Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 21 కరెంట్‌ అఫైర్స్‌

Daily-Current-Affairs-in-Telugu

Defence Ministry: రక్షణ రంగంలో దేశీయ కొనుగోళ్లకు ఎంత శాతం నిధులు కేటాయించారు?

దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. 2021–22లో తమ బడ్జెట్‌లో ఇందుకు ఏకంగా 65.50 శాతం నిధులు వెచ్చించినట్లు ఏప్రిల్‌ 20న తెలిపింది. 64 శాతం ఖర్చు చేయాలన్న 2021–22 బడ్జెట్‌ కేటాయింపులను 99.5 శాతం ఖర్చు చేశామని తెలిపింది. లక్ష్యాన్ని అధిగమించినట్టు చెప్పింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా రక్షణ శాఖకు ఆయుధాలు, సామగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయాలని, అందుకు చేయూతనివ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగsతి తెలిసిందే.

ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ జలాంతర్గామి ఎక్కడ జలప్రవేశం చేసింది?
ప్రాజెక్ట్‌–75లో భాగంగా మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ రూపొందించిన ఆరో సబ్‌మెరైన్‌ ‘ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌’ ఏప్రిల్‌ 20న ముంబై తీరంలో లాంఛనంగా జలప్రవేశం చేసింది. ఈ జలాంతర్గామిని మరో ఏడాదిపాటు సముద్ర జలాల్లో కఠిన పరీక్షలకు గురిచేస్తారు. ఆ తర్వాత నావికాదళంలో చేర్చుకుంటారు. ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ రాకతో భారత నావికాదళం శక్తి మరింత పెరుగుతుందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 ఏడాది రక్షణ రంగం బడ్జెట్‌లో దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లకు 65.50 శాతం నిధులు కేటాయింపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు    : రక్షణ శాఖ 
ఎందుకు : ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా రక్షణ శాఖకు ఆయుధాలు, సామగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయాలని, అందుకు చేయూతనివ్వాలని..

Wrestling: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన ఆటగాడు?

Hardeep Singh
హర్‌ప్రీత్‌ సింగ్‌

మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌ వేదికగా జరుగుతున్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022 పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో భారత రెజ్లర్లు హర్‌ప్రీత్‌ సింగ్‌ (82 కేజీలు), సచిన్‌ సెహ్రావత్‌ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. ఏప్రిల్‌ 20న కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్‌ రెజ్లర్‌ జఫర్‌ ఖాన్‌ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో హర్‌ప్రీత్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా పోటీల్లో హర్‌ప్రీత్‌కిది ఐదో పతకం. మరో కాంస్య పతక బౌట్‌లో మహమూద్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై సచిన్‌ గెలిచాడు.

కార్తీక్‌ రెడ్డికి స్వర్ణం
యూఎస్‌ఏ ఓపెన్‌ అంతర్జాతీయ కరాటే టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన కార్తీక్‌ అండర్‌–13 బాలుర కుమిటే టీమ్‌ విభాగంలో పసిడి పతకాన్ని నెగ్గాడు. 40 దేశాల నుంచి 300కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022 పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన భారతీయులు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు    : హర్‌ప్రీత్‌ సింగ్‌ (82 కేజీలు), సచిన్‌ సెహ్రావత్‌ (67 కేజీలు)
ఎక్కడ    : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్‌ రెజ్లర్‌ జఫర్‌ ఖాన్‌ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో,  మరో కాంస్య పతక బౌట్‌లో మహమూద్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై సచిన్‌ గెలిచినందున..​​​​​​​

National Civil Services Day 2022: సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

National Civil Services Day 2022

కరెన్సీ విలువ తగ్గుదల ఎగుమతులను ప్రోత్సహిస్తుందన్న వాదనను వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏప్రిల్‌ 20 తోసిపుచ్చారు. రూపాయి బలహీనపడటం దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు విఘాతమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ఎగుమతులను గణనీయంగా పెంచుకోవడం, దేశంలోకి విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పెంచేలా తగన పెట్టుబడులను వ్యూహాన్ని అనుసరించడం కీలకమని ఆయన అన్నారు. 15వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం(ఏప్రిల్‌ 21) సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో "విజన్‌ ఇండియా  ః 2047 - గవర్నెర్స్‌" అన్న అంశంపై ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ 21న సివిల్‌ సర్వీసెస్‌ డే(పౌర సేవల దినోత్సవం)ను జరుపుకుంటారు. ప్రజల ప్రయోజనాల కోసం తమను తాము అంకితం చేయడానికి, కట్టుబడి ఉండటానికి సివిల్‌ సర్వీసెస్‌ ఈ రోజును పాటిస్తారు.

