Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 12 కరెంట్‌ అఫైర్స్‌

sea-to-sea variant of BrahMos Missile

DRDO: బ్రహ్మోస్‌ నేవీ క్షిపణి పరీక్షను ఏ నౌక నుంచి నిర్వహించారు?

సముద్రతలం నుంచి ప్రయోగించి సముద్రం మీది లక్ష్యాలను(సీ టూ సీ) ఛేదించే బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పరీక్షను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక నుంచి నేవీ వేరియంట్‌ అడ్వాన్స్‌ బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) జనవరి 11న వెల్లడించింది. క్షిపణి కచ్చితత్వంతో దూసుకెళ్లి లక్షిత ఓడను ఢీకొట్టి, ధ్వంసం చేయడంతో ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. పీజే –10 ప్రాజెక్ట్‌ కింద రూపొందించిన ఈ క్షిపణిలో ఉపయోగించిన బూస్టర్, ఎయిర్‌ ఫ్రేమ్‌ను ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగా తయారు చేశారు. 

బ్రహ్మోస్‌ క్షిపణిని రష్యా, భారత్‌ సంయుక్త ప్రాజెక్టుగా సిద్ధం చేయడం విదితమే. శత్రు రాడార్‌ నుండి తప్పించుకుంటూ లక్ష్యాన్ని ఛేదించగల సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ బ్రహ్మోస్‌ 21వ శతాబ్దపు అత్యంత అధునాతన క్షిపణులలో ఒకటిగా పేరొందింది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. గతంలో 290 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగా తాజాగా దాని పరిధిని 350–400 కి.మీ.లకు పెంచారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సముద్రతలం నుంచి ప్రయోగించి సముద్రం మీది లక్ష్యాలను(సీ టూ సీ) ఛేదించే బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు   : జనవరి 11
ఎవరు    : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ    : ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక నుంచి..
ఎందుకు : భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు..

World Trade Organization: డబ్ల్యూటీవో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

WTO Office

కోవిడ్‌–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడం, పేటెంట్‌ మినహాయింపు ప్రతిపాదన వంటి అంశాలపై చర్చించడానికి వర్చువల్‌గా మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహించాలన్న భారత్‌ విజ్ఞప్తిని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీఓ) జనరల్‌ కౌన్సిల్‌ చర్చించింది. ఈ మేరకు 2021 డిసెంబర్‌ 23వ తేదీన జనరల్‌ కౌన్సిల్‌ చీఫ్‌కు భారత్‌ ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయా ప్రతిపాదనలపై 2022, జనవరి 10వ తేదీన జనరల్‌ కౌన్సిల్‌ చైర్‌ అంబాసిడర్‌ డేసియో క్యాస్టిలో (హోండూరాస్‌) ఒక సమావేశంలో చర్చించినట్లు డబ్ల్యూటీఓ ఒక ప్రకటనలో పేర్కొంది.

జెనీవాలో..
1995, జనవరి 1న ఏర్పాటైన డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో ఉంది. 164 దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్‌ దీని అధికార భాషలుగా ఉన్నాయి. ఎగుమతుల–దిగుమతుల విధానాలు, వాణిజ్య సంబంధ అంశాలపై రెండు దేశాల మధ్య ఏర్పడే వివాదాలపై డబ్ల్యూటీఓ దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ డైరెక్టర్‌ జనరల్‌గా నైజీరియన్‌–అమెరికన్‌ ఆర్థికవేత్త నాగోజి ఒకోంజో–ఇవెలా ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహించాలన్న భారత్‌ విజ్ఞప్తిపై చర్చ
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీఓ) జనరల్‌ కౌన్సిల్‌
ఎక్కడ    : జెనీవా, స్విట్జర్‌ల్యాండ్‌
ఎందుకు  : కోవిడ్‌–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడం, పేటెంట్‌ మినహాయింపు ప్రతిపాదన వంటి అంశాలపై చర్చించడానికి భారత్‌ విజ్ఞప్తి చేసింది

Cricket: ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనున్న సంస్థ?

IPL - TATA

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా భారత్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ ‘టాటా గ్రూప్‌’ వ్యవహరించనుంది. ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్‌ కంపెనీ ‘వివో’ తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో వివో స్థానంలో టాటా గ్రూప్‌ లీగ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జనవరి 11న ఐపీఎల్‌ లీగ్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ నిర్ధారించారు. ఐపీఎల్‌ రెండు సీజన్లకు (2022, 2023) ఇది వర్తిస్తుంది.

2018–2022 వరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.2,200 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో వివో ఒప్పందం చేసుకుంది. అయితే 2020లో గాల్వాన్‌ లోయలో ఘర్షణలు జరిగి భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఆ ఏడాది లీగ్‌ నుంచి వివో తప్పుకోగా, తాత్కాలిక ప్రాతిపదికన ‘డ్రీమ్‌ 11’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే 2021లో మళ్లీ వివోనే కొనసాగింది. వివో ఒప్పందాన్ని 2023 వరకు బీసీసీఐ పొడిగించింది. తాజాగా వివో తమంతట తామే వైదొలగడంతో టాటా సంస్థ వచ్చే రెండేళ్ల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. టాటా గ్రూప్‌ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనున్న సంస్థ?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : భారత్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ టాటా గ్రూప్‌ 
ఎందుకు : ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్‌ కంపెనీ ‘వివో’ తప్పుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో..

New Zealand: టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఆటగాడు?

Ross Taylor

న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ 1–1తో సమంగా ముగిసింది. జనవరి 10న న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ముగిసిన రెండో టెస్టులో కివీస్‌ జట్టు ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే.

