Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 26 కరెంట్‌ అఫైర్స్‌

Corruption

Transparency International: కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌లో భారత్‌ స్థానం?

జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 180 దేశాలతో కూడిన కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌–2021(సీపీఐ–2021)ను విడుదల చేసింది. ఈ జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి)రేంజ్‌లో మార్కులు ఇచ్చారు. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది.

కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌–ముఖ్యాంశాలు..

  • ఈ జాబితాలో 40 మార్కులతో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. 28 మార్కులతో పాకిస్తాన్‌ 140వ స్థానంలో నిలిచింది. ఇక బంగ్లాదేశ్‌ 147వ స్థానం పొందింది.
  • పాక్‌లో రూల్‌ ఆఫ్‌ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషించింది. 
  • జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్‌లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్‌ ఉన్నాయి. 
  • భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్‌ ఉన్నాయి.
  • ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌–2021(సీపీఐ–2021)లో భారత్‌కు 85వ స్థానం 
ఎప్పుడు : జనవరి 25
ఎవరు    : ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ
ఎక్కడ    : ప్రపంచంలో..

Power Cut: మధ్యాసియాలోని ఏ దేశాల్లో విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది?

Power Grid

మధ్యాసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ల్లో జనవరి 25న విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్‌ సరఫరా అంతరాయంతో పలు పౌర సేవలు నిలిచిపోయాయి. ఈ అంతరాయానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కజకిస్తాన్‌లో పవర్‌లైన్‌ ఫెయిల్యూర్‌ ఇందుకు కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపిస్తోంది. ఈ మూడు దేశాలు వన్‌ పవర్‌ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి.

కజకిస్తాన్‌..
రాజధాని:
నూర్‌–సుల్తాన్‌; కరెన్సీ: టెంజె

ఉజ్బెకిస్తాన్‌..
రాజధాని:
తాష్కెంట్‌; కరెన్సీ: ఉజ్బెక్‌ సోమ్‌

కిర్గిస్తాన్‌..
రాజధాని:
బిష్కెక్‌; కరెన్సీ: కిర్గిస్తానీ సోమ్‌

ఉత్తరకొరియా క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలు
ఉత్తరకొరియా జనవరి 25న రెండు క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలు జరిపినట్లు దక్షిణకొరియా మిలటరీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెలలో ఉత్తర కొరియా ఐదుమార్లు ఆయుధ పరీక్షలు జరిపినట్లయింది. ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఉత్తరకొరియా దూకుడు పెంచింది. తమపై ఆంక్షలు ఎత్తివేయాలని ఉత్తరకొరియా డిమాండ్‌ చేస్తోంది. లేదంటే 2018లో నిలిపివేసిన అణ్వాయుధ పరీక్షలు తిరిగి ఆరంభిస్తామని హెచ్చరిస్తోంది.

Astronomy: జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను నిర్మించిన సంస్థ?

James Webb Space Telescope

మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్‌2 పాయింట్‌ (లాంగ్రేజియన్‌ 2 పాయింట్‌)ను చేరినట్లు నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా) వర్గాలు తెలిపాయి. ఎల్‌2 పాయింట్‌ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్‌లో ఇకపై వెబ్‌ టెలిస్కోప్‌ పరిభ్రమణ జరుపుతుంది. 2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్‌ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్‌మెంట్‌) చెందడం వంటి పనులు పూర్తి చేయాల్సిఉంది.

విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ నిర్మాణం జరిగింది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడా స్పేస్‌ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేసింది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది. 2021, డిసెంబర్‌ 25వ తేదీన దీన్ని నింగిలోకి పంపారు.

చౌకైన కోవిడ్‌ ‘స్మార్ట్‌’ టెస్ట్‌
కరోనా నిర్ధారణ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ డయాగ్నస్టిక్‌ టూల్‌ను అమెరికా అధ్యయనకారులు కనిపెట్టారు. సార్స్‌ కోవిడ్‌ 2 జన్యు పదార్థం నుంచి దీనిని రూపొందించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ తెలిపింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టు తరహాలోనే పని చేసే ఈ టూల్‌ 97 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు తెలిపారు. 20 నిమిషాల్లో ఫలితాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది
ఎప్పుడు : జనవరి 25
ఎవరు    : నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా)
ఎక్కడ    : భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్‌2 పాయింట్‌ (లాంగ్రేజియన్‌ 2 పాయింట్‌)కు..
ఎందుకు : విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా..

Hindustan Petroleum: హెచ్‌పీసీఎల్‌ కొత్త చైర్మన్‌గా ఎంపికైన వ్యక్తి?

