Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 18 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-18

PM Modi: 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?

Statue of Lord Hanuman

హనుమజ్జయంతి(ఏప్రిల్‌ 16) సందర్భంగా గుజరాత్‌ రాష్ట్రం మోర్బి జిల్లాలోని మోర్బి పట్టణంలో 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 16న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్‌జీ చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి.

వోకల్‌ ఫర్‌ లోకల్‌..
విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్‌ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్‌ ఫర్‌ లోకల్‌ పథకం తెచ్చాం’’ అని చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహావిష్కరణ
ఎప్పుడు  : ఏప్రిల్‌ 16
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : మోర్బి, మోర్బి జిల్లా, గుజరాత్‌
ఎందుకు : హనుమాన్‌జీ చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా...

Free Electricity: ఉచిత కరెంట్‌ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?

Electricity

గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల చొప్పున ఉచితంగా కరెంటిస్తామని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 16న ప్రకటించింది. 2022, జూలై ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే రెండు నెలలకు కలిపి 600 యూనిట్లు దాటిటే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులు మాత్రం 600 యూనిట్లకు మించి వినియోగించిన మేరకు చెల్లిస్తే చాలని పేర్కొంది. ‘‘ఉచిత కరెంట్‌ పథకం వల్ల ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల భారం పడుతుంది. కానీ 80% మంది గృహ విద్యుత్‌ వినియోగదారులకు లబ్ధి కలుగుతుంది’’ అని ప్రభుత్వ అంచనా.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉచిత కరెంట్‌ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం? 
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు    : పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : పంజాబ్‌ రాష్ట్ర వ్యాప్తంగా..
ఎందుకు : గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల చొప్పున ఉచితంగా కరెంట్‌ అందించేందుకు..

Danish Open swimming: డానిష్‌ ఓపెన్‌లో స్వర్ణం సాధించిన భారత స్విమ్మర్‌?

Sajan, Vedaant
సజన్‌ ప్రకాశ్, వేదాంత్‌ మాధవన్‌

డెన్మార్క్‌ రాజధాని నగరం కొపెన్‌హగెన్‌ వేదికగా జరుగుతోన్న డానిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌–2022లో భారత స్విమ్మర్లు సజన్‌ ప్రకాశ్, వేదాంత్‌ మాధవన్‌ మెరిశారు. ఏప్రిల్‌ 16న జరిగిన పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో కేరళకు చెందిన సజన్‌ ప్రకాశ్‌ స్వర్ణ పతకం సాధించాడు. సజన్‌ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్‌ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సినీ నటుడు మాధవన్‌ కుమారుడైన వేదాంత్‌ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్‌ 2022, ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డానిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌–2022లో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ స్విమ్మర్‌?
ఎప్పుడు  : ఏప్రిల్‌ 16
ఎవరు    : సజన్‌ ప్రకాశ్‌
ఎక్కడ    : కొపెన్‌హగెన్, డెన్మార్క్‌
ఎందుకు : పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో కేరళకు చెందిన సజన్‌ ప్రకాశ్‌.. లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచినందున..

Electricity: అనరోబిక్‌ మీథనోట్రోపిక్‌ ఆర్కియా అని వేటిని పిలుస్తారు?

Bacteria

వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మైక్రోబయాలజీలో ప్రచురించారు.

ఇలా చేశారు..

  • పరిశోధనలో భాగంగా కాండిడేటస్‌ మిథేనోపెరెండెన్స్‌ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్‌ను ఆక్సిజన్‌ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
  • ‘‘ఎన్‌ఎంఈ (అనరోబిక్‌ మీథనోట్రోపిక్‌) ఆర్కియా’’గా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్‌ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి.
  • ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్‌ రహిత ట్యాంకులో మీథేన్‌తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్‌ ఆనోడ్‌ను జీరో ఓల్టేజ్‌ వద్ద సెట్‌ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్‌ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్‌ కాగా ఇంకోటి కెమికల్‌ టెర్మినల్‌ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్‌నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్‌ డైఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్‌కు 274 మిల్లీ యాంప్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

మొత్తం గ్రీన్‌హస్‌ వాయువుల్లో మీథేన్‌ వాటా?

  • ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్‌ సౌకర్యం లేదు.
  • భూతాపాన్ని పెంచే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో మీథేన్‌ కీలకమైనది. మొత్తం గ్రీన్‌హస్‌ వాయువుల్లో దీని వాటా 20 శాతం.
  • కార్బన్‌ డై ఆక్సైడ్‌తో పోలిస్తే మీథేన్‌ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది.
  • పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్‌ విడుదలవుతుంది.
  • భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది.

Chess: ఫాగర్నెస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌?

Krishnan Sasikiran

ఫాగర్నెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌–2022లో భారత గ్రాండ్‌మాస్టర్‌ కృష్ణన్‌ శశికిరణ్‌ విజేతగా నిలిచాడు. ఏప్రిల్‌ 17న నార్వేలోని ఫాగర్నెస్‌ పట్టణం వేదికగా ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్‌ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ఆర్యన్‌ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో శశికిరణ్‌కు టైటిల్‌ దక్కింది. ఆర్యన్‌ చోప్రాకు రెండో ర్యాంక్‌ లభించింది.