Ayush: ఆయుష్‌ పెట్టుబడుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు?

Ayush Summit

Global Ayush Investment and Innovation Summit-2022: గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌ వేదికగా 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్‌ పెట్టుబడుల మరియు ఆవిష్కరణల సదస్సు–2022 ప్రారంభమైంది. మారిషస్‌ ప్రధాని జగన్నాథ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ సమక్షంలో ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. అనంతరం హీల్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ప్రధాని ప్రసంగం–ముఖ్యమైన అంశాలు

 • ఆయుష్‌ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) చికిత్స కోసం భారత్‌ వచ్చేవాళ్లకు ప్రత్యేక వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తాం. 
 • సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్‌ మార్క్‌తో ఆ  ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుంది. 
 • ప్రత్యామ్నాయ ఔషధ విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్‌ ఉత్పత్తులకు మార్కింగ్‌ ఇస్తారు. 
 • సంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది. ఇది దేశమంతా విస్తరించాలి. హీల్‌ ఇన్‌ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్‌ కావాలి.
 • దహోద్‌(గుజరాత్‌)లో రూ. 20 వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తాం.
 • 2014కు పూర్వం ఆయుష్‌ రంగ విలువ 300 కోట్ల డాలర్ల కన్నా తక్కువ, ప్రస్తుతమిది 1800 కోట్ల డాలర్లను దాటింది.
 • సంప్రదాయ వైద్య స్టార్టప్‌లకు ఆయుష్‌ శాఖ సాయం చేస్తుంది. ఈ రంగం నుంచి యూనికార్న్‌లు (వందకోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు) వస్తాయి.
 • ఆయుష్‌ ఈమార్కెట్‌ పోర్టల్‌ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తాం.

టెడ్రోస్‌ కాదు.. తులసీ భాయ్‌
హీల్‌ ఇన్‌ ఇండియా సదస్సుకు హాజరైన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌కు ప్రధాని మోదీ తులసీ భాయ్‌ అని భారతీయ పేరు పెట్టారు. టెడ్రోస్‌ గుజరాతీలో ప్రసంగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించడాన్ని అభినందించారు. సదస్సులో టెడ్రోస్‌ మాట్లాడుతూ.. విదేశీ మార్కెట్లలో ఆయుష్‌ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆయుష్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు భారత్, మారిషస్‌ మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై మోదీ, జగన్నాథ్‌ చర్చలు జరిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ఆయుష్‌ పెట్టుబడుల మరియు ఆవిష్కరణల సదస్సు–2022 ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : గాంధీనగర్, గుజరాత్‌
ఎందుకు : ఆయుష్‌ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) రంగంలో పెట్టుబడుల అవకాశాలను గురించి, నూతన ఆవిష్కరణల ప్రాముఖ్యతను గురించి వివరించేందుకు..

Telangana: ఏ జలాశయాల పరిరక్షణ కోసం 111 జీవోను జారీ చేశారు?

Osman Sagar

హైదరాబాద్‌ నగరానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఏప్రిల్‌ 20న జీవో నంబర్‌ 69 జారీ చేశారు.

ఈ నీటి అవసరం లేదు..!
‘‘అప్పట్లో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ను, వాటి పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 111 జీవో ద్వారా ఆంక్షలు విధించారు. జీవో జారీ చేసినప్పుడు ఆ రిజర్వాయర్ల నుంచి నగరానికి అందించే తాగునీరు 27.59 శాతం వరకు ఉండేది. ప్రస్తుతం సరఫరా అయ్యేది 1.25 శాతమే. ఇప్పుడు నగర ప్రజలు తాగునీటి కోసం ఈ రిజర్వాయర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. 111 జీవో ఆంక్షలను తొలగిస్తున్నాం’’ అని ప్రభుత్వం పేర్కొంది.

84 గ్రామాల పరిధిలో..
హైదరాబాద్‌ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అందించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాలపై నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం విపరీతంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవో ఎత్తివేయాలన్న డిమాండ్‌ మొదలైంది.

సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ..
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో.. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వాటర్‌ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ (ప్లానింగ్‌) సభ్యులుగా ఉంటారు.

1.32 లక్షల ఎకరాలు..
గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలోని భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ అందుబాటులోకి రానున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హైదరాబాద్‌ నగరానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవో ఎత్తివేత
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని.. 

