Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 11 కరెంట్‌ అఫైర్స్‌

Supreme Court

Supreme Court: భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు కొత్త కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్‌ రాష్ట్ర సర్కార్‌లు గతంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తులను నిలిపివేస్తూ కొత్త కమిటీని సుప్రీంకోర్టు కొలువు తీర్చనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత కేసు విచారణ సందర్భంగా జనవరి 10న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కమిటీలో సభ్యులుగా..
చండీగఢ్‌ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్‌ జనరల్, పంజాబ్‌– హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఈ దర్యాప్తు కమిటీలో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం పునరావృతం కాకుండా పటిష్ట రక్షణకు సూచనలు ఇచ్చేలా, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలంటూ లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా జనవరి 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : సుప్రీంకోర్టు 
ఎందుకు : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు..

Myanmar: జైలు శిక్ష విధింపబడిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత?

Aung San Suu Kyi

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్‌ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు జనవరి 10న తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్‌ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాధికారులు తెలిపారు. 2021, డిసెంబర్‌లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించిన విషయం విదితమే.

100 ఏళ్లకు పైగానే..
సూకీ సారథ్యంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఐదేళ్ల కాలానికి రెండో విడత గెలవగానే 2021, ఫిబ్రవరిలో సైనిక నేతలు తిరుగుబాటు చేశారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని సూకీతోపాటు పలువురు కీలక నేతలపై ఆరోపణలు చేస్తూ వారిని పదవుల నుంచి తొలగించి, నిర్బంధంలో ఉంచారు. అనంతరం సూకీతోపాటు ఇతరులపై న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభించారు. సూకీ ఎదుర్కొంటున్న మరికొన్ని ఆరోపణలకు సంబంధించి త్వరలో కోర్టు తీర్పు వెలువడనుంది. ఇవికాకుండా, మిగతా ఆరోపణలు కూడా రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
జైలు శిక్ష విధింపబడిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు    : మయన్మార్‌ పదవీచ్యుత నేత అంగ్‌సాన్‌ సూకీ(76)
ఎక్కడ    : మయన్మార్‌
ఎందుకు : చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్‌ ఆంక్షలను ధిక్కరించినందున..

Badminton: ఇండియా ఓపెన్‌–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?

PV Sindhu

రెండేళ్లుగా కోవిడ్‌ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌–500’ టోర్నమెంట్‌ 2022 ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జనవరి 11న ప్రారంభమయ్యే ఈ మేటి ఈవెంట్‌ జనవరి 16న ముగియనుంది. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ క్రియాశీలం కావడంతో థర్ట్‌ వేవ్‌ (కోవిడ్‌ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహించనున్నారు.

టోర్నీలో పాల్గొననున్న ప్రముఖ ఆటగాళ్లు..

  • 2017 ఇండియా ఓపెన్‌ విజేత పీవీ సింధు 
  • 2015 ఇండియా ఓపెన్‌ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌
  • ప్రపంచ పురుషుల చాంపియన్‌ లో కియన్‌ వీ (సింగపూర్‌)
  • మలేసియా టాప్‌స్టార్స్‌ ఒంగ్‌ వి సిన్, టియో యి యి
  • ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్‌ అసాన్, హెండ్రా సెతివాన్‌

మయాంక్‌ అగర్వాల్‌ ఏ క్రీడకి చెందినవాడు?
ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ (2021, డిసెంబర్‌)గా న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. భారత్‌తో జరిగిన ముంబై టెస్టులో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచిన ఎజాజ్‌... 2021, డిసెంబర్‌ నెలలో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. ఈ అవార్డు కోసం ఎజాజ్‌తో పాటు ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్, భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పోటీ పడ్డారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
2022 ఏడాది ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : న్యూఢిల్లీ
ఎక్కడ    : ఇందిరాగాంధీ స్టేడియం, న్యూఢిల్లీ

Swedish Audio Brand: సోలార్‌ విద్యుత్‌ ఆధారిత హెడ్‌ఫోన్స్‌ను రూపొందించిన తొలి సంస్థ?

Urbanista Los Angeles

ఆడియో ఉత్పత్తుల తయారీలో ఉన్న స్వీడన్‌ బ్రాండ్‌ అర్బనిస్టా జనవరి 10న భారత్‌లో అడుగుపెట్టింది. ప్రపంచంలో తొలి సోలార్‌ విద్యుత్‌ ఆధారిత హెడ్‌ఫోన్స్‌ ‘‘అర్బనిస్టా లాస్‌ ఏంజిల్స్‌’’తోపాటు ప్రపంచంలో అతి చిన్న ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌బడ్స్‌ ‘‘అర్బనిస్టా లిస్బన్‌’’ను ఇక్కడ పరిచయం చేసింది. భారత హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్‌ మార్కెట్‌లో 2022 ఏడాది చివరినాటికి  5 శాతం వాటాను దక్కించుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. దేశంలో హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్‌ విపణి రూ.81,400 కోట్లు ఉంది.

