Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 3 కరెంట్‌ అఫైర్స్‌

Tony Blair

Britain: నైట్‌హుడ్‌ హోదా పొందిన మాజీ ప్రధాన మంత్రి?

బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌ను బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ నైట్‌హుడ్‌ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్‌.. ‘ఆర్డర్‌ ఆఫ్‌ గార్డర్‌’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్‌ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్‌ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టోనీ బ్లెయిర్‌ను ‘సర్‌ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్‌ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్‌కు ప్రధానిగా సేవలందించారు.

బ్రిటన్‌ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్‌ వలేరీ అమోస్‌(67)కు సైతం నైట్‌హుడ్‌ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్‌ కంప్యానియన్‌’గా నియమిస్తూ ఎలిజబెత్‌ రాణి మరో నిర్ణయం తీసుకున్నారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    
: నైట్‌హుడ్‌ హోదా పొందిన బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి?
ఎప్పుడు : జనవరి 1
ఎవరు    : టోనీ బ్లెయిర్‌ 
ఎందుకు : అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసినందున..

Nuclear Installations: ‘అణు’ సమాచారం పంచుకున్న దక్షిణాసియా దేశాలు?

India-Pakistan Flag

భారత్, పాకిస్తాన్‌లు తమ దేశాల్లో అణువిద్యుత్‌ కేంద్రాలు, అణు ఇంధనశుద్ధికి సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం జనవరి 1న రెండు దేశాలు దౌత్యమార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఈ సమాచార మార్పిడి చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

1991లో ఒప్పందం...
జనవరి ఒకటిన తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ రెండు దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్‌ అంశంపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు య«థావిథిగా కొనసాగింది.

అఫ్గాన్‌కు 5 లక్షల డోసుల కోవిడ్‌ టీకా..
తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్తాన్‌కు భారత్‌ రెండో విడత మానవతా సాయం అందించింది. జనవరి 1న 5 లక్షల డోసుల కరోనా టీకా కోవాగ్జిన్‌ను కాబూల్‌కు పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. త్వరలో మరో 5 లక్షల డోసుల టీకాను పంపిస్తామని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం పంచుకున్న దక్షిణాసియా దేశాలు? 
ఎప్పుడు : జనవరి 1
ఎవరు    : భారత్, పాకిస్తాన్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌
ఎందుకు : ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో 1991లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం..

Sports calendar 2022: ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?

FISU Games 2022

2022 ఏడాది క్రీడల క్యాలెండర్‌

అండర్‌–19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 
వేదిక: వెస్టిండీస్‌ 
జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు 

మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ 
వేదిక: న్యూజిలాండ్‌ 
మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు 

ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 
వేదిక: ఇస్తాంబుల్‌ (టర్కీ) 
మే 6 నుంచి 21 వరకు  

వింటర్‌ ఒలింపిక్స్‌ 
వేదిక: బీజింగ్‌ (చైనా) 
ఫిబ్రవరి 4–20
పాల్గొనే దేశాలు: 84 

కామన్వెల్త్‌ గేమ్స్‌ 
వేదిక: బర్మింగ్‌హమ్‌ (ఇంగ్లండ్‌)
జూలై 28–ఆగస్టు 8 

ఆసియా క్రీడలు 
వేదిక: హాంగ్జౌ (చైనా) 
సెప్టెంబర్‌ 10–25  

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 
వేదిక: ఖతర్‌ 
నవంబర్‌ 21–డిసెంబర్‌ 18 
పాల్గొనే జట్లు: 32 

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 
వేదిక: ఒరెగాన్‌ (అమెరికా) 
జూలై 15–24 

ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు 
వేదిక: చెంగ్డూ (చైనా) 
జూన్‌ 26–జూలై 7  

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 
వేదిక: బెల్‌గ్రేడ్‌ (సెర్బియా); 
సెప్టెంబర్‌ 10–18  

పురుషుల టి20 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 
వేదిక: ఆస్ట్రేలియా  
అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13


షూటింగ్‌

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ 

వేదిక: రబాట్‌ (మొరాకో); ఫిబ్రవరి 7–18

ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ 

వేదిక: కైరో (ఈజిప్ట్‌); ఫిబ్రవరి 26–మార్చి 8 

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ 

వేదిక: నికోసియా (సైప్రస్‌); మార్చి 8–19  

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ 

వేదిక: లిమా (పెరూ); మార్చి 27–ఏప్రిల్‌ 7 

ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ 

వేదిక: రియో డి జనీరో (బ్రెజిల్‌); ఏప్రిల్‌ 9–19 

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ టోర్నీ 

వేదిక: లొనాటో (ఇటలీ); ఏప్రిల్‌ 19–30

ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ

వేదిక: బాకు (అజర్‌బైజాన్‌); మే 27–జూన్‌ 9

ప్రపంచకప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ

వేదిక: చాంగ్వాన్‌ (కొరియా); జూలై 9–22 

ప్రపంచ షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌ 

వేదిక: క్రొయేషియా; సెప్టెంబర్‌ 27– అక్టోబర్‌ 10 

ప్రపంచ రైఫిల్, పిస్టల్‌ చాంపియన్‌షిప్‌ 

వేదిక: కైరో (ఈజిప్ట్‌); అక్టోబర్‌ 12–25 

 

