Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 20 కరెంట్‌ అఫైర్స్‌

daily current affairs in telugu

WHO-GCTM: డబ్ల్యూహెచ్‌ఓ సంప్రదాయ వైద్య కేంద్రానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?

PM Modi - Jamnagar

గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌ జిల్లాలోని జామ్‌నగర్‌లో ఏప్రిల్‌ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రం (డబ్ల్యూహెచ్‌ఓ జీసీటీఎం) ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఈ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నా«థ్‌ పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ కేంద్ర ప్రారంభం సందర్భంగా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌ ప్రధానులు భారత్‌కు అభినందన సందేశాన్ని పంపారు.

మరోవైపు టెడ్రోస్‌తో కేంద్ర ఆరోగ్యమంత్రి ఢిల్లీలో సమావేశమై ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడంపై చర్చలు జరిపారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేదను టెడ్రోస్‌ సందర్శించారు.

ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు

  • సంపూర్ణ ఆరోగ్యరక్షణకు ప్రజాదరణ పెరుగుతోంది. ప్రపంచంలోని ప్రతిఒక్కరికి రాబోయే 25ఏళ్లలో డబ్ల్యూహెచ్‌ఓ జీసీటీఎం, సంప్రదాయ వైద్యం అత్యంత కీలకమవుతాయి.
  • భారతీయ ఆయుర్వేదం కేవలం చికిత్స గురించి మాత్రమే చెప్పదు, సమగ్ర విషయాలను చర్చిస్తుంది. ఆధునిక జీవనశైలి తెచ్చే అనారోగ్యాలను నయం చేయడంలో సంప్రదాయ వైద్యం కీలక పాత్ర పోషిస్తుంది.
  • తృణధాన్యాల ఆవశ్యకతను భారత్‌లో పెద్దలు పదేపదే చెప్పేవారు, కానీ కాలక్రమేణా వీటిని నిర్లక్ష్యం చేశారు. తాజాగా అందరూ వీటి ప్రాముఖ్యతను గుర్తించారు. తృణధాన్యాల వాడుకను ప్రోత్సహించాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస ఆమోదం తెలపడం సంతోషకరం. 2023ను ఐరాస అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రం (డబ్ల్యూహెచ్‌ఓ జీసీటీఎం) ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నా«థ్‌
ఎక్కడ    : జామ్‌నగర్, జామ్‌నగర్‌ జిల్లా, గుజరాత్‌

Asian Championships: అర్జున్‌ హలాకుర్కి ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

Wrestling

మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌ వేదికగా జరుగుతోన్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో తొలి రోజు ఏప్రిల్‌ 19న భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో అర్జున్‌ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్‌ (63 కేజీలు), సునీల్‌ కుమార్‌ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్‌లలో కర్ణాటకకు చెందిన అర్జున్‌ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్‌ (మంగోలియా)పై... నీరజ్‌ 7–4తో బఖ్రమోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై... సునీల్‌ 9–1తో బత్బెయర్‌ లుత్బాయర్‌ (మంగోలియా)పై నెగ్గారు.

క్రీడలను మర్చిపోకూడదు: ప్రధాని మోదీ
గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ జిల్లా అహ్మదాబాద్‌ నగరంలోని విద్యాసమీక్ష కేంద్రాన్ని ఏప్రిల్‌ 18న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘సాంకేతికతతో కలిగే లాభాలను మీరు ప్రత్యక్షంగా చూశారు. అయితే అదే సర్వస్వం అనుకోవద్దు. క్రీడలు, సామాజిక జీవితం వంటి వాటిని మర్చిపోకూడదు’అని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో కాంస్య పతకాలు గెలిచిన భారతీయులు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : అర్జున్‌ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్‌ (63 కేజీలు), సునీల్‌ కుమార్‌ (87 కేజీలు)
ఎక్కడ    : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : కాంస్య పతక బౌట్‌లలో అర్జున్‌ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్‌ (మంగోలియా)పై... నీరజ్‌ 7–4తో బఖ్రమోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై... సునీల్‌ 9–1తో బత్బెయర్‌ లుత్బాయర్‌ (మంగోలియా)పై గెలిచినందున..​​​​​​​

International Monetary Fund: ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశం?

Indian Economy

భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022లో 8.2 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని విశ్లేషించింది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్‌ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే ఏడాది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యసవ్థ చైనా 4.4 శాతం పురోగతి సాధిస్తుందని బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్‌ 19న వార్షిక వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం..

