Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 18 కరెంట్‌ అఫైర్స్‌

telugu-current-affairs

Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?

INS Udaygiri
ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. మే 17న ముంబైలోని మాజగావ్‌ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ (డీఎన్‌డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ  వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అన్నారు.

ఐఎన్‌ఎస్‌ సూరత్‌..

  • ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది.
  • క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. 
  • దీన్ని బ్లాక్‌ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్‌లో జోడించారు.
  • ఈ నౌకకు గుజరాత్‌ వాణిజ్య రాజధాని సూరత్‌ పేరు పెట్టారు.
  • నౌకల తయారీలో సూరత్‌కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు.

ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి..

  • ఈ నౌకకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు.
  • 17ఏ ఫ్రిగేట్స్‌ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక.
  • పీ17 ఫ్రిగేట్స్‌ (శివాలిక్‌ క్లాస్‌) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు.
  • ఇందులో మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు.
  • పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రెండు యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిల జలప్రవేశం
ఎప్పుడు : మే 17
ఎవరు    : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
ఎక్కడ    : మాజగావ్‌ డాక్స్, ముంబై తీరం
ఎందుకు : భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు..

Varanasi: దేశంలోని ఏ మసీదులో శివలింగం కనిపించింది?

Gyanvapi Mosque

ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే మే 16న ముగిసింది. ఈ సందర్భంగా మందిరం–మసీదు వివాదం మరింత రాజేసే పరిణామాలు జరిగాయి. సర్వేలో మసీదులోని వజూఖానాలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు. దానికి రక్షణ కల్పించాలంటూ మే 16న వారణాసి కోర్ట్‌ ఆఫ్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) రవి కుమార్‌ దివాకర్‌ ను ఆశ్రయించారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించింది
ఎప్పుడు : మే 17
ఎవరు    : హిందూ పిటిషనర్లు
ఎక్కడ    : జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణం, వారణాసి, వారణాసి జిల్లా​​​​​​​

Gyanvapi Mosque: శివలింగానికి రక్షణ, నమాజుకు అనుమతి

Gyanvapi mosque 1

కాశీలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మే 17న ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్‌ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ నరసింహతో కూడిన బెంచ్‌ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌(సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) తుషార్‌ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు.

సర్వే కమిషనర్‌ అజయ్‌ మిశ్రా తొలగింపు..
జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్‌ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్‌ అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ ప్రతాప్‌సింగ్‌ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని చెప్పారు. సింగ్‌ అభ్యర్థన విన్న వారణాసి సివిల్‌ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్‌ అజయ్‌ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు.

మథుర మసీదులో నమాజ్‌ నిలిపివేతకు పిటిషన్‌..
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్‌ దేవ్‌ మందిరంలో ఈ మసీదు ఉంది.

NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?

Sweden PM

North Atlantic Treaty Organization(NATO): నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్‌ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్‌ ప్రధాని మగ్డలీనా అండర్సన్‌ మే 16న ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్‌ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్‌ పార్లమెంట్‌ రిక్స్‌డగెన్‌లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు.

టర్కీ అభ్యంతరం..
నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్‌ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్‌ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్‌ పార్లమెంట్‌ మే 17న 188–8 ఓట్లతో మద్దతు పలికింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
ఎప్పుడు : మే 17
ఎవరు    : స్వీడన్‌ ప్రధాని మగ్డలీనా అండర్సన్‌ 
ఎందుకు : నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమని..

Junior World Cup: భారత క్రీడాకారిణి రిథమ్‌ సాంగ్వాన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?

Manu Bhaker, Esha Singh, Rhythm Sangwan

ISSF Junior World Cup: జర్మనీలోని సుహ్ల్‌ వేదికగా జరుగుతోన్న జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌–2022లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మే 17న జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్‌ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది. మరోవైపు 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో పంకజ్‌ ముఖేజా, సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా (భారత్‌) జట్టు రజతం సాధించింది. ప్రస్తుతం భారత్‌ 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌–2022 మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టుకు స్వర్ణం
ఎప్పుడు : మే 17
ఎవరు    : ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు
ఎక్కడ    : సుహ్ల్, జర్మనీ
ఎందుకు : మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు 16–2తో జర్మనీ జట్టుపై విజయం సాధించినందున..

