Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 7 కరెంట్‌ అఫైర్స్‌

Veterinary Doctor

Andhra Pradesh: పశువైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్‌ పేరు?

స్కోచ్‌ గ్రూప్‌ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో  పది అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్‌ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్‌ స్కోచ్‌ మెడల్స్‌ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి జనవరి 6న నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్‌ గ్రూప్‌ ఎండీ గురుషరన్‌దంజల్‌ ఈ అవార్డులను ప్రకటించారు.

అవార్డుల వివరాలు..
గోల్డ్‌ మెడల్స్‌(5)

  • ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్‌ స్కోచ్‌లు వరించాయి. నేతన్న నేస్తం పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్‌ స్కోచ్‌ అవార్డు దక్కింది.
  • మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్‌ ఆంధ్రా’కు డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ కేటగిరిలో గోల్డ్‌ స్కోచ్‌ దక్కింది. 
  • గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్‌ ఫోర్టిఫికేషన్‌) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్‌ స్కోచ్‌ వరించింది.

సిల్వర్‌ మెడల్స్‌(5)

  • డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్‌ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్‌ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్‌ యాప్‌ ప్రభుత్వం తెచ్చిన విషయం విదితమే.
  • పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన ‘‘పశుసంరక్షక్‌ యాప్‌’’కు సిల్వర్‌ స్కోచ్‌ అవార్డు లభించింది.
  • ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌)కు సిల్వర్‌ స్కోచ్‌ దక్కింది.
  • కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్‌ స్కోచ్‌ వరించింది.
  • బయోవిలేజ్, నేచురల్‌ ఫార్మింగ్‌ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్‌ స్కోచ్‌ దక్కింది.

CDS General Bipin Rawat: రాష్ట్రంలోని స్కూల్‌కు జనరల్‌ రావత్‌ పేరు పెట్టారు?

దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్‌ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో తమళనాడులోని నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం జనవరి 6న వెల్లడించింది. 2019 ఏప్రిల్‌ ఒకటిన ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే.

ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ జనవరి 6న నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా విదేశాంగ శాఖ ఖండించింది. అరుణాచల్‌ ఎప్పుడూ భారత్‌లో భాగమేనని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఒక సైనిక్‌ స్కూల్‌కు దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును పెట్టాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు    : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : మెయిన్‌పురి జిల్లా, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : హెలికాప్టర్‌ ప్రమాదంలో తమళనాడులోని నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా..

RailTel: ఎన్ని స్టేషన్లలో రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌లను ప్రారంభించనున్నారు?

Varanasi Railway Station

బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కియోస్క్‌లకు ‘రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌’గా రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నామకరణం చేసింది. కొత్త కియోస్క్‌లను సీఎస్‌సీ ఇ–గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తాయని జనవరి 6న రైల్‌టెల్‌ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కియోస్క్‌లను తెస్తున్నట్లు రైల్‌టెల్‌ సీఎండీ పునీత్‌ చావ్లా చెప్పారు. భారతీయ రైల్వే, రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం కలిసి రైల్‌టెల్‌ను  ఏర్పాటుచేశాయి.

రైల్‌టెల్‌ తెలిపిన వివరాల ప్రకారం...

  • రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌లను తొలి దశలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్‌ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారు. దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు ఈ కియోస్క్‌ సేవలను విస్తరిస్తారు.
  • దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 44, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 13, నార్త్‌ ఫ్రంటియర్‌ రైల్వేలో 20, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 13, వెస్టర్న్‌ రైల్వేలో 15, నార్తర్న్‌ రైల్వేలో 25, వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 12, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 56 కియోస్క్‌లను ఏర్పాటుచేయనున్నారు.
  • కియోస్క్‌ల ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, ఆధార్‌ కార్డు సంబంధ సేవలు, పాన్‌ కార్డు దరఖాస్తు, ట్యాక్స్‌ చెల్లింపులు తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైలు, బస్సు, విమాన టిక్కెట్లను వీటి ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
200 రైల్వే స్టేషన్లలో రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌ల ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు    : రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందించాలని..

Election Commission of India: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితి?

ECI

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని భారత ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం జనవరి 6న వెల్లడించింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో 2022, ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితి పెంపు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు    : భారత ఎన్నికల సంఘం
ఎందుకు : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని..

PM Modi: భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని జనవరి 6న ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్‌ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్‌ కుమార్‌ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్, ఎస్‌పీజీ ఐజీ సురేశ్‌ సభ్యులుగా ఉన్నారు. వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది.

ద్విసభ్య కమిటీ వేసిన పంజాబ్‌..
మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్‌ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జడ్జి మెహతాబ్‌ సింగ్‌ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్‌ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా జనవరి 5న అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే!
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేబినెట్‌ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్‌ కుమార్‌ సక్సేనా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు 
ఎప్పుడు : జనవరి 6
ఎవరు    : కేంద్ర హోంశాఖ
ఎందుకు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు..

Niraj Bishnoi: బుల్లి బాయ్‌ యాప్‌ సృష్టికర్త ఎవరు?

Bulli Bai APP

ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్‌’ యాప్‌ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్‌ బిష్ణోయ్‌ (21) ఈ యాప్‌ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. జనవరి 6న అస్సాంలోని నీరజ్‌ సొంతూరు జోర్హత్‌లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ (ఐఎఫ్‌ఎస్‌ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి.

ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్‌ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోబీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహించనున్నారు?

Mithali Raj

భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ వరుసగా మూడో వన్డే వరల్డ్‌ కప్‌లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌–2022 బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు జనవరి 6న ప్రకటించారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2022, మార్చి 4నుంచి ఏప్రిల్‌ 3 వరకు న్యూజిలాండ్‌ వేదికగా వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్‌ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో 9 పరుగులతో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం విదితమే.

జట్టు వివరాలు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా, పూజ వస్త్రకర్, జులన్‌ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూనమ్‌ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌. స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్‌ బహదూర్‌.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహించనున్నారు?
ఎప్పుడు : జనవరి 6
ఎవరు    : భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్‌
ఎక్కడ    : న్యూజిలాండ్‌

Chakda Xpress: చక్దా సినిమాను ఎవరి జీవిత విశేషాలతో రూపొందించనున్నారు?

Chakda Xpress

భారత సీనియర్‌ పేస్‌ బౌలర్, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత (240) ఉన్న జులన్‌ గోస్వామి కెరీర్, జీవిత విశేషాలతో సినిమా రూపొందనుంది. ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో నిర్మించే ఈ సినిమాకు ప్రసీత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తాడు. జులన్‌ పాత్రలో అనుష్క శర్మ నటిస్తోంది. ఆమె ఈ చిత్రానికి సహ నిర్మాత కూడా.

కజకిస్తాన్‌లో రక్తపాతం

మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జనవరి 5న జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.

కజకిస్తాన్‌ ప్రజలు ఎల్‌పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్‌ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత జనవరి 2వ తేదీ నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో రష్యా సాయాన్ని కజకిస్తాన్‌ ప్రభుత్వం కోరింది. దీంతో రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి.

కజకిస్తాన్‌..
రాజధాని:
నూర్‌ సుల్తాన్‌(ఆస్థానా); కరెన్సీ: టెంజె
ప్రస్తుత అధ్యక్షుడు: కస్సిమ్‌–జోమార్ట్‌ టోకాయేవ్‌ 
ప్రస్తుత తాత్కాలిక ప్రధాని: అలీహాన్‌ స్మైలోవ్‌చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 6 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Jan 2022 05:38PM

Photo Stories