Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 24 కరెంట్‌ అఫైర్స్‌

Thich Nhat Hanh

Vietnamese Peace Activist: ఇటీవల కన్నుమూసిన ప్రముఖ బౌద్ధ గురువు?

ప్రముఖ బౌద్ధ గురువు, జెన్‌ సన్యాసి థిక్‌ నాక్‌ హాన్‌ 95 సంవత్సరాల వయసులో జనవరి 22న మరణించారు. వియత్నాంలోని టు హైయు పగోడాలో ఆయన చివరి శ్వాస విడిచారు. 1926, అక్టోబర్‌ 11న వియత్నాంలోని  హైయులో జన్మించిన థిక్‌ నాక్‌ హాన్‌.. 16ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. 1961లో అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన 1966లో మార్జిన్‌ లూథర్‌ కింగ్‌ (జూ)తో పలు విషయాలపై చర్చలు జరిపారు. వియత్నాం అంతర్యుద్ధం నివారణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన మార్టిన్‌... థిక్‌నాక్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు.

పశ్చిమ దేశాల్లో..
జెన్‌ బుద్ధిజం ముఖ్యాంశాలను థిక్‌ నాక్‌ హాన్‌ విరివిగా ప్రచారం చేశారు. పశ్చిమ దేశాల్లో జెన్, బౌద్ధిజంను వ్యాపింపజేయడంలో ఆయన కృషి గణనీయం.  కరేజ్‌ ఆఫ్‌ కన్సైస్‌ (1991), పసెమ్‌ ఇన్‌ టెర్రిస్‌ పీస్‌ అండ్‌ ఫ్రీడం(2015) అవార్డులు ఆయన్ను వరించాయి. 2017లో ఎడ్యుకేషన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. ఆయన చరిత్ర ఆధారంగా ద సీక్రెట్‌ ఆఫ్‌ 5 పవర్స్‌ అనే నవల కూడా వచ్చింది. స్వయంగా ఆయన కొన్ని చిత్రాల్లో, డాక్యుమెంటరీల్లో కనిపించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ బౌద్ధ గురువు, జెన్‌ సన్యాసి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 22
ఎవరు    : థిక్‌ నాక్‌ హాన్‌ 
ఎక్కడ    : టు హైయు పగోడా, వియత్నాం
ఎందుకు : వయోభారం కారణంగా..

Netaji Subhas Chandra Bose: నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?

hologram statue of Netaji Subhas Chandra Bose

ఆజాద్‌ హిందు ఫౌజ్‌ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి(జనవరి 23)ని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్‌ దివస్‌ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్‌ దగ్గర నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ జనవరి 23న ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్‌ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు.

షింజో అబెకు నేతాజీ అవార్డు..
నేతాజీ జన్మదినోత్సవం సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు  ‘‘సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కారాలను’’ ప్రధాని మోదీ ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్‌ జనరల్‌ ఈ అవార్డుని స్వీకరించారు.

దేశ, విదేశాల్లో..

  • బోస్‌ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్‌ స్వాతంత్య్ర సాధనలో బోస్‌ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. 
  • బోస్‌ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత డిమాండ్‌ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 
  • బెంగళూరులోని బోస్‌ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. 
  • ఒడిశాలో బోస్‌ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్‌ ఆవిష్కరించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ భారీ విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్‌ 21
ఎవరు   : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : ఇండియాగేట్‌ వద్ద, న్యూఢిల్లీ
ఎందుకు : నేతాజీ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని..

Republic Day: ఏ మేరే వతన్‌ కే లోగో గీతాన్ని ఎవరు రాశారు?

Beating Retreat

గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జనవరి 29న నిర్వహించే బీటింగ్‌ రిట్రీట్‌లో ఈసారి మహాత్మ గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్‌ విత్‌ మీ’ పాటని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా 2022 ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

అబిడ్‌ విత్‌ మీ స్థానంలో..
అబిడ్‌ విత్‌ మీ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్‌ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్‌ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్‌ రిట్రీట్‌ను నిర్వహిస్తారు.

హెన్రీ ఫాన్రిస్‌ లైట్‌ రచన..
‘అబిడ్‌ విత్‌ మీ’ని 1847లో స్కాటిష్‌ ఆంగ్లికన్‌ కవి హెన్రీ ఫాన్రిస్‌ లైట్‌ రాశారు. 1950 నుంచి బీటింగ్‌ రిట్రీట్‌ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది.

