Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 20 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu May 20th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Telugu-Current-Affairs

Pollution: అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవించాయి?

Taj Mahal

ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది. భారత్‌లో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాలమరణాలు సంభవించాయని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్‌ చెప్పారు. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. లాన్సెట్‌ జర్నల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

అత్యధికంగా వాయుకాలుష్యం వల్లనే..

  • ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించారు. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. 
  • ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా.
  • అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది.
  • 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగింది.
  • 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయి.

భారత్‌లో..

  • భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికం. ఇళ్లలో బయోమాస్‌ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయి.
  • దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయి. ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోంది.
  • భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టింది, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయి. 
  • సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గాయి. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగింది.
  • భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారు.

DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?

DRDO - Indian Navy

శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) మే 18న ప్రకటించింది. ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలోని చాందీపూర్‌ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్‌డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. నావికాదళ హెలికాప్టర్‌ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్‌ మిస్సైల్‌ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో తెలిపింది. హెలికాప్టర్‌ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన లాంచర్‌ను ఈ క్షిపణిలో వినియోగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష విజయవంతం
ఎప్పుడు    : మే 18
ఎవరు    : భారత నావికా దళం, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ    : చాందీపూర్‌ సమీపంలో సముద్రతీర ప్రాంతం, బాలాసోర్‌ జిల్లా, ఒడిశా
ఎందుకు    : భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు..​​​​​​​OTT Platform: సొంత ఓటీటీని ప్రారంభించనున్న తొలి రాష్ట్రం?

Kerala - OTT platform

2022, నవంబర్‌ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దీంతో భారత్‌లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీ నిర్వహించినట్లవనుంది. ‘‘సీ స్పేస్‌’’ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్‌ ఫిల్మ్స్ ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ తెలిపింది. ఓటీటీలో అంతర్జాతీయంగా, జాతీయంగా అవార్డులు సాధించిన చిత్రాలను కూడా ప్రదర్శిస్తామన్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్‌ సహకారంతో ఈ ఓటీటీని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుత ఓటీటీలకు భిన్నంగా కొన్ని ఫీచర్లను ఈ ఓటీటీలో పొందుపరుస్తామని అధికారులు చెప్పారు.

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రాజీనామా
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ వ్యక్తిగత కారణాలతో మే 18న తన పదవికి రాజీనామా చేశారు. 2016లో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతికి ఆయన తన రాజీనామా లేఖను పంపారని అధికారులు వెల్లడించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, నవంబర్‌ 1 నుంచి.. సొంత ఓటీటీ ‘‘సీ స్పేస్‌’’ని ప్రారంభించనున్న తొలి రాష్ట్రం?
ఎప్పుడు : మే 18
ఎవరు    : కేరళ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ
ఎందుకు : ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్‌  ఫిల్మ్స్ ను ప్రదర్శించేందుకు..

Union Cabinet: పెట్రోల్‌లో ప్రస్తుతం ఎంత శాతం ఇథనాల్‌ కలుపుతున్నారు?

Petrole - Ethanol

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాలన్న లక్ష్యాన్ని తొలుత నిర్ణయించిన 2030కి బదులు 2025–26 కల్లా చేరుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతోపాటు దేశ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా జాతీయ జీవ ఇంధన విధానానికి పలు సవరణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మే 18న సమావేశమై కేంద్ర మంత్రివర్గం వీటికి ఆమోదముద్ర వేసింది. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో జీవ ఇంధన ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని, ప్రత్యేక కేసుల్లో జీవ ఇంధన ఎగుమతులకు కూడా అనుమతివ్వాలని నిర్ణయించింది. పెట్రోల్‌లో ప్రస్తుతం 10 శాతం ఇథనాల్‌ కలుపుతున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాలన్న లక్ష్యాన్ని తొలుత నిర్ణయించిన 2030కి బదులు 2025–26 కల్లా చేరుకోవాలని నిర్ణయం
ఎప్పుడు : మే 18
ఎవరు    : కేంద్ర మంత్రివర్గం
ఎందుకు : దేశ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు..

Palm Oil Exports: పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?

