Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 10 కరెంట్‌ అఫైర్స్‌

current-affairs-telugu

Weather Station: ప్రపంచంలోనే ఎత్తైన‌ వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైంది?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన‌ ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది. మే 4న ఎవరెస్ట్‌ శిఖరంపై.. సముద్ర మట్టానికి 8,830 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతోపాటు.. డేటా ట్రాన్స్‌మిషన్ కేంద్రం కూడా ఉంది. గతంలో అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు 8,430 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్‌ దక్షిణ భాగాన నిర్మించిన వాతావరణ కేంద్రమే.. అత్యంత ఎల్తైనది. ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచంలోనే ఎల్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైంది?
ఎప్పుడు  : మే 04
ఎవరు    : చైనా
ఎక్కడ     : ఎవరెస్ట్‌ శిఖరం(చైనా వైపు)
ఎందుకు : వాతావరణంపై అధ్యయనం చేసేందుకు..

Unicorn Start-Ups: అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లు ఉన్న దేశాల్లో భారత్‌ స్థానం?

బెంగళూరుకు చెందిన నియో బ్యాంకింగ్‌ స్టార్టప్‌ ‘‘ఓపెన్‌’’ యూనికార్న్‌ హోదా సాధించిన వందో భారతీయ స్టార్టప్‌గా గుర్తింపు సాధించింది. ఒక స్టార్టప్‌ విలువ ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరితే దానిని యూనికార్న్‌ స్టార్టప్‌ అంటారు. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లు ఉన్న దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాతి స్థానంలో భారత్‌(మూడో స్థానం) ఉంది.

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్Œ కమిషన్Œ  తన పదవీ కాలం ముగియడానికి ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ ఈ నివేదిక సమర్పించింది. జమ్మూ కశ్మీర్‌లోని అసెంబ్లీస్థానాల సంఖ్యను 83 నుంచి 90 సీట్లకు పెంచాలని కమిష¯Œ ప్రతిపాదించింది. జమ్మూలో 6 స్థానాలు, కశ్మీర్‌లో ఒక స్థానం కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌కు 9 సీట్లు కేటాయించింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆర్డర్‌ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లు ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న దేశం?
ఎప్పుడు : మే 06
ఎవరు    : భారత్‌ 
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : తాజాగా బెంగళూరుకు చెందిన నియో బ్యాంకింగ్‌ స్టార్టప్‌ ‘‘ఓపెన్‌’’ యూనికార్న్‌ హోదా సాధించిన వందో భారతీయ స్టార్టప్‌గా గుర్తింపు పొందడంతో..​​​​​​​

Santoor Maestro: ప్రముఖ సంగీత విద్వాంసుడు శివ కుమార్‌ శర్మ కన్నుమూత

Pandit Shivkumar Sharma

ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్‌ వాద్యకారుడు పండిట్‌ శివ కుమార్‌ శర్మ(84)  మే 10న ముంబైలో కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మరణించారు. 1938, జనవరి 13న జమ్మూలో జన్మించిన శివ కుమార్‌ శర్మ.. దేశంలో అత్యంత సుప్రసిద్ధులైన సంప్రదాయ సంగీతకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన ప్రత్యేక శైలి కారణంగా భారతీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సత్కరించింది. జమ్మూ–కశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్‌ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు శివ కుమార్‌ శర్మనే కావడం విశేషం. పలు బాలీవుడ్‌ సినిమాలకు కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించారు. శివ కుమార్‌ శర్మ తనయుడు రాహుల్‌ శర్మ కూడా సంతూర్‌ వాద్యకారుడే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్‌ వాద్యకారుడు కన్నుమూత
ఎప్పుడు : మే 10
ఎవరు    : పండిట్‌ శివ కుమార్‌ శర్మ(84)  
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : గుండెపోటు కారణంగా..

Russia Oil Imports: రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించిన కూటమి?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జీ–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్‌ దేశాల అధినేతలు మే 8న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించాలని నిర్ణయించారు. ఈ యుద్ధంలో పుతిన్‌ విజయం దక్కడం అసాధ్యమని జీ–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు.

విక్టరీ డేను నిర్వహిస్తోన్న దేశం ఏది?
పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో మే 9న ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్‌ ఈ మేరకు ప్రసంగించారు.

విక్టరీ డేని ఎందుకు జరుపుకుంటారు?
1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతోపాటు, రష్యా ఆయుధ సామర్థ్యాన్ని, సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండున్నర కోట్లమందికి పైగా రష్యన్లు మరణించారని అంచనా.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించిన కూటమి?
ఎప్పుడు : మే 10
ఎవరు    : జీ–7(గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌) దేశాల కూటమి
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో..

