Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 5 కరెంట్‌ అఫైర్స్‌

Covid-19 650x400

Covid-19: ఐహెచ్‌యూ వేరియంట్‌ ఏ దేశంలో బయటపడింది?

ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో కరోనా మరో వేరియంట్‌ బయటపడింది. ఈ కొత్త వేరియంట్‌తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఐహెచ్‌యూ మెడిటరేరియన్‌ ఇన్‌ఫెక్షన్‌ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. ఐహెచ్‌యూ వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు(మ్యుటేషన్లలో ఒకరకం) ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.

ఆఫ్రికాకు చెందిన కామెరూన్‌ నుంచి వచ్చిన వారివల్ల ఐహెచ్‌యూ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఒకేరోజు అత్యధిక కేసులు ఏ దేశంలో నమోదయ్యాయి?
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒమిక్రాన్‌ ఒక సునామీలా దేశాన్ని కుదిపేస్తోంది. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. చైనాలోని వూహాన్‌లో తొలిసారి బయల్పడిన కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం 2022, జనవరి 3న ఒక్క రోజే అమెరికాలో 10,82,549 కేసులు నమోదయ్యాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కరోనా మరో వేరియంట్‌ ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) ఏ దేశంలో బయటపడింది?
ఎప్పుడు  : జనవరి 4
ఎవరు    : ఇన్‌స్టిట్యూట్‌ ఐహెచ్‌యూ మెడిటరేరియన్‌ ఇన్‌ఫెక్షన్‌ అనే సంస్థకు చెందిన పరిశోధకులు
ఎక్కడ    : ఫ్రాన్స్‌
ఎందుకు   : ఆఫ్రికాకు చెందిన కామెరూన్‌ నుంచి వచ్చిన వారివల్ల ఐహెచ్‌యూ వ్యాప్తిలోకి ఉండొచ్చని అనుమానం.

Retirement: సుప్రీంకోర్టులో తొలి తెలంగాణ న్యాయమూర్తి పదవీ విరమణ

Justice Subhash Reddy and CJI NV Ramana

2018, నవంబర్‌ 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి 2022, జనవరి 4న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం నుంచి సుప్రీంకోర్టుకు నియమితులైన తొలి న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి అని తెలిపారు. సుప్రీంకోర్టు సహా వివిధ కోర్టుల్లో సుదీర్ఘంగా 20 ఏళ్లపాటు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ప్రజల స్వేచ్ఛను పరిరక్షించడం, సమర్థించడం చేశారన్నారు. సుప్రీంకోర్టు జడ్జీగా 100కు పైగా తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు. సుభాష్‌ రెడ్డి పదవీ విరమణతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34(33+1).

మెదక్‌ జిల్లా...
తెలంగాణలోని మెదక్‌ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామంలో జగన్నా«థ్‌ రెడ్డి, విశాలదేవి దంపతులకు జనవరి 5, 1957లో సుభాష్‌ రెడ్డి జన్మించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 1980, అక్టోబర్‌ 30న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2002, డిసెంబరు 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా చేరి, 2004లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇక్కడ నుంచి 2016, ఫిబ్రవరి 13న  గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. అనంతర కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సుప్రీంకోర్టులో తొలి తెలంగాణ న్యాయమూర్తి పదవీ విరమణ
ఎప్పుడు   : జనవరి 4
ఎవరు    : జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి 
ఎక్కడ    : న్యూఢిల్లీ


RBI: డీ–ఎస్‌ఐబీలుగా కొనసాగనున్న బ్యాంకులు?

Bank 650x400

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్‌ దిగ్గజాలు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి 4న ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రత్యేకత ఏమిటి?
డీ–ఎస్‌ఐబీలను ‘టూ బిగ్‌ టూ ఫెయిల్‌ (టీబీటీఎఫ్‌)లుగా పరిగణిస్తారు. ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదన్నది దీని ఉద్దేశ్యం. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనా, దీనిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆయా అంశాల వల్ల ఈ బ్యాంకులు మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణలో నిర్దిష్ట సాను కూలతలు, ప్రయోజనాలను పొందగలుగుతాయి.

మరికొన్ని ముఖ్యాంశాలు...