25 శకటాలు..
2022 ఏడాది గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బాండ్లు,  వివిధ రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 25 శకటాలు రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొంటాయని ఇండియన్‌ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జనవరి 29న నిర్వహించే బీటింగ్‌ రిట్రీట్‌లో ఈసారి మహాత్మ గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్‌ విత్‌ మీ’ పాటని తొలగించాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు     : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 2022 ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని..

Western Asia: ప్రైవేట్‌ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్‌ దేశం?

Drones

దేశంలో ప్రైవేట్‌ డ్రోన్ల కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ) ప్రభుత్వం జనవరి 22న ప్రకటించింది. ప్రైవేట్‌ డ్రోన్లతో పాటు ప్రైవేట్‌ లైట్‌ స్పోర్ట్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా నెలపాటు నిషేధిస్తున్నామని తెలిపింది. ఇటీవలే అబుదాబిలో హౌతి తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. జనవరి 22నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో వీటి దుర్వినియోగం పెరిగిందని, అనుమతించిన పరిధులు దాటి ఇతర ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం కూడా ఎక్కువైందని పేర్కొంది. సినిమా షూటింగ్‌లకు మాత్రం ఈ నిషేధం వర్తించదని వివరించింది.

డబ్ల్యూహెచ్‌ఎంఓ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి?
అమెరికా అధ్యక్ష భవనం ‘‘వైట్‌హౌస్‌’’ మిలటరీ ఆఫీస్‌ డైరెక్టర్‌ పదవికి భారతీయ సంతతికి చెందిన మజ వర్గీస్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని, ఈ పదవిని నిర్వహించడం తనకు గర్వకారణమని ఆయన జనవరి 22న వెల్లడించారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో కూడా మజు పనిచేశారు. వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం కేరళ.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రైవేట్‌ డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ) ప్రభుత్వం
ఎక్కడ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ)
ఎందుకు : ఇటీవలే అబుదాబిలో హౌతి తిరుగుబాటుదారులు దాడి జరిపిన నేపథ్యంలో..

Women’s Singles Title: సయ్యద్‌ మోదీ టోర్నీలో విజేతగా నిలిచిన స్టార్‌ షట్లర్‌?

PV Sindhu at Lucknow

సయ్యద్‌ మోదీ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట(పీవీ) సింధు విజేతగా నిలిచింది. జనవరి 23న ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరం లక్నోలో ముగిసిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగం సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు.. 21–13, 21–16తో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్‌పై గెలిచి, టైటిల్‌ కైవసం చేసుకుంది. 2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ సాధించిన తర్వాత సింధు గెలిచిన మరో అంతర్జాతీయ టైటిల్‌ ఇదే కావడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన సింధుకు 11,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 55 వేలు), 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. సయ్యద్‌ మోదీ ఓపెన్‌లో సింధు విజేతగా నిలువడం ఇది రెండోసారి. 2017లోనూ సింధు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది.

రన్నరప్‌ గాయత్రి జోడీ..

  • మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–త్రిషా జాలీ (భారత్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–త్రిషా ద్వయం 12–21, 13–21తో అనా చింగ్‌ యిక్‌ చియోంగ్‌–తియో మె జింగ్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
  • పురుషుల డబుల్స్‌ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణ ప్రసాద్‌ (భారత్‌) ద్వయం 18–21, 15–21తో మాన్‌ వె చోంగ్‌–కయ్‌ వున్‌ తీ (మలేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 
  • మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఇషాన్‌ భట్నాగర్‌–తనీషా క్రాస్టో (భారత్‌) జంట 21–16, 21–12తో హేమ నాగేంద్ర బాబు–గురజాడ శ్రీవేద్య (భారత్‌) జోడీపై నెగ్గి టైటిల్‌ దక్కించుకుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సయ్యద్‌ మోదీ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట(పీవీ) సింధు 
ఎక్కడ : లక్నో, ఉత్తర ప్రదేశ్‌
ఎందుకు : ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు.. 21–13, 21–16తో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్‌పై గెలిచినందున.

Lifetime Achievement: ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ పురస్కారానికి ఎంపికైన వైద్యుడు?

