Daily Current Affairs in Telugu: 2022, మే 11 కరెంట్ అఫైర్స్
Asia Cup Archery 2022: ఆసియా కప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన జోడీ?
ఇరాక్‌లోని సులేమానియా నగరం వేదికగా జరుగుతోన్న ఆసియా కప్ ఆర్చరీ–2022లో భాగంగా మే 10న జరిగిన పోటీల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం లభించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో పర్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీలతో కూడిన భారత జట్టు 204–201తో కజకిస్తాన్ జట్టును ఓడించి బంగారు పతకం గెలిచింది. పురుషుల ఫైనల్లో ప్రథమేశ్ ఫుగె, రిషభ్ యాదవ్, జవకర్ సమాధాన్ కూడిన భారత బృందం 224–218తో బంగ్లాదేశ్ జట్టును ఓడించి స్వర్ణం సాధించింది.
ఇక మూడో స్వర్ణం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ప్రథమేశ్ ఫుగె, పర్నీత్ కౌర్ జోడీ(భారత్) సాధించింది. ఫైనల్లో ఈ జోడీ 158–151తో అదిలజెక్సెంబినొవా–క్రిస్టిచ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సమాధాన్ 147–145తో సెర్గెయ్ క్రిస్టిచ్ (కజకిస్తాన్)పై గెలిచి రెండో పతకం తన ఖాతాలో వేసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా కప్ ఆర్చరీ–2022 కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన భారత జోడీ?
ఎప్పుడు : మే 10
ఎవరు : ప్రథమేశ్ ఫుగె, పర్నీత్ కౌర్ జోడీ
ఎక్కడ : సులేమానియా, ఇరాక్
ఎందుకు : కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ప్రథమేశ్, పర్నీత్ ద్వయం 158–151తో అదిలజెక్సెంబినొవా–క్రిస్టిచ్ (కజకిస్తాన్) జంటపై గెలిచినందున..
Limassol International: హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?
సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్–2022(లిమాసోల్ ఇంటర్నేషనల్)లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. మే 10న సైప్రస్‌లోని లిమాసోల్ వేదికగా జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 13.38 సెకన్లతో అనురాధా బిస్వాల్ (ఒడిశా) పేరిట 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది.
షేక్ జాఫ్రీన్, భవాని జోడీలకు పతకాలు ఖాయం
బ్రెజిల్‌లోని కాక్సియాస్ దో సుల్(Caxias do Sul) వేదికగా జరుగుతోన్న బధిరుల ఒలింపిక్స్–2022 క్రీడల్లో టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో షేక్ జాఫ్రీన్ (ఆంధ్రప్రదేశ్), భవాని కేడియా (తెలంగాణ) తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో షేక్ జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ (భారత్) జంట 6–1, 6–1తో టుటెమ్– ఎమిర్ (టర్కీ) జోడీపై నెగ్గగా... భవాని–ధనంజయ్ దూబే (భారత్) జోడీకి జర్మనీ జంట నుంచి ‘వాకోవర్’ లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 100 మీటర్ల హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?
ఎప్పుడు : మే 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ స్వర్ణ
ఎక్కడ : లిమాసోల్, సైప్రస్
ఎందుకు : సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్–2022(లిమాసోల్ ఇంటర్నేషనల్)లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో.. జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచినందున..
Philippine presidential election 2022: ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్(64) ఘన విజయం సాధించారు. మే 10వ తేదీన 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్‌కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎప్పుడు : మే 10
ఎవరు : మార్కోస్ జూనియర్(64)
ఎందుకు : ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందున..
Pulitzer Prizes 2022: పులిట్జర్ అవార్డుకు ఎంపికైన భారతీయ ఫోటో జర్నలిస్టు?
