Daily Current Affairs in Telugu: 2022, జనవరి 22 కరెంట్ అఫైర్స్
New Delhi: అమరజవాన్ జ్యోతిని ఎందులో విలీనం చేశారు?
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక అఖండ జ్యోతిలో కలిపేశారు. ఇక నుంచి యుద్ధ స్మారక అఖండ జ్యోతి దగ్గరే అమర జవాన్లకు నివాళులర్పించాలని జనవరి 21న మిలిటరీ అధికారులు తెలిపారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించిన అనంతరం అమరులైన భారత సైనికుల త్యాగానికి గుర్తుగా స్మారక జ్యోతి(అమర జవాన్ జ్యోతి)ని నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. అలాంటి చరిత్రాత్మక అఖండ జ్యోతిని... ఇండియా గేట్‌కు 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక స్థలంలో ఉన్న జ్యోతిలో కలిపేశారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్రమోదీ ఈ స్థలాన్ని ప్రారంభించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన 25,942 మంది సైనికుల పేర్లను గ్రానైట్‌లేబుల్స్‌పై సువర్ణాక్షరాలతో లిఖించారు.
50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాన్ జ్యోతిని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో జరిగిన కార్యక్రమం ద్వారా జాతీయ యుద్ధ స్మారక అఖండ జ్యోతిలో కలిపారు. అమర్‌జవాన్ జ్యోతిని ఆర్పేయడం లేదని, యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధ స్మారకంలో భారతీయ అమరవీరులందరి పేర్లు ఉంటాయని.. అందువల్ల అమర జవాన్ల కోసం జ్యోతిని అక్కడ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక అఖండ జ్యోతిలో విలీనం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలోని బృందం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : యుద్ధ స్మారకంలో భారతీయ అమరవీరులందరి పేర్లు ఉంటాయని..
Netaji Subhash Chandra Bose: నేతాజీ భారీ విగ్రహన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 21న ప్రకటించారు. నేతాజీకి భారతజాతి రుణపడి ఉందని, 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటు ఆయనకిచ్చే నివాళని ప్రధాని పేర్కొన్నారు. గ్రానైట్‌తో ఏర్పాటయ్యే విగ్రహం తయారీ పూర్తయ్యేవరకు, ఆ స్థానంలో హోలోగ్రామ్‌ను ఉంచనున్నట్లు తెలిపారు.
28 అడుగుల ఎత్తు..
నేతాజీ విగ్రహం 28 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. కింగ్‌జార్జ్5కి విగ్రహ ఏర్పాటు చేసినట్టుగా ఓ మండపం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
జనవరి 23న పరాక్రమ దివస్‌గా..
నేతాజీ జయంతి(జనవరి 23) సందర్భంగా ప్రతి ఏటా జనవరి 23న పరాక్రమ దివస్‌గా జరపనున్నట్లు 2021 సంవత్సరంలో కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవను అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అందజేయనుంది. వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు, సర్టిఫికెట్‌ను, సంస్థకయితే 51 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను అందజేయనుంది. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన పురస్కారాలను జనవరి 23వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రదానం చేస్తారు. మొత్తం ఏడు అవార్డులను ఈ సందర్భంగా అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఇండియాగేట్ వద్ద, న్యూఢిల్లీ
ఎందుకు : నేతాజీ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని..
Morning Consult: ప్రపంచ దేశాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత?
అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రపంచ దేశాల నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి జనవరి 21న విడుదల చేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో ప్రధాని మోదీ తొలిస్థానంలో నిలిచారు. భారత వయోజన జనాభాలో 71 శాతం మంది మోదీకే మద్దతు తెలిపినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వెల్లడించింది. మోదీతో పాటు మరో 13 మంది నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. వీరిలో మెక్సికో అధినేత ఆండ్రస్ మాన్యుల్ ఎల్‌పెజ్ ఒబ్రాడర్ 66 శాతం ప్రజాదరణతో, ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ 60 శాతం ప్రజాదరణతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జాబితాలో 26 శాతం రేటింగ్‌తో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అట్టడుగున నిలిచారు.
మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రపంచ నేతల జనాదరణను మదింపు చేయడం మొదలుపెట్టిన తర్వాత మోదీ 2020 మేలో అత్యధిక రేటింగ్(84 శాతం)ను, 2021 కరోనా సెకండ్ వేవ్ సమయంలో అల్ప రేటింగ్(63 శాతం)ను పొందారు.
