Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 21 కరెంట్‌ అఫైర్స్‌

Fishermens

Andhra Pradesh: రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో ఏర్పాటు కానుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చు చేస్తారు. ఈ విశ్వవిద్యాలయం  ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది. పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు, పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందుతారని అంచనా. మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సుల బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : వేములదీవి ప్రాంతం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
ఎందుకు : పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని..

6G Research: ఓలు వర్సిటీతో ఒప్పందంతో చేసుకున్న సంస్థ?

6G

రిలయన్స్‌ జియోకు చెందిన జియో ఈస్తోనియా, ఫిన్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఓలు.. 6జీ టెక్నాలజీ విషయంలో పరస్పర సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమ 5జీ సామర్థ్యాలు మరింత పెరగడంతోపాటు, 6జీకి సంబంధించి వినియోగ అవకాశాల అన్వేషణకు వీలు కలుగుతుందని జనవరి 20న జియో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో తొలి 6జీ పరిశోధన కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఓలు యూనివర్సిటీ.. 6జీకి సంబంధించి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌పై దృష్టి సారించిందని ఓలు యనివర్సిటీ 6జీ ఫ్లాగ్‌షిప్‌ ప్రొఫెసర్‌ మట్టి లాత్వ పేర్కొన్నారు.

స్వర్ణిమ్‌ భారత్‌ కే ఓర్‌ ఆవిష్కరణ
వినూత్నమైన ఆలోచనలు, ప్రగతి శీల నిర్ణయాలతో ఎలాంటి వివక్షలకు తావులేని వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఆజాదీ కె అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జనవరి 20న ‘స్వర్ణిమ్‌ భారత్‌ కే ఓర్‌’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
 ఫిన్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఓలుతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : రిలయన్స్‌ జియోకు చెందిన జియో ఈస్తోనియా
ఎందుకు : 6జీ టెక్నాలజీ విషయంలో పరస్పర సహకారం కోసం..

IAS Officer: ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన అధికారి?

EPTRI

పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ అధర్‌ సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్‌ఐ కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జనవరి 20న ఉత్తర్వులు జారీచేశారు. ఈపీటీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంది.

తరోన్‌ కోసం పీఎల్‌ఏ సాయం కోరిన ఆర్మీ
అరుణాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన మిరమ్‌ తరోన్‌(17) ఆచూకీ కోసం చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సాయాన్ని భారతీయ ఆర్మీ జనవరి 20న కోరింది. నియమాల ప్రకారం తరోన్‌ చైనా భూభాగంలో ఉంటే గుర్తించి అప్పగించాలని పీఎల్‌ఏను ఆర్మీ కోరిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని అప్పర్‌ సియాంగ్‌ జిల్లా నుంచి తరోన్‌ను జనవరి 18న పీఎల్‌ఏ మాయం చేసిందని ఆ రాష్ట్ర ఎంపీ తపీర్‌ గావో ఆరోపించారు. మూలికల అన్వేషణ, జంతువుల వేట కోసం తరోన్‌ ఇంటినుంచి వెళ్లి మరలా తిరిగిరాలేదు
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : ఐఏఎస్‌ ఎ.వాణీప్రసాద్‌
ఎక్కడ    : గచ్చిబౌలి, హైదరాబాద్‌
ఎందుకు : పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీల నేపథ్యంలో..

X-rays: ఏఐ ఆధారిత కరోనా పరీక్షా విధానాన్ని ఏ దేశస్థులు ఆవిష్కరించారు?

కరోనాను డయాగ్నైజ్‌ చేసేందుకు (గుర్తించేందుకు) కృత్తిమ మేధ(ఏఐ) ఆధారిత నూతన పరీక్షా విధానాన్ని స్కాట్లాండ్‌ సైంటిస్టులు ఆవిష్కరించారు. నిమిషాల్లోనే కరోనా సోకిందా లేదా తేల్చే ఈ పరీక్ష ఎక్స్‌ కిరణాల ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరీక్షా విధానం 98% కచ్ఛితమైన ఫలితాలు అందిస్తుందని స్కాట్లాండ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే పీసీఆర్‌ పరీక్షలాగా ఈ పరీక్షతో కరోనాను తొలి దశలో గుర్తించలేమని పేర్కొన్నారు. పీసీఆర్‌ పరీక్ష అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ పరీక్షా విధానం ఉపయుక్తంగా ఉండొచ్చన్నారు. పీసీఆర్‌ పరీక్షలో కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రెండు గంటల సమయం పడుతుంది. 

