి..

G7 Foreign Ministers Meeting: జీ–7 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

G7 Countries

జర్మనీలోని వీసెన్‌హాస్‌ వేదికగా మే 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీ–7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ప్రపంచ సంక్షోభంగా పరిణమిస్తోందని జీ–7 విదేశాంగ మంత్రులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యే ప్రమాదం ఉందన్నారు. రష్యాకు ఏ రూపంలోనూ సాయమందించినా తీవ్ర పరిణామాలుంటాయని చైనాను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సాయం పెంచాలని తీర్మానించారు.

జీ–7 కూటమి..
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఆరు దేశాలు 1975లో జీ–6 కూటమిగా ఏర్పడ్డాయి. జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యునెటైడ్‌ కింగ్‌డమ్‌(యూకే), యునెటైడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా(యూఎస్‌ఏ) దేశాలతో కూడిన జీ–6 తొలి సదస్సు ఫ్రాన్స్‌లో(1975 నవంబరు) జరిగింది. 1975లో కెనడా ఏడో సభ్యదేశంగా చేరడంతో జీ–7గా మారింది. 1998లో ఈ కూటమిలో రష్యా చేరికతో జీ–8గా అవతరించింది. క్రిమియా సంక్షోభం కారణంగా 2014, మార్చి 24న రష్యా జీ–8 నుంచి సస్పెండ్‌ అయింది. దీంతో ప్రస్తుతం ఈ కూటమి జీ–7గా మారింది.

విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం, వాతావరణం, వ్యవసాయం, కార్మిక సమస్యల వంటివి జీ–7 సదస్సుల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఈ కూటమిలో సభ్యదేశం కానప్పటికీ సమావేశాలకు హాజరవుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
జీ–7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు  : మే 11–15
ఎవరు    : అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్‌ 
ఎక్కడ : వీసెన్‌హాస్, జర్మనీ
ఎందుకు : రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు..​​​​​​​

24th Summer Deaflympics: బధిరుల ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి?

Shaik Jafreen, Prithvi Sekhar

బ్రెజిల్‌లోని కాక్సియాల్‌ డు సల్‌ వేదికగా జరుగుతోన్న 24వ బధిరుల ఒలింపిక్స్‌(డెఫ్లింపిక్స్‌)లో ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌ కాంస్య పతకం సాధించింది. మే 15న జరిగిన టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటను ఓడించింది. ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్‌.

త్రిపుర రాష్ట్ర నూతన సీఎంగా ఎవరు ప్రమాణం చేశారు?
త్రిపుర రాజకీయాల్లో మే 14న అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ (50) రాజీనామా చేయడం, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మాణిక్‌ సాహా(69) ప్రమాణ స్వీకారం జరిగిపోయాయి.

యూఏఈ కొత్త అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు?
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కొత్త అధ్యక్షుడిగా దివంగత నేత షేక్‌ ఖలీఫా సవతి సోదరుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ (61) ఎంపికయ్యారు. ఆయన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నట్టు యూఏఈలోని ఏడు ముస్లిం దేశాల పాలకులు మే 14న ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
24వ బధిరుల ఒలింపిక్స్‌(డెఫ్లింపిక్స్‌)లో కాంస్యం గెలిచిన కాంస్యం గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి? 
ఎప్పుడు : మే 15
ఎవరు    : షేక్‌ జాఫ్రీన్‌
ఎక్కడ    : కాక్సియాల్‌ డు సల్, బ్రెజిల్‌
ఎందుకు : టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటపై విజయం సాధించినందున..

Sainthood: ఇటీవల సెయింట్‌హుడ్‌ పొందిన భారత పౌరుడు?

Devasahayam Pillai, Sainthood
సెయింట్‌ హుడ్‌ ప్రకటించిన తర్వాత వాటికన్‌ సిటీలో పోప్‌ ప్రార్థనలు 

మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్‌ సిటీలో మే 15న జరిగిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్‌ మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్‌ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు.

ట్రావెన్‌కోర్‌లో జననం.. కన్యాకుమారిలో కాల్చివేత..
1712 ఏప్రిల్‌ 23న కేరళలోని ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో హిందూ నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు.  ట్రావెంకోర్‌ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు.

దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్‌ బిషప్స్‌ సమాఖ్య పోప్‌ ఫ్రాన్సిస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్‌ గుర్తించినట్టు వెల్లడించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా)
ఎప్పుడు : మే 15
ఎవరు    : పోప్‌ ఫ్రాన్సిస్‌
ఎక్కడ    : వాటికన్‌ సిటీ
ఎందుకు : దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని..

Srilanka Economic Crisis: శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా

sri-lanka-mahinda-rajapaksa

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలు, లంకేయులు.. అధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స మే 9న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. 

Alzheimer's: అల్జీమర్స్‌ను అర్థం చేసుకునే కొత్త సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?

alzheimers-

కుంగుబాటు, అల్జీమర్స్, స్కిజోఫ్రేనియా వంటి మెదడు సంబంధిత రుగ్మతలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో దోహదపడగల సరికొత్త సాంకేతిక సాధనాన్ని భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆయా వ్యక్తులకు అనువైన చికిత్సా విధానాలను రూపొందించడంలోనూ అది దోహదపడుతుందని వారు తెలిపారు. అవేనా సటైవా(ఓట్స్‌) మొక్కల్లో కనిపించే ‘ఏఎస్‌ఎల్‌వోవీ2’ ఫొటోట్రోపిక్‌ రిసెప్టార్లపై తొలుత తాము అధ్యయనం చేసినట్లు జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ ఐహెచ్‌) పరిశోధకులు తెలిపారు. వాటిని ప్రేరణగా తీసుకొని.. న్యూరేగులిన్‌ 3 (ఎన్‌ ఆర్‌జీ3) ప్రొటీన్‌ , లైట్‌ సెన్సిటివ్‌ డొమైన్‌ ఎల్‌వోవీ2ల సంయోజనంతో వినూత్న కైమెరిక్‌ అణు నమూనాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. నాడీకణాల్లో ప్రొటీన్ల స్థితిగతుల్లో మార్పును అధ్యయనం చేసేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని వివరించారు. దాని సాయంతో మెదడు సంబంధిత వ్యాధులను మెరుగ్గా అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

Ballistic Missile: ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

జలాంతర్గామి నుంచి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు రేవు నగరం సిన్పో సమీపంలో సముద్ర జలాల్లో ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు.