తిరస్కరణ జాబితాలో బోరిస్ టాప్
అత్యధికంగా ప్రజా తిరస్కరణ పొందిన నేతల్లో బోరిస్ జాన్సన్ 69 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, 59 శాతం రేటింగ్‌తో ఫ్రాన్స్‌నేత ఇమ్మానియేల్ మాక్రాన్, 56 శాతం రేటింగ్‌తో బొల్సెనారో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో 21 శాతం రేటింగ్‌తో మోదీ అట్టడుగు స్థానం పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత?
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ప్రపంచంలో..
ఎందుకు : డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ చేసి సర్వే ప్రకారం..
Oscars 2022: ఆస్కార్ బరిలో నిలిచిన రెండు భారతీయ చిత్రాలు?
ఆస్కార్ బరిలో రెండు భారతీయ చిత్రాలు నిలిచాయి. 2022, మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ‘ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ 94 ఆస్కార్ అవార్డ్స్’ అంటూ నామినేషన్‌కి పోటీపడుతున్న చిత్రాల జాబితాను జనవరి 21న అకాడమీ కమిటీ విడుదల చేసింది. 276 ఫీచర్ ఫిల్మ్స్ ఉన్న ఈ జాబితాలో భారతదేశం నుంచి తమిళ ‘ౖజై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 94వ ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించిన ఈ చిత్రాలు ఫైనల్ నామినేషన్స్ జాబితాలో నిలుస్తాయా? లేదా అనేది ఫిబ్రవరి 8న తెలుస్తుంది. మరోవైపు ఉత్తమ విదేశీ విభాగంలో భారతదేశం నుంచి నామినేట్ అయిన తమిళ చిత్రం ‘కూళాంగల్’కు నిరాశ ఎదురైంది.
జై భీమ్: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, న్యాయవాది అయిన జస్టిస్ కె. చంద్రు జీవితం ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా ఈ చిత్రం. ఇందులో చంద్రుగా సూర్య నటించారు. టీజే జ్ఞానవేల్ దర్శకుడు.
మరక్కర్: 16వ శతాబ్దానికి చెందిన నావికుడు కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మరక్కర్‌గా మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 67వ నేషనల్ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో (బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 94 ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు?
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : తమిళ ‘జై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు
ఎక్కడ : ప్రపంచంలో..
India: మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏ నగరంలో ఏర్పాటు కానుంది?
డేటా సెంటర్ల రంగంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ సమీపం శంషాబాద్ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి 2022, ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిర్మాణంలో అమెజాన్ సెంటర్లు
హైదరాబాద్‌లో రూ.20,761 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) 2020, నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది.
డేటా సెంటర్ అంటే..
డేటా సెంటర్లలో సమాచారాన్ని భద్రపరుస్తారు. ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకం. క్లౌడ్ కంప్యూటింగ్‌లో వినియోగదారుల సమాచారాన్ని భద్రపరిచేందుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో డేటా సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్
ఎక్కడ : హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్
ఎందుకు : ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో భాగంగా..
Houthi rebels: యెమెన్‌లోని జైలుపై వైమానిక దాడి చేసిన దేశం?
యెమెన్‌లోని సదా నగరంలో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ అరెబియా ఆధ్వర్యంలో జనవరి 21న వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్‌లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్‌పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్‌నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది.
సిరియా, ఇరాక్‌లో ఐసిస్ దాడులు
ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు జనవరి 20న దాడి జరిపగా, ఇరాక్‌లో ఆర్మీ బ్యారక్‌పై జనవరి 21న విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యెమెన్‌లోని జైలుపై వైమానిక దాడి చేసిన దేశం?
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : సౌదీ అరెబియా
ఎక్కడ : సదా నగరం, యెమెన్
ఎందుకు : సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ చేసిన డ్రౌన్ దాడులకు ప్రతీకారంగా..
India: 2021లో కొత్తగా ఎన్ని స్టార్టప్స్ నమోదయ్యాయి?
