Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 15 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-April-15

Russia-Ukraine War: ప్రముఖ యుద్ధనౌక ‘మాస్కోవా’ ఏ దేశానికి చెందినది?

Moskva War Ship

రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక ‘‘మాస్కోవా’’ను మిసైళ్లతో పేల్చామని ఉక్రెయిన్‌ అధికారులు ఏప్రిల్‌ 14న ప్రకటించారు. నల్ల సముద్రంలో తమ క్షిపణుల ధాటికి నౌక మునిగిపోయిందని ఒక అధికారి చెప్పారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లను మోసుకుపోతుంది.

ఇతర అంశాలు..

  • ఉక్రెయిన్‌ తేలికపాటి హెలికాప్టర్లను తమ సరిహద్దుల్లోకి పంపి నివాస భవనాలపై బాంబులు కురిపిస్తోందని రష్యా ఆరోపించింది.
  • ఉక్రెయిన్‌లోని 20 లక్షల మంది ప్రజలకు సాయం చేసేందుకు అతిపెద్ద క్యాష్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తామని రెడ్‌క్రాస్‌ తెలిపింది. రష్యా యుద్ధంతో ప్రభావితమైనవారికి దాదాపు 10.6 కోట్ల డాలర్లను పంచుతామని సంస్థ ప్రతినిధి నికోల్‌ చెప్పారు.
  • ఉక్రెయిన్‌లో ఐర్లాండ్‌ రక్షణ, విదేశాంగ మంత్రి సైమన్‌ పర్యటించారు. ఉక్రెయిన్‌కు దాదాపు 5.8 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అమెరికా తాజాగా ప్రకటించిన 80 కోట్ల డాలర్ల సాయానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
  • మాస్కోవా యుద్ధనౌక పేల్చివేత  ఘటనను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్‌స్టాంపును ఉక్రెయిన్‌ విడుదల చేసింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక ‘‘మాస్కోవా’’ను పేల్చామని ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : ఉక్రెయిన్‌
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో..

Pradhanmantri Sangrahalaya: ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు?

Pradhanmantri Sangrahalaya

భారత మాజీ ప్రధానుల జీవిత/పరిపాలనా విశేషాలను భవిష్యత్తు తరాలు ఎల్లప్పుడూ స్మరించుకునేలా.. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి సంగ్రహాలయ(ప్రధానమంత్రుల మ్యూజియం)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చరిత్రను గుర్తుచేసే ఈ సంగ్రహాలయాన్ని ఏప్రిల్‌ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మన దేశం నేటి ఉన్నత స్థితికి చేరడం వెనుక స్వాతంత్య్రానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాల కృషి ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం ఎంతో సముచితమన్నారు.

ప్రధానమంత్రి సంగ్రహాలయ – విశేషాలు

  • నిర్మాణ ప్రదేశం: తీన్‌మూర్తి కాంప్లెక్స్, న్యూఢిల్లీ
  • విస్తీర్ణం: 10,491 చదరపు మీటర్లు
  • నిర్మాణ వ్యయం: రూ. 271 కోట్లు
  • లోగో: ప్రజాస్వామ్యానికి చిహ్నమైన ధర్మచక్రాన్ని దేశ ప్రజలు ఎత్తి పట్టుకున్నట్లుగా ఉంటుంది.
  • మ్యూజియంలో మొత్తం 43 గ్యాలరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు పనిచేసిన 14 మంది మాజీ ప్రధానుల అరుదైన చిత్రాలు, ప్రసంగాలు, వీడియో క్లిప్‌లు, ఇంటర్వ్యూలు, వారి చేతిరాతలను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. 
  • స్వాతంత్య్ర సంగ్రామం, రాజ్యాంగ ముసాయిదా రచన వంటి అపురూప ఘట్టాలను గుర్తుచేసే చిత్రాలూ ఉన్నాయి.
  • మాజీ ప్రధానులకు చెందిన కొన్ని వ్యక్తిగత వస్తువులు, వారికి వచ్చిన బహుమతులను కూడా పొందుపరిచారు.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రధానమంత్రి సంగ్రహాలయ(ప్రధానమంత్రుల మ్యూజియం) ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : తీన్‌మూర్తి కాంప్లెక్స్, న్యూఢిల్లీ
ఎందుకు : భారత మాజీ ప్రధానుల జీవిత/పరిపాలనా విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు..​​​​​​​

India-Pakistan: అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐ?

CJI in Punjab

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఏప్రిల్‌ 14న పంజాబ్‌లో పర్యటన కొనసాగించారు. రాష్ట్రంలోని అట్టారీ–వాఘా సరిహద్దును, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) మ్యూజియంను సందర్శించారు. భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు అయిన జీరో పాయింట్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను సీజేఐ దంపతులు తిలకించారు. అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ రికార్డుకెక్కారు. అలాగే బైశాఖీ పర్వదినం సందర్భంగా పంజాబ్‌ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

సీజేఐ దంపతులు ఏప్రిల్‌ 13న పంజాబ్‌ పర్యటన ప్రారంభించారు. తొలుత అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)?
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ఎక్కడ    : భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు
ఎందుకు : పంజాబ్‌లో రాష్ట్ర పర్యటనలో భాగంగా..

