Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 13 కరెంట్‌ అఫైర్స్‌

Justice Indu Malhotra

Supreme Court: భద్రతా వైఫల్యంపై ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై పూర్తి దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఈ కమిటీని నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జనవరి 12న ఉత్తర్వులిచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్‌ జనరల్, చండీగఢ్‌ డీజీపీ, పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, పంజాబ్‌ అదనపు డీజీపీ(సెక్యూరిటీ) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

తొలి మహిళ..
సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఆ పదవిలో 2018 ఏప్రిల్‌ 27 నుంచి 2021 మార్చి 13 వరకు కొనసాగారు. అంతకుముందు 2007లో సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపుపొందారు. సీనియర్‌ న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి  మహిళగా ఆమె పేరొందారు. పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యురాలిగా ఉన్న ఆమె కీలకమైన తీర్పుల్లో భాగస్వామి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల స్వతంత్ర కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : సుప్రీంకోర్టు 
ఎందుకు : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై పూర్తి దర్యాప్తునకు..

Indian Space Research Organisation: ఇస్రో నూతన చైర్మన్‌గా నియమితులైన శాస్త్రవేత్త?

ISRO Chairman Somanath

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.సోమనాథ్‌ నియమితులయ్యారు. స్పేస్‌ సెక్రటరీగా, స్పేష్‌ కమిషన్‌ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించనున్నారు. ఈ మేరకు జనవరి 12న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీనీయర్‌ శాస్త్రవేత్త అయిన సోమనాథ్‌.. 2022, జనవరి 14న పదవీ బాధ్యతలు చేపట్టి, మూడేళ్ళపాటు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.శివన్‌ పదవీకాలం జనవరి 14న ముగియనుండడంతో నూతన చైర్మన్‌గా సోమనాథ్‌ను నియమించారు. కేరళలోని ఎర్నాకుళంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఎస్‌.సోమనాథ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేశారు. 1985లో ఇస్రోలో చేరారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : తివనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.సోమనాథ్‌
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.శివన్‌ పదవీకాలం  2022, జనవరి 14న ముగియనుండటంతో..

Ministry of Railways: మినీ రత్న హోదా పొందిన ఇంజనీరింగ్‌ కంపెనీ?

Braithwaite & Co

రైల్వే శాఖ పరిధిలోని ఇంజనీరింగ్‌ కంపెనీ ‘‘బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో’’కు మినీరత్న–1 హోదా లభించింది. సంస్థ మరింత వృద్ధికి మినీరత్న హోదా సాయపడుతుందని అధికారులు తెలిపారు. తాము మినీరత్న–2 వస్తుందనుకున్నామని, 1వ హోదా ఇవ్వడం సంతోషంగా ఉందని బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో చైర్మన్, ఎండీ యతీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో ఈ సంస్థ తన పనితీరును ఎంతో మెరుగుపరుచుకుంది. టర్నోవర్‌ ఎన్నో రెట్లు పెరగ్గా, లాభాలను మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి నమోదు చేస్తోంది. 2020–21లో ఈ సంస్థ రూ.609 కోట్ల ఆదాయంపై రూ.25 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కనీసం రూ.500 కోట్లకు పైగా ఆదాయం, లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు మినీరత్న–1 హోదా లభిస్తుంది. బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో సంస్థ ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మినీ రత్న హోదా పొందిన ఇంజనీరింగ్‌ కంపెనీ?
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    :
రైల్వే శాఖ పరిధిలోని ‘‘బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో’’ సంస్థ
ఎక్కడ    : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ 
ఎందుకు : 2020–21లో బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో సంస్థ రూ.609 కోట్ల ఆదాయంపై రూ.25 కోట్ల లాభాన్ని నమోదు చేసినందున..

Global Economy: ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం.. 2022లో ప్రపంచ వృద్ధి రేటు?

భారత్‌ ఆర్థిక రికవరీ ఇంకా విస్తృత స్థాయిలో లేదని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంటుందన్న తమ గత అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్‌పై జనవరి 12న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • భారత్‌ వృద్ధి రేటు 2022–23 ఏడాదిలో 8.7 శాతంగా, 2023–24లో 6.8 శాతంగా నమోదుకావచ్చు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణం.
  • దక్షిణాసియాలో కరోనా సవాళ్లకు తోడు వినియోగ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్‌ బ్యాంకుల లక్ష్యాలకన్నా ఇది తీవ్రంగా పెరుగుతోంది.
  • ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2021లో 5.5 శాతంగా ఉంటే.. ఇది 2022లో 4.1 శాతానికి, 2023లో 3.2 శాతానికి తగ్గే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా సరళతర ఆర్థిక విధానాలు వెనక్కు తీసుకోవడం, డిమాండ్‌ వ్యత్యాసాలు దీనికి ప్రధాన కారణం.

యూబీఎస్‌ అంచనాలు 9.1 శాతానికి కోత
భారత్‌ 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను స్విస్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం– యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో అంచనాలు 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 8.3 శాతంగా నమోదు కావచ్చు.
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : ప్రపంచ బ్యాంక్‌
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ 
ఎందుకు : తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, పీఎల్‌ఐ పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాల కారణంగా..

