Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 25 కరెంట్‌ అఫైర్స్‌

Roch Marc Christian Kabore

Military Coup: ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు?

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు జనవరి 24న ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది వెల్లడించలేదు. జనవరి 23న సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం జనవరి 24న కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు.

2015 నుంచి..
2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు.

బుర్కినా ఫాసో..
రాజధాని: ఔగాడౌగౌ; కరెన్సీ: వెస్ట్‌ ఆఫ్రికన్‌ సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌
అధికార భాష: ఫ్రెంచ్‌
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని ఆ దేశ సైనికులు బంధించారు?
ఎప్పుడు : జనవరి 24
ఎవరు    : పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోరె
ఎందుకు : సైనిక తిరుగుబాటు చేసి..

ICC Awards: క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు?

Smirti-ICC Awards

భారత అగ్రశ్రేణి క్రికెటర్‌ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2021 ఏడాదికి గాను మహిళల విభాగంలో ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును స్మృతి గెలుచుకుంది. మూడు ఫార్మాట్‌లలోనూ ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఎడంచేతి వాటం ఓపెనర్‌ అయిన స్మృతి 2021 ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 38.86 సగటుతో 855 పరుగులు సాధించింది. స్మృతి ఐసీసీ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికవడం ఇది రెండోసారి. 2018లో ఈ అవార్డుతో పాటు ఆమె ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా కూడా నిలిచింది. 2021 ఏడాది మహిళల విభాగంలో ట్యామీ బీమాంట్‌ (టి20), లిజెల్‌ లీ (వన్డే) అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు.

రాచెల్‌ హేహో ఫ్లింట్‌ ట్రోఫీ..
ఐసీసీ ఉమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును 2017 నుంచి రాచెల్‌ హేహో ఫ్లింట్‌ ట్రోఫీ అని పిలుస్తున్నారు. ఈ అవార్డును ఇంగ్లండ్‌కి చెందిన మహిళా క్రికెట్‌ దిగ్గజం, అడ్మినిస్ట్రేటర్‌ అయిన రాచెల్‌ హేహో ఫ్లింట్‌ జ్ఞాపకార్థం.. ఐసీసీ అవార్డుల వేడుకలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం–2021కు ఎంపికైన భారతీయురాలు?
ఎప్పుడు : జనవరి 24
ఎవరు    : భారత అగ్రశ్రేణి క్రికెటర్‌ స్మృతి మంధాన
ఎందుకు : క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను..

ICC Awards 2021: క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారానికి ఎంపికైన క్రికెటర్‌?

Shaheen Afridi

పురుషుల విభాగంలో ‘సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌’ పేరిట అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇచ్చే ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారానికి పాకిస్తాన్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది ఎంపికయ్యాడు. 2021 ఏడాదికిగాను అఫ్రిదిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీసీ జనవరి 24న ప్రకటించింది. క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకుగాను అఫ్రిదికి ఈ అవార్డు దక్కింది. 2021 ఏడాది అతను 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 22.20 సగటుతో 78 వికెట్లు పడగొట్టాడు. 6/51 అఫ్రిది అత్యుత్తమ ప్రదర్శన.

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌..
2021 ఏడాది అత్యుత్తమ వన్డే, టి20 క్రికెటర్‌ అవార్డులు కూడా పాకిస్తాన్‌ ఆటగాళ్లకే లభించాయి. 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు చేసిన కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా... 29 టి20ల్లో 73.66 సగటుతో 1,326 పరుగులు చేసి 24 వికెట్ల పతనంలో పాలు పంచుకున్న కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ ‘టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యారు. ఐసీసీ ‘టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ఇంగ్లండ్‌ టెస్టు జట్టు  కెప్టెన్‌ జో రూట్‌కు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన రూట్‌ 15 టెస్టుల్లో 61 సగటుతో 1,708 పరుగులు సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం–2021కు ఎంపికైన క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 24
ఎవరు    : పాకిస్తాన్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది
ఎందుకు : క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకుగాను..

Taliban-Western Officials Talks: నార్వే దేశ రాజధాని నగరం పేరు?