Dr Indla Ramasubba Reddy

విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, ఇండ్లాస్‌ విమ్‌హాన్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డిని ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ అత్యున్నత పురస్కారం ౖ‘లెఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు–2022’కు ఎంపిక చేశారు. జనవరి 22న విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ సైకియాట్రిక్‌ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. జాతీయస్థాయిలో మానసిక వైద్యరంగానికి డాక్టర్‌ రామసుబ్బారెడ్డి చేసిన సేవలు, పరిశోధనలు, జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన ప్రచురించిన పరిశోధనాపత్రాలు, నిర్వహించిన సదస్సులను గుర్తించి, ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. 2023, జనవరిలో భువనేశ్వర్‌లో జరిగే జాతీయ సైకియాట్రిక్‌ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డు అందచేస్తారు.

సాయుధ పోరాట యోధుడు నర్సింహులు కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం ఎల్‌) జనశక్తి నేత, ప్రజా విమోచన సంపాదకుడు బండ్రు నర్సింహులు (104) తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా జనవరి 22న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన నర్సింహులు.. తొలుత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళ కమాండర్‌గా పోరాటం నడిపారు. 1964లో డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్, మీసా చట్టం కింద అరెస్ట్‌ అయి పన్నెండేళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత సీపీఐ (ఎంఎల్‌) పార్టీలో చేరారు. అనంతరం జనశక్తి పార్టీలో పనిచేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ అందించే జీవిత సాఫల్య పురస్కారం–2022కు ఎంపికైన వైద్యుడు?
ఎప్పుడు : జనవరి 22
ఎవరు    : విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, ఇండ్లాస్‌ విమ్‌హాన్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి
ఎక్కడ : జాతీయ సైకియాట్రిక్‌ సొసైటీ సర్వసభ్య సమావేశం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : మానసిక వైద్యరంగంలో చేసిన సేవలు, పరిశోధనలకు..

ISRO: వికాస్‌ ఇంజన్‌ సామర్థ్య పరీక్ష విజయవంతం

Vikas Engine

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్‌–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్‌ ఇంజన్‌ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. జనవరి 20న తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు జనవరి 22న వెల్లడించారు. గగన్‌యాన్‌–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్‌ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. గగన్‌యాన్‌–1 ప్రయోగాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గగన్‌యాన్‌–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్‌ ఇంజన్‌ సామర్థ్య పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ    : ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ), మహేంద్రగిరి, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు
ఎందుకు : గగన్‌యాన్‌–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా..

Padma Bhushan awardee: ప్రముఖ పురావస్తు పరిశోధకుడు నాగస్వామి కన్నుమూత

R Nagaswamy

పురావస్తు, శిలాఫలకాల పరిశోధకుడు, తమిళనాడు పరిశోధక శాఖ మొట్టమొదటి సంచాలకుడు రామచంద్రన్‌ నాగస్వామి(ఆర్‌.నాగస్వామి) (91) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా జనవరి 23న తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1930 ఆగస్టు 10న జన్మించిన నాగస్వామి..  మద్రాసు వర్సిటీలో సంస్కృతంలో పీజీ చేశారు. పుణె వర్సిటీలో భారత కళలు, పురాతత్వ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలో డాక్టరేట్‌ పొందారు. భారత పురావస్తు పరిశోధన శాఖలో శిక్షణ పొంది.. 1959 నుంచి 1963 వరకు చెన్నై ప్రభుత్వ మ్యూజియం సంరక్షకునిగా పనిచేశారు.

కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా..

  • 1963 నుంచి 1965 వరకు తమిళనాడు ప్రభుత్వ పురావస్తుశాఖ ప్రత్యేక సహాయ అధికారిగా, 1966 నుంచి 1988 వరకు పురావస్తుశాఖ మొదటి సంచాలకునిగా నాగస్వామి సేవలందించారు.
  • పదవీవిరమణ తర్వాత కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖ సలహాదారుగా పనిచేశారు. 
  • శిలాఫలకాలు, కళలు, సంగీతం, నృత్యం, తమిళ చరిత్ర గురించి తమిళం, ఆంగ్లం, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు. 
  • ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

ములుగు సిద్ధాంతి ఇకలేరు
ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ సిద్ధాంతి (70) జనవరి 23న శివైక్యం పొందారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడాని కంటే ముందు ఎంఆర్‌ ప్రసాద్‌ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, పద్మభూషణ్‌ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 23
ఎవరు    : రామచంద్రన్‌ నాగస్వామి(91)
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 22 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 24 Jan 2022 05:48PM

Photo Stories