Daily Current Affairs in Telugu: 2022, మే 09 కరెంట్ అఫైర్స్
![current-affairs-telugu-pdf](/sites/default/files/images/2022/05/10/current-affairs-telugu-pdf-1652159073.jpg)
Everest: ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?
![Kami Rita Sherpa](/sites/default/files/inline-images/Kami%20Rita%20Sherpa.jpg)
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా 26 సార్లు అధిరోహించాడు. ఈ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ మే 7న 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రైవేటు లిమిటెడ్ దావా షెర్పా వెల్లడించారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది.
కామి రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే. 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ పర్యాటక శాఖ 2022 ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?
ఎప్పుడు : మే 07
ఎవరు : నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా
ఎక్కడ : నేపాల్
ఎందుకు : 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ మే 7న 26వ సారి ఎవరెస్టును ఎక్కినందున..
Hong Kong: హాంకాంగ్ పాలకునిగా ఎవరు ఎన్నికయ్యారు?
![Jhon Lee](/sites/default/files/inline-images/Jhon%20Lee.jpg)
హాంకాంగ్ పాలకునిగా(ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్) చైనా అనుకూల జాన్ లీ కా–చియు మే 8న ఎన్నికయ్యారు. 1,500 మంది కమిటీ సభ్యుల్లో 1,416 మంది లీకి ఓటేశారు. కమిటీలో మెజారిటీ సభ్యులు చైనా మద్దతుదారులే కావడంతో ఎన్నిక సులభమైంది. ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేశారు. జూన్ 1న కేరీ లామ్ స్థానంలో లీ బాధ్యతలు చేపడతారు.
హాంకాంగ్ సెక్యూరిటీ చీఫ్‌గా చైనా అండతో నగరంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని జాన్ లీ కఠినంగా అణచివేశారన్న అపవాదు ఉంది. చైనాకు విధేయులుగా ఉన్నవారే పోటీ చేయగలిగేలా హాంకాంగ్ ఎన్నికల చట్టాల్లో చైనా గతేడాది మార్పులు చేసింది. హాంకాంగ్‌ను పూర్తిగా విలీనం చేసుకొనేందుకు డ్రాగన్ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాంకాంగ్ పాలకునిగా(ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్) ఎవరు ఎన్నికయ్యారు?
ఎప్పుడు : మే 08
ఎవరు : జాన్ లీ కా–చియు
ఎక్కడ : హాంకాంగ్
ఎందుకు : తాజా ఎన్నికల్లో విజయం సాధించినందున..
24th Summer Deaflympics: బధిరుల ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన షూటర్?
![Dhanush Srikanth and Priyesha Deshmukh](/sites/default/files/inline-images/Dhanush%20Srikanth%20and%20Priyesha%20Deshmukh.jpg)
బ్రెజిల్ వేదికగా జరుగుతోన్న 24వ బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్ రెండో స్వర్ణ పతకం సాధించాడు. ఈ క్రీడల్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించింది. ఫైనల్లో ధనుష్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించి.. పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ధనుష్ శ్రీకాంత్‌కు ఈ బధిరుల ఒలింపిక్స్‌లో ఇది రెండో స్వర్ణం. ఇంతకుముందు ధనుష్ శ్రీకాంత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో ఆరో ర్యాంక్‌లో ఉంది.
బధిరుల ఒలింపిక్స్–2021
24వ బధిరుల ఒలింపిక్స్–2021(24th Summer Deaflympics-2021)ను బ్రెజిల్‌లోని కాక్సియాస్ దో సుల్(Caxias do Sul) నగర వేదికగా నిర్వహించనున్నారు. 2022 మే 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. వాస్తవానికి ఈ క్రీడలను షేడ్యూలు ప్రకారం 2021 ఏడాదిలోని నిర్వహించాలి.. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2022 ఏడాదికి వాయిదా వేశారు.
