Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu May 21st 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
daily current affairs in telugu

World Cup: భారత క్రీడాకారిణి కోమలిక బారి ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

Indian women's archery team

Gwangju 2022 Hyundai Archery World Cup Stage 2: దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ నగరం వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022 మహిళల రికర్వ్‌ విభాగంలో భారత జట్టు కాంస్యం సాధించింది. మే 19న జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్‌ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.

హాకీ ఫైవ్స్‌ జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్‌ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్‌ ఇతర సభ్యులుగా  ఉన్నారు. ఈ టోర్నీ 2022, జూన్‌ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022 మహిళల రికర్వ్‌ విభాగంలో కాంస్యం గెలుపు 
ఎప్పుడు : మే 19
ఎవరు    : కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్‌తో కూడిన భారత జట్టు
ఎక్కడ    : గ్వాంగ్జూ, దక్షిణ కొరియా
ఎందుకు : ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6–2 తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించినందున..

Military Exercises: దక్షిణ చైనా సముద్రంలో సైనిక విన్యాసాలు ప్రారంభించిన దేశం?

military exercises in South China Sea

Telugu Current Affairs - International: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. సైనిక విన్యాసాలు మే 19న ప్రారంభమయ్యాయని, మే 23వ తేదీ వరకు కొనసాగుతాయని హైనన్‌ ప్రావిన్స్‌లోని చైనా మారిటైమ్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఏ దేశాలలో పర్యటిస్తున్నారు?
US President Joe Biden Begins Asia Tour: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మే 20న ఆసియా పర్యటన ప్రారంభించారు. దక్షిణ కొరియా, జపాన్‌లలో వారం రోజులు పర్యటించనున్న ఆయన తొలుత దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌టెక్‌కు వచ్చారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కి బైడెన్‌ తన అభినందనలు తెలియజేశారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలోనే ప్రపంచ భవిష్యత్‌ ఉందని పేర్కొన్నారు.

ఏ దేశాధ్యక్షుడు శామ్‌సంగ్‌ చిప్‌ తయారీ కేంద్రాన్ని సందర్శించారు?
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్‌ కంప్యూటర్‌ చిప్‌ తయారీ కేంద్రాన్ని(ప్యాంగ్‌టెక్‌లో ఉంది) బైడెన్‌ సందర్శించారు. ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్‌లో 1500 కోట్ల అమెరికా డాలర్ల వ్యయంతో ఒక సెమి కండక్టర్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వేధిస్తున్న కంప్యూటర్‌ చిప్‌ల కొరతను అధిగమించడం కోసమే బైడెన్‌ తన పర్యటనలో శామ్‌సంగ్‌ కంపెనీ సందర్శనకు పెద్దపీట వేశారు. సాంకేతికంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం కోసమే ఆయన కొరియా, జపాన్‌లలో పర్యటించనున్నారు.​​​​​​​

FDIs: 2021–22లో భారత్‌లో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశం?

FDIs to India

Telugu Current Affairs - Economy: భారత్‌ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) నమోదుచేసింది. ఈ విలువ  83.57 బిలియన్‌ డాలర్లని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మే 20న తెలిపింది. ఇంత స్థాయిలో దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం ఇదే తొలిసారి. 2020–21లో ఈ విలువ 81.97 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

అగ్రస్థానంలో సింగపూర్‌..
భారత్‌లో పెట్టుబడుల విషయానికి వస్తే, 2021–22 ఆర్థిక సంవత్సరం సింగపూర్‌ 27 శాతంతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత వరుసలో అమెరికా (18 శాతం), మారిషస్‌ (16 శాతం) ఉన్నాయి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ రంగాలు గరిష్ట ప్రవాహాలను ఆకర్షించాయి. ఆ తర్వాత సేవల రంగం, ఆటోమొబైల్‌ పరిశ్రమ ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
2021–22లో అత్యధికంగా ఎఫ్‌డీఐలు పెట్టిన దేశం?
ఎప్పుడు : మే 20
ఎవరు : సింగపూర్‌
ఎక్కడ : భారత్‌
ఎందుకు: వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు..

