Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 14 కరెంట్‌ అఫైర్స్‌

2022 ICC Under-19 Cricket World Cup

International Cricket Council: అండర్‌–19 వరల్డ్‌కప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

2022 ఐసీసీ అండర్‌–19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ టోర్నీ.. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్స్‌తో ముగుస్తుంది. తొలి మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. జనవరి 15న గ్రూప్‌–బిలో తమ తొలి పోరులో యశ్‌ ధుల్‌ సారథ్యంలోని భారత అండర్‌–19 జట్టు దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధమైంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడతాయి. ట్రినిడాడ్, అంటిగ్వా, సెయింట్‌ కిట్స్, గయానా నగరాల్లోని మొత్తం 9 వేదికల్లో 23 రోజుల పాటు ఈ యువ మెగా టోర్నీ జరుగనుంది.

గ్రూప్‌–బిలో భారత్‌..
గ్రూప్‌–ఎ: బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, యూఏఈ; గ్రూప్‌–బి: భారత్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండ; గ్రూప్‌–సి: జింబాబ్వే, అఫ్గానిస్తాన్, పపువా న్యూగినియా, పాకిస్తాన్‌; గ్రూప్‌–డి: స్కాట్లాండ్, శ్రీలంక, విండీస్, ఆస్ట్రేలియా.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అండర్‌–19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు    : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)
ఎక్కడ    : వెస్టిండీస్‌

Gujarat: గ్రీన్‌ ఎనర్జీపై రూ. 6 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న సంస్థ?

RIL - Gujarat

గ్రీన్‌ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల కోసం గుజరాత్‌లో వచ్చే 10–15 ఏళ్లలో రూ.5.95 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. పర్యావరణ అనుకూల ఇంధనాల వ్యాపారం కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ గిగా ఫ్యాక్టరీల ఏర్పాటుకు గుజరాత్‌ను ఎంపిక చేసుకుంది.

గుజరాత్‌ ప్రభుత్వంతో ఎంవోయూ..
వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సు 2022 సదస్సులో భాగంగా రూ.5.95 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు గుజరాత్‌ సర్కారుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. 100 గిగావాట్ల రెన్యువబుల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం గుజరాత్‌ ప్రభుత్వంతో కలసి కచ్, బనస్కాంత, ధొలెరా ప్రాంతాల్లో భూమిని గుర్తించేందుకు పనిని ప్రారంభించామని వెల్లడించింది. కచ్‌ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలను కోరుతున్నట్టు తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వచ్చే 10–15 ఏళ్లలో రూ.5.95 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న సంస్థ? 
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు     : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
ఎక్కడ    : గుజరాత్‌
ఎందుకు : గ్రీన్‌ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల కోసం..

Crypto Futures ETF: బిట్‌కాయిన్‌కు సంబంధించి ఐఎన్‌ఎక్స్‌తో జట్టు కట్టిన సంస్థ?

Bitcoin ETF

దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (గిఫ్ట్‌ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (బీఎస్‌ఈ) అంతర్జాతీయ విభాగమైన ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్సే్చంజ్‌ లిమిటెడ్‌(ఇండియా ఐఎన్‌ఎక్స్‌), టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చెయిన్‌ ఐఎఫ్‌ఎస్‌సీ చేతులు కలిపాయి. 2021–22  ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు జనవరి 13న తెలిపాయి.

ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్‌ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్‌ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్‌ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌ చెయిన్‌ ఐఎఫ్‌ఎస్‌సీ సీఈవో కృష్ణ మోహన్‌ మీనవల్లి తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్సే్చంజ్‌ లిమిటెడ్‌(ఇండియా ఐఎన్‌ఎక్స్‌)తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు    : టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చెయిన్‌ ఐఎఫ్‌ఎస్‌సీ
ఎందుకు : దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌లు అందుబాటులోకి తెచ్చెందుకు..

