Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 16 కరెంట్ అఫైర్స్
Russia-Ukraine War: సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత యుద్ద నౌక?
ఉక్రెయిన్ దాడిలో ఏప్రిల్ 14న భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్‌వా చివరకు నల్ల సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు ఏప్రిల్ 15న రష్యా ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్ రాజధానిపై మరిన్ని మిసైల్ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది.
మాస్క్‌వాకు అణు వార్‌హెడ్
- నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్‌వాపై రెండు అణు వార్ హెడ్స్ అమర్చి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్రోక్ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు.
- మాస్క్‌వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్‌వా కానుంది.
మాస్క్‌వా మిస్సైల్ క్రూయిజర్ ప్రత్యేకతలు
- రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లలో ఇది ఒకటి
- సిబ్బంది సంఖ్య: 680
- పొడవు: 186 మీటర్లు
- గరిష్ట వేగం: 32 నాటికల్ మైళ్లు(59 కి.మీ.)
ఆయుధ సంపత్తి
- 16 యాంటీ షిప్ వుల్కన్ క్రూయిజ్ మిస్సైళ్లు
- ఎస్–300 లాంగ్ రేంజ్ మెరైన్ వెర్షన్ మిస్సైళ్లు
- షార్ట్ రేంజ్ ఒస్సా మిస్సైళ్లు
- రాకెట్ లాంచర్స్, గన్స్, టార్పెడోస్
20 వేల రష్యా సైనికులు మృతి?
ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్‌లను తీవ్రంగా హెచ్చరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత యుద్ద నౌక?
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : మాస్క్‌వా మిస్సైల్ క్రూయిజర్
ఎక్కడ : నల్ల సముద్రం
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో..
Indian Navy: వాగ్‌షీర్ జలాంతర్గామిని నిర్మించిన సంస్థ?
ముంబై మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) నిర్మించిన వాగ్‌షీర్ జలాంతర్గామి 2022, ఏప్రిల్ 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని నేవీ అధికారులు ఏప్రిల్ 15న తెలిపారు. పీ75 స్కార్పిన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరో సబ్‌మెరైన్‌ను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రూ.46,000 కోట్ల విలువైన ఆర్డర్ దక్కిందని, ఇందులో 6 సబ్‌మెరైన్ ప్రాజెక్టులు, 15 బ్రేవో డిస్ట్రాయర్స్, 17 అల్ఫా స్టీల్త్ ఫ్రిగేట్స్ ఉన్నాయని ఎండీఎల్ చైర్మన్, ఎండీ నారాయణ్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 4 జలాంతర్గాములు, ఒక డిస్ట్రాయర్స్ సరఫరా చేశామని వివరించారు. పీ75 స్కార్పిన్ ప్రాజెక్టులో వాగ్‌షీర్ ఆఖరి జలాంతర్గామి. ఐదో జలాంతర్గామి అయిన ‘వగీర్’ సీ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్‌ఎస్ కల్వరీ, ఐఎన్‌ఎస్ ఖాందేరి, ఐఎన్‌ఎస్ కరాంజ్, ఐఎన్‌ఎస్ వేలా సబ్‌మెరైన్లు ఇప్పటికే విధుల్లో చేరాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, ఏప్రిల్ 20న ‘వాగ్‌షీర్’ జలాంతర్గామి జలప్రవేశం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : నేవీ అధికారులు
ఎక్కడ : అరేబియా సముద్రం, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు..
S-400 Missile System: భారత్‌కు ఎస్–400 ట్రయంఫ్ మిస్సైల్స్‌ను సరఫరా చేస్తోన్న దేశం?
ఒకవైపు ఉక్రెయిన్‌పై యుద్ధంపై కొనసాగిస్తున్న రష్యా మరోవైపు ఒప్పందం ప్రకారం భారత్‌కు ఎస్–400 ట్రయంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సరఫరాను ప్రారంభించింది. ఈ వ్యవస్థకు సంబంధించి సెకండ్ రెజిమెంట్ కొన్ని భాగాలు భారత్‌కు చేరుకోవడం మొదలయ్యిందని అధికార వర్గాలు ఏప్రిల్ 15న వెల్లడించాయి. మరికొన్ని కీలక విడిభాగాలు రావాల్సి ఉందని తెలిపాయి. ఈ క్షిపణి వ్యవస్థకు చెందిన మొదటి రెజిమెంట్ భాగాలను రష్యా 2021, డిసెంబర్‌లో సరఫరా చేసింది. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్–400 క్షిపణులు భారత్‌కు అండగా నిలవనున్నాయి.