Mathura: షాహీ ఈద్గా మసీదుని ఎవరు నిర్మించారు?

Shahi Idgah Mosque - mathura

Telugu Current Affairs and General Essay - National: మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది. మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది. 

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో  శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్‌ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది. మథురలో  శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు. 

కోర్టులో ఉన్న కేసులు ఎన్ని? 
ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి. 

మసీదు భూములపై హక్కులు ఎవరివి?
1670 సంవత్సరంలో నాటి మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్‌ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. 1815 సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్‌దేవ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్‌ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్‌ కిశోర్‌ బిర్లాకి విక్రయించారు. పండిట్‌ మదన మోహన్‌ మాలవీయ, గోస్వామి గణేశ్‌ దత్, భికెన్‌ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్‌దేవ్‌ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు. మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే  చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్‌ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు. మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని, ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ తరఫున  2020లోనే దిగువ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్‌ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్‌ జడ్జి రాజీవ్‌ భారతి విచారణకు అంగీకరించారు. 

1968లో రాజీ కుదిరిందా?
కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్‌ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది. 

ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది?  
రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి  మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం  చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు.

Ayushman Bharat: ఏబీడీఎం అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

Digital Health - abdm

Telugu Current Affairs - Regional: ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మే 20న నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) సీఈవో డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపారు. పౌరుల ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలు, చికిత్స లాంటి సమస్త వివరాలను కాగితాలతో పనిలేకుండా కేవలం ఒక్క క్లిక్‌ ద్వారా తెలుసుకునేలా ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

14 అంకెలతో డిజిటల్‌ ఐడీ 
దేశంలో ఎక్కడికి వెళ్లినా కాగితాలతో పనిలేకుండా పౌరులకు వైద్య సేవలు అందించడం ఏబీడీఎం ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్‌ ఆరోగ్య ఐడీ నంబర్‌ కేటాయించి కాగితాల అవసరం లేకుండా ఈ–హాస్పిటల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 2.75 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రంలో డిజిటల్‌ ఐడీలు జారీ అయ్యాయి.
ఏబీడీఎం అమలు ఇలా.. 
 

ఏబీడీఎం అమలు ఇలా..

రాష్ట్రం

పౌరులకు ఐడీల జారీ కోట్లలో

ఏపీ

2.75

బిహార్

1.48

మహారాష్ట్ర

1.42

కేరళ

1.28

ఉత్తరప్రదేశ్

1.27

 

ఆసుపత్రుల రిజిస్ట్రేషన్

ఉత్తరప్రదేశ్

26,824

ఏపీ

13,373

పశ్చిమబెంగాల్

10,022

మహారాష్ట్ర

5,022

మధ్యప్రదేశ్

2,317

జమ్మూకశ్మీర్

1,175

 

వైద్యుల రిజిస్ట్రేషన్

ఏపీ

7,023

చండీగఢ్

1,692

పుదుచ్చేరి

1,309

మహారాష్ట్ర

842

జమ్మూకశ్మీర్

839

 ​​
దేశంలోనే తొలిసారిగా..
ఏబీడీఎం కార్యక్రమాల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలవడంతో నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏబీడీఎంలో నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమాల అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : మే 20
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎక్కడ    : దేశంలో..

ISRO: ఏ రాకెట్‌ ద్వారా గగన్‌యాన్‌–1 ప్రయోగాన్ని చేపట్టనున్నారు?

Telugu Current Affairs and General Essay - Science and Technology: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా 2022 ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్‌–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది.

సుమారు 3.5 టన్నుల బరువు..

  • గగన్‌యాన్‌–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని స్ప్రాబ్‌ విభాగంలో 2022, మే 13న ఎస్‌–200 (ఘన ఇంధన మోటార్‌) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. 
  • భారీ రాకెట్‌ ప్రయోగానికి ఉపయోగించే ఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్‌–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్‌ (వ్యోమనాట్స్‌ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది.
  • క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్‌ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు. 

