Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 4 కరెంట్‌ అఫైర్స్‌

Pangong lake Bridge

Galwan Valley: ప్యాంగాంగ్‌ త్సో సరస్సులో వంతెనను నిర్మించిన దేశం?

భారత్‌–చైనా మధ్య 18 నెలలుగా తీవ్ర ఉద్రిక్తంగా తయారైన తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలో చైనా ఒక వంతెనను నిర్మించింది. ప్యాంగాంగ్‌ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన నిర్మించారని తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమైంది. భారత్‌తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే చైనా దీన్ని నిర్మించిందని నిపుణులు విశ్లేషించారు.

అటు వైపే బ్రిడ్జి కట్టారు
సరిహద్దు వెంట చైనా అధీనంలోని ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం జరిగిందని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. రెండు కి.మీల. నిస్సైనిక ప్రాంతంలో ఈ వంతెనను నిర్మించలేదని, గల్వాన్‌ ఘర్షణల తర్వాత కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించలేదని పేర్కొన్నాయి.

ఏడాదిపాటు తీవ్ర ఉద్రిక్తత..
2020 జూన్‌లో గల్వాన్‌ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. దాదాపు ఏడాదిపాటు తూర్పు లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తత రాజ్యమేలింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీల చర్చల తర్వాత ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని ఇరుదేశాల సైన్యాలు నిర్ణయించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్యాంగాంగ్‌ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ వంతెనను నిర్మించిన దేశం?
ఎప్పుడు : జనవరి 3
ఎవరు    : చైనా
ఎక్కడ    : గల్వాన్‌ లోయ ప్రాంతం, తూర్పు లద్దాఖ్‌
ఎందుకు : భారత్‌తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే..

UKSHA: ఒమిక్రాన్‌పై మూడో డోస్‌ ఎంత శాతం ప్రభావం చూపిస్తుంది?

కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకి ఆస్పత్రి పాలవకుండా టీకా బూస్టర్‌ డోస్‌ 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని బ్రిటన్‌కు చెందిన యూకేఎస్‌హెచ్‌ఏ(యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ) అధ్యయనం వెల్లడించింది. కోవిడ్‌ టీకా మొదటి రెండు డోసుల కన్నా మూడో డోసు అత్యధిక రక్షణనిస్తుందని తెలిపింది. కోవిడ్‌ టీకాల రెండో డోసు తీసుకున్న 6 నెలల అనంతరం వాటి రక్షణ 52 శాతానికి పడిపోతోందని ఆరోగ్య నిపుణుడు ప్రొఫెసర్‌ ఎరిక్‌ టోపాల్‌ చెప్పారు. బూస్టర్‌డోస్‌తో టీకా రక్షణ సామర్థ్ధ్యం (రెండోడోసు ముగిసిన ఆరు నెలల తర్వాత) 52 నుంచి 88 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు.

టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ ఎప్పుడు ప్రారంభమైంది?
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల గ్రూపు వారికి జనవరి 3న ప్రారంభమైన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు టీకా వేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్‌?

Mohammad Hafeez

పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పూర్తి సంతృప్తితో క్రికెట్‌ కెరీర్‌ను ముగిస్తున్నందుకు గర్వపడుతున్నానని జనవరి 3న 41 ఏళ్ల హఫీజ్‌ పేర్కొన్నాడు.

2018లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు..

  • టాపార్డర్‌ బ్యాటర్, ఆఫ్‌ స్పిన్‌ బౌలరైన హఫీజ్‌ 2018లోనే టెస్టు క్రికెట్‌కు బైబై చెప్పాడు. 
  • అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 392 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హఫీజ్‌ 12,789 పరుగులు చేశాడు. 253 వికెట్లు తీశాడు. ఇందులో 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టి20 మ్యాచ్‌లున్నాయి. 
  • మూడు వన్డే వరల్డ్‌కప్‌లు, ఆరు టి20 ప్రపంచకప్‌లు ఆడిన ఈ పాకిస్తాన్‌ క్రికెటర్‌ 2003లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేశాడు.
  • 2021, నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌ మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరిది. 
  • తన కెరీర్‌లో పాకిస్తాన్‌ జాతీయ జట్టు మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించిన ఘనత హఫీజ్‌ది.

జోష్నా చినప్ప ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?
ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి జోష్నా చినప్ప మళ్లీ టాప్‌–10లోకి వచ్చింది. జనవరి 3న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 35 ఏళ్ల జోష్నా రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌లో నిలిచింది. తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జోష్నా 417 మ్యాచ్‌లు ఆడి 246 విజయాలు సాధించింది. 21 టోర్నీలలో ఫైనల్‌కు చేరింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్‌?
ఎప్పుడు : జనవరి 3
ఎవరు    : పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ 
ఎందుకు : వ్యక్తిగత కారణాలతో..