ఆకాశంలోకి..
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను (దాదాపు రూ.35 వేల కోట్లను పైగా వెచ్చించి) కొనుగోలు చేయాలని భారత్ 2015లో నిర్ణయించింది. ఈ మేరకు 2018లో ఆ దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది. దీనిపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ భారత్ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్ డాలర్లను చెల్లించింది. 2021 చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.
ఎస్–400 ప్రత్యేకతలు..
- శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు.
- ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు.
- ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు.
- భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు.
- వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోన్న దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : రష్యా
ఎందుకు : 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం చేసుకున్నందున..
Economic Crisis: ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం?
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు(ఇంధన రేషనింగ్) విధించారు. తాజా రేషన్ విధానం ఏప్రిల్ 15న నుంచి అమల్లోకి వచ్చిందని శ్రీలంక ప్రభుత్వం అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. దీని ప్రకారం టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్ పోస్తారు. వాణిజ్య వాహనాలను రేషన్ నుంచి మినహాయించారు. విద్యుత్ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి.
వంటగ్యాస్ కోసం భారత్‌కు అభ్యర్థన..
తీవ్ర వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది. రుణ రూపేణా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు ప్రభుత్వ రంగ లిట్రో గ్యాస్ కంపెనీ తెలిపింది. శ్రీలంక రూపాయి విలువ పతనం కావడంతో అత్యవసరాలకు సైతం తీవ్ర కొరత ఏర్పడింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : శ్రీలంక
ఎక్కడ : శ్రీలంక వ్యాప్తంగా..
ఎందుకు : దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నందున..
PM Modi: కె.కె.పటేల్ ఆస్పత్రిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ నగరంలో 200 పడకల కె.కె.పటేల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏప్రిల్ 15న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో దేశంలో వైద్యుల కొరత తీరిపోనుందని అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఫలితంగా వచ్చే పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు అందివస్తారని చెప్పారు.
గుటెరస్‌తో జై శంకర్ భేటీ
భారత విదేశాంగమంత్రి జై శంకర్ ఏప్రిల్ 14న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో సమావేశమయ్యారు. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ భేటీలో.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లలో పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు జై శంకర్ ట్విటర్ ద్వారా తెలిపారు. భారత్–అమెరికా మధ్య జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు రాజ్‌నాథ్, జై శంకర్ ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కె.కె.పటేల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : భుజ్, కచ్ జిల్లా, గుజరాత్
Fungi-Plant Communication Network: హైఫే అని వేటిని అంటారు?
పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్ భాషలో సమాచార ప్రసారం చేసుకుంటాయని.. వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధనలో వెల్లడైంది.
పరిశోధన ప్రకారం... ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్‌లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్‌వర్క్‌ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు.
ఇలా కనుగొన్నారు
- చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్)తో పోలినట్లు గుర్తించారు.
- ఫంగస్‌ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు. ఒక్కో ఫంగస్ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు.
- దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు.
- ఫంగస్‌లు భూమిలోపల అంతర్గత నెట్‌వర్క్‌తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి.
- ఫంగస్‌ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది.
Heart Disease: మెటబాలిక్ సిండ్రోమ్‌గా దేనిని పరిగణిస్తారు?
మనిషిలో కుంగుబాటు(డిప్రెషన్) అనేది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె జబ్బులతో బాధిపడుతున్నవారిలో కుంగుబాటు అధికమని పేర్కొన్నారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు 55 నుంచి 75 ఏళ్లలోపు వయసున్న 6,500 మందిపై నిర్వహించిన ఈ నూతన అధ్యయనం ఫలితాలను ప్లోస్‌వన్ పత్రికలో ప్రచురించారు. ఆరోగ్యవంతుల్లో క్రమంగా డిప్రెషన్ లక్షణాలు బయటపడితే వారికి గుండెజబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని అధ్యయనంతో తేలింది.
మనుషుల్లో కుంగుబాటును సృష్టించడంలో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా చక్కెర, నడుము చుట్టూ అధిక కొవ్వు, రక్తంలో అధికంగా చెడు కొలెస్టరాల్‌ను మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు.
న్యాయాధికారుల సదస్సు–2022ను ఎక్కడ ప్రారంభించారు?
రెండు రోజుల రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు–2022ను ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 15 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్