Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 8 కరెంట్‌ అఫైర్స్‌

India GDP

National Statistical Office: ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ ఏది?

కోవిడ్‌–19 సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీ 9.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని, ఈ స్థాయి వృద్ధి రేటును ప్రపంచలో ఏ దేశమూ సాధించే స్థితిలో లేదని పేర్కొంది. ఈ మేరకు జనవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎన్‌ఎస్‌ఓ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... 

  • 2021 మే 31వ తేదీన వెలువడిన గణాంకాల ప్రకారం... 2020–21లో జీడీపీ విలువ రూ.135.13 లక్షల కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.147.54 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
  • 2019–20 ఎకానమీ రూ. 145.69 లక్షల కోట్లకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ విలువ అంచనాలు అధికం.
  • ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలిస్తే, జీవీఏ విలువ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) 8.6 శాతం వృద్ధితో రూ.124.53 లక్షల కోట్ల నుంచి రూ.135.22 లక్షల కోట్లకు పెరగనుంది.
  • తయారీ రంగం వృద్ధి రేటు 7.2 శాతం క్షీణత నుంచి 12.5 శాతం వృద్ధిలోకి మారే వీలుంది.
  • ట్రేడ్, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి 11.9 శాతంగా నమోదుకావచ్చు.
  • ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు 3.6 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 ఆర్థిక ఏడాదిలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవనుంది
ఎప్పుడు : జనవరి 7
ఎవరు    : జాతీయ గణాంకాల కార్యలయం (ఎన్‌ఎస్‌ఓ)
ఎక్కడ    : ప్రపంచంలోనే...
ఎందుకు : భారత ఎకానమీ 9.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని, ఈ స్థాయి వృద్ధి రేటును ప్రపంచలో ఏ దేశమూ సాధించే స్థితిలో లేదని..

IHS Markit: రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న దేశం?

2030 నాటికి ఆసియాలో జపాన్‌ను పక్కకునెట్టి భారత్‌ రెండో అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ వెల్లడించింది. అలాగే దేశ జీడీపీ జర్మనీ, బ్రిటన్‌లను దాటి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎదిగే వీలుందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 7న ఒక నివేదికను విడుదల చేసింది.

ఐహెచ్‌ఎస్‌ నివేదికలోని ముఖ్యాంశాలు..

  • ప్రస్తుతం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్‌ తరువాత ఆరో స్థానంలో ఉంది. 
  • భారత్‌ జీడీపీ 2021లో 2.7 ట్రిలియన్‌ డాలర్లయితే, 2030 నాటికి ఈ విలువ 8.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరే వీలుంది. 
  • వృద్ధి బాటలో వేగంగా నడుస్తున్న మధ్యతరగతి, వినియోగం భారీ వృద్ధి వంటి అంశాలు భారత్‌కు లాభిస్తున్న ప్రధాన అంశాలు.
  • దేశ వినియోగం 2020లో 1.5 ట్రిలియన్‌ డాలర్లు ఉంటే, ఇది 2030 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది.
  • ఇంటర్‌నెట్‌ యూజర్ల సంఖ్య 2020లో 500 మిలియన్లు (50 కోట్లు) ఉంటే, 2030 నాటికి 1.1 బిలియన్‌లకు (110 కోట్లు) చేరుతుంది.
  • 2021–22లో భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదవుతుంది. 2022–23లో  ఈ రేటు 6.7 శాతంగా ఉంటుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2030 నాటికి జపాన్‌ను పక్కకునెట్టి భారత్‌ రెండో అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉంది
ఎప్పుడు : జనవరి 7
ఎవరు    : ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌
ఎక్కడ    : ఆసియాలో...
ఎందుకు : వేగవంతమైన వృద్ధి కారణంగా..

Ministry of Jal Shakti: జాతీయ జల అవార్డును గెలుచుకున్న రాష్ట్రం?

Water-Ministry Jal Shakthi

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ జనవరి 7న జాతీయ జల అవార్డులు–2020ను ప్రకటించారు. ఇందులో ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లాకు కూడా అవార్డు లభించింది. వైఎస్సార్‌ జిల్లా... సౌత్‌ జోన్‌ పరిధిలో ఉత్తమ జిల్లా కేటగిరీలో రెండో స్థానం సాధించింది.