Gaganyaan Mission: ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ ఎక్కడ ఉంది?

IPRC - Tamil Nadu

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్‌–1కు సంబంధించి క్రయోజనిక్‌ ఇంజన్‌ దశను తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ)లో జనవరి 12న విజయవంతంగా పరీక్షించారు. సుమారు 12 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని నింపి 720 సెకండ్లపాటు మండించి ఇంజన్‌ పనితీరును పరీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతమైంది. గగన్‌యాన్‌–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్‌ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గగన్‌యాన్‌–1కు సంబంధించి క్రయోజనిక్‌ ఇంజన్‌ దశ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ    : ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ), మహేంద్రగిరి, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు
ఎందుకు : గగన్‌యాన్‌–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా..

Mercom India Research: సోలార్‌ విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం?

Solar Power

సౌర విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యంలో దేశంలోనే మూడో అతి పెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు పొందింది. మెర్కామ్‌ ఇండియా రీసెర్చ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. నివేదికలోని వివరాల ప్రకారం... 2021, డిసెంబర్‌ నాటికి 8.9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో యుటిలిటీ స్కేల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌లలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక 7.5 గిగావాట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 4.3 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో ఏపీ మూడో స్థానంలో ఉంది. 4 గిగావాట్ల సామర్థ్యంతో తమిళనాడు 4వ స్థానంలో, 3.9 గిగావాట్లతో గుజరాత్‌ అయిదో స్థానంలో ఉన్నాయి.

ఇటీవల ఐటీసీ వెల్కమ్‌ హోటల్‌ను ఎక్కడ ప్రారంభించారు?
గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలోని విద్యానగర్‌లో నూతనంగా నిర్మించిన ఐటీసీ వెల్కమ్‌ హోటల్‌ ప్రారంభమైంది. జనవరి 12న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ హోటల్‌ను ప్రారంభించి, ప్రసగించారు. పర్యాటక, వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా వివరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సౌర విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యంలో మూడో అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు 
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ    : దేశంలో...
ఎందుకు : సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యచ్చి, సోలార్‌ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించినందున..

Telangana: రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌గా నియమితులైన నేత?

Telangana Legislative Council

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పక్షాన అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు జనవరి 12న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 11 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.  రాజ్యాంగంలోని నిబంధన 184 (1) ప్రకారం జరిగిన ఈ నియామకం.. 182వ నిబంధన మేరకు మండలికి కొత్త చైర్మన్‌ ఎన్నికయ్యే వరకు అమల్లో ఉంటుంది. ప్రొటెమ్‌ చైర్మన్‌గా జాఫ్రి జనవరి 13న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రొటెమ్‌ చైర్మన్‌ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవడంతో..
2020, జూన్‌ 4న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఎమ్మెల్సీలుగా పదవీ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెదక్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డిని ప్రొటెమ్‌ చైర్మన్‌గా నియమించారు. ఆయనే ప్రొటెమ్‌ చైర్మన్‌ హోదాలో మండలిని నడిపించారు. 7 నెలల పాటు పదవిలో కొనసాగారు. ఆయన కూడా 2021, జనవరి 4న ఎమ్మెల్సీగా పదవీ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రొటెమ్‌ చైర్మన్‌గా హసన్‌ జాఫ్రీ నియమితులయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌గా నియామకం 
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : ఎంఐఎం పార్టీకి చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ
ఎందుకు : ఇప్పటివరకు ప్రొటెమ్‌ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డి.. జనవరి 4న ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకోవడంతో..

Military Talks: భారత్, చైనా 14వ కమాండర్‌ స్థాయి చర్చలు ఎక్కడ జరిగాయి?

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీగా మోహరించిన ఇరు దేశాల బలగాల ఉపసంహరణపై భారత్, చైనా కమాండర్‌ స్థాయి అధికారుల 14వ రౌండ్‌ చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంట చైనా వైపు ఉన్న చుషుల్‌–మోల్డో సమావేశ ప్రాంతంలో జనవరి 12న ఈ చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి (పెట్రోలింగ్‌ పాయింట్‌ 15) సాధ్యమైనంత త్వరగా చైనా బలగాలు వెనక్కి మళ్లాలని ఈ సందర్భంగా భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసింది.

రవి దహియా చేతుల మీదుగా క్వీన్స్‌ బ్యాటన్‌ రిలే
టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌–2022కు ముందు జరిగే క్వీన్స్‌ బ్యాటన్‌ రిలేను జనవరి 12న భారత్‌లో రవి ప్రారంభించాడు. 2022, జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్‌ క్రీడలు జరుగనున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్, చైనా 14వ కమాండర్‌ స్థాయి చర్చలు ఎక్కడ జరిగాయి?
ఎప్పుడు : జనవరి 12
ఎవరు    : భారత్, చైనా సైన్యధికారులు
ఎక్కడ    : వాస్తవాధీన రేఖ వెంట చైనా వైపు ఉన్న చుషుల్‌–మోల్డో సమావేశ ప్రాంతం
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీగా మోహరించిన ఇరు దేశాల బలగాల ఉపసంహరణపై చర్చించేందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 12 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Jan 2022 05:45PM

Photo Stories