Pink Lady: ఏ దేశానికి చెందిన న్యూస్‌ రీడర్‌ పింక్‌ లేడీగా పేరొందారు?

Kim Jong-Un

అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, దేశాధినేత మరణం..తదితర ప్రధాన ఘటనలకు ఉత్తరకొరియా వార్తా గొంతుకగా ఉన్న న్యూస్‌ రీడర్‌ రీ చున్‌ హై(79)కి ఆ దేశాధిపతి కిమ్‌ జొంగ్‌ ఉన్‌ విలాసవంతమైన భవనం కానుకగా ఇచ్చారు. దేశ అధికార వార్తాసంస్థ ‘‘కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌(కేసీటీవీ)’’లో 5 దశాబ్దాలుగా పనిచేస్తున్న రీ చున్‌ సంప్రదాయ వస్త్రధారణతో ‘పింక్‌ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. రీచున్‌కు.. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని రెసిడెన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ఏప్రిల్‌ 13న ప్రారంభోత్సవం సందర్భంగా అధ్యక్షుడు కిమ్, రీచున్‌తో కలిసి ఇల్లంత కలియదిరిగారు.

సింగపూర్‌ ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు?
సింగపూర్‌ కాబోయే ప్రధాన మంత్రిగా ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్‌ వాంగ్‌ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని లీ హిసీన్‌ లూంగ్‌ వారసుడిగా అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) అధ్యక్షుడిగా వాంగ్‌ ఏప్రిల్‌ 14న పార్టీ ఎంపిక చేసింది. అధికార పార్టీకి నాలుగో తరం అధినాయకుడిగా ఆయన వ్యవహరిస్తారు.

PHDCCI: భారత్‌ 2022–23లో ఎన్ని బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించనుంది?

FDIs

భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) అంచనా వేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్‌ ఎన్ని లక్షల కోట్లు?
2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని, పన్ను రాబడులు పుంజుకుంటాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆయా అంశాలు ఎకానమీని ఐదు ట్రిలియన్‌ డాలర్ల దిశగా నడుపుతాయన్న భరోసాను వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్‌ (మూలధన వ్యయం)ను 35.4 శాతం పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్‌ రూ. 5.5 లక్షల కోట్లు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా.
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)  
ఎందుకు : ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని..

Millets: మిల్లెట్స్‌ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం?

చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్‌ మిషన్‌’కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి సరికొత్త వ్యవసాయ విప్లవం దిశగా కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. మేజర్‌ మిల్లెట్స్‌గా పరిగణించే సజ్జలు, జొన్నలు, మైనర్‌ మిల్లెట్స్‌గా పరిగణించే రాగులు, కొర్రలు, వరిగ, ఊద, సామలు, అరిక పంటలను సాగు చేయడం ద్వారా ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు.

రాష్టంలోని ఏ జిల్లాలో డీవీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కొటార్లపల్లె వద్ద స్మార్ట్‌ డీవీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు కానుంది. రూ.50 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కంపెనీకి ఏప్రిల్‌ 14న ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.నారాయణస్వామి భూమి పూజ చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మిల్లెట్స్‌ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం  
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా..
ఎందుకు : రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా..

Men's Hockey: హాకీ ప్రపంచకప్‌–2023కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?

Hockey 2023

ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌–2023కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.  ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో జనవరి 13 నుంచి 29వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ టోర్నీ లోగోను ఏప్రిల్‌ 14న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆవిష్కరించారు. ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. హాకీ ఇండియా, దాని అధికారిక భాగస్వామి ఒడిషా రాష్ట్రం ఈ ప్రపంచకప్‌నకు వరుసగా రెండోసారి ఆతిథ్యమిస్తున్నాయి. 2018 ప్రపంచకప్‌ కూడా భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్షుడిగా నరిందర్‌ బత్రా ఉన్నారు.

ఆసీస్‌ హెడ్‌ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించారు. జస్టిన్‌ లాంగర్‌ తర్వాత 2022, ఫిబ్రవరిలో మెక్‌ డొనాల్డ్‌కు తాత్కాలికంగా కోచింగ్‌ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన్నే నాలుగేళ్ల పాటు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించారు. గతంలో బిగ్‌బాష్‌ లీగ్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్‌ 2019లో ఆస్ట్రేలియా కోచింగ్‌ బృందంలో చేరారు. ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడి మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌–2023 లోగో ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌
ఎక్కడ    : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌–2023ను ఒడిశా రాష్ట్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 14 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Apr 2022 06:27PM

Photo Stories