ప్రాణ నష్టాన్ని నివారించేందుకు..

  • మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు.
  • ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్‌ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.  

ఇస్రో ప్రొపల్షన్‌ సెంటర్‌లో..

  • గగన్‌యాన్‌–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్‌ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్‌ సెంటర్‌లో 2022, జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు.
  • క్రయోజనిక్‌ మోటార్‌లో 12 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్‌ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.

ఆర్‌ఎల్‌వీ–టీడీ ప్రయోగం విజయవంతం

  • సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌–టెక్నికల్‌ డిమాన్‌స్ట్రేటర్‌(ఆర్‌ఎల్‌వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. 
  • ఈ తరహా రాకెట్‌ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్‌ సోనిక్‌ ఫ్లైట్‌ను విడుదల చేసింది.
  • ఆ ఫ్లైట్‌ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్‌ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు.
  • దానికి ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్స్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్‌ మెజర్‌మెంట్, షిప్‌ బర్న్‌ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు.
  • వ్యోమనాట్స్‌ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌–టెక్నికల్‌ డిమాన్‌స్ట్రేటర్‌ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు.

Mount Everest: ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ మహిళ?

mountaineer Anvitha Reddy

Telugu Current Affairs - Persons: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి మే 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. స్థానికంగా ఉన్న రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న 25 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి నేపాల్‌లోని లుక్లా నుంచి మే 9న ఎవరెస్ట్‌ అధిరోహణ మొదలు పెట్టారు. మే 12న బేస్‌ క్యాంప్‌ నుంచి యాత్ర ప్రారంభించి, మే 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు.

యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఏది?
అన్వితారెడ్డి ఇప్పటికే ఫిబ్రవరి 2021లో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు–సో–మోరిరి, లదాఖ్‌), జనవరి 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబర్‌ 2021లో యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఎక్కి.. రికార్డు సృష్టించారు. అన్వితారెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

 

Badminton: థామస్‌ కప్‌ టీమ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టు?

Indian Badminton team win Thomas Cup 2022 title

Telugu Current Affairs - Sports: ప్రతిష్టాత్మక ‘‘థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నమెంట్‌–2022’’లో భారత బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు విజేతగా నిలిచింది. మే 15న థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ వేదికగా జరిగిన ఫైనల్లో అంచనాలకు మించి రాణించిన భారత్‌ 3–0తో 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియాను ఓడించి.. చాంపియన్‌గా అవతరించింది. దీంతో 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ తొలిసారి చాంపియన్‌గా అవతరించినట్లయింది. ఫైనల్‌ చేరిన తొలిసారే భారత్‌ విజేతగా నిలిచింది. ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచింది.

కేరళకి చెందిన ఎం.ఆర్‌.అర్జున్‌ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
భారత్‌–ఇండోనేసియా మ్యాచ్‌లు ఇలా..

  • తొలి మ్యాచ్‌: ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు.
  • రెండో మ్యాచ్‌: డబుల్స్‌ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్‌ కెవిన్‌ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్‌ మొహమ్మద్‌ అహసాన్‌లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్‌ జంటను బోల్తా కొట్టించి భారత్‌ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది.
  • మూడో మ్యాచ్‌:  మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్‌ జొనాథాన్‌ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. 
  • ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు.

గెలుపు వీరుల బృందం..
 ప్రపంచ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్‌ కప్‌లో భారత్‌ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (ఆంధ్రప్రదేశ్‌), లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (కేరళ), ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)... ఎం.ఆర్‌.అర్జున్‌ (కేరళ)–ధ్రువ్‌ కపిల (పంజాబ్‌) జోడీలు బరిలోకి దిగాయి.​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మే 20
ఎవరు    : భారత బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు
ఎక్కడ    : బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
ఎందుకు : ఫైనల్లో భారత జట్టు 3–0తో ఇండోనేసియాపై విజయం సాధించినందున..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 20 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 May 2022 11:13AM

Photo Stories