Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 19 కరెంట్‌ అఫైర్స్‌

INS Ranvir

Indian Navy: ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌక ఎక్కడ సేవలందిస్తోంది?

ముంబై నావల్‌ డాక్‌ యార్డ్‌లో నిలిచి ఉన్న ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌకలో జనవరి 18న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత నౌకాదళాధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌లోని ఇంటర్నల్‌ కంపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు.. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

విశాఖ కేంద్రంగా రణ్‌వీర్‌ సేవలు..
ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ విశాఖపట్నం కేంద్రంగా తూర్పు నౌకాదళంలో సేవలందిస్తోంది. 1986, అక్టోబర్‌లో భారత నౌకాదళంలో చేరిన రణ్‌వీర్‌ యుద్ధనౌక సోవియట్‌ యూనియన్‌లో నిర్మితమైంది. రాజ్‌పుత్‌ క్లాస్‌ డిస్ట్రాయర్‌గా విధుల్లో చేరిన ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై పలు రకాల మిసైల్స్‌ను అమర్చారు. సముద్ర జలాల్లో గస్తీ కాయడం, సముద్ర దొంగలను, ఉగ్రవాదులను అడ్డుకోవడం, నావికా దౌత్యం, జలమార్గ కమ్యూనికేషన్స్‌ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలను ఈ నౌక నిర్వహిస్తోంది. 2008లో శ్రీలంకలో జరిగిన 15వ సార్క్‌ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని భద్రత వ్యవహారాల్లోనూ, సింగపూర్, ఇండోనేషియా దేశాల ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొని ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో రణ్‌వీర్‌  ముఖ్య భూమిక పోషించింది. క్రాస్‌ కోస్ట్‌ ఆపరేషన్స్‌ కోసం ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ నేతృత్వంలో రణ్‌వీర్‌ పని చేస్తోంది. వివిధ ఆపరేషన్లలో భాగంగా 2021 నవంబర్‌లో విశాఖ నుంచి బయలుదేరింది. ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ బేస్‌ అయిన విశాఖపట్నానికి ఈ నౌక మరికొద్ది రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం సంభవించిందని నేవీ అధికారులు తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌకలో భారీ పేలుడు  
ఎప్పుడు : జనవరి 18 
ఎక్కడ    : ముంబై నావల్‌ డాక్‌ యార్డ్‌
ఎందుకు : ప్రమాదవశాత్తూ...

Senior Bureaucrat: ఎయిర్‌ ఇండియా చీఫ్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?

Air India

సీనియర్‌ స్థాయి బ్యూరోక్రాటిక్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా... సీనియర్‌ బ్యూరోక్రాట్‌ విక్రమ్‌ దేవ్‌ దత్‌ ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన విక్రమ్ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా 1991 బ్యాంచ్‌ ఐఏఎస్‌ అధికారి మనిష్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీడీఏలో ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

‘బిగ్‌బాష్‌’ మ్యాచ్‌ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా...
ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్‌ టి20 లీగ్‌ టోర్నీలో మ్యాచ్‌ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ గుర్తింపు పొందాడు. హోబర్ట్‌ హరికేన్స్‌తో జనవరి 18న జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ తరఫున ఉన్ముక్త్‌ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు. 2012లో ఉన్ముక్త్‌ కెప్టెన్సీలో టీమిండియా అండర్‌–19 ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచింది. బీసీసీఐ రూల్స్‌  ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది. దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్‌ 2021, ఆగస్టులో రిటైర్మెంట్‌ ప్రకటించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
ఎప్పుడు  : జనవరి 18
ఎవరు    : సీనియర్‌ బ్యూరోక్రాట్‌ విక్రమ్‌ దేవ్‌ దత్‌ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : సీనియర్‌ స్థాయి బ్యూరోక్రాటిక్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా..

Covid-19: ఇన్‌ఈక్వాలిటీ కిల్స్‌ పేరుతో నివేదికను విడుదల చేసిన సంస్థ?

inequality

కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్‌ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ దావోస్‌ సదస్సు-2022 తొలి రోజు జనవరి 18న ఆక్స్‌ఫామ్‌ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదికను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్‌’’ పేరుతో విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు.
  • బిలియనీర్లు జెఫ్‌ బెజోస్, ఎలన్‌ మస్క్, బిల్‌ గేట్స్‌ సహా ప్రపంచంలోని టాప్‌–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది.
  • ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు.
  • ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి.

భారత్‌లో...

  • భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది.
  • 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది.
  • దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది.
  • జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు.  
  • కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారు..
ఎప్పుడు : జనవరి 17
ఎవరు    : ఆక్స్‌ఫామ్‌ సంస్థ విడుదల చేసిన ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్‌’’ నివేదిక
ఎక్కడ    : ప్రపంచ వ్యాప్తంగా..
ఎందుకు : కరోనా సంక్షోభం కారణంగా...