బ్యాడ్మింటన్‌

ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీ 

వేదిక: న్యూఢిల్లీ 
జనవరి 11–16 

సయ్యద్‌ మోదీ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీ 

వేదిక: లక్నో 
జనవరి 18 –23 

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీ 

వేదిక: బర్మింగ్‌హమ్‌; మార్చి 16 –20  

థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీ 

వేదిక: బ్యాంకాక్‌; మే 8 –15 

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీ 

వేదిక: జకార్తా;జూన్‌ 14 –19 

ప్రపంచ చాంపియన్‌షిప్‌ 

వేదిక: టోక్యో; ఆగస్టు 21 –28 

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ 

వేదిక: గ్వాంగ్‌జౌ;డిసెంబర్‌ 14 –18  

 

టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 

వేదిక: మెల్‌బోర్న్‌ 
జనవరి 17–30 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

వేదిక: పారిస్‌ 
మే 22– జూన్‌ 5 

వింబుల్డన్‌ ఓపెన్‌ 

వేదిక: లండన్‌; జూన్‌ 27–జూలై 10 

యూఎస్‌ ఓపెన్‌

వేదిక: న్యూయార్క్‌; ఆగస్టు 29–సెప్టెంబర్‌ 11  

 

ఆర్చరీ 

ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీ 

వేదిక: అంటాల్యా; ఏప్రిల్‌ 18–24

ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీ 

వేదిక: గ్వాంగ్‌జు; మే 16–22

ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ 

వేదిక: పారిస్‌ (ఫ్రాన్స్‌); 
జూన్‌ 20–26  

ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నీ 

వేదిక: మెడెలిన్‌ (కొలంబియా); జూలై 18–24  

ఫార్ములావన్‌
2022 ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. మార్చి 20న బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రితో ఎఫ్‌1 సీజన్‌ మొదలవుతుంది. అనంతరం సౌదీ అరేబియా (మార్చి 27), ఆస్ట్రేలియా (ఏప్రిల్‌ 10), ఇటలీ (ఏప్రిల్‌ 24), మయామి–యూఎస్‌ఏ (మే 8), స్పెయిన్‌ (మే 22), మొనాకో (మే 29), అజర్‌బైజాన్‌ (జూన్‌ 12), కెనడా (జూన్‌ 19), బ్రిటన్‌ (జూలై 3), ఆస్ట్రియా (జూలై 10), ఫ్రాన్స్‌ (జూలై 24), హంగేరి (జూలై 31), బెల్జియం (ఆగస్టు 28), నెదర్లాండ్స్‌ (సెప్టెంబర్‌ 4), ఇటలీ (సెప్టెంబర్‌ 11), రష్యా (సెప్టెంబర్‌ 25), సింగపూర్‌ (అక్టోబర్‌ 2), జపాన్‌ (అక్టోబర్‌ 9),  ఆస్టిన్‌–యూఎస్‌ఏ (అక్టోబర్‌ 23), మెక్సికో (అక్టోబర్‌ 30), బ్రెజిల్‌ (నవంబర్‌ 13) గ్రాండ్‌ప్రి రేసులు ఉన్నాయి. చివరగా నవంబర్‌ 20న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో సీజన్‌ ముగుస్తుంది.

PM Modi: తాజాగా ఎన్నో విడత పీఎం–కిసాన్‌ నిధులను విడుదల చేశారు?

PM-KISAN Installment

2022, జనవరి 1న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌) పథకం పదో విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. పీఎం–కిసాన్‌ పదో విడత నిధుల విడుదలలో భాగంగా మొత్తం 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదల చేశారు. పీఎం–కిసాన్‌ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్‌ సందర్భంగా పీఎం–కిసాన్‌ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్‌ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది.

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని రియాసి జిల్లా, కత్రాలో ఉన్న ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో 2022, జనవరి 1న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్‌ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారింది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌) పథకం పదో విడత నిధులు విడుదల
ఎప్పుడు : జనవరి 1
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : రైతులకు ఆర్థికసాయం అందించేందుకు..

Dope Test: డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్‌ మహిళా చాంపియన్‌?