భారతీయ ఫోటో జర్నలిస్టు, అఫ్గానిస్తాన్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన రాయటర్స్ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖికి ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు–2022 లభించింది. సిద్దిఖితో పాటు మరో ముగ్గురు భారతీయులు, ఆయన సహచర ఫొటోగ్రాఫర్లు అద్నాన్ అబిది, సనా ఇర్షాద్ మట్టో, అమిత్ దేవ్‌లకు ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో మరణ మృదంగాన్ని అద్దం పట్టేలా అద్భుతంగా తమ కెమెరాలో బంధించినందుకు ఈ నలుగురు భారతీయులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక జర్నలిజం ప్రజాసేవ విభాగంలో అమెరికా పార్లమెంటు భవనంపై దాడికి సంబంధించిన కవరేజికిగాను వాషింగ్టన్ పోస్టుకి పులిట్జర్ అవార్డు లభించింది.
డానిష్‌కి రెండోసారి..
- డానిష్ సిద్దిఖికీ పులిట్జర్ అవార్డు రావడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యా సంక్షోభం కవరేజీలో ఒక మహిళ దేశాన్ని వీడి వెళ్లిపోతూ నేలని తాకుతున్న ఫొటోకి ఆయనకి ఈ అవార్డు లభించింది.
- 38 ఏళ్ల వయసున్న సిద్దిఖి 2021 ఏడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నప్పుడు జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్ సంక్షోభం కవరేజీకి వెళ్లిన సిద్దిఖి కాందహార్ నగరంలో 2021, జూలైలో అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకి మధ్య కాల్పుల్ని కవర్ చేస్తుండగా తూటాలకు బలయ్యారు.
- అఫ్గాన్ కల్లోలం, హాంగ్‌కాంగ్ నిరసనలు, ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కడా సంక్షోభం తలెత్తినా డానిష్ సిద్ధిఖి విస్తృతంగా కవర్ చేశారు. ఢిల్లీకి చెందిన సిద్ధికి మాస్ కమ్యూనికేషన్లు, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. 2010లో రాయటర్స్ సంస్థలో చేరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పులిట్జర్ అవార్డు–2022(ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో) ఎంపికైన భారతీయులు?
ఎప్పుడు : మే 10
ఎవరు : అఫ్గానిస్తాన్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన రాయటర్స్ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖితో పాటు ఆయన సహచర ఫొటోగ్రాఫర్లు అద్నాన్ అబిది, సనా ఇర్షాద్ మట్టో, అమిత్ దేవ్
ఎందుకు : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో మరణ మృదంగాన్ని అద్దం పట్టేలా అద్భుతంగా తమ కెమెరాలో బంధించినందుకు..
Marilyn Monroe: 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్?
1964లో అమెరికన్ చిత్రకారుడు ఆండీ వర్హోల్ పట్టు వస్త్రంపై వేసిన హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో పెయింటింగ్ మే 09న క్రిస్టీస్ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1,506 కోట్లకు అమ్ముడుపోయింది. 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా చరిత్రకెక్కింది.
ఉక్రెయిన్‌లో అతి పెద్ద నౌకాశ్రయం ఏది?
ఉక్రెయిన్‌లో సైన్యానికి పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న కీలక రేవు పట్టణం ఒడెసాపై రష్యా మే 10న భారీగా దాడులకు దిగింది. ఆయుధ సరఫరా మార్గాలను పూర్తిగా మూసేయడమే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. ఉక్రెయిన్‌లో అతి పెద్ద నౌకాశ్రయమైన ఒడెసా నౌకాశ్రయం.. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగమతులకు ప్రధాన కేంద్రం.
ఉక్రెయిన్‌కు 4,000 కోట్ల డాలర్లు సాయం
ఉక్రెయిన్‌కు మరో 4,000 కోట్ల డాలర్ల సైనిక, మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మే 09న సంతకం చేశారు. రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించడంలో ఈ సాయం కీలకంగా మారనుందని బైడెన్ పేర్కొన్నారు.
ISTA: ఇస్టా అధ్యక్షుడిగా ఎంపికకానున్న మొదటి ఆసియా వ్యక్తి?