2022 Cannes Film Festival: 75వ కాన్స్‌ చిత్రోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

Cannes Film Festival

2022 Cannes Film Festival: 75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు–2022 ఫ్రాన్స్‌లోని కాన్స్‌ నగరంలో మే 17న అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో కలిసి నటులు నవాజుద్దిన్, మాధవన్, దర్శకుడు– నటుడు  శేఖర్‌ కపూర్, సంగీతదర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్‌సి (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌) చైర్‌ పర్సన్‌ ప్రసూన్‌ జోషి, సీబీఎఫ్‌సి సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈసారి చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్‌ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెంచ్‌ నటుడు విన్సెంట్‌ లిండన్‌ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు ఈ జ్యూరీలో ఉంటారు.  మే, 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి.

భారత ఆటగాడు చిరాగ్‌ శెట్టి ఏ క్రీడలో ప్రసిద్ధి పొందాడు?
ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ టైటిల్‌ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి.. మే 18వ తేదీ నుంచి థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ వేదికగా మొదలయ్యే థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్‌ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telangana: రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?

Telangana Highcourt

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫార్సు చేసింది. తెలంగాణ సహా ఐదు హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని తెలిపింది.  2021, అక్టోబర్‌ 11న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

పదోన్నతి వీరికే..

న్యాయమూర్తి

ప్రస్తుతం

సీజేగా పదోన్నతి హైకోర్టు

జస్టిస్‌ విపిన్‌ సంఘీ

ఢిల్లీ

ఉత్తరాఖండ్‌

జస్టిస్‌ అమ్జాద్‌ ఎ. సయ్యద్‌

బాంబే

హిమాచల్‌ ప్రదేశ్‌

జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే

బాంబే

రాజస్తాన్‌

జస్టిస్‌ రష్మిన్‌ ఎం ఛాయ

గుజరాత్‌

గువాహటి

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

తెలంగాణ

తెలంగాణ

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేపథ్యం ఇలా..

  • అసోంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్‌ సీనియర్‌ న్యాయవాదిగా, అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. 
  • గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు. 
  • అసోం బార్‌ కౌన్సిల్‌లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌ చేశారు.
  • ఆదాయపు పన్ను స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 
  • 2010, సెప్టెంబర్‌ 6న సీనియర్‌ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు. 
  • అసోం అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. 
  • మిజోరాం రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.
  • గౌహతి హైకోర్టులో అడిషనల్‌ జడ్జిగా 2011, అక్టోబర్‌ 17న నియామకమయ్యారు. 
  • 2019, అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 
  • 2021, అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.
  • ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతున్నారు. 
  • తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా భుయాన్‌ కొనసాగుతున్నారు.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?
ఎప్పుడు : మే 17
ఎవరు    : జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌
ఎందుకు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సుల మేరకు..

6G Services: ట్రాయ్‌ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

6G Services

Telecom Regulatory Authority of India (TRAI): 5జీకి మించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందించే 6జీ టెలికం నెట్‌వర్క్‌ను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని  మే 17న న్యూఢిల్లీలో నిర్వహించిన టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు..

  • దేశీయంగా ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసులు అందుబాటులో ఉండగా త్వరలో వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది.
  • 5జీ నెట్‌వర్క్‌తో దేశీ ఎకానమీకి 450 బిలియన్‌ డాలర్ల మేర ఊతం లభించగలదు.
  • కేవలం ఇంటర్నెట్‌ వేగం పెరగడమే కాదు అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పన కూడా వేగం పుంజుకుంటాయి. 
  • వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఇన్‌ఫ్రా, లాజిస్టిక్స్‌ వంటి రంగాల వృద్ధికి తోడ్పాటు లభిస్తుంది.

తొలి 5జీ టెస్ట్‌బెడ్‌ ఆవిష్కరణ..: దేశీయంగా రూపొందించిన తొలి 5జీ టెస్ట్‌బెడ్‌ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ముఖ్యమైన, ఆధునిక సాంకేతికతల విషయంలో స్వయం సమృద్ధి దిశగా ఇది కీలక అడుగని ఆయన పేర్కొన్నారు.

టెలికం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెలికం సాధనాలను ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉపయోగించడం ప్రారంభించగలదని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. దేశీ 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.

ట్రాయ్‌..
ఏర్పాటు:
ఫిబ్రవరి 20, 1997
ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
ప్రస్తుత చైర్మన్‌: డాక్టర్‌ పీడీ వాఘేలా​​​​​​​​​​​​​​చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 17 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 May 2022 07:16PM

Photo Stories