Taliban - Western officials

అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్‌ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్‌ సమావేశంలో మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్‌ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలన్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

నార్వే..
రాజధాని:
ఓస్లో; కరెన్సీ: నార్వేజియన్‌ క్రోన్‌
ప్రస్తుత రాజు: హెరాల్డ్‌ V
ప్రస్తుత ప్రధానమంత్రి: జోనాస్‌ గహర్‌ స్టోర్‌

హౌతీ మిస్సైల్స్‌ కూల్చేసిన యూఏఈ
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ)రాజధాని నగరం అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు క్షిపణులను మధ్యలోనే పేల్చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం జనవరి 24న ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడులకు ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మిప్సైల్‌ లాంచర్‌ను యూఏఈ రక్షణ వర్గాలు పేల్చేశాయి.

Dredging Corporation of India: డీసీఐ, ఎన్‌ఎండీసీల ఒప్పందం ప్రధాన ఉద్దేశం?

DCI and NMDC

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ) రాజధాని నగరం అబుదాబీలో లిస్టెడ్‌ కంపెనీ అయిన నేషనల్‌ మారిటైం డ్రెడ్జింగ్‌ కంపెనీ(ఎన్‌ఎండీసీ)తో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్‌లో మేజర్‌ పోర్టుల నిర్వహణ, ఓడరేవుల అభివృద్ధి, డ్రెడ్జింగ్‌ పనుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక సహకార మార్పిడి, అవసరమైతే జాయింట్‌ వెంచర్‌లతో ప్రాజెక్టుల నిర్వహణ, టెండర్లలో సంయుక్త భాగస్వామ్యంతో ప్రపంచ నౌకాశ్రయాల అవసరాలను సమర్థంగా తీర్చడానికి డీసీఐ, ఎన్‌ఎండీసీలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీసీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కెప్టెన్‌ ఎస్‌.దివాకర్, ఎన్‌ఎండీసీ గ్రూప్‌ సీఈవో యాసిర్‌ నజర్‌ జగ్‌లౌల్‌ జనవరి 24న వర్చువల్‌ విధానంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ డెవలప్‌మెంట్‌ అడ్వైజర్‌ (పోర్ట్స్‌) హెచ్‌.ఎన్‌.అశ్వత్‌ మాట్లాడుతూ.. డీసీఐ, ఎన్‌ఎండీసీ చేసుకున్న ఒప్పందం మారిటైం విజన్‌–2030 లక్ష్య సాధనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నేషనల్‌ మారిటైం డ్రెడ్జింగ్‌ కంపెనీ(ఎన్‌ఎండీసీ)తో భాగస్వామ్య ఒప్పందం 
ఎప్పుడు : జనవరి 24
ఎవరు    : డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ)
ఎందుకు : ప్రపంచ నౌకాశ్రయాల అవసరాలను సమర్థంగా తీర్చడానికి..

BioAsia 2022: బయో ఏసియా 19వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?

BioAsia 2022

తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏసియా 19వ వార్షిక సదస్సు హైదరాబాద్‌ వేదికగా జరగనుంది. 2022 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్‌ రెడీ’ నినాదంతో జరిగే ఈ సదస్సు లైఫ్‌ సైన్సెస్‌ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్‌ అవకాశాలపై చర్చిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు, బయోటెక్‌ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్‌ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషిస్తారు. నోబెల్‌ గ్రహీతలు డాక్టర్‌ కుర్ట్‌ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్‌ జుర్‌ హుస్సేన్, బారీ మార్షల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, ఫిబ్రవరి 24, 25 తేదీల్లో బయో ఏషియా 19వ వార్షిక సదస్సు నిర్వహణ
ఎప్పుడు : జనవరి 24
ఎవరు    : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ    : హైదరాబాద్‌ వేదికగా వర్చువల్‌ విధానంలో..
ఎందుకు : లైఫ్‌ సైన్సెస్‌ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్‌ అవకాశాలపై చర్చించేందుకు..

Himalayas: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ?