మనిషకి పంది మూత్రపిండాలు..
అమెరికాలోని అలబామ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్రపిండాలను.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి అమర్చారు. అనంతరం మూడు రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. పేషంట్‌ శరీరం ఆ మూత్రపిండాలను తిరస్కరించిన సంకేతాలేవీ కనిపించలేదని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ జేమీ లాకీ జనవరి 20న తెలిపారు. అవి సక్రమంగా పనిచేసినట్లు వెల్లడించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కృత్తిమ మేధ(ఏఐ) ఆధారిత నూతన పరీక్షా విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు?
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : స్కాట్లాండ్‌ యూనివర్సిటీ పరిశోధకులు
ఎందుకు : కరోనాను డయాగ్నైజ్‌ చేసేందుకు (గుర్తించేందుకు)..

Youngest Woman Pilot: విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలు?

Zara Rutherford

అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలిగా 19 ఏళ్ల బెల్జియన్‌–బ్రిటిష్‌ పైలట్‌ జారా రూథర్‌ఫర్డ్‌ రికార్డు నెలకొల్పింది. బెల్జియంలోని కోర్ట్‌రైలో ఓ చిన్న విమాన స్థావరం నుంచి 155 రోజుల క్రితం తన సాహసయాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె.. ఏకంగా 52 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ సురక్షితంగా జనవరి 20న కోర్ట్‌రైకి చేరుకున్నారు. దీంతో అతిచిన్న వయసులో ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె పేరు గిన్నిస్‌ పుస్తకంలోకి ఎక్కనుంది. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన శేష్టా వైజ్‌ పేరు మీద (30 ఏళ్ల వయసులో) ఉంది. మహిళలు విమానయాన రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి ఈ సాహస యాత్రను చేపట్టినట్లు జారా తెలిపింది. ఐదు ఖండాల్లోని 41 దేశాలను సందర్శించిన జారా.. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలిగా రికార్డు
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : 19 ఏళ్ల బెల్జియన్‌–బ్రిటిష్‌ పైలట్‌ జారా రూథర్‌ఫర్డ్‌
ఎక్కడ    : కోర్ట్‌రై, బెల్జియం
ఎందుకు : మహిళలు విమానయాన రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి.. 

Educational Institutions: టోఫీ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?

Ban on Tobacco

పాఠశాలలు, వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే విద్యా సంస్థల ప్రహరీల నిర్మాణంతో పాటు, పాఠశాలకు వంద గజాల్లోపు ప్రాంతంలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించింది. అదే విధంగా విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా ఇతర కార్యక్రమాలు చేపడుతోంది. వైద్యారోగ్య శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యా సంస్థలను పొగాకు రహిత ప్రాంతంగా ధ్రువీకరించేలా 9 ప్రమాణాలతో వైద్య శాఖ ‘టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌’(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. దానిని ఏపీ ఏఎన్‌ఎం హెల్త్‌ యాప్‌తో అనుసంధానించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా చేపడుతున్న చర్యల్లో భాగంగా..

Literacy Rate: పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత ఏ జిల్లాలో అమలులోకి తెచ్చారు?

Padhna Likhna Abhiyan

నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షరవెలుగులు నింపేందుకు కేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఇందుకోసం ‘పడ్నా–లిఖ్నా అభియాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. రాష్ట్రంలోనే మొదటిగా విజయనగరం జిల్లాలో కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చాయి. జిల్లాలోని 39,336 మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాయి.

60:40 నిష్పత్తిలో ఖర్చు..
వివిధ కారణాలతో చిన్నప్పుడు చదువుకోలేక, విద్యకు దూరమైనవారితో ఓనమాలను దిద్దించేందుకు 2021 జూన్‌లో ‘పడ్నా–లిఖ్నా అభియాన్‌’ క్యాక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తాయి.

ఇతర జిల్లాలలో పోలిస్తే..
విజయనగరం జిల్లాలో అక్షరాస్యత ఇతర జిల్లాలలో పోలిస్తే తక్కువగా ఉంది. ప్రధానంగా మహిళా అక్షరాస్యత మరింత తక్కువ. జిల్లాలో సగటు అక్షరాస్యత 58.89 శాతం ఉండగా వీరిలో పురుషుల అక్షరాస్యత 68.15 శాతం, మహిళల అక్షరాస్యత 49.87 శాతం మాత్రమే. దీంతో జిల్లాలో 2021, నవంబర్‌ 19న ‘పడ్నాలిఖ్నా అభియాన్‌’ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తొలివిడతగా 10 మండలాలకు చెందిన 39,336 మంది మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులను చేయాలని సంకల్పించారు. 2022, ఫిబ్రవరి 15 నాటికి తొలివిడత శిక్షణ కార్యక్రమం పూర్తికానుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత అమలులోకి తెచ్చారు?
ఎప్పుడు : నవంబర్‌ 19, 2021
ఎవరు    : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఎక్కడ    : విజయనగరం జిల్లా
ఎందుకు : నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షరవెలుగులు నింపేందుకు..

