Daily Current Affairs in Telugu: 2022, జనవరి 10 కరెంట్ అఫైర్స్
Kolkata: మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారు?
మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్‌జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ జనవరి 8న పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు.
ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. భారత్‌లోని ఏదైనా ఎన్‌జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి కల్పించేందుకు..
Punjab: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన అధికారి?
పంజాబ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 8న ఉత్తర్వులు వెలువడ్డాయి. సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో భవ్రా బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టాక కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. కొంతకాలంగా భవ్రా పంజాబ్ హోంగార్డ్స్ డీజీపీగా కొనసాగుతున్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్ నుంచి భవ్రాను చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఎంపికచేసింది. దీంతో భవ్రాను డీజీపీగా పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ నియమించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్‌సీ పంపిన షార్ట్‌లిస్ట్‌లోని ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంచుకోవాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నియామకం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రా
ఎందుకు : పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు..
Assembly Elections In 5 States: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య?
ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళలో ఎన్నికలు వాయిదా వేస్తారేమోనన్న సందేహాలకు తెరదించుతూ కేంద్ర ఎన్నికల సంఘం 2022, జనవరి 8న షెడ్యూల్‌ని ప్రకటించింది. కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) సుశీల్ చంద్ర స్పష్టం చేశారు.
తొలిసారి ఆన్‌లైన్లో నామినేషన్..
ఈ సారి ఎన్నికల్లో తొలిసారిగా అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఇది తప్పనిసరి కాదు. ఎవరైనా స్వచ్ఛందంగా ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనుకుంటే చేయొచ్చు. అలా చేయడం వల్ల రద్దీ తగ్గుతుందని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ – వివరాలు |
|||||
రాష్ట్రాలు |
పోలింగ్ ప్రారంభం |
పోలింగ్ ముగింపు |
పోలింగ్ రోజులు |
అధికార పార్టీ |
మొత్తం సీట్లు |
ఉత్తరప్రదేశ్ |
ఫిబ్రవరి 10 |
మార్చి 7 |
7 |
బీజేపీ |
403 |
పంజాబ్ |
ఫిబ్రవరి 14 |
ఫిబ్రవరి 14 |
1 |
కాంగ్రెస్ |
117 |
ఉత్తరాఖండ్ |
ఫిబ్రవరి 14 |
ఫిబ్రవరి 14 |
1 |
బీజేపీ |
70 |
మణిపూర్ |
ఫిబ్రవరి 27 |
మార్చి 3 |
2 |
బీజేపీ |
60 |
గోవా |
ఫిబ్రవరి 14 |
ఫిబ్రవరి 14 |
1 |
బీజేపీ |
40 |
ఓట్ల లెక్కింపు మార్చి 10 |
8R Tractor: డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన సంస్థ?
రైతుకు మరింత సాయం చేసే.. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను జాన్ డీర్ కంపెనీ రూపొందించింది. 8–ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో-2022లో ప్రదర్శించింది. కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్‌లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది.
ప్రత్యేకతలు..
- ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్ ఉంటాయి.
- కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది.
- పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది.
- దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్ నిలిచిపోతుంది.
- ఈ కెమెరాలను, కంప్యూటర్‌ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు.
- రైతు చేతిలోని స్మార్ట్ ఫోన్‌లో వీడియో ద్వారా ట్రాక్టర్ కదలికలను పర్యవేక్షించవచ్చు.
- దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
- ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రైవర్ అక్కర్లేని 8–ఆర్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన సంస్థ?
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : జాన్ డీర్ కంపెనీ
ఎక్కడ : కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో, లాస్‌వెగాస్, అమెరికా
ఎందుకు : రైతుకు మరింత సాయం చేసేందుకు..
Tennis: అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారతీయ జంట?
అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. జనవరి 9న ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. దీంతో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ 41 ఏళ్ల బోపన్న(బెంగళూరు) తన కెరీర్‌లో 20వ డబుల్స్ టైటిల్ సాధించినట్లయింది. 2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్‌కుమార్ కెరీర్‌లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్‌లో బోపన్న–రామ్‌కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన బోపన్న–రామ్‌కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
నలుగురు భారత ఆటగాళ్లతో...
ఏటీపీ టూర్‌లో బోపన్న 20 డబుల్స్ టైటిల్స్ నెగ్గగా ఇందులో ఐదు టైటిల్స్‌ను నలుగురు భారత ఆటగాళ్లతో కలిసి సాధించాడు. బోపన్న 2012లో మహేశ్ భూపతితో కలిసి దుబాయ్ ఓపెన్, పారిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచాడు. 2017లో జీవన్ నెదున్‌చెజియాన్‌తో చెన్నై ఓపెన్‌ను, 2019లో దివిజ్ శరణ్‌తో పుణే ఓపెన్‌ను, 2022 ఏడాది రామ్‌కుమార్‌తో అడిలైడ్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన భారతీయ జోడి?
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ
ఎక్కడ : అడిలైడ్, ఆస్ట్రేలియా
ఎందుకు : డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించినందుకు...
Chess: వెర్గాని కప్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు?