Telangana: తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ పుస్తకాన్ని ఎవరు రచించారు?

book release-mlc kavitha

మన కళలు, సాహిత్యం తెలంగాణకు పంచప్రాణాలని, మరుగున పడిన తెలంగాణ సాహిత్యం రాష్ట్ర అవతరణ తర్వాత వెలుగొందుతోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీ లెక్చరర్‌ డాక్టర్‌ ఎం.దేవేంద్ర రాసిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’(1990–2010) పరిశోధనా గ్రంథాన్ని ఏప్రిల్‌ 20న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ పాల్గొన్నారు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌?
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే టి20 లీగ్‌లలో మాత్రం ఆడతానని ఏప్రిల్‌ 20న పొలార్డ్‌ తెలిపాడు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ 15 ఏళ్ల కెరీర్‌లో 123 వన్డేలు ఆడాడు. 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. 2008లో ఆస్ట్రేలియాతో టి20 ఫార్మాట్‌కు శ్రీకారం చుట్టిన ఈ ఆల్‌రౌండర్‌ 101 మ్యాచ్‌ల్లో 1,569 పరుగులు చేశాడు.

2022 ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌లో పొలార్డ్‌ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది... అంతర్జాతీయ క్రికెట్‌లో గిబ్స్, యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 2012లో విండీస్‌ గెలిచిన టి20 ప్రపంచకప్‌లో  పొలార్డ్‌ సభ్యుడిగా ఉన్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డాక్టర్‌ ఎం.దేవేంద్ర రాసిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’(1990–2010) పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు    : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎక్కడ    : హైదరాబాద్‌ 

DGCIS: 2021–22లో భారత్‌ ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేసింది?

ప్రపంచ దేశాల ఆకలిని తీర్చడంలో ముందున్న భారత్‌ బాస్మతియేతర బియ్యం ఎగుమతుల్లోనూ దూసుకుపోతోందని కేంద్రం పేర్కొంది. 2013–14తో పోలిస్తే ఏకంగా 109 శాతం వృద్ధి సాధించిందని ఏప్రిల్‌ 20న వెల్లడించింది. 2013–14లో భారత నాన్‌ బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ 292 కోట్ల డాలర్లు కాగా 2021–22లో 611 కోట్ల డాలర్లకు పెరిగిందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (డీజీసీఐఎస్‌) తెలిపింది. డీజీసీఐఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం...

 • 2021–22లో 150 దేశాలకు భారత్‌ బియ్యం ఎగుమతి చేసింది. వీటిలో 76 దేశాలకు మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బియ్యం వెళ్లాయి.
 • ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిసా, అసోం, హరియాణా రాష్ట్రాల్లో ఎక్కుగా వరి ఉత్పత్తి జరుగుతోంది. 
 • కరోనా సవాలును అధిగమించి మరీ ఆఫ్రికా, ఆసియా, యూరప్‌ మార్కెట్లలో బియ్యం ఎగుమతుల్లో భారత్‌ పై చేయి సాధిస్తూనే ఉంది. ప్రపంచ బియ్యం వాణిజ్యంలో అత్యధిక వాటా సాధించింది.

Noise Pollution: నివాస ప్రాంతాల్లో సీపీసీబీ అనుమతించిన శబ్ద కాలుష్య పరిమితి?

Noise Pollution

మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్‌ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) పార్టీ చేస్తున్న డిమాండ్‌ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్‌ఎస్‌ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. దీంతో ఈ వివాదం కోర్టుకి చేరింది. ఈ నేపథ్యంలో లౌడ్‌ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే విషయాలను పరిశీలిస్తే..

శబ్ద కాలుష్యమంటే? 
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు.    
 

ప్రాంతాలవారీగా సీపీసీబీ అనుమతించిన శబ్ద కాలుష్య పరిమితి

ప్రాంతం

పరిమితి (డెసిబుల్స్‌లో)

 

పగలు

రాత్రి

పారిశ్రామికవాడలు

75

70

వాణిజ్య ప్రాంతాలు

65

55

నివాస ప్రాంతాలు

55

45

అమల్లో ఉన్న నిబంధనలేమిటి?

 • బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్‌ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌ స్పీకర్లను అనుమతిస్తారు.
 • శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్‌ 28న తీర్పు ఇచ్చింది. 
 • సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్‌ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

110 కోట్ల మంది యువకులపై ప్రభావం
శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది.​​​​​​​​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 20 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Apr 2022 06:17PM

Photo Stories