బధిరుల ఒలింపిక్స్–2021 నినాదం(Motto) : స్పోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ ద అవర్ హార్ట్స్(Sports comes from the our hearts)
క్విక్ రివ్యూ :
ఏమిటి : 24వ బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో స్వర్ణం గెలిచిన భారత ద్వయం
ఎప్పుడు : మే 8
ఎవరు : దనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట
ఎక్కడ : కాక్సియాస్ దో సుల్(Caxias do Sul), బ్రెజిల్
ఎందుకు : 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ధనుష్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించినందున..
Chess: చెసెబల్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్?
![Gukesh D](/sites/default/files/inline-images/Gukesh%20D.jpg)
భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో అంతర్జాతీయ చెస్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. తాజాగా స్పెయిన్‌లోని ఫార్మెన్‌టెరా వేదికగా జరిగిన చెసెబల్ సన్‌వే ఫార్మెన్‌టెరా ఓపెన్–2022లో గుకేశ్ చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్ ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. చెన్నైకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ ఇటీవల లా రోడా ఓపెన్, మెనోర్కా ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో స్వర్ణం గెలిచిన ఆటగాడు?
బ్రెజిల్ వేదికగా జరుగుతోన్న 24వ బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ ఫైనల్లో.. ఉత్తరాఖండ్‌కు చెందిన 15 ఏళ్ల అభినవ్ 234.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చెసెబల్ సన్‌వే ఫార్మెన్‌టెరా ఓపెన్–2022లో విజేతగా నిలిచిన భారత ఆటగాడు?
ఎప్పుడు : మే 08
ఎవరు : దొమ్మరాజు గుకేశ్
ఎక్కడ : ఫార్మెన్‌టెరా, స్పెయిన్
ఎందుకు : నిర్ణీత 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్ ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినందున..
Athletics: 5000 మీటర్ల పరుగులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
![Avinash Sable](/sites/default/files/inline-images/Avinash%20Sable.jpg)
30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పురుషుల 5000 మీటర్ల భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహారాష్ట్రకు చెందిన అవినాశ్ సాబ్లే తన పేరిట కొత్త జాతీయ రికార్డును లిఖించుకున్నాడు. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌లో భాగంగా.. అమెరికాలో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్–2022లో 27 ఏళ్ల అవినాశ్ 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. ఇండియన్ ఆర్మీ అథ్లెట్ అయిన అవినాశ్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసి 12వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 1992లో బర్మింగ్‌హమ్ వేదికగా భారత అథ్లెట్ బహదూర్ ప్రసాద్ 13 నిమిషాల 29.70 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అవినాశ్ సవరించాడు. అవినాశ్ ఖాతాలో ఇది మూడో జాతీయ రికార్డు కావడం విశేషం. ప్రస్తుతం అవినాశ్ పేరిట 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, హాఫ్ మారథాన్ జాతీయ రికార్డులు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్–2022లోనూ అవినాశ్ పాల్గొన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల 5000 మీటర్ల పరుగులో భారత జాతీయ రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
ఎప్పుడు : మే 08
ఎవరు : అవినాశ్ సాబ్లే
ఎక్కడ : అమెరికాలో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్–2022లో..
ఎందుకు : 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసినందున..
Life Expectancy: దేశంలో ఏ రాష్ట్ర ప్రజల ఆయుష్షు అత్యధికంగా ఉంటుంది?
![Population](/sites/default/files/inline-images/Population.jpg)
మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రజల జీవిత కాలం పెరుగుతోంది. ప్రధానంగా పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. 2031–35 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, స్త్రీ, పురుషుల ఆయర్దాయంపై ఈ నివేదికను రూపొందించింది. తాజాగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం..
ఆంధ్రప్రదేశ్..
- ఆంధ్రప్రదేశ్‌లో మగవాళ్ల కన్నా ఆడవాళ్ల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా.
- రాష్ట్రంలో 2011–15 మధ్య మహిళల ఆయుర్దాయం 71.2 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 75.6 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా.
- రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 67.1 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.4 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. అంటే పురుషులకంటే స్త్రీల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువ.
దేశంలో..
- దేశంలో 2011–15 మధ్య స్త్రీల ఆయుర్దాయం 70 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 74.7 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా.
- పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 66.9 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా.