Piyush Goyal: 2021–22 ఏడాదిలో భారత్‌ ఎగుమతుల లక్ష్యం?

Exports

భారత్‌ ఎగుమతులు 2021 డిసెంబర్‌లో 37.29 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2020 ఇదే నెలతో పోల్చితే  (27 బిలియన్‌ డాలర్లు) ఇది 37 శాతం పెరుగుదల. ఎగుమతుల చరిత్రలో ఒక నెల్లో ఈ స్థాయి స్పీడ్‌ ఇదే తొలిసారని జనవరి 3న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) భారత్‌ 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని పేర్కొన్నారు.

ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (88) ఇక లేరు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన జనవరి 3న చెన్నైలో టీ నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. 1933 అక్టోబర్‌ 15న జన్మించిన పీసీ రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామానికి చెందిన ఆయన 1959లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. ‘అనురాధ’ (1971) చిత్రంతో దర్శకుడిగా మారి.. దాదాపు 75 సినిమాలకు దర్శకత్వం వహించారు.

టాప్‌ లష్కరే ఉగ్రవాది సలీం పర్రే హతం
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌ శివారులో జనవరి 3న పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్‌ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

SWREL: స్టెర్లింగ్‌ విల్సన్‌ కొత్త  ప్రమోటర్‌గా ఆవిర్భవించిన సంస్థ?

Merge

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్‌) కొత్త ప్రమోటర్‌గా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆవిర్భవించింది. అనుబంధ సంస్థలతో కలసి ఆర్‌ఐఎల్‌ 40 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు వీలుగా రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) 25.9 శాతం ఈక్విటీ వాటా కొనుగోలుకి మిగిలిన రూ. 1,583 కోట్లు చెల్లించింది. ఈ లావాదేవీ తదుపరి రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థలు ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్‌లో ఉమ్మడిగా 40 శాతం వాటాను పొందాయి.

దేశంలో మొదటి ఆటోఈటీఎఫ్‌ పథకాన్ని ప్రారంభించిన సంస్థ?
దేశంలో మొదటి ఆటోఈటీఎఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) ప్రారంభించింది. ఈ పథకం 2022, జనవరి 5న మొదలై, 10వ తేదీన ముగుస్తుందని సంస్థ ప్రకటించింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఇండెక్స్‌లో భాగంగా ఉన్న బ్లూచిప్‌ ఆటోమొబైల్, ఆటో యాన్సిలరీ (విడిభాగాల తయారీ సంస్థలు) కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్‌) కొత్త ప్రమోటర్‌గా ఆవిర్భవించిన సంస్థ?
ఎప్పుడు : జనవరి 3
ఎవరు    : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)
ఎందుకు : అనుబంధ సంస్థలతో కలసి ఆర్‌ఐఎల్‌ 40 శాతం వాటాను సొంత చేసుకున్నందున..

Sarbananda Sonowal: 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?

Kanha Village-Yoga Guru

రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, కాన్హా గ్రామంలోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్, ఫిట్‌ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో జనవరి 3న 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభమైంది. హార్ట్‌ఫుల్‌ నెస్‌ గురూజీ కమ్లేష్‌ డి.పటేల్‌ ఆధ్వర్యంలో జనవరి 3న ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా గురు రామ్‌దేవ్‌ బాబా, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్‌ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు    : కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్‌
ఎక్కడ    : కాన్హా శాంతి వనం, కాన్హా గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా
ఎందుకు : అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా..

Tamilisai Soundararajan: రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్‌ అవార్డును గెలుచుకున్న సంస్థ?

Telangana State energy conservation award

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్‌ అవార్డును గెలుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జనవరి 3న హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జీఎంఆర్‌ ప్రతినిధులకు అవార్డును అందజేశారు. ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ముందు వరుసలో ఉందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
ప్రముఖ ఆధునిక కవి అరుణ్‌సాగర్‌ జయంతి సందర్భంగా అరుణ్‌సాగర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జనవరి 2న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలు’ ప్రదానం చేశారు. ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారం, సీనియర్‌ సంపాదకుడు ఎమ్‌.నాగేశ్వరరావుకు విశిష్ట పాత్రికేయ పురస్కారం అందించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, సమాచార హక్కు కమిషనర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి,  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, ప్రముఖ కవి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి పాల్గొన్నారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. జనవరి 3న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో పోలవరం సవరించిన అంచనా వ్యయాలను తక్షణమే ఆమోదించేలా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో రెవెన్యూ లోటు, పెండింగ్‌ నిధులు, విద్యుత్‌ బకాయిలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్‌ ప్లాంట్, పోలవరం సవరించిన అంచనా వ్యయాలు తదితర అంశాలపై అంశాలపై ప్రధానితో చర్చించి వినతి పత్రాలను అందచేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్‌ అవార్డు ప్రదానం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందున..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 3 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Jan 2022 05:51PM

Photo Stories