Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 6 కరెంట్‌ అఫైర్స్‌

Chopper Crash

Chopper Crash: ఎంఐ–17వీ5 ప్రమాదంపై దర్యాప్తును ఎవరి నేతృత్వంలో నిర్వహించారు?

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీసీ) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో త్రివిధ దళాలు చేసిన దర్యాప్తు నివేదికను జనవరి 5న న్యూఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సమర్పించారు. దర్యాప్తు వివరాలను, ప్రమాదానికి గల కారణాలను రాజ్‌నాథ్‌కు వివరించారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదానికి సాంకేతిక లోపాలు, విద్రోహ చర్యలు కారణం కాదు. 
  • ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పైలట్‌ చేసిన తప్పిదం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చు.
  • ఆకాశం మేఘావృతమై కారుచీకట్లు కమ్ముకోవడంతో ముందున్నది కనిపించక పైలట్, ఇతర సిబ్బందిపై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగినట్టుగా దర్యాప్తు బృందం భావిస్తోంది.

సీఎప్‌ఐటీగా..
2021, డిసెంబర్‌ 8న తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, కూనూరు సమీపంలోని నీలగిరి కొండల్లో ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలడానికి ముందు ఏదైనా భూభాగం లేదంటే కొండలు, నీళ్లు, అడ్డుగా వచ్చిన మరొక దానిని ఢీకొని ఉంటుందని.. దీనినే కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ ఇన్‌టూ టెరియన్‌ (సీఎఫ్‌ఐటీ) అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ప్రకారం... ప్రతికూల వాతావరణం లేదంటే పైలట్‌ తప్పిదం కారణంగా విమానం, లేదంటే హెలికాప్టర్‌కి అడ్డంగా వచ్చిన దేనినైనా ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగితే సీఎప్‌ఐటీగా అభివర్ణిస్తారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు నివేదిక అందజేత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు    : ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలోని బృందం
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై త్రివిధ దళాలు చేసిన దర్యాప్తు వివరాలు అందించేందుకు..

Covid-19: భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది?

దేశంలో తొలి ఒమిక్రాన్‌ మరణం సంభవించింది. రాజస్తాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ సోకిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్‌ 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 5న వెల్లడించింది. మరోవైపు కరోనా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు విస్తృతంగా వాప్తిస్తున్నాయని పేర్కొంది.

2.69 శాతానికి ఆర్‌–వాల్యూ..
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని సూచించే ఆర్‌–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69 శాతానికి చేరింది. డెల్టా వేరియెంట్‌ కారణంగా సెకండ్‌ వేవ్‌ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్‌– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు.

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి?

Kabaddi Tournament at Tirupati

జాతీయ కబడ్డీ పోటీలు చిత్తూరు జిల్లా, తిరుపతి నగరంలో జనవరి 5న ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, బ్యాడ్మింటన్‌ కోచ్, పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్, తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు జనవరి 9న ముగుస్తాయి.

‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకావిష్కరణ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన ‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకావిష్కరణ – విశ్లేషణ కార్యక్రమాన్ని విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవంలో జనవరి 5న నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌.సత్యనారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పద్మభూషణ్‌ అవార్డీ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ
ఎక్కడ    : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

SAAR: ‘స్మార్ట్‌’ అధ్యయనానికి ఎంపికైన నగరాలు?

Smart Cities Mission

స్మార్ట్‌ సిటీల్లో వచ్చిన మార్పులు, అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోని రెండు నగరాలను స్మార్ట్‌ సిటీ మిషన్, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ సంయుక్తంగా ఎంపిక చేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 47 స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేయగా.. ఇందులో కాకినాడ, విశాఖపట్నానికి చోటు లభించింది. అలాగే స్మార్ట్‌ సిటీస్‌ అండ్‌ అకాడెమియా టువార్డ్స్‌ యాక్షన్‌ అండ్‌ రీసెర్చ్‌(SAAR) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ అధ్యయనానికి దేశంలోని 15 ప్రముఖ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలు, విద్యా సంస్థలను ఎంపిక చేశారు. ఇందులో విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఉంది. ఈ సంస్థలు ఎంపిక చేసిన నగరాల్లో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్టులను డాక్యుమెంటేషన్‌ చేస్తాయి.

స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి 5,151 ప్రాజెక్టులు చేట్టినట్లు  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఇందులో అత్యంత ప్రభావితమైన 75 ప్రాజెక్టులపై ఈ అధ్యయనం ఉంటుందని తెలిపింది. ఇది భవిష్యత్‌లో చేపట్టే పథకాలకు ఉపయోగపడుతుందని జనవరి 5న వివరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్మార్ట్‌ సిటీస్‌ అండ్‌ అకాడెమియా టువార్డ్స్‌ యాక్షన్‌ అండ్‌ రీసెర్చ్‌(SAAR) కార్యక్రమానికి కాకినాడ, విశాఖపట్నం నగరాలు ఎంపిక
ఎప్పుడు   : జనవరి 5
ఎవరు    :  కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : స్మార్ట్‌ సిటీల్లో వచ్చిన మార్పులు, అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసేందుకు..

United Nations: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొత్తగా చేరిన దేశాలు?

UNSC

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా రెండేళ్ల కాలానికి 2021, జూన్‌ నెలలో ఎన్నికైన అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ దేశాలు 2022, జనవరి 4న బాధ్యతలు చేపట్టాయి. ప్రపంచ శాంతి, భద్రతలను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలిలో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది అశాశ్వత సభ్యదేశాలు ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకు వీటో హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్యదేశాల మధ్య వివరాలను పరిష్కరించడం వంటి విధులను భద్రతా మండలి నిర్వర్తిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరణ
ఎప్పుడు : జనవరి 4
ఎవరు    : అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ
ఎక్కడ    : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా రెండేళ్ల కాలానికి 2021, జూన్‌ నెలలో ఎన్నికైనందున..