భారత్‌ ఎకానమీ వృద్ధి 8.2 శాతం..

  • 2022 భారత్‌ ఎకానమీ వృద్ధి తాజా అంచనా 8.2 శాతం అయినప్పటికీ, ఇది క్రితం అంచనాల కన్నా 80 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తక్కువ.
  • ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కమోడిటీ, ఆహార ధరల పెరుగుదల, పెట్టుబడులు పుంజుకోకపోవడం వంటి అంశాలు భారత్‌ వృద్ధి అంచనా తగ్గింపు కారణం.
  • 2021లో భారత్‌ వృద్ధి 8.9 శాతం. 2023లో 6.9 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా.

ప్రపంచ వృద్ధి 3.6 శాతం..
2022లో ప్రపంచ వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌ అంచనావేసింది. ఈ మేరకు క్రితం (జనవరిలో 4.4 శాతంగా అంచనా) అంచనాలకన్నా 80 బేసిస్‌ పాయింట్లు కుదించింది. భౌగోళిక ఉద్రిక్తతలను దీనికి కారణంగా చూపింది. 2021 ప్రపంచ వృద్ధి 6.1 శాతం. 2023లో ప్రపంచ వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి కుదించింది.

చైనా వృద్ధి రేటు 4.4 శాతం

  • 2021లో 8.1 శాతం పురోగమించిన చైనా వృద్ధి రేటు 2022లో 4.4 శాతానికి తగ్గుతుంది. 2023లో ఈ రేటు 5.1 శాతంగా ఉంటుంది.
  • అమెరికా 2022లో 3.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటుది. 2023లో ఈ రేటు 2.3 శాతానికి తగ్గుతుంది.
  • ప్రపంచ వృద్ధి వేగం తగ్గడానికి రష్యా యుద్ధం ప్రధాన కారణం. 2022లో రష్యా ఎకానమీ 8.5 శాతం క్షీణిస్తుంది. ఉక్రెయిన్‌ విషయంలో ఈ క్షీణత 35 శాతంగా ఉంటుంది.
  • ఇక 19 దేశాల యూరో దేశాల ఎకానమీ 2022 వృద్ధి అంచనాలు 3.9 శాతం నుంచి 2.8 శాతానికి కుదింపు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్‌ ఉంటుంది
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని..

Semicon India Conference 2022: సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?

Chip

వచ్చే నాలుగేళ్లలో (2026 నాటికి) దేశీయంగా 300 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఏప్రిల్‌ 19న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం 70–80 బిలియన్‌ డాలర్ల సెమీకండక్టర్లు (చిప్‌లు) అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. సెమీకాన్‌ ఇండియా 2022 సదస్సుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

బెంగళూరు వేదికగా..
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్‌ 29–మే 1 మధ్య బెంగళూరులో జరగనుంది. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్‌ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని మంత్రి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్‌ 29–మే 1 మధ్య జరగనుంది
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా..

International Monetary Fund: ఐఎంఎఫ్‌ చీఫ్‌తో మంత్రి నిర్మలా ఎక్కడ సమావేశమయ్యారు?

Kristalina Georgieva, Nirmala Sitharaman

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశమయ్యారు. ఏప్రిల్‌ 19న అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదతర అంశాలపై ఇరువురు చర్చించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు మంత్రి నిర్మల వాషింగ్టన్‌కు వచ్చారు.

క్రిప్టోలను కట్టడి చేయాల్సిందే..
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నిర్వహించిన అత్యున్నత స్థాయి ప్యానెల్‌ సమావేశంలో మంత్రి నిర్మల పాల్గొని, ప్రసంగించారు. భారత్‌లో క్రిప్టోలపై పన్ను విధింపు అన్నది వాటిల్లోకి వచ్చే పెట్టుబడుల మూలాలు తెలుసుకునేందుకే గానీ, చట్టబద్ధత కల్పించడం కాదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్రిప్టో ఆస్తుల్లో ప్రభుత్వం జోక్యం లేకుండా.. వాటి నియంత్రణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)
స్థాపన:
డిసెంబర్‌ 27, 1945
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డీసీ (అమెరికా)
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవాతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదతర అంశాలపై చర్చించేందుకు..

Telugu Vedic Scholar: భారతాత్మ పురస్కార్‌ను ఎవరు అందుకున్నారు?

