Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 19 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-19

Chief of Army Staff: దేశ 29వ సైనిక దళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు?

Lt. Manoj Kumar Pandey

దేశ 29వ సైనిక దళాధిపతి(చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఏప్రిల్‌ 30న రిటైరవుతున్నారు. అదే రోజు పాండే బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ ఏప్రిల్‌ 18న ప్రకటించింది. దీంతో ఆర్మీ కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ డివిజన్‌ నుంచి ఈ పదవి చేపట్టనున్న తొలి సైన్యాధికారిగా పాండే రికార్డు సృష్టించారు.

జనరల్‌ మనోజ్‌ పాండే  నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో  కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్‌ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్‌ సెక్టార్లో మౌంటేన్‌ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్‌వాలా సెక్టార్లో ఆపరేషన్‌ పరాక్రమ్‌ సందర్భంగా ఇంజనీర్‌ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్‌ బాధ్యతలు చూశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశ 29వ సైనిక దళాధిపతి(చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌)గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 18
ఎవరు    : లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే 
ఎందుకు : ప్రస్తుత సైన్యాధ్యక్షుడు జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఏప్రిల్‌ 30న రిటైరవుతున్న నేపథ్యంలో..

Danish Open Swimming: 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన స్విమ్మర్‌?

Vedaant Madhavan

డెన్మార్క్‌ రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌ వేదికగా జరుగుతోన్న డానిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌–2022లో భారత యువ స్విమ్మర్‌ వేదాంత్‌ మాధవన్‌ రెండో పతకాన్ని సాధించాడు. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వేదాంత్‌ ఏప్రిల్‌ 18న పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 800 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 17.28 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వేదాంత్‌.. ఈ టోర్నీలో 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలోనూ రజతం నెగ్గిన విషయం విదితమే. ప్రముఖ సినీ నటుడు మాధవన్‌ కుమారుడైన వేదాంత్‌.. 2022 ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గాడు. జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డానిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌–2022లో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ స్విమ్మర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు    : వేదాంత్‌ మాధవన్‌
ఎక్కడ    : కొపెన్‌హగెన్, డెన్మార్క్‌
ఎందుకు : పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వేదాంత్‌.. 800 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 17.28 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నందున..​​​​​​​

Chess: లా రోడా ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడు?

Gukesh - Chess

స్పెయిన్‌లోని లా రోడా పట్టణం వేదికగా ఏప్రిల్‌ 17న ముగిసిన 48వ లా రోడా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌–2022లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల గుకేశ్‌ నిర్ణీత 9 రౌండ్‌ల తర్వాత 8 పాయింట్లు సాధించి అగ్రస్థానం సాధించాడు. గుకేశ్‌ ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ముగించాడు. చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

వ్యవసాయ పోర్టళ్ల ఆవిష్కరణ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రెండు కొత్త పోర్టళ్లను ప్రారంభించారు. ఇందులో ఒకటి.. పురుగుమందుల నమోదుకు సంబంధించింది (సీఆర్‌ఓపీ) కాగా మరొకటి వ్యవసాయ ఉత్పత్తులు, మొక్కల ఎగుమతి, దిగుమతుల డాక్యుమెంటేషన్‌ (పీక్యూఎంఎస్‌)కు సంబంధించింది. ఈ రెండు పోర్టళ్ల ద్వారా ఆయా విభాగాల్లో మరింత పారదర్శకత సాధ్యమవుతుందని మంత్రి తోమర్‌ అన్నారు. అవసరమైతే ఈ పోర్టళ్లను మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
48వ లా రోడా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు    : భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ 
ఎక్కడ    : లా రోడా, స్పెయిన్‌ 
ఎందుకు : నిర్ణీత 9 రౌండ్‌ల తర్వాత 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచినందున..

Mahindra Holidays: చైనా వాల్‌ తర్వాత అత్యంత పొడవైన గోడ ఎక్కడ ఉంది?

Kumbhalgarh Fort Wall

చాలా మంది భారతీయులకు మన దేశం, చరిత్ర, సంస్కృతి, ఆహార విహారాలు మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహన లేదు. మహీంద్రా హాలిడేస్‌ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మన దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పర్యటన స్థలాలు, వాతావరణం, ఆహారం మొదలైన వాటి గురించి తమకు అంతగా తెలియదని వెల్లడించారు. టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్‌ ఈ సర్వే నివేదిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్‌ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు.

సర్వేలోని కొన్ని అంశాలు..

 • భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్‌(కర్ణాటక)లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే.
 • ఖజురహో ఉత్సవాలను మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తారన్న సంగతి మూడో వంతు మందికి (39 శాతం) పైగా తెలియదు.
 • ఇక మహారాష్ట్ర .. పైఠనీ చీరలకు పెట్టింది పేరని సుమారు మూడో వంతు మంది (32 శాతం)కి తెలియదు.
 • భారతదేశంలోని గిర్‌ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం మూడొంతుల మందికి (దాదాపు 39 శాతం) తెలియదు.
 • ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరంగా వ్యవహరిస్తారని, చైనా వాల్‌ తర్వాత అత్యంత పొడవైన గోడ గల కుంభల్‌గఢ్‌ కోట .. రాజస్థాన్‌లో ఉందన్న సంగతి గానీ సుమారు మూడోవంతు మందికి తెలియదు. కుంభల్‌గఢ్‌ కోట గోడ పొడవు 36 కిలో మీటర్లు.

