Daily Current Affairs in Telugu: 2022, మే 14 కరెంట్ అఫైర్స్
![dailycurrent-affairs-telugu](/sites/default/files/images/2022/05/14/dailycurrent-affairs-telugu-1652532511.jpg)
United Arab Emirates: బుర్జ్ ఖలీఫా నిర్మాణం ఎవరి పేరు మీద జరిగింది?
![Sheikh Khalifa bin Zayed Al Nahyan](/sites/default/files/inline-images/Sheikh%20Khalifa%20bin%20Zayed%20Al%20Nahyan.jpg)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ (73) కన్నుమూశారు. కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధ పడుతున్న ఆయన మే 13న తుదిశ్వాస విడిచినట్టు అధ్యక్ష వ్యవహారాల శాఖ వెల్లడించింది. 40 రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ పెద్ద కుమారుడైన ఖలీఫా.. తండ్రి మరణానంతరం 2004లో దేశ పగ్గాలు చేపట్టారు. పుష్కలమైన చమురు, గ్యాస్ నిల్వల సాయంతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లో ఉన్న ‘‘బుర్జ్ ఖలీఫా’’ నిర్మాణం ఆయన పేరు మీదే జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు కన్నుమూత
ఎప్పుడు : మే 13
ఎవరు : షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ (73)
ఎక్కడ : అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఎందుకు : గుండె జబ్బు కారణంగా..
Lunar Soil: ఏ దేశ శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు?
![Moon Soil - Plants](/sites/default/files/inline-images/Moon%20Soil%20-%20Plants.jpg)
జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.
ఏ మొక్కలు పెంచారు?
మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్ జాతికి చెందిన అరబిడోప్సిస్ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్ కమ్యూనికషన్స్ బయాలజీ ప్రచురించింది.
మొక్కల్ని ఇలా పెంచారు..
- చంద్రుడి నుంచి అపోలో మిషన్ 11, 12, 17 సమయంలో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకుపైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచారు.
- చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టి మధ్య చాలా తేడాలుంటాయి. సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పని చేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో ఉండవు. అందుకే ఇందులో మొక్కలు పెంచడాన్ని ఒక సవాల్ తీసుకున్నారు.
- అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టి ఒక్కో గ్రాము వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెర్రారియమ్ బాక్సుల్లో ఉంచారు. ప్రతీ రోజూ వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. రెండు రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తాయి.
ఎలా పెరిగాయి?
చంద్రుడిపై వ్యవసాయానికి వీలు కుదురుతుందా ? భవిష్యత్‌లో చంద్రుడిపై పరిశోధనల కోసం మరిన్ని రోజులు వ్యోమగాములు గడపాలంటే వారికి కావల్సిన పంటలు అక్కడ పండించుకోవడం సాధ్యమేనా? అన్న దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందులో చంద్రుడి మట్టిలో వ్యవసాయం సాధ్యమేనని తేలింది. అయితే ఈ మొక్కలు భూమిపై పెరిగినంత బలంగా, ఏపుగా పెరగలేదని తేలింది.
Shooting: జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయులు?
![Esha Singh, Umamahesh](/sites/default/files/inline-images/Esha%20Singh%2C%20Umamahesh.jpg)
జర్మనీలోని సుహ్ల్ వేదికగా జరుగుతోన్న జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్–2022 టీమ్ ఈవెంట్స్‌లో మే 13న భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి.
పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో..
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు.. ఫెనల్లో 16–8తో స్పెయిన్ జట్టును ఓడించి విజేతగా నిలిచి, స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 17 ఏళ్ల మద్దినేని ఉమామహేశ్ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు.
మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో..
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు.. ఫైనల్లో 16–8తో జార్జియా జట్టుపై గెలిచి, పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇషా సింగ్ తెలంగాణకి చెందిన అమ్మాయి.
మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో..
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది.
పురుషుల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో..
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ చౌదరీ, శివ, సరబ్‌జీత్‌లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది.
Forbes Global 2000 List 2022: ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో నిలిచిన కంపెనీ?
![Reliance Industries](/sites/default/files/inline-images/Reliance%20Industries_0.jpg)
Forbes Global 2000 List 2022: 2022 సంవత్సరానికి గాను 2000 అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా(గ్లోబల్ 2000 జాబితా)ను మే 13న ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి.
అగ్రస్థానంలో హాథ్‌వే..
- గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అగ్రస్థానంలో నిలిచింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం.
- ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది.
- సౌదీ ఆరామ్‌కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తొలి భారతీయ కంపెనీగా..
ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇక తాజా జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి.
ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితా–2022 |
|
ర్యాంకు |
కంపెనీ |
1 |
బెర్క్‌షైర్ హాథ్‌వే |
2 |
ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా |
3 |
సౌదీ ఆరామ్‌కో |
4 |
జేపీమోర్గాన్ చేజ్ |
5 |
చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకు |
53 |
రిలయన్స్ ఇండస్ట్రీస్ |
105 |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
153 |
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ |
204 |
ఐసీఐసీఐ బ్యాంక్ |
228 |
ఓఎన్‌జీసీ |
268 |
హెచ్‌డీఎఫ్‌సీ |
357 |
ఐఓసీ |
384 |
టీసీఎస్ |
407 |
టాటా స్టీల్ |
431 |
యాక్సిస్ బ్యాంక్ |
593 |
వేదాంత |
1453 |
అదానీ ఎంటర్‌ప్రైజెస్ |
1568 |
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ |
1570 |
అదానీ గ్రీన్ ఎనర్జీ |
1705 |
అదానీ ట్రాన్స్‌మిషన్ |
1746 |
అదానీ టోటల్ |
Chief Secretary of AP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఎవరు ఉన్నారు?
![AP-CS-Sameer-Sharma](/sites/default/files/inline-images/AP-CS-Sameer-Sharma.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ మే 13న కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 2022, నవంబర్ 30వ తేదీ వరకు ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సమీర్‌శర్మ పదవీ కాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. ఆ గడువు 2022, మే నెలాఖరుతో పూర్తి కానుండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సమీర్‌శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలం మరో 6 నెలలపాటు పొడిగింపు
ఎప్పుడు : మే 13
ఎవరు : కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు..
Andhra Pradesh: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు?
![Mukesh-Kumar-Meena](/sites/default/files/inline-images/Mukesh-Kumar-Meena.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్–సీఈవో)గా వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు మే 13న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్‌కుమార్ మీనా గతంలో రాజ్‌భవన్ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటివరకు ఏపీ సీఈవో పదవిలో కె.విజయానంద్ కొనసాగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్–సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మే 13
ఎవరు : ముఖేశ్‌కుమార్ మీనా
ఎందుకు : కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు..
Gaganyaan: ఎస్–200 బూస్టర్ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి నిర్వహించారు?
![](/sites/default/files/images/2022/10/31/isro0-1667210228.jpg)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ ప్రయోగం విజయవంతమైంది. గగన్‌యాన్–1 ప్రయోగంలో భాగంగా మే 13న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వెడల్పుగల 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి దీన్ని ప్రయోగించారు. ఈ స్ట్రాపాన్ బూస్టర్‌ను 135 సెకండ్ల పాటు మండించి సుమారు 700 కిలో మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి ప్రయోగించడంతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా నేపథ్యంలో గగన్‌యాన్ ప్రయోగాన్ని 2023 ఆఖరు నాటికి, లేదా 2024 ప్రథమార్థంలో నిర్వహించే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : మే 13
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్), శ్రీహరికోట, తిరుపతి జిల్లా
ఎందుకు : గగన్‌యాన్–1 ప్రయోగంలో భాగంగా...
Badminton: థామస్ కప్ టీమ్ టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించారు?
![Srikanth Kidambi](/sites/default/files/inline-images/Srikanth%20Kidambi.jpg)
థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నమెంట్–2022లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీంతో 1949లో మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా మే 13న మాజీ చాంపియన్ డెన్మార్క్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–2తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో 14 సార్లు విజేత ఇండోనేసియా 3–2తో మాజీ విజేత జపాన్‌ను ఓడించి మే 14న జరిగే టైటిల్ పోరులో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, పంజాల విష్ణువర్ధన్ ఏ క్రీడలో ప్రసిద్ధులు?
భారత్–డెన్మార్క్ మ్యాచ్‌లు ఇలా..
- మొదటి మ్యాచ్: భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 49 నిమిషాల్లో 13–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్‌సన్(డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.
- రెండో మ్యాచ్: రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం(భారత్) 21–18, 21–23, 22–20తో కిమ్ ఆస్‌ట్రప్–మథియాస్ క్రిస్టియాన్సన్(డెన్మార్క్) జంటను ఓడించింది.
- మూడో మ్యాచ్: ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్(డెన్మార్క్)తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 80 నిమిషాల్లో 21–18, 12–21, 21–15తో గెలుపొందాడు.
- నాలుగో మ్యాచ్: ఈ మ్యాచ్‌లో ఆండెర్స్ రస్‌ముసెన్–ఫ్రెడెరిక్ ద్వయం(డెన్మార్క్) 21–14, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట(భారత్)ను ఓడించింది.
- ఐదో మ్యాచ్: ప్రపంచ 13వ ర్యాంకర్ రస్‌ముస్ జెమ్కె(డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో 23వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్(భారత్) 73 నిమిషాల్లో 13–21, 21–9, 21–12తో గెలుపొంది భారత్‌ను తొలిసారి థామస్ కప్‌లో ఫైనల్‌కు చేర్చాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నమెంట్ తొలిసారి ఫైనల్‌కు అర్హత
ఎప్పుడు : మే 13
ఎవరు : భారత జట్టు
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
ఎందుకు : మాజీ చాంపియన్ డెన్మార్క్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–2తో విజయం సాధించినందున..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 12 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్