Pench Tiger Reserve: విఖ్యాత పులి కాలర్‌వాలీ ఇక లేదు

Collarwali

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఉన్న పెంచ్‌ టైగర్‌ రిజర్వు (పీటీఆర్‌)కు గర్వకారణంగా నిలిచిన విఖ్యాత పులి ‘కాలర్‌వాలీ’ ఇకలేదు. తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌ 17 ఏళ్ల వయసులో జనవరి 15న కన్నుమూసింది. పులి సాధారణ జీవితకాలం 12 ఏళ్లు. కాలర్‌వాలీ దానికి మించి ఐదేళ్లు బతికి వృద్ధాప్య సమస్యలతో మరణించింది. కాలర్‌వాలీ మొత్తం ఎనిమిది కాన్పుల్లో 29 పులి పిల్లలకు జన్మనివ్వగా... ఇందులో 25 బతికాయి. అడవిలో పులుల సంఖ్య గణనకు, వాటి ప్రవర్తనను గమనించేందుకు, జాడను కనిపెట్టేందుకు రేడియో సిగ్నల్స్‌ను పంపే పట్టీలకు పులుల మెడకు కడతారు. 2008లో కట్టిన పట్టీ పనిచేయకపోవడంతో 2010 మరో పట్టీని ‘టి15’గా పిలిచే ఈ పులికి కట్టారు. దాంతో దీనికి కాలర్‌వాలీ అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్‌లో 526 పులులున్నాయి. 2018లో అత్యధిక పులులున్న రాష్ట్రంగా అవతరించిన మధ్యప్రదేశ్‌ భారతదేశపు ‘టైగర్‌ స్టేట్‌’గా గుర్తింపు పొందింది. కాలర్‌వాలీ పెంచ్‌ రిజర్వు పెద్ద ఆకర్షణగా ఉండేది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
విఖ్యాత పులి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 15
ఎవరు    : కాలర్‌వాలీ
ఎక్కడ    : పెంచ్‌ టైగర్‌ రిజర్వు (పీటీఆర్‌), సియోని జిల్లా, మధ్యప్రదేశ్‌ 
ఎందుకు  : వృద్ధాప్య సమస్యలతో..

Padma Vibhushan Awardee: పండిట్‌ బిర్జూ మహరాజ్‌ ఏ న‌‌‌ృత్యంలో ప్రసిద్ధి చెందాడు?

Birju Maharaj

ప్రఖ్యాత కథక్‌ నాట్య కళాకారుడు, పండిట్‌ బిర్జూ మహరాజ్‌ (84) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా జనవరి 18న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. భారతదేశ సంప్రదాయ నృత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఆయన ఎన్నో దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యరంగంలో  చేసిన విశేష కృషికిగాను పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. కమలహాసన్‌ నటించిన విశ్వరూపం సినిమాకు కొరియోగ్రఫీ అందించినందుకు ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.

టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
దక్షిణ ఫసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం జనవరి 15న బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. దీని వల్ల ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రఖ్యాత కథక్‌ నాట్య కళాకారుడు, పద్మవిభూషణ్‌ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 18
ఎవరు    : పండిట్‌ బిర్జూ మహరాజ్‌ (83)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా..

Badminton: ఇండియా ఓపెన్‌ పురుషుల టైటిల్‌ సొంతం చేసుకున్న ద్వయం?

ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం(భారత్) విజేతగా నిలిచింది. జనవరి 16న న్యూఢిల్లీ వేదికగా ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్‌ జంట సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి 21–16, 26–24తో ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) జోడీ ని ఓడించి, టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి ద్వయానికి ఇది రెండో సూపర్‌ –500 స్థాయి టైటిల్‌ కావడం విశేషం. 2019లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.      

పురుషుల సింగిల్స్‌లో..
పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ లో కీన్‌ యు (సింగపూర్‌)ను ఓడించి భారత యువస్టార్‌ లక్ష్య సేన్‌ విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 24–22, 21–17తో కీన్‌ యుపైగెలుపొంది కెరీర్‌లో తొలి సూపర్‌–500 టైటిల్‌ సాధించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్‌కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్ గెలుచుకున్న జోడీ?
ఎప్పుడు : జనవరి 16
ఎవరు    : సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం(భారత్)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–16, 26–24తో మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) ద్వయంపై గెలిచినందున..

SISFS: స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకానికి ఎంపికైన సంస్థ?

T-Hub

ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ‘టి హబ్‌’కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌’పథకానికి(SISFS) ఎంపికైంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ పథకం కింద అర్హత కలిగిన స్టార్టప్‌లకు రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు ఇంక్యుబేటర్‌ సీడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఐఎస్‌ఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు టి హబ్‌ ప్రకటించింది. మూడేళ్ల వ్యవధిలో 15 స్టార్టప్‌లకు ఈ పథకం ద్వారా టి హబ్‌ నిధులు అందజేస్తుంది.

ప్రపంచ వాణిజ్య సదస్సులో మోదీ..
ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్‌ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌)’ అనే అంశంపై జనవరి 17న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రసంగించారు. వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకానికి ఎంపికైన సంస్థ?
ఎప్పుడు : జనవరి 18
ఎవరు    : టి హబ్‌
ఎందుకు : స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు..

చదవండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 14 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Jan 2022 09:39PM

Photo Stories