Daily Current Affairs in Telugu: 2022, మే 12 కరెంట్ అఫైర్స్
Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన భారతీయుడు?
జర్మనీలోని సుహ్ల్ వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ–2022లో భారత షూటర్లు రుద్రాంక్ష్ పాటిల్, అభినవ్ షాల గురి అదిరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ విజేతగా నిలువగా, అభినవ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. మే 11న జరిగిన ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్ 17–13తో అభినవ్ షాపై గెలిచి బంగారు పతకం సాధించగా, రజతంతో అభినవ్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ భారత్‌కు స్వర్ణ, రజతాలు లభించాయి. ఫైనల్లో శివ నర్వాల్ 16–12తో భారత్‌కే చెందిన సరబ్‌జ్యోత్ సింగ్‌ను ఓడించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ–2022 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం, రజత పతకాలు సాధించిన భారత షూటర్లు?
ఎప్పుడు : మే 11
ఎవరు : రుద్రాంక్ష్ పాటిల్(స్వర్ణం), అభినవ్ షా(రజతం)
ఎక్కడ : సుహ్ల్, జర్మనీ
ఎందుకు : ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్ 17–13తో అభినవ్ షాపై గెలిచి బంగారు పతకం సాధించగా, రజతంతో అభినవ్ రన్నరప్‌గా నిలిచాడు
Tomato Flu: దేశంలోని ఏ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు?
దక్షిణ భారత రాష్ట్రం కేరళలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. ఐదేళ్ల లోపు చిన్నారులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కొల్లాం జిల్లాలో 80 మందికి పైగా పిల్లలు దీని బారిన పడ్డట్టు వైద్య అధికారులు వెల్లడించారు. వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
శరీరంపై ఎర్రటి దద్దుర్లు..
- టమాటో ఫ్లూ సోకిన వారి శరీరంపై ఎర్రటి దద్దుర్లు, టమాటో రంగు బొబ్బలు వస్తున్నాయి. వీటితోపాటు దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో చిన్నారులు బాధపడుతున్నారు.
- టమాటో ఫ్లూ సోకితే శారీరక పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది ఎందుకు సోకుతోందో వైద్యులకూ అంతుపట్టడం లేదు. చికున్‌గున్యా, డెంగీ వంటివి వచ్చిన వారికి ఆఫ్టర్ ఎఫెక్ట్‌గా ఈ వైరస్ సోకుతుందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోని ఏ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు?
ఎప్పుడు : మే 11
ఎవరు : కేరళ వైద్యులు
ఎక్కడ : కొల్లాం జిల్లా, కేరళ
Supreme Court: ఏ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది?
బ్రిటిష్ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్ 124ఏ) విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. చట్టం అమలుపై మే 11న స్టే విధించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణ కూడా నిలిపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తమ తదుపరి ఉత్తర్వుల దాకా కొనసాగుతాయని పేర్కొంది. 124ఏ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని వ్యాఖ్యానించింది. దీనిపై జూలై మూడో వారంలో తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు.
ఒక చట్టం... వేల వివాదాలు
సెక్షన్ 124 ఏలో ఏముంది?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు.
ఎందుకు తెచ్చారు?
స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి.
2015–20 మధ్య 356 కేసులు..
- 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి.
- ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది.
- 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి.
- కేంద్రంలో ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటిష్ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్ 124ఏ) అమలుపై స్టే విధింపు
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : సెక్షన్ 124ఏ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని..
Israeli–Palestinian Conflict: కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్టు?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా అల్ జజీరా చానల్ మహిళా జర్నలిస్టు షిరీన్ అబు అక్లా (51) ప్రాణాలు కోల్పోయారు. మరో జర్నలిస్టు అలీ సమోదీ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీయే ఈ దారుణానికి పాల్పడిందని అల్ జజీరా ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు షిరీన్ తలపై నేరుగా తుపాకీ పెట్టి కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పాలస్తీనా కూడా చెబుతోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పాలస్తీనా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారంది.
బులెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా..
కవరేజీ సమయంలో షిరీన్ తలకు హెల్మెట్ పెట్టుకున్నారు. బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. దానిపై ప్రెస్ అని రాసుంది. ఆమె చెవి కింద తూటా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణకు ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ ఆదేశించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్టు?
ఎప్పుడు : మే 11
ఎవరు : షిరీన్ అబు అక్లా (51)
ఎక్కడ : వెస్ట్‌బ్యాంక్ సిటీ, ఇజ్రాయెల్
ఎందుకు : ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా..
PM Modi: మోడీ ఎట్ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకం ఆవిష్కరణ
ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పలు రంగాల్లో 20 ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు సంబంధించిన పలు అంశాలపై 22 మంది నిపుణులు రాసిన 21 కథనాల సంకలనం ‘మోడీ ఎట్ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకం విడుదలైంది. మే 11న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజా పోరాటాలపై లోతైన అవగాహన, కలలుగనే ధైర్యం, కృషి, అభిరుచి, శక్తి, దృఢ నిశ్చయం ప్రధాని మోదీ విజయ రహస్యాలని వెంకయ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత సుఖ్‌రాం మృతి
కాంగ్రెస్ కురువృద్ధ నేత సుఖ్‌రాం (94) న్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మే 7న హిమాచల్‌ప్రదేశ్‌లోని స్వస్థలం మండి నుంచి ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మే 11న తుదిశ్వాస విడిచారు. ఆయన 1993–96 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర సమాచార మంత్రిగా పని చేశారు. టెలికాం కుంభకోణంలో చిక్కుకోవడంతో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ కేసులో 2011లో ఆయనకు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది.