మాండరిన్‌ ఓరియంటల్‌ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రీమియం లగ్జరీ హోటల్‌ మాండరిన్‌ ఓరియంటల్‌లో 73.37 శాతం వాటాలను దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) కొనుగోలు చేసింది. 98.15 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 735 కోట్లు) విలువైన ఈ డీల్‌ 2022, మార్చి ఆఖరుకు పూర్తి కావచ్చని రిలయన్స్‌ పేర్కొంది.

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఎవరు ఉన్నారు?
ఫిన్‌ టెక్‌ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్‌ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్‌ కేస్రి ఈ విషయం తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
ప్రపంచంలో తొలి సోలార్‌ విద్యుత్‌ ఆధారిత హెడ్‌ఫోన్స్‌ ‘‘అర్బనిస్టా లాస్‌ ఏంజిల్స్‌’’ను భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్థ?
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : స్వీడన్‌కి చెందిన అర్బనిస్టా 
ఎందుకు : భారత మార్కెట్‌లో వాటా దక్కించుకోవడం కోసం..

PSA Plants: ఇటీవల 144 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన రాష్ట్రం?

PSA Plants - AP

రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం(లీటర్‌ పర్‌ మినిట్‌) సామర్ధ్యం కలిగిన 144 ఆక్సిజన్‌ ఉత్పత్తి (పీఎస్‌ఏ) ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. పీఎస్‌ఏ ప్లాంట్లతో పాటు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్‌ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 10న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

247 పీఎస్‌ఏ ప్లాంట్లు..
పీఎస్‌ఏ ప్లాంట్ల ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ నేర్పిన పాఠాలతో ఆక్సిజన్‌ కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. ‘‘144 పీఎస్‌ఏ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పి ప్రజలకు ఇవాళ అందుబాటులోకి తెస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 పీఎస్‌ఏ ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. మరో 71 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ పీఎస్‌ఏ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వమే 30 శాతం సబ్సిడీని భరిస్తూ చేయూత అందిస్తోంది. తద్వారా 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటవుతాయి’’ అని సీఎం పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
93,600 ఎల్‌పీఎం(లీటర్‌ పర్‌ మినిట్‌) సామర్ధ్యం కలిగిన 144 ఆక్సిజన్‌ ఉత్పత్తి (పీఎస్‌ఏ) ప్లాంట్లు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా...
ఎందుకు : ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు..

APIIC: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు?

Industrial Park

ఆటోమొబైల్, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఐఐసీ) నిర్ణయించింది. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ అభివృద్ధి చేసే ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు తాజాగా పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   : పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఐఐసీ)
ఎక్కడ    : కోశలనగరం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆటోమొబైల్, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా..

Andhra Pradesh: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల ప్రధాన ఉద్దేశం?

Jagananna Smart Township

నగర, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి వారి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు (ఎంఐజీ) ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. వీటి కొనుగోలుకు రూపొందించిన వెబ్‌సైట్‌ https://migapdtcp.ap.gov.in/ ను జనవరి 11న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.

పట్టణ నగర పాలక సంస్థల పరిధిలో ఉండే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ప్లాట్లను రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తారు. మార్కెట్‌ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌(ఎంఐజీ)లలో ప్లాట్ల కొనుగోలుకు నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం 
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : నగర, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి వారి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో..

Beijing: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌?

Urjit Patel 650x400

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఏఐఐబీలోని ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఉర్జిత్‌ పటేల్‌ ఒకరు కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డీజే పాండ్యన్‌ స్థానంలో ఉర్జిత్‌ పటేల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. బీజింగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐఐబీ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం చైనా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జిన్‌ లిక్వన్‌ ఉన్నారు.

ఉర్జిత్‌ పటేల్‌.. 2016, సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి 2018, డిసెంబర్‌ 10వ తేదీ వరకు ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా పనిచేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పదవీకాలం ముగియకముందే తన పదవికి  రాజీనామా చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌
ఎక్కడ    : బీజింగ్, చైనా
ఎందుకు : ప్రస్తుతం ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డీజే పాండ్యన్‌ పదవీ కాలం ముగియడంతో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 10 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Jan 2022 06:03PM

Photo Stories