Telecom Sector: బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో తొలి స్థానంలో ఉన్న సంస్థ?

airtel, jio, bsnl

ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)ను వెనక్కి నెట్టి రిలయన్స్‌ జియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. వాణిజ్య పరంగా సేవలు అందుబాటులోకి తెచ్చిన రెండేళ్లలోనే జియోఫైబర్‌ ఈ ఘనతను సాధించింది. ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలో రెండు దశాబ్దాలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధిపత్య స్థానంలో కొనసాగింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) జనవరి 19న వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2021 నవంబర్‌లో 43.4 లక్షల మంది కస్టమర్లతో జియో తొలి స్థానంలో ఉంది. అంత క్రితం నెలలో ఈ సంఖ్య 41.6 లక్షలు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదార్ల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు వచ్చి చేరింది. భారతి ఎయిర్‌టెల్‌కు 40.8 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 2019 నవంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 86.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2021, అక్టోబర్‌లో 79.9 కోట్లు, 2021, నవంబర్‌లో 80.1 కోట్లకు చేరుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో తొలి స్థానం కైవసం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : జనవరి 19
ఎవరు    : రిలయన్స్‌ జియో 
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : మిగతా సంస్థలతో పోలిస్తే అత్యధిక కస్టమర్లను కలిగి ఉన్నందున..

Bulgarian President: బల్గేరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?

Rumen Radev

బల్గేరియా అధ్యక్షుడిగా రుమెన్‌ రదేవ్‌ జనవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష బాధ్యతలు రదేవ్‌ చేపట్టడం ఇది రెండోసారి. తొలిసారి 2017, జనవరి 22న అధ్యక్షలు బాధ్యతలు స్వీకరించారు. గతంలో బల్గేరియా వైమానిక శాఖలో పనిచేసిన ఆయన 2021 ఏడాది  దేశంలో జరిగిన ఆందోళనలకు అనుకూలంగా మాట్లాడి అత్యంత ప్రజాదరణ పొందారు. దేశ రాజధాని నగరం సోఫియాలోని నేషనల్ అసెంబ్లీలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రదేవ్‌ మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పడమే తన తక్షణ కర్తవ్యమని ప్రకటించారు. దేశాన్ని పీడిస్తున్న జనాభా, పేదరికం, అసమానతలపై పోరాడతానన్నారు. యూరోపియన్‌ యూనియన్‌లో పేద దేశంగా బల్గేరియా నిలుస్తోంది.    

బల్గేరియా..
రాజధాని:
సోఫియా; కరెన్సీ: లెవ్
అధికార భాష: బల్గేరియన్
ప్రస్తుత అధ్యక్షుడు: రుమెన్‌ రదేవ్‌
ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఇలియానా లోటోవా
ప్రస్తుత ప్రధానమంత్రి: కిరిల్ పెట్కోవ్
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బల్గేరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు    : రుమెన్‌ రదేవ్‌
ఎక్కడ    : నేషనల్ అసెంబ్లీ, సోఫియా, బల్గేరియా

Covid-19: కరోనా ఎండమిక్‌ దశ అంటే ఏమిటీ?

దేశంలో కరోనా మహమ్మారి 2022, మార్చి నాటికి ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అంచనా వేసింది. ‘‘డెల్టా వేరియంట్‌ స్థానాన్ని ఒమిక్రాన్‌ ఆక్రమిస్తే  కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్‌ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్‌ వేవ్‌ మూడు నెలల్లో ముగిసిపోతుంది. కరోనా ఎండమిక్‌ దశ  మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి’’ అని ఐసీఎంఆర్‌ నిపుణుల బృందం పేర్కొంది. 

ఎండమిక్‌ దశ అంటే..
ఎండమిక్‌ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం.

అత్యవసర పరిస్థితులు ఉండవ్‌ : డబ్ల్యూహెచ్‌ఓ
కోవిడ్‌–19తో విధించే అత్యవసర పరిస్థితులు 2022 ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలను నిర్మూలించి.. అన్ని దేశాలకు సమానంగా లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్‌–19 మరణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్‌డౌన్‌లు వంటివి అరికట్టవచ్చునని, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని పేర్కొంది.