మోంటెకార్లో ఓపెన్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?
మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో గ్రీస్‌ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఏప్రిల్‌ 17న ఫ్రాన్స్‌లోని రోక్యూబ్రూనే–క్యాప్‌–మార్టిన్‌(Roquebrune-Cap-Martin) వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిట్సిపాస్‌ 6–3, 7–6 (7/3)తో అలెజాంద్రో ఫొకీనా (స్పెయిన్‌)పై గెలిచాడు. సిట్సిపాస్‌ కెరీర్‌లో ఇది ఎనిమిదో టైటిల్‌. విజేతగా నిలిచిన సిట్సిపాస్‌కు 8,36,335 యూరోల (రూ. 6 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫాగర్నెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌?
ఎప్పుడు    : ఏప్రిల్‌ 17
ఎవరు    : కృష్ణన్‌ శశికిరణ్‌
ఎక్కడ    : ఫాగర్నెస్, నార్వే
ఎందుకు    : శశికిరణ్‌ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నందున..

Telemedicine: టెలీమెడిసిన్‌ సేవల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

Telemedicine

టెలీమెడిసిన్‌ సేవల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడంలో, వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయ వర్చువల్‌ విధానంలో ఏప్రిల్‌ 16న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 2022 ఏడాది ఆఖరు నాటికి హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది.

రెండో స్థానంలో కర్ణాటక..
కేంద్ర ప్రభుత్వం.. 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్‌లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 కన్సల్టేషన్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్‌లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్‌ మూడో స్థానంలో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టెలీమెడిసిన్‌ సేవల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధిక కన్సల్టేషన్‌లు నమోదైనందున..

Minister Piyush Goyal: ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు గెలుచుకున్న సంస్థ?

Piyush Goyal

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ తలనీలాల ఎగుమతి సంస్థ ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీకి ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు దక్కింది. ఏప్రిల్‌ 16న ముంబైలోని తాజ్‌ ప్రెసిడెంట్‌ హోటల్‌లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చేతుల మీదుగా ఇండస్ట్రీ అధినేత, ఎంఎస్‌ఎంఈ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ వంక రవీంద్రనాథ్‌ అవార్డు అందుకున్నారు. తలనీలాల ఎగుమతుల ద్వారా ఉపాధి కలగడమే కాకుండా విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేకూరుతుంది. గత 32 ఏళ్లుగా ఈ పరిశ్రమ ద్వారా తణుకు, ఆచంట, నిడదవోలు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని వేలాది మంది మహిళలకు ఉపాధి కలుగుతోంది.

భారతీయ అమెరికన్‌కు కీలక హోదా
భారతీయ మూలాలున్న మరో అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్‌దేవ కొర్హొనెన్‌ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్‌టన్‌. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్‌ తల్వార్‌ను మొరాకో రాయబారిగా, షెఫాలీ రజ్దాన్‌ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌ ప్రతినిధిగా అధ్యక్షుడు నియమించారని వైట్‌హౌస్‌ గుర్తు చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు    : ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీ
ఎక్కడ    : తాజ్‌ ప్రెసిడెంట్‌ హోటల్, ముంబై
ఎందుకు : సంస్థ ఎగుమతుల ద్వారా ఉపాధి కలగడమే కాకుండా విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేకూరుతున్నందున..

Moon Soil: చంద్రుడి మృత్తికను వేలం వేసిన సంస్థ?

Moon Soil

అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే! ఆయన తనతో పాటు తెచ్చిన చంద్రుడి మృత్తికకు తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్‌ సంస్థ ‘‘బొన్‌హామ్స్‌’’ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్ర మృత్తికను గుర్తు తెలియని వ్యక్తి 5,04, 375 డాలర్లు (సుమారు 3.85 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. 

భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని
ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన ఖరారైంది. 2022, ఏప్రిల్‌ 21, 22తేదీల్లో ఆయన దేశంలో పర్యటిస్తారు. 21న లండన్‌ నుంచి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలపై చర్చిస్తారు. 22న ఢిల్లీలో మోదీతో సమావేశమవుతారు. రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో  వ్యూహాత్మక బంధాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపైనా చర్చించనున్నారు.

ప్రధాని మోదీకి పాకిస్తాన్‌ ప్రధాని లేఖ
భారత్, పాకిస్తాన్‌ మధ్య అర్థవంతమైన సంబంధాలు ఏర్పడాలని ఆ దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసమే ఇరు దేశాలు పని చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.  ‘‘భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుతున్నాం. కశ్మీర్‌తో పాటు  సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. కొత్తగా పగ్గాలు చేపట్టిన షరీఫ్‌ను అభినందిస్తూ మోదీ లేఖ రాయడం, ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలపడం తెలిసిందే.

ఎల్‌ఏసీ వద్ద చైనా టవర్లు
న్యూఢిల్లీ: సరిహద్దు వెంబడి చైనా దుందుడుకు, కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లదాఖ్‌లో వివాదాస్పద ప్రాంతంలో పాంగాంగ్‌ సరస్సుపై అక్రమ బ్రిడ్జి నిర్మించి వివాదానికి తెర తీసిన డ్రాగన్‌ దేశం, ఇప్పుడు నియంత్రణ రేఖకు అతి సమీపంలో చుశూల్‌ వద్ద ఏకంగా మూడు మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేసింది.

కొరియా మరో క్షిపణి పరీక్ష
ప్రపంచ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా కొత్తగా డిజైన్‌ చేసిన క్షిపణిని ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ఏప్రిల్‌ 17న వెల్లడించింది. అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారని తెలిపింది. ఈ ప్రయోగంతో ఫ్రంట్‌లైన్‌ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందని చెప్పింది. 2022 ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ప్రయోగాల్లో ఇది 13వది.​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 16 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Apr 2022 06:39PM

Photo Stories