Steel Mills: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో జత కట్టిన దేశీ సంస్థ?

Posco - Adani

స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్‌ ప్లాంటు నెలకొల్పడంతో పాటు #నరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్‌ వంటి పలు రంగాలలో 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37,500 కోట్లు) పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ఈ ప్రాథమిక ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం పునరుత్పాదక విద్యుత్, హైడ్రోజన్, రవాణా వంటి వివిధ పరిశ్రమల్లోనూ ఇరు సంస్థల భాగస్వామ్యానికి అవకాశం ఉంది. ఏ సంస్థ ఎంత పెట్టుబడులు పెడుతోంది, భాగస్వామ్య వివరాలను వెల్లడించలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్న దేశీ దిగ్గజం?
ఎప్పుడు : జనవరి 14
ఎవరు    : అదానీ గ్రూప్‌
ఎందుకు : భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా..

Free Trade Agreement: ఏ రెండు దేశాల మధ్య ఎఫ్‌టీఏ చర్చలు ప్రారంభమయ్యాయి?

Indai-UK FTA

ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, బ్రిటన్‌ మధ్య చర్చలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 13న న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్‌ గోయల్, బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీ–మేరీ ట్రెవిల్యాన్‌ వీటిని ప్రారంభించారు. తొలి విడత చర్చలు పూర్తి స్థాయిలో 2022, జనవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రతి అయిదు వారాలకోసారి ఇరు దేశాల బృందాలు సమావేశమవుతాయి. 2022 డిసెంబర్‌ నాటికి చర్చలను ముగించాల్సి ఉంటుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు తోడ్పడటం ఈ ఒప్పంద లక్ష్యం.

8.15 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు..
2020–21లో భారత్‌ నుంచి బ్రిటన్‌కు ఎగుమతులు 8.15 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 4.95 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. రెడీమేడ్‌ గార్మెంట్స్, టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రవాణా పరికరాలు, సుగంధ ద్రవ్యాలు, ఫార్మా మొదలైనవి భారత్‌ ఎగుమతి చేస్తోంది. బ్రిటన్‌ నుంచి రసాయనాలు, భారీ యంత్రాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు మొదలైనవి దిగుమతి చేసుకుంటోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, బ్రిటన్‌ మధ్య చర్చలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు    : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్‌ గోయల్, బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీ–మేరీ ట్రెవిల్యాన్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ 
ఎందుకు : 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు..

Devas vs Antrix: ఏ నగరంలోని భారత ప్రభుత్వ అపార్ట్‌మెంట్‌ను జప్తు చేశారు?

India Govt Apartment in Paris

దేవాస్‌ షేర్‌హోల్డర్లు దాఖలు చేసిన ఒక దావాలో ఫ్రాన్స్‌ కోర్టు ఒకటి కీలక రూలింగ్‌ ఇచ్చింది. ఫ్రాన్స్‌ రాజధాని నగరం పారిస్‌లోని భారత్‌ ప్రభుత్వ అపార్ట్‌మెంట్‌ను జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన దేవాస్‌– ఇస్రో వాణిజ్య విభాగం ఆంట్రిక్స్‌ కార్పొరేష‌న్ ఉపగ్రహ ఒప్పంద వివాదానికి సంబంధించి 1.3 బిలియన్‌ అమెరికా డాలర్ల ఆర్బ్రిట్రేషన్‌ అవార్డును అమలు చేయాలని కోరుతూ ఈ దావా దాఖలైంది. ఈ భవనం గతంలో ఇండియన్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ నివాసంగా ఉంది. అపార్ట్‌మెంట్‌ విలువ దాదాపు 3.8 మిలియన్‌ యూరోలు ఉంటుందని అంచనా.

