Daily Current Affairs in Telugu: 2022, మే 17 కరెంట్ అఫైర్స్
Prime Minister of France: ఫ్రాన్స్ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు?
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జీన్ కాస్టెక్స్ నుంచి మే 16న ఆమె బాధ్యతలు స్వీకరించారు. దీంతో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1991–92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్ గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. త్వరలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో కలిసి బోర్న్ నూతన మంత్రివర్గాన్ని నియమిస్తారు.
ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా..
రాజకీయాల్లోకి రాకముందు ఎలిజబెత్ బోర్న్ ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2017లో మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీలో చేరారు. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రధానులు మారుతూనే ఉంటారు. కార్మిక మంత్రిగా ఆమె తెచ్చిన సంస్కరణలకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు బోర్న్ సత్తాకు పరీక్షగా నిలవనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు?
ఎప్పుడు : మే 16
ఎవరు : ఎలిజబెత్ బోర్న్
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Integrated Renewable Energy Project: ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్ పవర్ ప్రాజెక్టు ఏది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజీ) విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు–ఐఆర్‌ఈపీ) ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 17న శంకుస్థాపన చేశారు.
ప్రపంచంలోనే అత్యధికంగా..
- ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా(కర్నూలు జిల్లా), పాణ్యం మండలం పిన్నాపురం(నంధ్యాల జిల్లా)లలో గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటుచేస్తున్న.. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా అవతరిస్తోంది.
- ఒకే యూనిట్ నుంచి సోలార్, పవన, హైడల్ పవర్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టు కూడా ఇదే కాబోతోంది.
- ఈ ప్రాజెక్టులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానించి ఓర్వకల్ పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కమ్‌లు, పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
- ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించారు.
రూ.15వేల కోట్ల పెట్టుబడి..
- ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది.
- ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్ డయాక్సైడ్ 15 మిలియన్ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా.
కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు..
- ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు(ఐఆర్‌ఈపీ)లో భాగంగా కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది.
- 1,680 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే హైడల్ వపర్‌ను పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ అని కూడా అంటారు. హైడల్ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది.
పంప్డ్ స్టోరేజ్ పవర్ అంటే..?
కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు. విద్యుత్ వాడకానికి డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్ స్టోరేజ్ పవర్ లేదా హైడల్ పవర్ అంటారు. ఐఆర్‌ఈపీ కోసం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే.. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు–ఐఆర్‌ఈపీ)కు శంకుస్థాపన
ఎప్పుడు : మే 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా(కర్నూలు జిల్లా), పాణ్యం మండలం పిన్నాపురం(నంధ్యాల జిల్లా)లలో..
ఎందుకు : ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజీ) విద్యుత్ ఉత్పాదనకు..
PM Modi: బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు?
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్‌లో ఉన్న బుద్ధుని జన్మస్థలం లుంబిని వనాన్ని మే 16న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ఆహ్వానం మేరకు వెళ్లిన మోదీకి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. బుద్ధుని జన్మస్థలంగా భావించే మాయాదేవి ఆలయాన్ని ప్రధానులిద్దరూ దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. లుంబిని బుద్ధుని జన్మస్థలమనేందుకు లభించిన తొలి శాసనాధారమైన అశోక స్తంభాన్ని సందర్శించారు. అలాగే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ భవన్‌కు లుంబినిలో శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్‌లో 2566వ బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
హెరిటేజ్ కారిడార్‌ను అభివృద్ధి..
భారత్–నేపాల్ మైత్రిని సమస్త మానవాళికి మేలు చేసేదిగా మోదీ అభివర్ణించారు. బుద్ధునిపై ఉన్న అచంచల విశ్వాసం ఇరు దేశాలనూ కలిపి ఉంచే ప్రధాన సూత్రమన్నారు. భారత్‌లోని సారనాథ్, బోధ్ గయ, కుశీనగర్, నేపాల్లోని లుంబిని మధ్య హెరిటేజ్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు.
జల విద్యుత్ రంగంలో మరిన్ని పెట్టుబడులు
పలు ద్వైపాక్షిక అంశాలపై మోదీ–దేవ్‌బా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యుదుత్పాదన రంగంలో ఇరు దేశాల మధ్య సహకారంలో పురోగతిపై సంతృప్తి వెలిబుచ్చారు. నేపాల్లో జల విద్యుత్ రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా భారత పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. విద్యా, సాంస్కృతిక బంధాలను విస్తరించేలా పలు ఒప్పందాలు జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుద్ధ పూర్ణిమ సందర్భంగా.. బుద్ధుని జన్మస్థలం లుంబిని వనం సందర్శన
ఎప్పుడు : మే 16
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లుంబిని వనం, రూపన్‌దేహి జిల్లా, లుంబిని ప్రావిన్స్, నేపాల్
ఎందుకు : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ఆహ్వానం మేరకు..
Free WiFi: తొలిదశలో భాగంగా ఎన్ని స్టేషన్లలో పీఎం వైఫై సేవలను ప్రారంభించారు?
దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో మరింత వేగవంతమైన ఉచిత వైఫై సేవలకు ప్రభుత్వరంగ సంస్థ రైల్‌టెల్ శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా 100 స్టేషన్లలో ‘ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్’ ఆధారిత సేవలను ప్రారంభించింది. మొత్తం 22 రాష్ట్రాల్లోని 71 ఏ1, ఏ కేటగిరీ స్టేషన్లతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన మరో 29 స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
13th Century: కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని ఎక్కడ గుర్తించారు?
కాకతీయుల కాలం నాటి శివాలయం ఒకటి ఇటీవల వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయితీ కార్యాలయం వెనకవైపు ఉన్న ఈ ఆలయాన్ని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ గుర్తించింది. క్రీ.శ.13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయ నిర్మాణ శైలిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని.. గణపేశ్వరాలయ వాస్తు శిల్పాన్ని పోలి ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ద్వారాల ముందు రాతి కిటికీలతోపాటు గోడపైభాగంలో ఆలయం చుట్టూ రాతి వెంటిలేటర్ ఉండటం విశేషమన్నారు.
Master of the Santoor: ప్రముఖ సంతూర్ విద్యాంసుడు శివకుమార్ శర్మ కన్నుమూత
జానపద వాయిద్య పరికరం సంతూర్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రముఖ విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ(83) మే 10న కన్నుమూశారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన శర్మ 1938లో జమ్మూలో జన్మించారు. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు. జమ్మూ–కశ్మీర్‌లో ఓ జానపద వాయిద్య పరికరమైన సంతూర్‌పై భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన తొలి సంగీతకారుడుగా గుర్తింపు పొందారు. ప్రముఖ ఫ్లూట్ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘శివ–హరి’ స్వరకల్పన ద్వయంగా ప్రఖ్యాతి గాంచారు.
Pulitzer Prize: మరణానంతరం పులిట్జర్ అవార్డుకు ఎంపికైన ఫొటో జర్నలిస్టు?
ప్రముఖ ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ.. ప్రతీష్టాత్మక పులిట్జర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది కిందట అఫ్గానిస్థాన్ లో తాలిబాన్లు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలైన భారత ఫొటోగ్రాఫర్ సిద్దీఖీకి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది. భారత్‌లో కరోనా మరణాలపై ఆయన తీసిన చిత్రాలకుగానూ పులిట్జర్ అవార్డు వరించింది. 2022 ఏడాదికి గానూ పులిట్జర్ అవార్డు విజేతలను ఇటీవల ప్రకటించగా..ఇందులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్ సంస్థకు చెందిన డానిశ్ సిద్దిఖీ, అద్నన్ అబిదీ, సన్నా ఇర్షాద్, అమిత్ దవే విజేతలుగా నిలిచారు. సిద్ధిఖీ పులిట్జర్ పురస్కారం గెలుచుకోవడం ఇది రెండోసారి. 2018లో మయన్మార్‌లోని రోహింగ్యా శరణార్థులపై తీసిన ఫొటోలకు గాను తొలిసారి సిద్ధిఖీ పులిట్జర్ అవార్డు అందుకున్నారు.
Chief of Army Staff of India: మనోజ్ పాండేకు పరమ విశిష్ట సేవా పురస్కారం
భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకు పరమ విశిష్ట సేవా పురస్కారం వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విధుల్లో వీరమరణం పొందిన పలువురు ఆర్మీ అధికారులకు, సైనికులకు శౌర్య చక్ర అవార్డు(మరణానంతరం)లను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.
Hockey: ఆసియా కప్ టోర్నీలో భారత్ ఎవరి నేతృత్వంలో బరిలో దిగనుంది?
వెటరన్ డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్‌పాల్ సింగ్ సారథ్యంలో.. భారత జట్టు ఆసియాకప్ హాకీ టోర్నమెంట్లో బరిలో దిగబోతోంది. జకార్తాలో మే 23న ఆరంభం కానున్న ఈ టోర్నీ కోసం భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతోంది. 20 మంది సభ్యుల జట్టుకు బీరేంద్ర లాక్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో రూపిందర్, బీరేంద్ర సభ్యులు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న భారత్.. పూల్–బిలో పాకిస్థాన్ , జపాన్ , ఆతిథ్య ఇండోనేసియాలతో కలిసి ఆడనుంది.
National Record: 5000 మీటర్ల పరుగులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
భారత స్టార్ రన్నర్ అవినాశ్ సాబ్‌లె మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఈవెంట్లో అవినాశ్ 5000 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఈ రేసును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన సాబ్‌లె.. 30 ఏళ్ల క్రితం బహుదూర్ ప్రసాద్ (13 నిమిషాల 29.70 సెకన్లు, బర్మింగ్‌హామ్ మీట్, 1992) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ ఈవెంట్లో అవినాశ్ 12వ స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో జాతీయ రికార్డు (8 నిమిషాల 16:21 సెకన్లు) కూడా అవినాశ్ పేరిటే ఉంది.చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 16 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్