Election Commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
భారత ఎన్నికల కమిషన్(Election Commission of India-ఈసీఐ) 25వ ప్రధాన కమిషనర్(Chief Election Commissioner of India-సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర మే 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మే 15న నూతన సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. ఎలక్షన్ కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఈసీఐలో 2వ కమిషనర్‌గా ఉన్నారు. ఈసీఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్.. బిహార్, జార్ఖండ్ కేడర్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర సర్వీసులకు వచ్చిన తర్వాత ఆర్‌బీఐ, సెబీ, నాబార్డ్‌లలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆర్థిక రంగానికి చెందిన పలు ఇతర సంస్థలకు సేవలందించారు. అంతకుముందు ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం
భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అందువల్ల జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని 2011 నుంచి పాటిస్తున్నారు. దేశ తొలి చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్ సేన్(కాలం 1950, మార్చి 21–1958, డిసెంబర్ 19) పనిచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం – బహుళ సభ్యత్వం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థ. 1950 జనవరి 25 నుంచి 1989 అక్టోబర్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో మాత్రమే పనిచేసింది. 1989లో మొట్టమొదటిసారిగా బహుళ సభ్య సంస్థగా మార్పు చేస్తూ ఇద్దరు ఇతర కమిషనర్లను నియమించారు. కానీ 1990లో తిరిగి ఏక సభ్య సంస్థగా మారింది. తిరిగి 1993లో బహుళ సభ్య సంస్థగా మారుస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1993 నుంచి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు సభ్యులతో కొనసాగుతోంది.
ప్రత్యేక వివరణ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారాలు, హోదాలు, జీతభత్యాల్లో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. లేకుంటే మెజార్టీ ప్రాతిపదికపై నిర్ణయాలను అమలుచేస్తారు.
నియామకం–అర్హతలు–పదవీకాలం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజనల్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉంటుంది. నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలేమీ లేవు. ప్రకరణ 324(5) ప్రకారం ఎలక్షన్ కమిషనర్ల పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను పార్లమెంటు చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది. సాధారణంగా సీనియర్ బ్యూరోక్రాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమిస్తారు. వీరి పదవీ కాలం ఆరేళ్లు, పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. పదవిలో కొనసాగే కాలంలో ఈ రెండింటిలో ఏది ముందువస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రత్యేక వివరణ: ప్రస్తుతానికి రీజనల్ కమిషనర్ల నియామకం చేపట్టలేదు.
జీతభత్యాలు
వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి జీతాలు చెల్లిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వాటిని తగ్గించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తుల వేతనాలతో సమానంగా వీరి వేతనాలుంటాయి.
తొలగింపు
ప్రకరణ 324(5) ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే పార్లమెంటు తొలగిస్తుంది. కానీ, ఇతర కమిషనర్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) 25వ ప్రధాన కమిషనర్(సీఈసీ)గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : రాజీవ్ కుమార్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రస్తుతం సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర మే 14న పదవీ విరమణ చేయడంతో..
Shaurya Chakra: అమరవీరుడు జస్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర ప్రదానం
భరత మాత ముద్దు బిడ్డ, బాపట్ల వాసి, వీర సైనికుడు మరుప్రోలు జస్వంత్ రెడ్డికి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర పతకాన్ని ప్రదానం చేసింది. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జస్వంత్‌రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డును అందజేశారు. 2021, జూలైలో జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో జస్వంత్‌రెడ్డి వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
World Economic Forum: డబ్ల్యూఈఎఫ్ టెక్‌లో చేరిన భారత స్టార్టప్‌లు?
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కి సంబంధించిన టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీలో 2022 ఏడాది కొత్తగా 100 స్టార్టప్‌లు చేరాయి. వీటిలో భారత్‌కు చెందిన అంకుర సంస్థలు అయిదు ఉన్నాయి. వాహన్, స్మార్ట్‌కాయిన్ ఫైనాన్షియల్స్, రీసైకల్, ప్రోయియాన్, ప్యాండోకార్ప్ ఈ జాబితాలో ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ఈ కమ్యూనిటీలో చేరడం ద్వారా స్టార్టప్‌లకు.. కొత్త టెక్నాలజీల పురోగతిని ప్రదర్శించేందుకు వీలవుతుందని వివరించింది.
టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీకు ఎంపికైన స్టార్టప్‌లకు డబ్ల్యూఈఎఫ్ వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి చర్చలు మొదలైన వాటిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, కిక్‌స్టార్టర్, మొజిల్లా, స్పాటిఫై వంటి కంపెనీల సరసన ఇవి కూడా చేరతాయి. మే 22–26 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ లిస్టును ప్రకటించారు. టెక్ పయోనీర్స్ జాబితాలో 30 దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కి సంబంధించిన టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీలో చేరిన భారత స్టార్టప్‌లు?
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : వాహన్, స్మార్ట్‌కాయిన్ ఫైనాన్షియల్స్, రీసైకల్, ప్రోయియాన్, ప్యాండోకార్ప్
ఎందుకు : కొత్త టెక్నాలజీల పురోగతిని ప్రదర్శించేందుకు..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 11 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్