Free Trade Agreement: పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన దేశాలు?

India-Britain Flags

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ (సీబీఐ), కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కలిసి ఈ జాయింట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్‌ లార్డ్‌ కరణ్‌ బిలిమోరియా తెలిపారు. ఎఫ్‌టీఏ సాకారమైతే  2035 నాటికి బ్రిటన్‌–భారత్‌ మధ్య వాణిజ్యం 28 బిలియన్‌ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్‌ పౌండ్ల స్థాయిలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన దేశాలు?
ఎప్పుడు  : మే 09
ఎవరు    : భారత్, బ్రిటన్‌
ఎందుకు : పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో.. 

Grid Dynamics: దేశంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ మొదటి యూనిట్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?

Grid Dynamics

అమెరికా కేంద్రంగా డిజిటల్‌ సమస్యల పరిష్కారంలో పేరొందిన అంతర్జాతీయ కంపెనీ ‘గ్రిడ్‌ డైనమిక్స్‌’భారత్‌లో తన మొదటి యూనిట్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మే 9న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ఈ యూనిట్‌తో ఏడాదిలోపు  వేయి మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. సంస్థ సీఈఓ లివ్‌షిట్జ్‌ నేతృత్వంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ ప్రతినిధి బృందం మే 9న ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమావేశమై.. యూనిట్‌ ఏర్పాటు విషయమై చర్చలు జరిపింది.

హైసియా ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెజ్‌ సెంటర్‌ హెడ్‌ సెంటర్‌ హెడ్‌ మనీషా సాబూ ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం హైసియా చరిత్రలో ఇదే తొలిసారి. 2022–24 కాలానికి ఆమె ఈ పదవిలో ఉంటారు. హైసియా సీఎస్‌ఆర్‌ విభాగానికి మనీషా నేతృత్వం వహిస్తున్నారు. ఐటీ రంగంలో ఆమెకు 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైసియా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఫస్ట్‌సోర్స్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ నందెళ్ల, జనరల్‌ సెక్రటరీగా ఆరోప్రో సాఫ్ట్‌ సిస్టమ్స్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ మొదటి యూనిట్‌ తెలంగాణలో ఏర్పాటు కానుంది
ఎప్పుడు : మే 09
ఎవరు    : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు 
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : డిజిటల్‌ సమస్యల పరిష్కారంలో సేవలందించేందుకు..

World Press Freedom Index: పత్రికా స్వేచ్ఛ సూచీలో 150వ స్థానానికి పడిపోయిన భారత్‌

world-press-freedom

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్‌ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్‌ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది. భారత్‌లో లక్షకుపైగా వార్తా పత్రికలతో పాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్‌ చానళ్లు ఉన్నాయని నివేదికలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022 ఎడిషన్, వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే అయిన మే 3న.. ప్యారిస్‌లోని రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ అనే సంస్థ విడుదల చేసింది. ఈ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్‌ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. చివరి(180వ) స్థానంలో నార్త్‌ కొరియా ఉంది.  
 

Driving Licence: మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీపై నిషేధం విధించిన దేశం?

driving-license-women-afgha

తాజాగా అఫ్గానిస్తాన్‌లో మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయడాన్ని అక్కడి తాలిబాన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్‌ సెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్‌ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా తాలిబన్లు..ఉద్యోగాలు, పాఠశాలలతోపాటు ఇతర అంశాల్లోనూ.. మహిళలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతకుముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు. పాఠశాలలు తెరచిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది.

India-Nordic Summit 2022: ఇండియా–నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు?

india-nordic-summit

డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌ లో నిర్వహించిన ఇండియా–నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్‌లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళదామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్‌ దేశాల ప్రధానమంత్రులు పాల్గొన్నారు. రష్యా–ఉక్రెయిన్‌  యుద్ధం ప్రముఖంగా ప్రస్తావిస్తూ నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియా నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్బంగా.. మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్‌ గార్‌ స్టారెతో భేటీ అయ్యారు. అలాగే స్వీడన్‌ ప్రధాని మగ్దలెనా ఆండర్సోన్‌ తో సమావేశంలో.. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికతలు, నవోన్వేషణలు తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారంపై చర్చించారు. అదేవిధంగా ఐస్‌లాండ్‌ ప్రధాని కత్రిన్‌ జాకబ్స్‌దతిర్‌తో భేటీ అయ్యారు. ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారున్‌ తో జరిగిన సంప్రదింపుల్లో డిజిటల్‌ భాగస్వామ్యం, పెట్టుబడుల అనుసంధానత, వాణిజ్య భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి.