Free Trade Agreement: బ్రిటన్‌ –భారత్‌ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌

task-force-industries

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సీబీఐ), కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) కలిసి ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్‌ లార్డ్‌ కరణ్‌ బిలిమోరియా తెలిపారు. ఎఫ్‌టీఏ సాకారమైతే.. 2035నాటికి బ్రిటన్, భారత్‌ మధ్య వాణిజ్యం 28 బిలియన్‌ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్‌ పౌండ్ల స్థాయిలో ఉంది. 

డబ్ల్యూఈఎఫ్‌ టెక్‌లో 5 భారతీయ స్టార్టప్‌లు  
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరానికి(డబ్ల్యూఈఎఫ్‌) సంబంధించిన టెక్నాలజీ పయోనీర్స్‌ కమ్యూనిటీలో.. ఈ ఏడాది కొత్తగా 100 స్టార్టప్‌లు చేరాయి. వీటిలో భారత్‌కు చెందిన ఐదు అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. వాహన్, స్మార్ట్‌కాయిన్‌ ఫైనాన్షియల్స్, రీసైకల్, ప్రోయియాన్, ప్యాండోకార్ప్‌.. ఈ జాబితాలో ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. ఎంపికైన స్టార్టప్‌లకు డబ్ల్యూఈఎఫ్‌ వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి చర్చలు మొదలైన వాటిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌బీఎన్‌ బీ, గూగుల్, కిక్‌స్టార్టర్, మొజిల్లా, స్పాటిఫై వంటి కంపెనీల సరసన ఇవి కూడా చేరతాయి. మే 22–26 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సు జరగనున్న నేపథ్యంలో.. ఈ లిస్టును ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్‌ పయోనీర్స్‌ జాబితాలో మొత్తం 30 దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి.

Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే

supreme-court

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజద్రోహం కేసులన్నీ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఇటీవల తీర్పులో వెల్లడించింది. రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకోవచ్చని తెలిపింది సుప్రీంకోర్టు. కొత్తగా రాజద్రోహం కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని సూచించింది. రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని పేర్కొన్న సుప్రీం.. సెక్షన్‌ 124అ కింద నమోదైన కేసులన్నింటినీ తిరిగి పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, బ్రిటిష్‌ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ(సెక్షన్‌ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్‌ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. రాజద్రోహం చట్టాన్ని తిరిగి పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది. ఈ చట్టాన్ని సమీక్షించే వరకూ స్టే విధిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. 

2022 Indian Presidential Election: తగ్గనున్న ఎంపీల ఓటు విలువ

presidential-poll

ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుల(ఎంపీ) ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక 2022 ఏడాది జూలైలో జరగనుంది.

Supreme Court: ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరు నియమితులయ్యారు?

supreme-court

సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ రెండు రోజుల్లోనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుధాన్షు ధులియా, గుజరాత్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ జంషెడ్‌ బి పార్దివాలాల నియామకాలను ఆమోదిస్తూ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వచ్చే వారం వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. 

Skeletons: 1857 నాటి వీర సైనికుల అస్థిపంజరాలు ఎక్కడ లభ్యమయ్యాయి?

skeletons

బ్రిటిష్‌ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లో బయటపడ్డాయి. జాల్నాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు వెల్లడించారు.​​​​​​​

Tomato Flu: కేరళలో కొత్త రకం వైరస్‌ టమాటో ఫ్లూ కలకలం

 

కేరళలో కొత్త రకం వైరస్‌ కలకలం రేపుతోంది. అంతుచిక్కని టమాటో ఫ్లూ కారణంగా అనేక మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఈ వైరస్‌ బారిన పడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వైరస్‌ను టమాటో జ్వరంగా కూడా పిలుస్తున్నారు. ఇది అత్యంత అరుదైన వైరస్‌ వ్యాధిగా నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి ఎర్రగా, టమాటో ఆకారంలో ఉండటంతో ఈ వ్యాధికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ సోకిన పిల్లల్లో శరీరంపై చాలాచోట్ల బొబ్బలు వస్తాయి. దీంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు,బలహీనత, డీహైడ్రేషన్‌ వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు పిల్లల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతుల వంటి లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి కేరళలోని కొల్లం జిల్లాలో మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి.

Sagar Mala Project: సాగర్‌మాల కింద ఎన్ని ప్రాజెక్టులను చేపట్టనున్నారు?

sagarmala

సాగర్‌మాల కార్యక్రమం కింద రూ.6.5 లక్షల కోట్ల విలువైన 1,537 ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రకటించారు. తీరప్రాంత జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ.58,700 కోట్ల వ్యయ అంచనాలతో 567 ప్రాజెక్టులను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. సాగర్‌మాల దేశవ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న సాగర తీరాన్ని ఉపయోగించుకుంటూ..పోర్టుల ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర సర్కారు సాగర్‌మాల కార్యక్రమాన్ని తలపెట్టింది.అలాగే 14,500 కిలోమీటర్ల పొడవునా జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది.

చదవండి: Daily Current Affairs in Telugu: 2022, మే 14 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 May 2022 06:26PM

Photo Stories