  • డీ–ఎస్‌ఐబీ నిర్ధారణ ఫ్రేమ్‌వర్క్‌ 2014 జూలైలో జారీ అయ్యింది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ కింద సేకరించిన వ్యాపార గణాంకాల ప్రాతిపదికన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు 2015, 2016ల్లో ఆర్‌బీఐ డీ–ఎస్‌ఐబీ హోదా ఇచ్చింది. 2017 మార్చి 31న హెచ్‌డీఎఫ్‌సీకి కూడా ఇదే హోదా లభించింది.
  • డీ–ఎస్‌ఐబీల కోసం అదనపు కామన్‌ ఈక్విటీ టైర్‌ 1 (సీఈటీ1) సౌలభ్యతను ఏప్రిల్‌ 1, 2016 నుండి దశలవారీగా ప్రారంభించడం జరిగింది. 2019 ఏప్రిల్‌ 1 నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది. తగిన మూలధన కల్పనలో ఈ సౌలభ్యత కీలకమైనది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయి
ఎప్పుడు : జనవరి 4
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) 
ఎందుకు : ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదని..\

Oil and Natural Gas Corporation: ఓఎన్‌జీసీ సీఎండీగా నియమితుతలైన తొలి మహిళ?

Alka Mittal

ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) అల్కా మిట్టల్‌ నియమితులయ్యారు. డిసెంబర్‌ 31తో పదవీ విరమణ చేసిన తాత్కాలిక హెడ్‌ సుభాష్‌ కుమార్‌ స్థానంలో ఆమె నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఆరు నెలల పాటు అల్కా మిట్టల్‌ (59)కు ఓఎన్‌జీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించాలన్న కేంద్ర పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆగస్టు ఆఖరుతో మిట్టల్‌ పదవీకాలం పూర్తవుతుంది.  ఈ విషయాలను జనవరి 4న సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) వెల్లడించింది.

ఇదే తొలిసారి..
ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, కామర్స్‌లో డాక్టరేట్‌ చేసిన అల్కా మిట్టల్‌.. 2018 నవంబర్‌ 27న ఓఎన్‌జీసీ బోర్డులో తొలి మహిళా మెంబర్‌గా నియమితులయ్యారు. తాజాగా కంపెనీ సీఎండీగా నియమితులయ్యారు. ఒక చమురు, గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీకి .. మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. అప్పట్లో (2014లో) ప్రభుత్వ రంగ రిఫైనర్, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)కు తొలి మహిళా హెడ్‌గా నిశి వాసుదేవ సేవలు అందించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) నియామకం
ఎప్పుడు  : జనవరి 4
ఎవరు    : అల్కా మిట్టల్‌
ఎందుకు : ఓఎన్‌జీసీ తాత్కాలిక హెడ్‌ సుభాష్‌ కుమార్‌ 2021, డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..

PM Modi: మహారాజా బీర్‌ బిక్రమ్‌ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

PM Modi at Agartala

మణిపూర్‌ రాజధాని నగరం ఇంఫాల్‌లో రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 4న ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో వాటిలో.. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంఫాల్‌ స్మార్ట్‌ సిటీ మిషన్, అత్యాధునిక కేన్సర్‌ ఆస్పత్రి ఉన్నాయి. వీటితోపాటు మణిపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ భవనానికి, 5 జాతీయ రహదారుల నిర్మాణానికి, మూడు తాగునీటి ప్రాజెక్టులు తదితరాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన త్రిపుర రాజధాని నగరం అగర్తలాలో మహారాజా బీర్‌ బిక్రమ్‌(ఎంబీబీ) విమానాశ్రయంలో రెండో టెర్మినల్‌ భవనంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను జనవరి 4న రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
ఎప్పుడు  : జనవరి 4
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : ఇంఫాల్, మణిపూర్‌
ఎందుకు : మణిపూర్‌ రాష్ట్రాభివృద్ధి కోసం..

Covid-19: టీకా మిశ్రమ డోసులతో 4 రెట్లు అధిక రక్షణ: ఏఐజీ

కరోనాను అడ్డుకునేందుకు ఇచ్చే టీకాలను మిశ్రమ పద్ధతిలో ఇవ్వడం వల్ల నాలుగురెట్లు అధికంగా యాంటీబాడీ రెస్పాన్స్‌ కనిపిస్తోందని ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్‌ అధ్యయనం వెల్లడించింది. ఏసియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌తో కలిసి ఏఐజీ ఈ అధ్యయనం నిర్వహించింది. తొలి మలి డోసులుగా కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ను లేదా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ను ఇవ్వడం వల్ల నాలుగురెట్ల అధిక రక్షణ లభిస్తుందని అధ్యయనం తెలిపింది. టీకా డోసుల మిశ్రమంతో లభించే రక్షణను పరిశీలించేందుకు ఈ అధ్యయనం జరిపామని ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

గాన్యూల్స్‌ జేఎండీగా రామ్‌ రావు
ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌ ఇండియా జేఎండీ, సీఈవోగా కేవీఎస్‌ రామ్‌ రావు నియమితులయ్యారు. ఫార్మా, కెమికల్స్‌ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉందని కంపెనీ జనవరి 4న ప్రకటించింది.