జల్‌ సమృద్ధ్‌ భారత్‌..
అవార్డుల ప్రకటన సందర్భంగా మంత్రి షెకావత్‌ మాట్లాడుతూ... ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 18 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పునరుత్పాదక నీటి వనరుల్లో మాత్రం కేవలం నాలుగు శాతమే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ‘జల్‌ సమృద్ధ్‌ భారత్‌’ సాధనలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన ఆదర్శప్రాయమైన పనులు, ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించేందుకు జాతీయ జల అవార్డులను ప్రధానం చేస్తున్నట్టు తెలిపారు. నీటి వనరుల నిర్వహణలో సమగ్ర విధానాన్ని అవలంబించేలా ఏకీకృత జాతీయ జల అవార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2020 జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ రాష్ట్ర విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకున్న రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 7
ఎవరు    : ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : ‘జల్‌ సమృద్ధ్‌ భారత్‌’ సాధనలో.. ఆదర్శప్రాయమైన పనులు, ప్రయత్నాలు చేసినందుకు..

Vijayawada: ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?

Kambampati Haribabu

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు చెప్పారు. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ రంగాల్లో మంచి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తోన్న పురోగతి అభినందనీయమన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మూడు రోజులపాటు నిర్వహించనున్న 4వ ఆర్గానిక్‌ మేళాను జనవరి 7న ఆయన ప్రారంభించారు.

ప్రకాశం జిల్లాలో మెగా లెదర్‌ పార్క్‌..
ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో ‘అంతర్జాతీయ మెగా లెదర్‌ పార్క్‌’ను ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చర్మ పరిశ్రమ అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్‌) చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ ప్రకటించారు. దీనివల్ల 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా ప్రతిపాదన చేశామని జనవరి 7న తెలిపారు.

ఒమిక్రాన్‌ ప్రాణాంతకమే: డబ్ల్యూహెచ్‌ఓ
ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాణాంతక మేనని, వ్యాధి తీవ్రత తక్కువున్న దానిగా పరిగణించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ తక్కువ ప్రభావం చూపిస్తోందని, అంతమాత్రాన దాని వల్ల స్వల్ప లక్షణాలే ఉంటాయని చెప్పలేమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రయెసస్‌ చెప్పారు.

NCeG: 24వ ఈ–గవర్నెన్స్‌ జాతీయ సదస్సును ఎక్కడ ప్రారంభించారు?

Jitendra Singh and KTR

హైదరాబాద్‌లో 24వ ఈ–గవర్నెన్స్‌ జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును జనవరి 7న కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలసి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించి, మాట్లాడారు. ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)’ విధానాన్ని పునః సమీక్షించాలని.. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏడున్నరేళ్లలో రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రంగంలో రాష్ట్రానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బలబీర్‌ నౌకను నిర్మించిన సంస్థ?
హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సంస్థ నిర్మించిన బలబీర్‌ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 7న విశాఖపట్నంలో జరిగింది. 12 నాట్స్‌ వేగంతో ప్రయాణించే సామర్థ్యం కల ఈ నౌక 50 టన్నుల బోలార్ట్‌ పుల్‌ టగ్‌ను కలిగి ఉంది. కోవిడ్‌–19 విపత్కర పరిస్థితుల్లోనూ హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సంస్థ ఈ నౌక నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో సంస్థ ఇప్పటివరకు రెండు వందల నౌకల నిర్మాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించింది.