Gullapalli Sita Ramachandra Murthy Ghanapathi

రాజమహేంద్రవరం కొంతమూరులోని శ్రీదత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాఠికి ‘భారతాత్మ అశోక్‌ సింఘాల్‌ వైదిక పురస్కార్‌’ లభించింది. సింఘాల్‌ ఫౌండేషన్‌ చిన్మయమిషన్‌ (ఢిల్లీ)లో ఏప్రిల్‌ 18న నిర్వహించిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా గుళ్లపల్లిని సత్కరించి, ఈ పురస్కారాన్ని, ‘ఆదర్శ వేదాధ్యాపక’ బిరుదును అందజేశారు. అవార్డు కింద గుళ్లపల్లికి రూ.5 లక్షలు నగదు, ప్రశంసాపత్రం అందించారు. తెలుగుప్రాంతం నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి వేదపండితులు సీతారామచంద్రమూర్తి ఘనాపాఠి ఒక్కరే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారతాత్మ అశోక్‌ సింఘాల్‌ వైదిక పురస్కార్‌ అందుకున్న వ్యక్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 18
ఎవరు    : శ్రీదత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాఠి
ఎక్కడ  : న్యూఢిల్లీ

Governor: ఏ ఇయర్‌ ఆఫ్‌ పాజిటివిటీ పుస్తకాన్ని ఎవరు రూపొందించారు?

Tamilisai Soundararajan Books

ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తానే గానీ రబ్బర్‌ స్టాంప్‌ గవర్నర్‌గా నడుచుకోనని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. తెలంగాణ సీఎం సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా విధుల నిర్వహణ, సేవా కార్యక్రమాలపై స్వయంగా రూపొందించిన రెండు పుస్తకాలను తమిళిసై ఏప్రిల్‌ 19న చెన్నైలో ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ‘ఒన్‌ ఎమాంగ్‌ అండ్‌ ఎమాంగస్ట్‌ ది పీపుల్‌’, పుదుచ్చేరి పాలనపై ‘ఏ ఇయర్‌ ఆఫ్‌ పాజిటివిటీ’అనే పుస్తకాల తొలి ప్రతులను తన భర్త డాక్టర్‌ సౌందరరాజన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రజాసంక్షేమం కోసం గవర్నర్, సీఎం కలిసి పనిచేస్తే ఎంత ప్రగతి సాధించవచ్చో చెప్పడానికి పుదుచ్చేరి ఉదాహరణైతే.. విభేదాలతో ముందుకు సాగితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో తెలియడానికి తెలంగాణ ఉదాహరణ’ అని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
‘ఒన్‌ ఎమాంగ్‌ అండ్‌ ఎమాంగస్ట్‌ ది పీపుల్‌’, ‘ఏ ఇయర్‌ ఆఫ్‌ పాజిటివిటీ’ పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా విధుల నిర్వహణ, సేవా కార్యక్రమాలను గురించి వివరించేందుకు..

Manufacturing Facility: బిలిటీ ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?

Biliti Electric

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న యూఎస్‌ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌ తెలంగాణ రాష్టంలో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తొలి దశ వచ్చే ఏడాది, రెండవ దశ 2024 నాటికి పూర్తి కానుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల యూనిట్లు. ఇది కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహన తయారీలో ప్రపంచంలో అతి పెద్ద ప్లాంటు కానుంది. 200 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ కేంద్రం కోసం సుమారు రూ.1,144 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఏప్రిల్‌ 19న కంపెనీ తెలిపింది. టాస్క్‌మన్‌ కార్గో, అర్బన్‌ ప్యాసింజర్‌ వాహనాలను ప్లాంటులో తయారు చేస్తారు. బిలిటీ వాహనాల తయారీ భాగస్వామిగా హైదరాబాద్‌కు చెందిన గయమ్‌ మోటార్‌ వర్క్స్‌ వ్యవహరిస్తోంది.

భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
వచ్చే మూడేళ్లలో భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు టెస్లా పవర్‌ యూఎస్‌ఏ వెల్లడించింది. పవర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (పాస్‌) కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ఏప్రిల్‌ 18న సంస్థ చైర్మన్‌ జాన్‌ హెచ్‌ రట్సినస్‌ తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
త్వరలో భారీ తయారీ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : యూఎస్‌ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌
ఎక్కడ    : తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం..​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 19 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Apr 2022 06:19PM

Photo Stories