HPCL

దేశంలోని మూడవ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనింగ్, మార్కెటింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్త చైర్మన్‌ ఎండీగా పుష్పకుమార్‌ జోషి (58) ఎంపికయ్యారు. ఈ మేరకు జనవరి 25న ఒక ప్రకటన వెలువడింది. అయితే పీఈఎస్‌బీ చేసిన సిఫారసుకు ప్రధానమంత్రి నేతృత్వంలోని నియామకాల కేబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర పడాల్సి ఉంది. 2022, ఏప్రిల్‌ 30న హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుత చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సురానా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పుష్పకుమార్‌ నియామకం జరిగింది. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌ మానవ వనరుల విభాగంలో డైరెక్టర్‌గా పుష్పకుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

73వ గణతంత్ర దినోత్సవం
ప్రస్తుతం బలమైన, సునిశితమైన భారత్‌ ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవాల్లో భారతీయతను కనబరచాలని దేశ ప్రజలను ఆయన కోరారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇండియా సాటిలేని తెగువను చూపిందని ఆయన ప్రశంసించారు. 73వ గణతంత్ర దినోత్సవం(2022, జనవరి 26) సందర్భంగా ఆయన జనవరి 25న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్త చైర్మన్‌ ఎండీగా ఎంపిక
ఎప్పుడు : జనవరి 25
ఎవరు    : హెచ్‌పీసీఎల్‌ మానవ వనరుల విభాగం డైరెక్టర్‌  పుష్పకుమార్‌ జోషి
ఎందుకు : 2022, ఏప్రిల్‌ 30న హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుత చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సురానా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో..

GDP Growth Rate: ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?

భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌).. 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. 2021, అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. వ్యాపార, రవాణా కార్యకలాపాలపై కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్ర ప్రభావమే వృద్ధి కోతకు కారణమని జనవరి 25న ఐఎంఎఫ్‌ పేర్కొంది. కోవిడ్‌ సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎకానమీ వృద్ధిని నమోదుచేసుకోకపోగా 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.

ప్రపంచ వృద్ధి 4.4 శాతం
ప్రపంచ వృద్ధి రేటు 2021లో 5.9 శాతంగా నమోదయితే, 2022లో 4.4 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్‌ తాజా అంచనా. 2021, అక్టోబర్‌లో వేసిన  (4.9 శాతం) అంచనాలకన్నా ఇది అరశాతం తక్కువ.

హైదరాబాద్‌ నుంచి తొలి కంపెనీ..
ఎంటర్‌ప్రైస్‌ హెచ్‌ఆర్‌ టెక్‌ కంపెనీ డార్విన్‌బాక్స్‌ రూ.538 కోట్ల నిధులను సమీకరించింది. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఒక బిలియన్‌ డాలర్‌ (రూ.7,480 కోట్లు) దాటింది. తద్వారా ఈ సంస్థ యూనికార్న్‌ కంపెనీల జాబితాలో చేరింది. హైదరాబాద్‌ నుంచి యూనికార్న్‌ హోదా దక్కించుకున్న తొలి కంపెనీగా స్థానం సంపాదించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22లో భారత్‌ వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతం నుంచి 9 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు    : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 
ఎందుకు : వ్యాపార, రవాణా కార్యకలాపాలపై కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్ర ప్రభావం కారణంగా..

Andhra Pradesh: కొత్తగా ఎన్ని జిల్లాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

AP New Districts Map

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం జనవరి 25న ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోనుంది. 1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే 2022, ఏప్రిల్‌ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా సౌలభ్యం.. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా లోక్‌సభ నియోజక వర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించిన విషయం విదితమే.

11 జిల్లాలు ఆంగ్లేయుల హయాంలోనే..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్‌ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.

రెవెన్యూ డివిజన్లూ పునర్‌ వ్యవస్థీకరణ..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.

కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా..
అల్లూరి సీతారామరాజు జిల్లా.. అనకాపల్లి జిల్లా..

  • ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తేవాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. సగటున 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
  • శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
  • ఎచ్చెర్ల మినహా విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలి.
  • శృంగవరపు కోట మినహా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా  ఆరు నియోజకవర్గాలతో విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి తేవాలి.
  • అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయాలి.
  • అరకు లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించాలి. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయాలి. రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలి.

కోనసీమ జిల్లా.. ఎన్టీఆర్‌ జిల్లా..

  • అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు.
  • కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
  • రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు.
  • ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
  • నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు.
  • మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు.
  • విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు.

భావపురి జిల్లా.. పల్నాడు జిల్లా..

  • గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కలిపి గుంటూరు జిల్లా ఏర్పాటు.
  • సంతనూతలపాడు మినహా బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు. భావ నారాయణస్వామి వెలిసిన బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు భావపురిగా పేరు పెట్టాలని యోచన.
  • నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. 

బాలాజీ జిల్లా.. అన్నమయ్య జిల్లా..

  • ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకర్గాలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు.
  • నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు కేంద్రంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఏర్పాటు.
  • సర్వేపల్లి శాసనసభ స్థానం మినహా తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
  • చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోనూ చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పుంగనూరును చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు.
  • పుంగనూరు శాసనసభ నియోజకవర్గంపోనూ రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
  • ప్రముఖ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను స్మరించుకుంటూ రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

సత్యసాయి జిల్లా..

  • కడప లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కడప కేంద్రంగా వైఎస్సార్‌ జిల్లా ఏర్పాటు.
  • కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు.. నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి కర్నూలు  జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
  • పాణ్యం మినహా నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
  • అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు.. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు శాసనసభ స్థానాన్ని కలిపి అనంతపురం జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
  • రాప్తాడు మినహా హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు. శ్రీసత్యసాయిబాబా సేవలను స్మరించుకుంటూ పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Padma Awards 2022: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్‌ సర్వీసెస్‌ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన వారికి ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని(జనవరి 26) పురస్కరించుకొని 2022 ఏడాది అవార్డుల విజేతల జాబితాను జనవరి 25న విడుదల చేసింది. నలుగురు పద్మ విభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. మొత్తంగా 128 మందికి అవార్డులు దక్కాయి. అవార్డు పొందిన వారిలో 34 మంది మహిళలు ఉండగా, 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో అవార్డులకు ఎంపిక చేశారు. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు..

  • తెలుగు రాష్ట్రాల నుంచి 2022 ఏడాది ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఉన్నారు.
  • పద్మ భూషణ్‌ అవార్డుకు తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు)లను పద్మశ్రీ వరించింది.  
  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి గోసవీడు షేక్‌ హాసన్‌ (కళలు) (మరణానంతరం), డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది. 

పద్మ పురస్కారాలు–2022

పద్మ విభూషణ్‌ విజేతలు(4)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

జనరల్‌ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం)

సివిల్‌ సర్వీసులు

ఉత్తరాఖండ్‌

2

రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం)

విద్య మరియు సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

3

కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)

ప్రజా వ్యవహారాలు

ఉత్తర ప్రదేశ్‌

4

ప్రభా ఆత్రే

కళలు

మహారాష్ట్ర

పద్మ భూషణ్‌ విజేతలు(17)

సంఖ్య

పేరు

రాష్ట్రం/దేశం/యూటీ

రంగం

1

గులాం నబీ ఆజాద్‌

ప్రజా వ్యవహారాలు

జమ్మూ, కశ్మీర్‌ 

2

విక్టర్‌ బెనర్జీ

కళలు

పశ్చిమ బెంగాల్‌

3

గుర్మీత్‌ బవ (మరణానంతరం)

కళలు

పంజాబ్‌

4

బుద్ధదేవ్‌ భట్టాచర్య

ప్రజా వ్యవహారాలు

పశ్చిమ బెంగాల్‌

5

నటరాజన్‌ చంద్రశేఖరన్‌

వాణిజ్యం, పరిశ్రమలు 

మహారాష్ట్ర

6

కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు

వాణిజ్యం, పరిశ్రమలు

తెలంగాణ

7

మధుర్‌ జాఫ్రి

ఇతరములుపాకశాస్త్రం

అమెరికా

8

దేవేంద్ర ఝఝారియా

క్రీడలు

రాజస్థాన్‌

9

రషీద్‌ ఖాన్‌

కళలు

ఉత్తర ప్రదేశ్‌

10

రాజీవ్‌ మెహ్రిషి

సివిల్‌ సర్వీసులు

రాజస్థాన్‌

11

సత్య నాదేళ్ల

వాణిజ్యం, పరిశ్రమలు

అమెరికా

12

సుందర్‌ పిచాయ్‌

వాణిజ్యం, పరిశ్రమలు

అమెరికా

13

సైరస్‌ పూనావాలా

వాణిజ్యంపరిశ్రమలు

మహారాష్ట్ర

14

సంజయ రాజారాం (మరణానంతరం)

సైన్స్, ఇంజనీరింగ్‌

మెక్సికో

15

ప్రతిభా రే

విద్య, సాహిత్యం

ఒడిశా

16

స్వామి సచ్చిదానంద్‌

విద్య, సాహిత్యం

గుజరాత్‌

17

వశిష్ట త్రిపాఠి

విద్య, సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 25 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Jan 2022 06:12PM

Photo Stories