కెయిర్న్‌ కేసులోనూ..
క్టివ్‌ పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్ర్‌బిట్రేషన్‌ ఇచ్చిన అవార్టుకు అనుగుణంగా భారత్‌ ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను రాబట్టుకోడానికి బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ 2021, జూలైలో ఇదే ఆస్తిపై జప్తు ఆదేశాలు తెచ్చుకుంది. అయితే అటు తర్వాత దాదాపు నెల రోజులకు భారత్‌ ప్రభుత్వం రెట్రాస్పెక్టివ్‌ పన్ను ఉపసంహరణ ప్రకటన, తదుగుణమైన చర్యల్లో భాగంగా ఈ కేసును కెయిర్న్‌ ఎనర్జీ ఉపసంహరించుకుంది. తరువాత దేవాన్‌ షేర్‌హోల్డర్స్‌ 2021 సెప్టెంబర్‌లో ఫ్రెంచ్‌ కోర్టును ఆశ్రయించారు.

వివాదమిది..
ఎస్‌–బ్యాండ్‌ శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ని ఉపయోగించి మొబైల్‌ వినియోగదారులకు మల్టీమీడియా సేవలను అందించడానికి ఆంట్రిక్స్‌తో 2005లో దేవాస్‌ మల్టీమీడియా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2011లో ఈ ఒప్పందం రద్దయ్యింది. బ్రాడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ వేలంలో మోసం జరిగిందన్న ఆరోపణలు,  జాతీయ భద్రత–ఇతర సామాజిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి ఎస్‌–బ్యాండ్‌ శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ అవసరమన్న వాదన తత్సబంధ అంశాలు దీనికి నేపథ్యం. ఈ విషయంలో ఆర్ర్‌బిటేషన్‌ ట్రిబ్యునల్‌ దేవాస్‌ షేర్‌హోల్డర్లకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. దేవాస్‌ షేర్‌హోల్డర్లలో అమెరికా పెట్టుబడి గ్రూపులు కొలంబియా క్యాపిటల్, టెలికం వెంచర్స్, డ్యుయిష్‌ టెలికంలు ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఫ్రాన్స్‌ రాజధాని నగరం పారిస్‌లోని భారత్‌ ప్రభుత్వ అపార్ట్‌మెంట్‌ను జప్తు చేయాలని ఉత్తర్వులు
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు    : ఫ్రెంచ్‌ కోర్టు
ఎందుకు : రద్దయిన దేవాస్‌– ఇస్రో వాణిజ్య విభాగం ఆంట్రిక్స్‌ ఉపగ్రహ ఒప్పంద వివాదానికి సంబంధించి..

 India State of Forest Report 2021: అటవీ విస్తీర్ణం పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

Forest

దేశంలో గత రెండేళ్ళలో అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక–2021ని కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ జనవరి 13న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం... అటవీ విస్తీర్ణంలో పెరుగుదలను చూపుతున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ) తర్వాత స్థానంలో తెలంగాణ (632 చ.కి.మీ) ఉంది. ఒడిశా (537 చ.కి.మీ) మూడో స్థానంలో నిలిచింది.

తెలంగాణలో 24.05 శాతం..
తెలంగాణలో 2014 నుంచి 2019 వరకు పచ్చదనం (ట్రీ కవర్‌) 361 చదరపు కిలోమీటర్ల మేర పెరిగినట్టుగా ఈ నివేదిక  స్పష్టం చేస్తోంది. 2014తో పోల్చితే 2019 నాటికి ట్రీకవర్‌ 14.51 శాతం వృద్ధి చెందింది. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం 1,12,077 చ.కి.మీల పరిధిలో విస్తరించి ఉండగా అందులో 26,969 చ.కి.మీలలో (24.05 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 730.06 చ.కి. మీ. పరిధిలో దట్టమైన అడవులున్నాయి. ఖమ్మం జిల్లా భౌగోళిక పరిధి 13,266 చ.కి.మీగా ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు    : దేశంలో అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక–2021
ఎక్కడ : దేశంలో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 13 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Jan 2022 09:21PM

Photo Stories