The International Seed Testing Association (ISTA): అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్ కేశవులు పేరు ఖరారైంది. ప్రస్తుతం ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పదవికి ఎంపికవుతున్న మొదటి భారతీయుడు, మొదటి ఆసియా వ్యక్తి కూడా డాక్టర్ కేశవులే. 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి విదితమే.
అధిక దిగుబడులు సాధించడానికి, మెరుగైన విత్తనాలు అందేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడమే ఇస్టా లక్ష్యం. ల్యాబ్‌లో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే ఇస్టా సర్టిఫికేషన్ ఇస్తారు. ఇస్టా ప్రధాన కార్యాలయం స్విట్జర్‌లాండ్‌లో ఉంది. ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా స్టీవ్ జోన్స్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా ఎంపికకానున్న మొదటి ఆసియా వ్యక్తి?
ఎప్పుడు : మే 10
ఎవరు : తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్ కేశవులు
ఎందుకు : ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్ నిర్ణయం మేరకు..
Supreme Court: ఐపీసీ సెక్షన్ 124ఏ దేనికి సంబంధించినది?
‘‘బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ చట్టం ‘ఐపీసీ సెక్షన్ 124ఏ’ను పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మే 10న ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. వీటిపై కేంద్రం వైఖరేమిటో మే 11వ తేదీలోగా తమకు చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. దాన్నిబట్టి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న దేశద్రోహం చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లెక్కకు మించి పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని పునఃసమీక్షిస్తామని, అంతవరకు పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని సుప్రీంను కేంద్రం కోరింది. దేశద్రోహ చట్టం కింద 2015–20 మధ్య దేశవ్యాప్తంగా 356 కేసులు నమోదయ్యాయి. ఈ చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది.
PM Modi: ఇటీవల ఏ రాష్ట్రంలో 2,985 అమృత్ సరోవర్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?
ఇటీవల అస్సాం రాష్ట్రంలో 2,985 అమృత్ సరోవర్ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే దిఫూలో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కర్బీ అంగ్లాంగ్‌లో పశువైద్య కళాశాల సహా పలు విద్యాసంస్థలకు ఆయన శంకుస్థాపన చేశారు. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టులు సంయుక్తంగా ‘అస్సాం కేన్సర్ కేర్ ఫౌండేషన్ (ఏసీసీఎఫ్)’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు కేన్సర్ చికిత్స కేంద్రాలను మోదీ ప్రారంభించారు. మరో ఏడింటికి శంకుస్థాపన చేశారు.
Diabetes: క్లోమాన్ని ప్రేరేపించే పీకే2ను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు?
మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే సరికొత్త మందు అభివృద్ధి దిశగా భారత పరిశోధకులు ముందడుగు వేశారు. ఇన్సులిన్ ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించే పదార్థాన్ని వారు గుర్తించారు. దీన్ని పీకే2గా పిలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయికి అనుగుణంగా క్లోమంలోని బీటా కణాలు సరిపడినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. ఇన్సులిన్ విడుదలలో అనేక జీవరసాయన ప్రక్రియలకు పాత్ర ఉంటుంది. బీటా కణాల్లోని జీఎల్‌పీ1ఆర్ ప్రొటీన్ కూ ఇందులో ప్రమేయం ఉంది. భోజనం చేశాక విడుదలయ్యే జీఎల్‌పీ1 అనే హార్మోనల్ పదార్థం.. జీఎల్‌పీ1ఆర్‌కు అంటుకొని, ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఎక్సెనాటైడ్, లిరాగ్లుటైడ్ వంటి ఔషధాలు కూడా జీఎల్‌పీ1 పాత్రను పోషిస్తూ ఇన్సులిన్ విడుదలకు దోహదపడతాయి. ఈ ఔషధాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ సిమ్యులేషన్ విధానాలను ఉపయోగించింది. జీఎల్‌పీ1ఆర్‌తో బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యమున్న పదార్థాల కోసం శోధించారు. పీకే2 వైపు మొగ్గారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా బీటా కణాలను ప్రేరేపించే సత్తా ఈ పదార్థానికి ఉందని ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది. పీకే2ను జీర్ణాశయ వ్యవస్థ వేగంగా గ్రహించగలుగుతోందని, దీన్ని ఇంజెక్షన్ రూపంలో కాకుండా నోటి ద్వారా తీసుకునే మందులా వాడొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. నష్టపోయిన బీటా కణాలనూ పునరుద్ధరించే సత్తా దీనికి ఉందని గుర్తించారు.