Population: 2050 నాటికి ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉంటారని అంచనా?

Urban

పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌) మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ‘‘2021–22 వార్షిక నివేదిక’’ను నివేదికను విడుదల చేసింది. నివేదికలోని అంశాలు ఇలా..

పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన..

 • గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు.
 • చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు.
 • పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
 • కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్‌ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయి.
 • భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారింది. ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉంది.

2050 నాటికి 50 శాతం పట్టణాల్లోనే..

 • 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా.
 • పట్టణాలు గ్రోత్‌ ఇంజన్లుగా పనిచేస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనం.
 • 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగింది. 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుంది.
 • భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది.
 • వేగవంతమైన పట్టణీకరణ వల్ల.. తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది.​​​​​​​                   

దేశ జనాభాలో పట్టణాల్లో నివసించే వారి పెరుగుదల ఇలా..

సంవత్సరం

జనాభా(కోట్లలో)

పట్టణ శాతం

1951

36.10

17.29

1961

43.92

17.97

1971

54.81

19.91

1981

68.33

23.34

1991

84.64

25.71

2001

102.87

27.81

2011

121.02

31.16

2050

164.00

50 కి పైగా(అంచనా)

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2050 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటారని అంచనా
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు    : కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘‘2021–22 వార్షిక నివేదిక’’ 
ఎందుకు : ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుండటంతో..

Indian Navy: ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్‌?

Vagsheer

సైలెంట్‌ కిల్లర్‌గా పేరొందిన ‘‘వాగ్‌షీర్‌’’ జలాంతర్గామి ఏప్రిల్‌ 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుంది. దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబై మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌)లో పీ–75 స్కార్పెన్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్‌ సబ్‌మెరైన్‌ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్‌షీర్‌’ రూపొందింది. ప్రాజెక్ట్‌–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ కల్వరి, ఐఎన్‌ఎస్‌ ఖందేరి, ఐఎన్‌ఎస్‌ కరంజ్, ఐఎన్‌ఎస్‌ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సీట్రయల్స్‌ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్‌షీర్‌ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

సముద్రంలో మందుపాతర పేల్చగలదు

 • ఇప్పటివరకూ ఉన్న సబ్‌మెరైన్లలో వాగ్‌షీర్‌ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్‌మెరైన్‌లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్‌లు ఉన్నాయి.
 • ఏదైనా భారీ ఆపరేషన్‌ సమయంలో ఈ సైలెంట్‌ కిల్లర్‌ 18 టార్పెడోలు లేదా ఎస్‌ఎం39 యాంటీ–షిప్‌ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం.
 • శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు.

సైలెంట్‌ కిల్లర్‌
వాగ్‌షీర్‌ని సైలెంట్‌ కిల్లర్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్‌ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్‌మెరైన్‌లు రాడార్‌ సాయంతో కూడా వాగ్‌షీర్‌ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్‌లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్‌ సిస్టమ్‌లతో కూడిన ఈ సబ్‌మెరైన్‌ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు.

వాగ్‌షీర్‌ ప్రత్యేకతలివీ..

 • పొడవు: 221 అడుగులు
 • ఎత్తు: 40 అడుగులు
 • వేగం: ఉపరితలంపై గంటకు 20 కి.మీ., నీటి అడుగున గంటకు 37 కి.మీ.
 • బ్యాటరీ సామర్థ్యం:  360 వార్‌మెషిన్‌ బ్యాటరీ సెల్స్‌
 • సత్తా: సముద్రంలో 350 అడుగుల లోతుకు వెళ్లి శత్రువుని గుర్తించగలదు. 50 రోజుల పాటు నిర్విరామంగా పనిచేయగలదు 
 • సిబ్బంది: ఆరుగురు అధికారులు, 35 మంది సెయిలర్లు 

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, ఏప్రిల్‌ 20న ‘వాగ్‌షీర్‌’ జలాంతర్గామి జలప్రవేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 18
ఎవరు    : భారత నావికాదళం
ఎక్కడ   : అరేబియా సముద్రం, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు..