T20 Cricket: స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధన

ICC-Ground

అంతర్జాతీయ టి20 టోర్నిల్లో నిర్ణీత సమయంకంటే ఓవర్లు ఆలస్యం చేస్తే చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్‌ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఒక టి20 మ్యాచ్‌లో 85 నిమిషాల్లో 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ‘85వ నిమిషంలో 20వ ఓవర్‌ మొదలు కావాలి’ అనేది తాజా నిబంధన. అలా చేస్తేనే సరైన ఓవర్‌రేట్‌ నమోదు చేసినట్లుగా భావిస్తారు. లేదంటే ఫీల్డర్‌ కోత పడుతుంది. టి20ల్లో స్లో ఓవర్‌రేట్‌కు చెక్‌ పెట్టేందుకు ఐసీసీ తాజా నిర్ణయం దోహదం చేయనుంది. టి20 ఇన్నింగ్స్‌ మధ్యలో (10 ఓవర్ల తర్వాత) రెండున్నర నిమిషాల డ్రింక్స్‌ బ్రేక్‌ తీసుకోవచ్చనేది మరో కొత్త నిబంధన.

రవి దహియా ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
కరోనా కాలంలో విదేశీ కోచ్‌ల వెంట పడకుండా... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు భారతీయ కోచ్‌ల ఆధ్వర్యంలో తమ ప్రదర్శ నకు మెరుగులు దిద్దుకోవాలని భారత స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, రవి దహియా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌–2020లో రవి రజతం... బజరంగ్‌ కాంస్యం సాధించారు.

Covid-19: టీకాల పంపిణీలో 150 కోట్ల మైలురాయిని చేరుకున్న దేశం?

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2022, జనవరి 7వ తేదీ నాటికి దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్‌ టీకా పంపిణీ పూర్తయింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం...

  • దేశంలో కరోనా టీకా పంపిణీ  2021, జనవరి 16న ప్రారంభమైంది. 
  • కరోనా టీకా డోసుల సంఖ్య 2021, అక్టోబరు 21వ తేదీ నాటికి 100 కోట్లు దాటింది.
  • ఇప్పటివరకు దేశంలో వయోజన జనాభాలో 91 శాతం  మందికి పైగా కనీసం ఒక డోసు టీకా వేసుకున్నారు. 66 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. అర్హులైన కౌమారుల్లో 22% మందికి మొదటి డోసు అందింది.
  • 2022, జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్‌లో అర్హులైన 22 శాతం మంది బాలబాలికలు(టీనేజర్లు) టీకా వేయించుకున్నారు.

భారత్, నేపాల్‌ మధ్య వంతెనకు ఆమోదం
భారత్, నేపాల్‌ మధ్య వంతెన నిర్మాణానికి సంబంధించి ఇరు దేశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి జనవరి 7న కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. ఉత్తరాఖండ్‌లోని ధర్‌చులాలో మహకాళి నది మీదుగా ఇరుదేశాలను కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తారు. విపత్తుల నిర్వహణలో పరస్పరం సహకరించుకోవడానికి టర్క్‌మెనిస్తాన్‌తో ఎంఓయూకు కూడా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, జనవరి 7వ తేదీ నాటికి 150 కోట్ల కోవిడ్‌ టీకా పంపిణీ 
ఎప్పుడు : జనవరి 7
ఎవరు    : భారత ప్రభుత్వం
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : కోవిడ్‌–19 నియంత్రణ కోసం..

భద్రత రికార్డులను భద్రపరచండి: సుప్రీంకోర్టు

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5న చేసిన పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటన(ఫిరోజ్‌పూర్‌ ఘటన)కు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను జనవరి 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరోజ్‌పూర్‌ ఘటనపై లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 7న విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏ నగరంలో ఉంది?
పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో ఉన్న చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్‌ ప్రారంభమైంది. జనవరి 7న వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్యాంపస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.

గంగాసాగర్‌ మేళాను ఏక్కడ నిర్వహిస్తారు?
హిందువులు లక్షలాదిగా హాజరయ్యే గంగాసాగర్‌ మేళాకు కోల్‌కతా హైకోర్టు పచ్చజెండా ఊపింది. దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న వేళ ఈ మేళాను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బంగాళాఖాతంలో గంగానది కలిసే ద్వీప ప్రాంతంలో ఏటా గంగాసాగర్‌మేళా జరుగుతుంది. 2022, జనవరి 8నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ మేళా సమయంలో జనం నదీ స్నానాలు ఆచరించడంతోపాటు అక్కడి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 7 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Jan 2022 05:25PM

Photo Stories