Palm Oil

నెల రోజుల క్రితం పామాయిల్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం మే 19న తెలిపింది. దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వంటనూనె ఎగుమతులు  మే 23 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడొడొ తెలిపారు. ప్రపంచ పామాయిల్‌ ఉత్పత్తిలో ఇండోనేసియా, మలేసియాలు 85 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు పామాయిల్‌ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. నిషేధం తొలగడంతో, భారత్‌లో పామాయిల్‌ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు.

క్వాడ్‌ దేశాల మూడో భేటీ ఎక్కడ జరిగింది?
2022, మే 24వ తేదీన జపాన్‌ రాజధాని టోక్యోలో క్వాడ్‌ దేశాల మూడో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాలు, పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై ప్రధాని మోదీ ఆయా దేశాల నేతలతో చర్చలు జరుపుతారని పేర్కొంది. ఇండో–పసిఫిక్‌ వ్యూహాత్మక కూటమి అయిన క్వాడ్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
ఎప్పుడు : మే 19
ఎవరు    : ఇండోనేసియా ప్రభుత్వం 
ఎందుకు : దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో..

First Case of Monkeypox in 2022: అమెరికాలో మంకీపాక్స్‌ వైరస్‌ కేసు నమోదు

United States reports Monkeypox case

అత్యంత అరుదైన, ప్రమాదకరమైన మంకీపాక్స్‌ కేసు అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే యూరప్‌ దేశాల్లో ఈ వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కెనడా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన మసాచుసెట్స్‌కు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ సోకిందని, ఆస్పత్రిలో అతనికి చికిత్స అందజేస్తున్నట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. 2022 ఏడాది అమెరికాలో ఇదే తొలి కేసు. యూకే, పోర్చుగల్, స్పెయిన్, కెనడా దేశాల్లో ఇప్పటికే 10కిపైగా కేసులు నమోదై కలవరపెడుతున్నాయి.

జ్ఞానవాపి మసీదులో సర్వే పూర్తి  
వారణాసి నగరంలోని జ్ఞానవాపి– శ్రింగార్‌ గౌరీ కాంప్లెక్సులో కోర్టు నియమించిన అధికారుల సర్వే పూర్తయింది. ఈ సర్వే నివేదికను కమిషనర్ల బృందం మే 19న జిల్లా కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు సర్వే చేసిన వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించామని స్పెషల్‌ అడ్వకేట్‌ కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ చెప్పారు.

World Boxing Championships: మహిళల బాక్సింగ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తెలంగాణ క్రీడాకారిణి?

Nikhat Zareen - Boxing

12th edition of the IBA Women’s World Boxing Championships Istanbul 2022: టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరుగుతోన్న 12వ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో భారత మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం గెలిచింది. మే 19న జరిగిన 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీ ఫైనల్లో తెలంగాణకి చెందిన నిఖత్‌...  5–0తో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌పై విజయం సాధించింది. దీంతో భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ రికార్డులకెక్కింది. మేరీకోమ్‌ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్‌ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  
12వ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో స్వర్ణ పతకం గెలిచిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు    : మే 19
ఎవరు    : నిఖత్‌ జరీన్‌
ఎక్కడ    : ఇస్తాంబుల్, టర్కీ
ఎందుకు : 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీ ఫైనల్లో తెలంగాణకి చెందిన నిఖత్‌...  5–0తో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌పై విజయం సాధించినందున..

Veterinary Ambulances: సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?

YSR Mobile Veterinary Ambulances

మూగ జీవాల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.278 కోట్లతో 340 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 19న జెండా ఊపి ప్రారంభించారు. 108, 104 అంబులెన్స్‌ల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ను తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సౌకర్యాలు ఇలా..

  • ప్రతి అంబులెన్స్‌లో ట్రావిస్‌తో పాటు వెయ్యి కిలోల బరువున్న మూగ జీవాన్ని తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం.
  • 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో కూడిన లేబరేటరీ.
  • ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు. అందుబాటులో సీజన్‌ వారీగా అవసరమైన వ్యాక్సిన్లు, అన్ని రకాల మందులు.
  • ప్రతి వాహనంలో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌. 
  • టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962కు ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమాచారం తెలియజేస్తే చాలు రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం చేయిస్తారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం
ఎప్పుడు : మే 19
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : మూగ జీవాలకు వైద్య సేవలందించేందుకు..​​​​​​​చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 18 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 May 2022 07:50PM

Photo Stories