Metaverse: స్పేస్‌ టెక్‌ పాలసీ విడుదల చేసిన రాష్ట్రం?

metaverse

అంతరిక్ష సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఏకైక గమ్యస్థానంగా మార్చడం లక్ష్యంగా ‘తెలంగాణ స్పేస్‌టెక్‌ ఫ్రేమ్‌వర్క్‌ పాలసీ’ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యాధునిక ఐటీ సాంకేతికత ‘మెటావర్స్‌’(వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా ఒకే వేదికపై ఉన్నట్లు చూపే 3డీ ప్రోగ్రాం) వేదికగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏప్రిల్‌ 18న స్పేస్‌టెక్‌ పాలసీని విడుదల చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్, నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్, ఇన్‌స్పేస్‌ సీఈఓ పవన్‌ గోయెంకా, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌ ప్రసంగం–ముఖ్యాంశాలు

 • స్పేస్‌టెక్‌ వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని స్టార్టప్‌లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేసుకోవాలి.
 • ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై స్పేస్‌ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. 
 • 2026 నాటికి అంతరిక్ష రంగం 558 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా ఎదుగుతుందనే అంచనాల నేపథ్యంలో ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 
 • కృత్రిమ మేథస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఏఐ మిషన్‌ (టీ ఎయిమ్‌) మార్గదర్శనం, సాయం, మార్కెటింగ్‌ మద్దతు కోసం దేశవ్యాప్తంగా 80కిపైగా స్టార్టప్‌లు తమ వివరాలు నమోదు చేసుకున్నాయి. 
 • టీ ఎయిమ్‌ తరహాలో ఇంక్యుబేషన్, శిక్షణ, భాగస్వామ్యాల కోసం సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీసీఓఈ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 • టీ హబ్, టీఎస్‌ఐసీ, వి హబ్, రిచ్, టాస్క్, టీ వర్క్స్, ఎమర్జింగ్‌ టెక్నాలజీ విభాగం, ఇమేజ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ తదితరాలను అభివృద్ది చేయడంతో గత ఐదేళ్లలో 1,500కు పైగా స్టార్టప్‌లకు రూ.1,800 కోట్లకు పైగా నిధులు సమకూరాయి.
 • గతంలో అనేక విదేశీ సంస్థలు సాధించిన సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణల్లో భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లది కీలకపాత్ర అనే విషయం మనకు తెలుసు. ఇకపై భారతీయుల స్వదేశీ సాంకేతికతను విశ్వవ్యాప్తంగా ఎగుమతి చేయాల్సిన తరుణం వచ్చింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ స్పేస్‌టెక్‌ ఫ్రేమ్‌వర్క్‌ పాలసీ విడుదల
ఎప్పుడు : ఏప్రిల్‌ 18
ఎవరు    : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ  : అత్యాధునిక ఐటీ సాంకేతికత ‘మెటావర్స్‌’(వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా ఒకే వేదికపై ఉన్నట్లు చూపే 3డీ ప్రోగ్రాం) వేదికగా..
ఎందుకు : అంతరిక్ష సాంకేతిక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఏకైక గమ్యస్థానంగా మార్చడం లక్ష్యంగా..

Electricity: బయోమాస్‌ పెల్లెట్స్‌ అని వేటిని అంటారు?

Biomass pellets

బొగ్గు కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గుతోపాటు వెదురునూ కలిపి విద్యుదుత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానశాఖ వినూత్న ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. వెదురును నేరుగా కాకుండా పెల్లెట్ల రూపంలోకి మార్చి వినియోగిస్తారు.

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో తొలి రెండేళ్లపాటు 5శాతం, ఆ తర్వాత 7 శాతం బయోమాస్‌ పెల్లెట్లను బొగ్గుతో కలిసి ఇంధనంగా వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వెదురుతో పెల్లెట్లను రూపొందించి థర్మల్‌ కేంద్రాల్లో వినియోగించేందుకు ఉద్యానశాఖ రంగం సిద్ధం చేసింది.

దేశంలో తొలిసారిగా..
ఇప్పటికే చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో వెదురు, బయోమాస్‌ పెల్లెట్లను థర్మల్‌ కేంద్రాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే దీనిని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద భైంసా వద్ద 15 ఎకరాల్లో వెదురుసాగును ఉద్యానశాఖ చేపట్టింది. వెదురును పెల్లెట్స్‌గా మార్చే యంత్రాలనూ సిద్ధం చేసింది. కొంతమేర పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్‌టీపీసీకి పరిశీలన నిమిత్తం పంపించింది.

భీమా రకం వెదురుతో..
రాష్ట్రంలో సాధారణ వెదురు కాకుండా భీమా రకం వెదురుతో పెల్లెట్స్‌ తయారు చేయాలని నిర్ణయించారు. ఈ రకం వెదురు ఎలాంటి నేలల్లోనైనా, సరిగా నీళ్లు లేకున్నా పెరుగుతుందని.. దానిని రెండేళ్లలోనే నరికి పెల్లెట్స్‌ తయారు చేయవచ్చని ఉద్యానశాఖ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.

ఏమిటీ పెల్లెట్లు?
వృక్ష, జంతు పదార్థాలనే బయోమాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు,  చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నింటిని పొడిచేసి.. మండే రసాయనాలు కలుపుతారు. తర్వాత అత్యంత వేడి, ఒత్తిడిని కలిగించే యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే బయోమాస్‌ పెల్లెట్స్‌ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్‌ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. అయితే రాష్ట్రంలో పూర్తి వెదురుతో పెల్లెట్లను తయారు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది.​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 18 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Apr 2022 05:44PM

Photo Stories