Taranjeet Kaur

అండర్‌–23 విభాగంలో భారత జాతీయ స్ప్రింట్‌ మహిళా చాంపియన్‌ తరణ్‌జీత్‌ కౌర్‌ డోపింగ్‌ పరీక్షలో విఫలమైంది. ఈ విషయాన్ని జనవరి 1న జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్‌ 2020, సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. ‘నాడా’ క్రమశిక్షణ కమిటీ విచారణలోనూ తరణ్‌జీత్‌ దోషిగా తేలితే ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధిస్తారు.

ధ్యాన్‌చంద్‌ క్రీడా విశ్వవిద్యాలయానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, మీరట్‌ జిల్లా, మీరట్‌లో జనవరి 2న మేజర్‌ ధ్యాన్‌చంద్‌ క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 700 కోట్లతో నిర్మించే ఈ వర్సిటీ 1,080 మంది బాల, బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దనుంది.

Legal Age Of Marriage: పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో ఉన్న ఏకైక మహిళా ఎంపీ?

Marriage

అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్‌ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్‌ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్‌ నేత వినయ్‌ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్‌సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది.

జయా జైట్లీ కమిటీ సిఫారసుల మేరకు..
అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే బిల్లుపై లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్‌ కమిటీకి పంపింది.

ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే..
అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్‌ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్‌ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్, ద ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్, ద స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్, ద హిందూ మ్యారేజ్‌ యాక్ట్, ద ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది.

Parliament Building: ఏ దేశ పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది?

South Africa

కేప్‌టౌన్‌లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ భవన సముదాయంలో జనవరి 2న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా లేదా విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పార్లమెంట్‌ స్పీకర్‌ నొసివివే అన్నారు. సంఘటన ప్రాంతాన్ని అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా సందర్శించారు. మంటలు మొదట ప్రారంభమైన పార్లమెంట్‌ పాత భవనం 1880ల నాటిది కాగా, దాని వెనుక ఉన్న నేషనల్‌ అసెంబ్లీ భవనం ఇటీవలి కాలంలో నిర్మించింది. కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కేప్‌టౌన్‌ నగరం లెజిస్లేటివ్‌ రాజధాని కాగా, ప్రిటోరియా పరిపాలన కేంద్రంగా, బ్లోమ్‌ ఫోంటెన్‌ న్యాయ రాజధానిగాను ఉన్నాయి.

2022 ఏడాది యూనికార్న్‌ హోదా దక్కించుకున్న తొలి సంస్థ?
మామాఎర్త్‌ తదితర బ్రాండ్స్‌ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్‌ సంస్థ హోనాసా కన్జూమర్‌ తాజాగా 1.2 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. తద్వారా 2022 ఏడాది యూనికార్న్‌ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిలిచింది.

టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌గా సురేశ్‌ రాజు..
ది ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టై) హైదరాబాద్‌ విభాగం కొత్త ప్రెసిడెంట్‌గా (2022కి) సురేశ్‌ రాజు నియమితులయ్యారు. ఆయన నియామకం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లవుతుందని టై హైదరాబాద్‌ తెలిపింది. రాజు ఇప్పటిదాకా వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.

టెస్లా ఆటోపైలట్‌ టీమ్‌ తొలి ఉద్యోగి మనోడే..
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిగ్గజం టెస్లాకి చెందిన ఆటోపైలట్‌ టీమ్‌లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన వ్యక్తి అశోక్‌ ఎల్లు స్వామి నియమితులయ్యాడు. ఈ విభాగంలో నియామకాలకు సంబంధించి తొలుత అశోక్‌ను రిక్రూట్‌ చేసుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు.

CMIE: దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో నమోదైంది?

Job Less

2021 డిసెంబర్‌ చివరినాటికి దేశ వ్యాప్తంగా సరాసరి 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. 2021 సెప్టెంబర్‌ నుంచి నెలనెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని జనవరి 2న తెలిపింది. సీఎంఐఈ తెలిపిన ప్రకారం...

  • జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది.
  • దేశవ్యాప్తంగా హరియాణాలో అత్యధిక నిరుద్యోగ రేటు 34.1 శాతం నమోదైంది.
  • హరియాణ తర్వాత స్థానాల్లో రాజస్తాన్‌ (27.1 శాతం) జార్ఖండ్‌ (17.3 శాతం), బిహార్‌ (16 శాతం), జమ్మూకశ్మీర్‌ (15 శాతం) ఉన్నాయి.
  • దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 2.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నమోదైంది.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
2021 డిసెంబర్‌ చివరినాటికి దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో నమోదైంది?
ఎప్పుడు  : జనవరి 2
ఎవరు    : సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)
ఎక్కడ    : హరియాణా

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 1 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Jan 2022 07:23PM

Photo Stories