కేరళలో అత్యధికం.. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పం..
- దేశం మొత్తంమీద కేరళ రాష్ట్రంలోనే పరుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుంది.
- కేరళలో మహిళల ఆయుర్దాయం 2031–35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల ఆయుర్దాయం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా.
- ఉత్తరప్రదేశ్‌లో పురుషుల, స్త్రీల ఆయుర్దాయం అత్యల్పంగా ఉంటుందని అంచనా.
- ఉత్తరప్రదేశ్‌లో 2031–35 మధ్య పురుషుల ఆయుర్దాయం 69.4 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా.
- దేశంలో ఏటేటా పురుషులు, స్త్రీల ఆయుష్షు పెరుగుతుంది.
మొత్తం జనాభాలో వృద్ధుల శాతం?
అన్ని రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుతుండటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు జనం ఆయుర్దాయం పెరుగుతుండటం దీనికి కారణమని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4 శాతం ఉంది. 2031–35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేరళ రాష్ట్రంలోనే పరుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుంది
ఎప్పుడు : మే 08
ఎవరు : జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
ఎక్కడ : దేశం మొత్తంమీద..
Andhra Pradesh: సీ కయాకింగ్ చాంపియన్ షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
![sea kayaking Championship](/sites/default/files/inline-images/sea%20kayaking%20Championship.jpg)
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా.. జాతీయస్థాయి సీ కయాకింగ్ చాంపియన్‌షిప్–2022 నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... విశాఖలోని రుషికొండలో జూన్ 24 నుంచి 26 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీలను దేశంలో రెండోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో..
కయాకింగ్, కానోయింగ్ వాటర్ స్పోర్ట్స్‌కు దాదాపు అన్ని దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. సముద్రంలో అలలను చీల్చుకుంటూ.. ప్రత్యేకమైన నావలో గమ్యాన్ని చేరుకునేందుకు డైవర్లు పోటీ పడుతుంటారు. ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద క్రీడల్లో కయాకింగ్ అగ్ర భాగంలో ఉంది. ఇలాంటి క్రీడల్ని నిర్వహించే సా మర్థ్యం ఉన్న బీచ్‌లు దేశంలో అతి తక్కువగా ఉన్నాయి. అందులో విశాఖ తీరంలోను పోటీలకు అనువైన వాతావరణం ఉండటంతో రాష్ట్రంలో మొదటిసారి కయాకింగ్ పోటీలు జరగబోతున్నాయి.
వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మహ్మద్ మసీఉల్లా ఖాన్..
తెలంగాణ రాష్ట వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మహ్మద్ మసీఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే 07న హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో పాలక మండలి సభ్యులు సమావేశమై ఈ మేరకు ఎన్నుకున్నారు. మసీఉల్లా ఖాన్ ఇప్పటి వరకు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూన్ 24 నుంచి 26 వరకు జాతీయస్థాయి సీ కయాకింగ్ చాంపియన్‌షిప్–2022 నిర్వహణ
ఎప్పుడు : మే 08
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్..
ఎక్కడ : రుషికొండ బీచ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Digital Payments: 2026కల్లా డిజిటల్ లావాదేవీలు ఎన్ని కోట్ల డాలర్లకు చేరనున్నాయి?
![Digital Payments](/sites/default/files/inline-images/Digital%20Payments_0.jpg)
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెందిన క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ లిమిటెడ్ అంచనా.
ఎందుకీ డిజిటల్ చెల్లింపులు?
నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి...
1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం.
2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.
3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా.
భారత్‌లో ఏటేటా డిజిటల్ లావాదేవీల పెరుగుదల |
|
సంవత్సరం |
డిజిటల్ లావాదేవీల సంఖ్య |
2015–16 |
594 కోట్లు |
2016–17 |
970 కోట్లు |
2017–18 |
1,459 కోట్లు |
2018–19 |
2,343 కోట్లు |
2019–20 |
3,434 కోట్లు |
2020–21 |
4,371 కోట్లు |
2021–22 |
7,422 కోట్లు |
చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 05 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్