Bachendri Pal

ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్‌ మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ పది మంది మహిళల జట్టుతో అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రోజైన మార్చి 8న ప్రారంభమయ్యే ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా అయిదు నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగనుంది. వీటిలో 17,320 అడుగుల ఎత్తుతో పర్వతారోహకుల సామర్థ్యాన్ని పరీక్షించే లంఖాగా పర్వతమార్గం కూడా ఉంది.

యాత్ర విశేషాలు..

  • లద్దాఖ్‌లోని ద్రాస్‌ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఆగస్టు మొదటివారం లేదా రెండో వారంతో ఈ యాత్ర ముగుస్తుంది.
  • టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ‘ఫిట్‌ ఇండియా’ బ్యానరుపై ఈ యాత్రను నిర్వహిస్తున్నారు.
  • వాస్తవానికి ఈ యాత్ర 2021, మేలోనే ప్రారంభం కావాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ పరిస్థితులతో వాయిదా పడి, ఇప్పుడు జరగనుంది.
  • భారత్‌–మయన్మార్‌ సరిహద్దులోని పాంగ్‌సౌ పాస్‌ నుంచి యాత్ర మొదలై అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఠుంగ్రీ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నేపాల్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ల మీదుగా సాగుతూ.. కార్గిల్‌ జిల్లాలోని టైగర్‌ హిల్‌ వద్ద ముగుస్తుంది.
  • ఎవరికివారు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ద్వారా.. జీవితాన్ని 50 ఏళ్ల తర్వాత కూడా ఆస్వాదించవచ్చు అని చాటడమే ఈ యాత్ర ఉద్దేశమని బచేంద్రి పాల్‌ పేర్కొన్నారు.

బృందంలోని సభ్యులు..
1. బచేంద్రి పాల్, సారథి(67, ఉత్తర కాశీ జిల్లా, ఉత్తరాఖండ్‌)
2. చేతనా సాహూ (54, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌)
3. సవితా ధప్వాల్‌ (52, భిలాయ్, ఛత్తీస్‌గఢ్‌)
4. శ్యామలా పద్మనాభన్‌ (64, మైసూర్, కర్ణాటక)
5. గంగోత్రి సోనేజి (62, బరోడా, గుజరాత్‌)
6. ఛౌలా జాగిర్దార్‌ (63, పాలన్‌పుర్, గుజరాత్‌)
7. పాయో ముర్ము (53, జంషెడ్‌పూర్, జార్ఖండ్‌)
8. డాక్టర్‌ సుష్మా బిస్సా (55, బికనేర్, రాజస్థాన్‌
9. మేజర్‌ కృష్ణా దూబే (59, లక్నో, ఉత్తర ప్రదేశ్‌)
10. బింబ్లా దేవోస్కర్‌ (55, నాగ్‌పూర్, మహారాష్ట్ర)
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, మార్చి 8న 50 ఏళ్లు పైబడ్డ పది మంది మహిళల జట్టుతో సాహస యాత్ర ప్రారంభం అవుతుంది
ఎప్పుడు : జనవరి 24
ఎవరు    : బచేంద్రి పాల్‌
ఎక్కడ    : అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా...
ఎందుకు : ఎవరికివారు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ద్వారా.. జీవితాన్ని 50 ఏళ్ల తర్వాత కూడా ఆస్వాదించవచ్చు అని చాటేందుకు..

తైవాన్‌పైకి చైనా యుద్ధ విమానాలు

తైవాన్‌ పైకి చైనా జనవరి 23న 39 యుద్ధవిమానాలను పంపింది. తైవాన్‌ను బెదిరించే క్రమంలో చైనా ఈ చర్యలకు దిగింది. అయితే తన సొంత జెట్లను పంపి చైనా విమానాలను వెనక్కు తైవాన్‌ తిప్పికొట్టింది. చైనాకు చెందిన 24 జే16 ఫైటర్లు, 10 జే10 జెట్లు తమ వాయుమార్గంలోకి వచ్చాయని తైవాన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో తైవాన్‌పై చైనా పలు కవ్వింపు చర్యలకు దిగుతోంది.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 24 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Jan 2022 05:33PM

Photo Stories