టేలర్‌ వీడ్కోలు..
న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం రాస్‌ టేలర్‌ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టేలర్‌ 112 టెస్టుల్లో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత టేలర్‌దే.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్‌?
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దేశవాళీ జట్టు టైటాన్స్‌కు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మోరిస్‌ జనవరి 11న అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మోరిస్‌ 4 టెస్టుల్లో 12 వికెట్లు, 173 పరుగులు.. 42 వన్డేల్లో 48 వికెట్లు, 467 పరుగులు.. 23 టీ20 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 133 పరుగులు రాబట్టాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : రాస్‌ టేలర్‌
ఎందుకు : వ్యక్తిగత కారణాల రీత్యా..

Largest Shareholder: ఏ టెలికం కంపెనీలో ప్రభుత్వానికి వాటా లభించనుంది?

VI

రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్‌ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్‌) ఖాయం చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది.

తాజా ఈక్విటీ జారీతో వొడాఫోన్‌ ఐడియాలో  ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు కంపెనీ అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్‌ గ్రూప్‌ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్‌ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది.

టాటా టెలీలోనూ వాటా..
ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్‌ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్‌ ఐడియా బాటలో ఏజీఆర్‌ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏ టెలికం కంపెనీలో ప్రభుత్వానికి వాటా లభించనుంది?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : వొడాఫోన్‌ ఐడియా సంస్థ
ఎందుకు : రుణ భారంతో సతమతమవుతున్నందున..

MPATGM: మ్యాన్‌ పోర్టబుల్‌ మిసైల్‌ను పరీక్షించిన దేశం?

MPATGM

మనిషి మోసుకెళ్లగల ట్యాంక్‌ విధ్వంసక క్షిపణిని భారత్‌ జనవరి 11న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ‘మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌’ (ఎంపీఏటీజీఎం) బరువు చాలా తక్కువని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. 2.5 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకులను ఇది ఛేదించగలదని పేర్కొంది. గత ప్రయోగాల్లో అది గరిష్ఠ పరిధి సామర్థ్యాన్ని రుజువు చేసుకోగా.. తాజా పరీక్షలో కనిష్ఠ పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తాను పరిశీలించారు. ఈ అస్త్రంలోని చిన్నపాటి ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ సీకర్, అధునాతన ఏవియానిక్స్‌ వంటివి లక్ష్యం దిశగా మార్గనిర్దేశం చేస్తాయి.

ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్‌ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో జనవరి 10న ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ వన్‌ ఇన్‌ చౌల్‌  వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు.

EP: యూరోపియన్‌ పార్లమెంట్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

David Sassoli - EP

యూరోపియన్‌ పార్లమెంట్‌(ఈపీ) అధ్యక్షుడు డేవిడ్‌ మరియా సస్సోలీ(65) కన్నుమూశారు. ఇటలీలోని ఏవియానో పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న తుదిశ్వాస విడిచారు. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన సస్సోలీ... 2021, డిసెంబరు 26న ఆసుపత్రిలో చేరారు. రెండు వారాలకుపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటలీకి చెందిన సస్సోలీ  2009లో తొలిసారి యూరోపియన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మరోమారు 2014లో గెలుపొందారు. 2019, జూలై 3వ తేదీ నుంచి యూరోపియన్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడిగా సేవలందించారు.

1952, సెప్టెంబర్‌ 10న ఏర్పాటైన యురోపియన్‌ పార్లమెంట్‌ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బోర్గ్‌లో ఉంది. 450 మిలియన్ల మంది ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులోని సభ్య దేశాలు 700 మంది సభ్యులను ఎన్నుకుంటాయి.

పద్మశ్రీ టి.వి. నారాయణ కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సామాజికవేత్త, కవి, రచయిత పద్మశ్రీ డాక్టర్‌ టి.వి.నారాయణ (97) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో జనవరి 11న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ నుంచి సాహితీవేత్తగా ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. బడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన ఆయన ఎందరో రాజకీయనాయకులు, విద్యావేత్తలకు ఆయన గురువు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యూరోపియన్‌ పార్లమెంట్‌(ఈపీ) అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : డేవిడ్‌ మరియా సస్సోలీ(65)
ఎక్కడ    : ఏవియానో, ఇటలీ
ఎందుకు : రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో..

Operation: ఏ దేశ వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చారు?

PIG Heart

అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రం, బాల్టిమోర్‌ నగరానికి చెందిన 57 ఏళ్ల ఆసామి డేవిడ్‌ బెన్నెట్‌ అనే వ్యక్తికి వైద్యులు.. పంది గుండెను అమర్చారు. గుండె జబ్బుతో కచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి వచ్చిన ఆయనకు.. ఏ మనిషి గుండె కూడా సరిపడని పరిస్థితి తలెత్తడంతో పంది గుండెను అమర్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు ఈ ఘనత సాధించారు. బెన్నెట్‌కు 2022, జనవరి 7న గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు పంది గుండెను అమర్చారు. ఇలాంటి ఆపరేషన్లలో ఇప్పటికి విజయవంతమైన వాటిల్లో ఇదే మొదటిది. ఆపరేషన్‌ కోసం జన్యుమార్పులు చేసి కృత్రిమంగా పెంచిన పందిని వినియోగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏ దేశ వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చారు?
ఎప్పుడు  : జనవరి 7
ఎవరు    : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు
ఎక్కడ    : బాల్టిమోర్, మేరీల్యాండ్, అమెరికా
ఎందుకు : గుండె జబ్బుతో కచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి వచ్చిన డేవిడ్‌ బెన్నెట్‌కు.. ఏ మనిషి గుండె కూడా సరిపడని పరిస్థితి తలెత్తడంతో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 11 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Jan 2022 06:00PM

Photo Stories