The Better India: దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచిన అధికారి?

dgp-goutam-sawang-1641468197

ప్రజలకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్‌ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జాబితాను ఆ సంస్థ జనవరి 1న విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్‌ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది.

2022 ఏడాది యూనికార్న్‌ హోదా దక్కించుకున్న తొలి సంస్థ?
మామాఎర్త్‌ తదితర బ్రాండ్స్‌ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్‌ సంస్థ హోనాసా కన్జూమర్‌ తాజాగా 1.2 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. తద్వారా 2022 ఏడాది యూనికార్న్‌ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిలిచింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాదిలో అత్యుత్తమ డీజీపీగా ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ నిలిచారు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు    : ది బెటర్‌ ఇండియా సంస్థ
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : కోవిడ్‌ క్లిష్ట సమయంలోనూ పజలకు విశేష సేవలు అందించినందున..

Covid-19: టీనేజర్లకు వ్యాక్సిన్‌ పంపిణీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

Covid-19 Vaccination for teenagers

దేశ వ్యాప్తంగా 15–18 ఏళ్ల వారికి మొదటి డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే(2022, జనవరి 5వ తేదీ నాటికి) 52.82 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,89,501 మంది బాలబాలికలకు టీకా వేశారు. రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 76.09 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 24.41 లక్షల మంది టీనేజర్లను గుర్తించారు.

టీనేజర్లకు వ్యాక్సిన్‌ పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్‌(49.2 శాతం), గుజరాత్‌(45.29) శాతం ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 33.44 శాతం, రాజస్తాన్‌లో 22 శాతం నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా జనవరి 3వ తేదీన టీనేజ్‌ వారికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 147.72 కోట్ల డోస్‌ల టీకాలను కేంద్రం పంపిణీ చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టీనేజర్లకు వ్యాక్సిన్‌ పంపిణీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 5
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : 15–18 ఏళ్ల వారిలో 52.82 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సిన్‌ పంపిణీ చేసినందుకు..

Telangana MLC: సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జానపద గాయకుడు?

ప్రముఖ జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు –2021 లభించింది. తెలుగు విభాగంలో వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం ఏడు కవితా సంపుటిలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒకటి చొప్పున బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, క్రిటిసిజం, ఎపిక్‌ పొయిట్రీలను 2021 సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల అవార్డులను త్వరలో ప్రకటిస్తామని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అయ్యర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు 2021, డిసెంబర్‌ 30న ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ నుంచి ముగ్గురికి..
తెలంగాణకు చెందిన ముగ్గురు కవులను 2021 ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. ఈ ముగ్గురిలో గోరటి వెంకన్న ఒకరు కాగా,  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తగుళ్ల గోపాల్‌ను వరించింది. ‘దండ కడియం’అనే కవితా సంపుటికి గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు?’అనే నాటకానికి దక్కింది. గోరటి వెంకన్న తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వారు కాగా, తగుళ్ల గోపాల్‌ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామంలో జన్మించారు. ఇక దేవరాజు మహారాజు వరంగల్‌ జిల్లాకు చెందినవారు.

మరికొన్ని ముఖ్యాంశాలు...

  • కేంద్ర సాహిత్య అకాడమీ 2021కి గాను 20 భాషల్లో 2021, డిసెంబర్‌ 30న అవార్డులు ప్రకటించింది.
  • కవితల విభాగంలో గోరటి వెంకన్న(తెలుగు), మవాడీ గహాయి(బోడో), సంజీవ్‌ వెరెంకర్‌(కొంకణి), హృషీకేశ్‌ మాలిక్‌(ఒడియా), మీథేశ్‌ నిర్మొహీ(రాజస్థానీ), బిందేశ్వరీప్రసాద్‌ మిశ్ర్‌(సంస్కృతం), అర్జున్‌ చావ్లా(సింధి)లకు పురస్కారాలు దక్కాయి.
  • కథా రచయితలు రాజ్‌ రాహీ(డోగ్రీ), కిరణ్‌ గురవ్‌(మరాఠీ), ఖలీద్‌ హుసేన్‌(పంజాబీ), నిరంజన్‌ హంస్డా (సంతాలీ), అంబాయి(తమిళం)కి పురస్కారాలు వరించాయి.
  • నవలా రచయితలు అనురాధా శర్మ పుజారీ(అస్సామీ), నమితా గోఖలే(ఇంగ్లిష్‌)లకు అవార్డులు దక్కాయి.
  • జీవిత చరిత్రల విభాగంలో కన్నడ రచయిత డీఎస్‌ నాగభూషణకు, స్వీయచరిత్రల విభాగంలో జార్జ్‌ ఒనక్కూర్‌ మళయాలం, నాటక విభాగంలో బెంగాలీ రచయిత బ్రాత్య బసు, హిందీ రచయిత దయా ప్రకాశ్‌ సిన్హాలకు అవార్డులు ప్రకటించారు.
  • విమర్శ విభాగంలో వాలీ మొహ్మద్‌ అసీర్‌ కాస్తవారీ(కశ్మీరీ), ఐతిహాసిక కవిత్వంలో చబీలాల్‌ ఉపాధ్యాయ(నేపాలీ) పురస్కారాలు గెలుచుకున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు–2021కు ఎంపికైన తెలుగు జానపద గాయకుడు?
ఎప్పుడు  : డిసెంబర్‌ 30, 2021
ఎవరు    : ప్రముఖ జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న 
ఎందుకు : వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికిగాను..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 5 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Jan 2022 05:59PM

Photo Stories