Chandrayaan Mission: చంద్రుడిపై నీటికి భూమే ఆధారం
చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్ మిషన్ నిర్ధారించి 14 ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని.. అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు. చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపై నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు భూమి ఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని.. ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు.
Shukrayaan-I: శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనున్న దేశం?
చంద్రుడు, కుజుడి(మార్స్)పైకి విజయవంతంగా వ్యోమ నౌకలను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. 2024 డిసెంబరులో శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనుంది. సౌర కుటుంబంలోకెల్లా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలకు నెలవైన శుక్రుని కక్ష్యలో తమ నౌక పరిభ్రమిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వివరించారు. ‘శుక్ర గ్రహ సైన్స్’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘శుక్రునిపై ఎల్లప్పుడూ దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు అలుముకుని ఉంటాయి. ఆ మేఘాల కింద శుక్రుని ఉపరితలాన్ని తమ నౌక కక్ష్య నుంచే శోధిస్తుంది’ అని చెప్పారు. 2024 డిసెంబరులో శుక్రుని చేరుకునే ఇస్రో వ్యోమ నౌక.. 2025 జనవరి నుంచి శుక్ర కక్ష్యలో విన్యాసాలు పారంభిస్తుంది. 2025లో భూమి, శుక్రుడు ఒకే రేఖ మీదకు ఉంటాయి కాబట్టి, రెండు గ్రహాల మధ్య దూరం తగ్గుతుందని సోమనాథ్ వివరించారు.
USA International Team Trials: సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన స్విమ్మర్?
అమెరికా యువ స్విమ్మర్ హంటర్ ఆర్మ్‌స్ట్రాంగ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నార్త్‌కరోలినా వేదికగా జరిగిన అంతర్జాతీయ టీమ్ ట్రయల్స్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్ సత్తాచాటాడు. బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ కోసం జరిగిన ఈ సన్నాహక పోటీల్లో 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ రేసును.. ఆర్మ్‌స్ట్రాంగ్ రికార్డు స్థాయిలో 23.71 సెకన్లలో ముగించాడు. రష్యా స్విమ్మర్ క్లిమెంట్ కొలెస్నికోవ్ (23.80సె) రికార్డును హంటర్ తిరగరాశాడు. గతంలో జరిగిన ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌తో 100 మీటర్ల మెడ్లె రేసులోనూ ఆర్మ్‌స్ట్రాంగ్ పసిడి పతకంతో మెరిశాడు.
Asian Games 2022: వాయిదా పడిన ఆసియా క్రీడలు
చైనాలో కోవిడ్ కేసులు పెరగడంతో ఆసియా క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10–25 మధ్య చైనాలోని హాంగ్‌జౌలో19వ ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది. చైనా వ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు తిరిగి పెరిగాయి. దాంతో ఇటీవల సమావేశమైన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు.. క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.
భారత స్టార్ డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై వేటు
నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో కమల్ ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ సస్పెన్షన్ విధించింది. ఆమె దోషిగా తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడుతుంది. 26ఏళ్ల కమల్ ప్రీత్‌కు ఎప్పుడు పరీక్ష నిర్వహించారన్న వివరాలు తెలియలేదు. ప్రస్తుతం జాతీయ రికార్డు (65.06 మీటర్లు) కమల్ ప్రీత్ పేరిటే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె అనూహ్య ప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది.చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 10 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్