జెనిసిస్‌ ప్రైజ్‌కి ఎంపికైన వ్యక్తి?
ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా  ప్రఖ్యాత జెనిసిస్‌ బహుమతికి ఎంపికయ్యారు. 2022, జూన్‌లో ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ బహు మతి విలువ 10 లక్షల డాలర్లు. కోవిడ్‌ టీకా అభివృద్ధి చేయడంలో కృషికిగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. బహుమతికి ఎవరిని ఎంపిక చేయాలని ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ నిర్వహించగా ఎక్కువగా ఆల్బర్ట్‌కు 2లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని జెనిసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

Mobile App: ఇన్వెస్టర్ల కోసం సెబీ అందుబాటులోకి తెచ్చిన యాప్‌?

Sebi

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI) ఇన్వెస్టర్ల కోసం తాజాగా ‘సారథి’ (saarthi) పేరుతో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా క్యాపిటల్‌ మార్కెట్‌ల పట్ల ఇన్వెస్టర్లకు అవగాహన పెంచేందుకు సులభరీతిలో తెరతీసింది. సారథి యాప్ ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల ప్రాథమిక అంశాలు, తదితరాలలో ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించడంతోపాటు.. విజ్ఞానాన్ని అందించనున్నట్లు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్కొన్నారు. ఇటీవల స్టాక్‌ మార్కెట్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరగడంతోపాటు, పెట్టుబడులు సైతం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యాప్‌ విడుదలకు ప్రాధాన్యత ఏర్పడింది. సెబీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సారథి మొబైల్ యాప్ విడుదల
ఎప్పుడు  : జనవరి 19
ఎవరు    : సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI)
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : క్యాపిటల్‌ మార్కెట్‌ల పట్ల ఇన్వెస్టర్లకు అవగాహన పెంచేందుకు..

UASG: యూఏ అంబాసిడర్‌గా నియమితులైన భారతీయుడు?

Vijay Shekhar Sharma

పేటీఎం వ్యవస్థాకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ అంతర్జాతీయంగా ముఖ్యమైన గ్రూపులో చోటు సంపాదించుకున్నారు. యూనివర్సల్‌ యాసెప్టెన్స్‌ స్టీరింగ్‌ గ్రూపు (యూఏఎస్‌జీ).. శర్మను యూఏ (యూనివర్సల్‌ యాసెప్టెన్స్‌) అంబాసిడర్‌గా నియమించింది. ఇంటర్నెట్‌  కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ (ఐసీఏఎన్‌ఎన్‌) మద్దతుతో ఈ గ్రూపు పనిచేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ అవకాశం లేని భాషలకు సంబంధించి స్క్రిప్ట్‌లకు ప్రమాణాలను ఈ గ్రూపు సిఫారసు చేస్తుంటుంది. ఇంగ్లీష్‌ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నామని యూఏఎస్‌జీ చైర్‌పర్సన్‌ అజయ్‌ డాటా తెలిపారు. భాషల పరంగా ఉన్న అడ్డంకిని ఛేదించాలన్నది మా ఆలోచన అని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యూఏ (యూనివర్సల్‌ యాసెప్టెన్స్‌) అంబాసిడర్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు    : పేటీఎం వ్యవస్థాకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ
ఎక్కడ    : భారత్
ఎందుకు : ఇంగ్లీష్‌ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా..

Missile Deal: బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేయనున్న దేశం?

ప్రతిష్టాత్మక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణుల ఎగుమతికి సంబంధించి తొలి ఆర్డర్‌ ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చింది. దాదాపు రూ. 2,780 కోట్ల కాంట్రాక్ట్‌ను బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్ కు ఫిలిప్పీన్స్‌ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. క్షిపణులతోపాటు మూడు బ్యాటరీలు, క్షిపణుల నిల్వ, వాటిని ఎలా ప్రయోగించాలనే అంశాలపై ఫిలిప్పీన్స్‌ సైనిక సిబ్బందికి శిక్షణ, తదితర వివరాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంలో భాగంగా యాంటీ–షిప్‌ వేరియంట్‌ క్షిపణులను సరఫరాచేస్తారు.

రెండు ఔషధాలకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్‌ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన బారిక్టినిబ్‌ ఔషధం, గ్లాక్సోస్మిత్‌క్లేన్‌ కంపెనీ మోనో క్లోనల్‌ యాంటీబాడీ థెరపీలను కోవిడ్‌ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు అంగీకరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  
బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్ తో ఒప్పందం
ఎప్పుడు  : జనవరి 14
ఎవరు    : ఫిలిప్పీన్స్‌ 
ఎందుకు : ప్రతిష్టాత్మక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణుల కొనుగోలు కోసం..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 19 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Jan 2022 05:43PM

Photo Stories