ఆర్‌బీఐలో ఇరువురికి ఈడీలుగా పదోన్నతి
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా దీపక్‌ కుమార్, అజయ్‌ కుమార్‌ చౌదరిలు పదోన్నతి పొందారు.  సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ మేరకు జనవరి 4న ఒక ప్రకటన చేసింది. ఈడీలుగా పదోన్నతికి ముందు దీపక్‌ కుమార్‌ ఆర్‌బీఐ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ చీఫ్‌గా ఉండగా, చౌదరి పర్యవేక్షణా విభాగం మేనేజర్‌–ఇన్‌–చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Petroleum: ఒపెక్‌ కూటమిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి?

OPEC

ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని ఒపెక్‌ దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. కోవిడ్‌–19 మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన రోడ్‌మ్యాప్‌లో భాగంగా 2022, ఫిబ్రవరిలో రోజుకు 400,000 బారెల్స్‌ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొన్నాయి. మిక్రాన్‌ వేరియంట్‌  వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్‌ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు తెలిపాయి.

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌(ఒపెక్‌–OPEC)...
ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజులా 1960లో ఇరాక్‌లో ఒపెక్‌ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయాన్ని మొదట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్యదేశాల సంఖ్య 13. ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వ వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది.

ఒపెక్‌ కూటిమిలోని ప్రస్తుత సభ్యదేశాలు(13):

  1. అల్జీరియా
  2. అంగోలా
  3. ఈక్వటోరియల్‌ గినియా
  4. గబాన్‌
  5. ఇరాన్‌
  6. ఇరాక్‌
  7. కువైట్‌
  8. లిబియా
  9. నైజీరియా
  10. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
  11. సౌదీ అరేబియా
  12. యూఏఈ
  13. వెనిజులా

Sindhutai Sapkal: ప్రముఖ సామాజిక వేత్త, పద్మ శ్రీ అవార్డీ కన్నుమూత

Sindhutai Sapkal

అనాథ పిల్లల అమ్మ(మదర్‌ ఆఫ్‌ ఆర్ఫన్స్‌)గా పేరొందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత సింధుతాయి సప్కాల్‌ (73) ఇక లేరు. గుండెనొప్పి కారణంగా పూణెలోని గ్యాలక్సీ కేర్‌ ఆసుపత్రిలో జనవరి 4న తుదిశ్వాస విడిచారు. 1948, నవంబర్‌ 14న మహారాష్ట్ర రాష్ట్రం, వార్ధా జిల్లా, వార్థాలో జన్మించిన సింధుతాయి జీవితంలో ఎన్నో కష్టాలకు ఎదురీది అనాథ పిల్లల కోసం పలు సంస్థలను ఏర్పాటు చేశారు. 1,050 మంది అనాథలను పెంచి పెద్ద చేశారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఈమె జీవిత చరిత్ర మరాఠా భాషలో బయోపిక్‌ చిత్రంగా వచ్చింది.

రంజీ ట్రోఫీ వాయిదా
కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించడంతో 2022, జనవరి 13న ప్రారంభానికి సిద్ధమైన రంజీ ట్రోఫీ సహా, సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్‌ మహిళల టి20 లీగ్‌ టోర్న మెంట్లను వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. టోర్నమెంట్‌లను తిరిగి ఎప్పుడు నిర్వహించేది కేసుల తీవ్రత, అనుకూల పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ సామాజిక వేత్త, పద్మ శ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 4
ఎవరు    : సింధుతాయి సప్కాల్‌ (73)
ఎక్కడ    : పూణె, పూణె జిల్లా, మహరాష్ట్ర 
ఎందుకు  : గుండెనొప్పి కారణంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 4 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Jan 2022 05:33PM

Photo Stories