India-France: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో ప్రధాని మోదీ ఎక్కడ స‌మావేశ‌మ‌య్యారు?

pm-modi-emmanuel-macron

ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్‌  సంక్షోభం గురించి ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ‘భారత్‌కున్న బలమైన అంతర్జాతీయ భాగస్వాముల్లో ఫ్రాన్స్‌ ఒకటి. విభిన్న రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి’ అని పారిస్‌ చేరుకున్న వెంటనే మోదీ ట్వీట్‌ చేశారు. రష్యా–ఉక్రెయిన్‌  యుద్ధాన్ని ఎలా నిలిపివేయాలి, ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని ఎలా నివారించాలి, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడం ఎలా తదితర అంశాలపై మోదీ, మెక్రాన్‌ చర్చించుకున్నారు. భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య దౌత్య సంబంధాలకు 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగానూ మోదీ పర్యటనకు ప్రాధాన్యమేర్పడింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది అయిదోసారి. 2019 ఆగస్టు, 2017 జూన్‌ , 2015 నవంబరు, 2015 ఏప్రిల్‌ నెలల్లో మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. రెండు దేశాలు 1998 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి.

Pangong Lake: పాంగాంగ్‌ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం పూర్తి

pangong-lake

పాంగాంగ్‌ సరస్సుపై ఖుర్నాక్‌ వద్ద చైనా చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయింది. దీంతో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్‌లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది. తాజాగా ఈ వంతెనను సమీపంలోని భారీ చైనా సైనిక స్థావరానికి అనుసంధానించేలా రహదారి నిర్మాణం చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. 2020 ఆగస్టులో భారత దళాలు బ్లాక్‌ టాప్‌ శిఖరాన్ని స్వాధీనం చేసుకొనే సమయంలో నిర్వహించిన ఆపరేషన్‌ వంటివి భవిష్యత్తులో చేపట్టాలంటే మరింత కష్టపడాల్సి రావొచ్చు. ఖుర్నాక్‌ సమీపంలో ఆ దూరం 500 మీటర్లే! అక్కడ గతేడాది సెప్టెంబర్‌ చివరి వారం నుంచి డ్రాగన్‌ వంతెన నిర్మాణం ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఈ నిర్మాణం ఏప్రిల్‌ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్‌ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. 

Repo Rate: ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ కీలక నిర్ణయం​​​​​​​

rbi

ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంక్‌ ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపోరేటు, క్యాష్‌ రిజర్వ్‌ రేషియో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉన్నందున ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. కేంద్ర బ్యాంకు తాజా నిర్ణయం ప్రకారం– రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. ఈ పెంపు తక్షణమే (2022 మే 4) అమల్లోకి వస్తుందని తెలిపారు. క్యాష్‌ రిజర్వ్‌ రేషియో(సీఆర్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపు మే 21 నుంచి అమల్లోకి రానుంది. చివరి సారిగా 2018 ఆగస్టులో వడ్డీరేట్లు ఆర్‌బీఐ పెంచింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఎదురయ్యాయి. క్రమంగా ఈ పరిస్థితులు గాడిన పడుతున్న సమయంలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైంది. యూరప్, అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. మరోవైపు అతి పెద్ద సరఫరాదారుగా ఉక్రెయిన్‌ లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆర్‌బీఐ సర్దుబాటు ధోరణికి స్వస్తి పలికి.. రెపో రేటు, క్యాష్‌ రిజర్వ్‌ రేషియో రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. జూన్‌ లో ఆర్‌బీఐ సమావేశం జరగాల్సి ఉండగా.. ఒక నెల ముందుగానే అత్యవసర సమావేశం నిర్వహించింది. కీలక నిర్ణయాలను వెల్లడించింది.

రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యవసరంగా పెంచిన రెపోరేటు కొందరికి వరంగా మారగా.. మరికొందరికి భారంగా మారనుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ విధించే వడ్డీరేటును రెపోరేటుగా పేర్కొంటారు. నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు కేంద్రబ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంటాయి. ఈ అప్పుకు విధించే వడ్డీని రెపోరేటుగా చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ రెపోరేటును పెంచితే బ్యాంకులు సైతం తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పెంచుతాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ రెపోరేటు పెంచడంతో హోంలోన్‌ , పర్సనల్‌ లోన్‌ , వెహికల్‌ లోన్ల వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. ఆర్‌బీఐ వడ్డీరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. దీని ప్రకారం పాత వడ్డీ రేటు 0.40 శాతం పెరుగుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 09 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 May 2022 02:32PM

Photo Stories