2021 ఏడాది భారతదేశ వ్యాప్తంగా కొత్తగా 2,250 స్టార్టప్స్ నమోదయ్యాయి. 2020తో పోలిస్తే 600 కంపెనీల దాకా ఎక్కువగా వచ్చి చేరాయి. జనవరి 21న విడుదలైన నాస్కామ్–జిన్నోవ్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. నివేదిక ప్రకారం.. 2021లో భారత్‌లోని స్టార్టప్స్ రూ.1.78 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. ఇది కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే రెండింతలు అధికం. గడిచిన దశాబ్దంలో మొత్తం స్టార్టప్స్ పరిశ్రమ ప్రత్యక్షంగా 6.6 లక్షలు, పరోక్షంగా 34.1 లక్షల మందికి ఉపాధి కల్పించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఎడ్‌టెక్, రిటైల్, రిటైల్ టెక్, ఫుడ్‌టెక్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, మొబిలిటీ విభాగాలు కొత్త ఉద్యోగ అవకాశాలు అధికంగా కల్పించాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- స్టార్టప్స్‌లోకి వచ్చి చేరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో యూఎస్ ముందు వరుసలో ఉంది.
- యూకే, యూఎస్, ఇజ్రాయిల్, చైనాతో పోలిస్తే భారతీయ స్టార్టప్ వ్యవస్థకు 2021 అత్యుత్తమ సంవత్సరంగా నిలుస్తుంది.
- మొత్తం స్టార్టప్స్‌లో ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్, ముంబైల వాటా 71 శాతం.
- కనీసం ఒక మహిళ ఫౌండర్ లేదా కో–ఫౌండర్‌గా 12–15 శాతం స్టార్టప్స్, 10 యునికార్న్ సంస్థలు ఉన్నాయి. దేశంలో ఉన్న 70 యునికార్న్ కంపెనీల్లో 42 2021 ఏడాది అవతరించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది కొత్తగా 2,250 స్టార్టప్స్ నమోదయ్యాయి.
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : నాస్కామ్–జిన్నోవ్ నివేదిక
ఎక్కడ : భారతదేశ వ్యాప్తంగా..
ఎందుకు : దేశంలో స్టార్టప్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న క్రమంలో..
Statehood Day: ఇటీవల ఏ మూడు రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి?
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, మేఘాలయాలలో కనెక్టివిటీ, మౌలికసదుపాయాలు మెరుగు పడడంతో ఆ రాష్ట్రాలు కనెక్టివిటీ హబ్స్‌గా రూపాంతరం చెందుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో అవి చేరాయని చెప్పారు. మూడు రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. ఈశాన్య ప్రాంతాల చట్టం, 1971 కింద 50 ఏళ్ల క్రితం 1972లో ఈ మూడింటికి రాష్ట్ర హోదా ఇచ్చారు.
త్రిపుర
అవతరణ: జనవరి 21, 1972
విస్తీర్ణం: 10,491,69 చ.కి.మీ.
రాజధాని: అగర్తలా
సరిహద్దు రాష్ట్రాలు: అసోం, మిజోరాం.
సరిహద్దు దేశం: బంగ్లాదేశ్
కార్యనిర్వాహక శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 60
పార్లమెంట్:
లోక్‌సభ సీట్లు: 2
రాజ్యసభ సీట్లు: 1
ముఖ్యభాష: బెంగాళీ, కొక్‌బోరక్, మణిపూరి
మణిపూర్
అవతరణ: జనవరి 21, 1972
విస్తీర్ణం: 22,327 చ.కి.మీ.
రాజధాని: ఇంఫాల్
సరిహద్దు రాష్ట్రాలు: మిజోరాం, అస్సాం, నాగాలాండ్,
దేశం: మయన్మార్
శాసనసభ: ఏకసభ
శాసనసభ సీట్లు: 60
పార్లమెంటు:
లోక్‌సభ సీట్లు : 2
రాజ్యసభ సీట్లు: 1
ముఖ్యభాష: మిటియ్‌లన్(మణిపూరి)
మేఘాలయ
అవతరణ: జనవరి 21, 1972
విస్తీర్ణం: 22,429 చ.కి.మీ.
రాజధాని: షిల్లాంగ్
సరిహద్దు రాష్ట్రాలు: అసోం
దేశం: బంగ్లాదేశ్
శాసనసభ: ఏకసభ
శాసనసభ సీట్లు: 60
పార్లమెంటు:
లోక్‌సభ సీట్లు: 2
రాజ్యసభ సీట్లు: 1
ముఖ్యభాష: గరో, కాశి, ఇంగ్లిష్
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, జనవరి 21 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్