Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 14 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-14

Union Cabinet: రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ ప్రధాన ఉద్దేశం?

Panchayat Raj

పంచాయతీరాజ్‌ సంస్థల్లోని ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)కు రూ.5,911 కోట్లు అందనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏప్రిల్‌ 13న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. పథకం రూపురేఖలు మార్చి 2026 మార్చి 31 దాకా కొనసాగించాలని నిర్ణయించింది. గ్రామాల్లో సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన, ఆరోగ్య కల్పన, బాలలకు సౌకర్యాలు, సుపరిపాలన తదితర లక్ష్యాలను సాధించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలను కల్పించాలని నిర్ణయించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)కు రూ.5,911 కోట్లు కేటాయించాలని నిర్ణయం
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు    : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 
ఎందుకు : పంచాయతీరాజ్‌ సంస్థల్లోని ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించేందుకు..

Fish Species: ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ఏమని అంటారు?

Fish

భవిష్యత్‌లో శీతోష్ణస్థితి మార్పుతో సముద్రాలు అనూహ్యంగా వేడెక్కి చేపల జాతులు తగ్గిపోతాయని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ వివరాలను రాయల్‌ సొసైటీ బీకి చెందిన జర్నల్‌ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రెడేటర్‌– ప్రే సంబంధాలు (ఇతర జీవులను చంపి తినే జీవిని ప్రెడేటర్‌ అంటారు. ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ప్రే అంటారు) మార్పు చెందిన పలు జాతులు బతికేందుకు అవసరమైన పరిస్థితులు మారిపోతాయని తెలిపింది. కేవలం పెద్ద జాతుల చేపలే కాకుండా, వాణిజ్యపరమైన చేపల జాతులు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. ఉదాహరణకు అట్లాంటిక్‌లో జాలరికి ‘‘200 ఫిష్‌ ఇయర్స్‌’’ తర్వాత ప్రస్తుతం దొరికేదాని కన్నా తక్కువగా చేపలు దొరుకుతాయని వివరించిది.

చేపలు తగ్గే కొద్దీ వాటి వేట అధికమవుతుందని, దీనివల్ల జీవవైవిధ్యతలో భారీ మార్పులు వస్తాయని పరిశోధనలో పాల్గొన్న మలిన్‌ పింక్సీ చెప్పారు. కంప్యూటర్‌ మోడల్స్‌ను ఉపయోగించి ప్రెడేటర్‌– ప్రే సంబంధాలను విశ్లేషించినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ లక్షల చేపల జాతులు ధృవప్రాంతాలకు పోతాయని, దీనివల్ల భూమిపై జీవరాసుల బంధాల్లో సైతం గణనీయమార్పులు వస్తాయని చెప్పారు.​​​​​​​

Chess: రెక్యావిక్‌ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?

R Praggnanandhaa

ప్రతిష్టాత్మక రెక్యావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఐస్‌లాండ్‌ రాజధాని రెక్యావిక్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. మొత్తం 150 మంది క్రీడాకారులు ఈ టోర్నిలో పాల్గొన్నారు. చాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు 5 వేల యూరోలు (రూ. 4 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 58 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన నాలుగో భారతీయ చెస్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో పెంటేల హరికృష్ణ (2006), అభిజిత్‌ గుప్తా (2010, 2016), భాస్కరన్‌ ఆధిబన్‌ (2018) ఈ ఘనత సాధించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మక రెక్యావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు    : భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద
ఎక్కడ    : రెక్యావిక్, ఐస్‌లాండ్‌
ఎందుకు : ఈ టోర్నీలో ప్రజ్ఞానంద నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినందున..

2021–22 Financial Year: భారత్‌ నెలకు ఎన్ని బిలియన్‌ డాలర్ల ఎగుమతులు చేసింది?

India Exports

భారత్‌ ఎగుమతులు మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటును 40 బిలియన్‌ డాలర్లు దాటి చరిత్ర సృష్టించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌ 13న ఈ మేరకు తాజాగా గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు..

  • ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాల మేరకు భారత్‌ 420 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది.
  • మొత్తం ఎగుమతులు 419.65 బిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 611.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 192.24 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు 102.63 బిలియన్‌ డాలర్లే కావడం గమనార్హం.
  • ఇక ఒక్క సేవల రంగాన్ని చూస్తే, 2021–22లో ఎగుమతుల విలువ చరిత్రాత్మక గరిష్ట స్థాయి 249.24 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2020–21 ఇదే కాలంతో పోల్చి చూస్తే (206.09 బిలియన్‌ డాలర్లు) విలువ 21 శాతం పెరిగింది. ఇక సేవల దిగుమతులు ఇదే కాలంలో 23.20% పెరిగి 144.70 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2020–21లో ఈ విలువ 117.52 బిలియన్‌ డాలర్లు.  వెరసి ఒక్క సేవల రంగంలో వాణిజ్య మిగులు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 17.94 శాతం పెరిగి 88.57 బిలియన్‌ డాలర్ల నుంచి 104.45 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Skoch Awards 2022: స్కోచ్‌ మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అవార్డుకి ఎంపికైన కార్యక్రమం?