వెర్గాని కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ (ఎంఆర్) లలిత్ బాబు చాంపియన్‌గా నిలిచాడు. ఇటలీలోని కటోలికా పట్టణం వేదికగా జనవరి 9న ముగిసిన ఈ టోర్నీలో లలిత్ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా లలిత్‌కు టైటిల్ లభించింది. విజయవాడకు చెందిన 29 ఏళ్ల లలిత్ 2021, డిసెంబర్ నెలలో థాయ్‌లాండ్ చెస్ ఫెస్టివల్‌లో క్లాసికల్, బ్లిట్జ్ విభాగాల్లో టైటిల్స్ సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెర్గాని కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ (ఎంఆర్) లలిత్ బాబు
ఎక్కడ : కటోలికా, ఇటలీ
Tennis: మెల్‌బోర్న్ సమ్మర్ సెట్ టోర్నీ చాంపియన్?
2022 మెల్‌బోర్న్ సమ్మర్ సెట్–1 ఏటీపీ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జనవరి 9న జరిగిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 7–6 (8/6), 6–3తో మాక్సిమి క్రెసీ (అమెరికా)పై గెలిచి, టైటిల్ సొంతం చేసుకున్నాడు. నాదల్ కెరీర్‌లో ఇది 89వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన నాదల్‌కు 87,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 64 లక్షల 90 వేలు) లభించింది. మరోవైపు మహిళల విభాగం సింగిల్స్‌లో రోమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ చాంపియన్‌గా అవతరించింది.
విజేత జ్యోతి సురేఖ
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎన్‌టీపీసీ ప్రథమ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ చాంపియన్‌గా నిలిచింది. జనవరి 9న సీనియర్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 146–145 పాయింట్లతో అదితి (మహారాష్ట్ర)పై నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 మెల్‌బోర్న్ సమ్మర్ సెట్–1 ఏటీపీ టోర్నీ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 7–6 (8/6), 6–3తో మాక్సిమి క్రెసీ (అమెరికా)పై గెలిచినందున..
Delhi Police: సల్లి డీల్స్ యాప్ సృష్టికర్త ఎవరు?
ముస్లిం మహిళల్ని అవమానించడమే లక్ష్యంగా బుల్లి బాయ్ యాప్ కంటే ముందే వచ్చిన సల్లి డీల్స్ యాప్ సృష్టికర్తని మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్‌లో బీసీఏ చదివిన అంకురేశ్వర్ ఠాకూర్ (26) ఈ యాప్ రూపొందించాడని అనుమానంతో ఢిల్లీ పోలీసులు అతనిని జనవరి 8న అదుపులోనికి తీసుకున్నారు. ముస్లిం మహిళల్ని ట్రోల్ చేయడం కోసం తాను ఈ యాప్‌ని రూపొందించినట్టు విచారణలో అంకురేశ్వర్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. సల్లి డీల్స్ కేసులో ఇదే మొదటి అరెస్ట్.
నటుడు రమేశ్ బాబు కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రముఖ నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్‌బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన జనవరి 8న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1965, అక్టోబర్ 13న చెన్నైలో జన్మించిన రమేశ్ ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. తర్వాత మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. మొత్తం 20కి పైగా చిత్రాల్లో నటించిన రమేశ్... కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థను ప్రారంభించి, సోదరుడు మహేశ్‌బాబు హీరోగా ‘అర్జున్’(2004) చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు.
PM Modi: వీర్‌బాల్ దివస్‌గా ఏ రోజును పాటించనున్నారు?
సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్ దివస్‌గా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. గురు గోవింద్ సింగ్ జయంతి–2022 సందర్భంగా జనవరి 9న ప్రధాని ఈ ప్రకటన చేశారు. న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన పేర్కొన్నారు.
బలబీర్ నౌక అప్పగింత
ఇండియన్ నేవీ కోసం విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తయారు చేసిన బలబీర్ నౌక.. షిప్‌యార్డ్ నుంచి జనవరి 9న ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌కు తరలి వెళ్లింది. నేవీ కోసం సంస్థలో నాలుగు టగ్‌ల నిర్మాణం జరిగింది. ఇప్పటికే మూడు అప్పగించగా ఇది చివరి టగ్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్ దివస్‌గా పాటించాలి
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని.
Indian Navy: ఐఏసీ విక్రాంత్‌ను నిర్మిస్తోన్న సంస్థ?
దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు జనవరి 9న అరేబియా సముద్రం(కొచ్చిన్ షిప్‌యార్డు సమీపం)లో ఆరంభమయ్యాయి. రూ.23వేల కోట్ల వ్యయంతో కొచ్చిన్ షిప్‌యార్డ్ నిర్మిస్తున్న ఈ నౌకను 2022, ఆగస్టులో నేవీకి అందించనున్నారు. అందుకే ఈ లోపు వివిధ దఫాలుగా వివిధ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా 2021 ఆగస్టు, అక్టోబర్‌లలో సముద్రంలో ట్రయిల్స్ నిర్వహించారు. తాజాగా మరోమారు సీ ట్రయిల్స్ ఆరంభిస్తున్నామని అధికారులు తెలిపారు.
మిగ్–29కె యుద్ధ విమానాలు, కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంహెచ్–60 ఆర్ హెలికాప్టర్లను విక్రాంత్ యుద్ధ నౌకపై నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా గంటకు 28 నాటికల్ మైళ్ల చొప్పున ఏకబిగిన 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. 2009లో కొచ్చిన్ షిప్‌యార్డులో నిర్మాణం ప్రారంభమైన ఈ యుద్ధ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : భారత నావికాదళం
ఎక్కడ : కొచ్చిన్ షిప్‌యార్డు సమీపం, అరేబియా సముద్రం
ఎందుకు : యుద్ధ నౌక విక్రాంత్‌లోని అన్ని వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేస్తున్నాయా? లేదా? అని పరిశీలించే క్రమంలో..
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, జనవరి 8 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్