Skoch Award

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘‘వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ’’ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్‌ మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అవార్డు లభించింది. కార్యక్రమంలో భాగంగా 30 లక్షల మందికీ ఒకేసారి పట్టాలు పంపిణీ చేశారు. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఇది కాకుండా మరో మూడు అవార్డులూ రాష్ట్రానికి వచ్చాయి. ‘మీ భూమి ప్రాజెక్టు’కి స్కోచ్‌ సిల్వర్‌ అవార్డు దక్కింది. కౌలు రైతులకు ఆన్‌లైన్‌లో కార్డులు జారీ చేసే క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌ (సీసీఆర్‌సీ), భూసోదక్‌ యాప్‌కు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు వచ్చాయి. మొత్తం 9 ప్రాజెక్టులకు సీసీఎల్‌ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌) స్కోచ్‌ అవార్డ్స్‌–2022కి నామినేషన్లు పంపగా వాటిలో నాలుగింటికి అవార్డులు వచ్చాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్కోచ్‌ మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అవార్డుకి ఎంపికైన కార్యక్రమం?
ఎప్పుడు  : ఏప్రిల్‌ 13
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ 
ఎందుకు : లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించినందుకు..

Telangana: ప్రాణహిత నది మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు?

Pranahita River

ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏప్రిల్‌ 13న...∙మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలు స్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు.

ప్రాణహిత నది
మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా పర్వతాల్లో జన్మిస్తున్న ‘వైన్‌గంగ’, మహారాష్ట్రలో జన్మిస్తున్న ‘పెన్‌ గంగ, ‘వార్ధా’ అనే మూడు చిన్న నదుల కలయికతో ప్రాణహిత ఏర్పడుతోంది. ఇది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ద్వారా ప్రవహించి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశిస్తోంది. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలుస్తోంది. గోదావరి నదికి ప్రాణహిత అతి ముఖ్యమైన ఉపనది. ఇది గోదావరికి దాదాపు 40 శాతం నీటిని సరఫరా చేస్తోంది. ప్రాణహిత నది మొత్తం పొడవు 113 కిలోమీటర్లు.

రాష్ట్రంలో తొలి పామాయిల్‌ ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు?
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఏప్రిల్‌ 13న శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక తొలిసారి పామాయిల్‌ ఫ్యాక్టరీని సిద్దిపేటలోనే స్థాపిస్తున్నామని తెలిపారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రాణహిత పుష్కరాలకు అంకురార్పణ 
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఎక్కడ    : అర్జునగుట్ట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా 

United Nations: ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ?

Food Waste

ఆహారం వృథాలో రెండు భిన్నకోణాలు ఉన్నాయి. పంటలు పండించడం నుంచి రవాణా, మార్కెటింగ్, విక్రయం వరకు ఉన్న దశల్లో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో వృథా ఎక్కువగా ఉంటోంది. పంటలు పండించడం, నిల్వ వంటి సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది.

  • వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం విషయంలో అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో వృథా చాలా ఎక్కువ. అలాంటి దేశాల్లో కేవలం ఇళ్లలోనే 30 శాతానికిపైగా ఆహారం వృథా అవుతున్నట్టు యూఎన్‌ నివేదిక తెలిపింది. తమ సంపాదనలో ఆహారానికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉండటం, ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్‌ చేయడం, అవసరానికి మించి కొనుగోలు వంటివి దీనికి కారణమని పేర్కొంది.
  • యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లోని దేశాల్లో సగటున ఒక్కోవ్యక్తి ఏటా 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తారని అంచనా. ఇది ఆఫ్రికా, దక్షిణాసియాతో పోలిస్తే పదింతలు ఎక్కువ.
  • భూమ్మీద ఏటా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఓ రూపంలో వృథా అవుతూనే ఉన్నాయి.
  • మనుషులు తినేందుకు వీలుగా తయారు చేసిన/వండిన ఆహారంలో దాదాపు మూడో వంతు వరకు.. కిందపడిపోవడం/చెడిపోవడం/పడేయడం ద్వారా వృథా అవుతోంది. వృథా అవుతున్న ఆహారం ఏటా సుమారు 1,300 టన్నులు ఉంటుందని అంచనా. 
  • ఏటా ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో పావు వంతు వినియోగించుకోగలిగినా.. 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చట. Food Wastage

     

కోట్ల కిలోమీటర్ల మేర వృథా..

  • ఏటా భారీగా ఆహారం వృథా అవుతోంది కదా. మరి దానంతటినీ ఉత్పత్తి చేయడానికి వాడుతున్న భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా?.. ఏకంగా 1.35 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న వ్యవసాయ భూమిలో 28శాతం. మరోలా చెప్పాలంటే.. ఇండియా, అమెరికా, ఈజిప్ట్‌ దేశాల్లోని మొత్తం భూమి విస్తీర్ణంతో సమానమైన వ్యవసాయ భూమిలో ఉత్పత్తయ్యే ఆహారం వృధా అవుతోంది.
  • ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు లక్ష కోట్ల డాలర్లు. భారతీయ కరెన్సీలో చూస్తే.. రూ. 75 లక్షల కోట్లు.

ఆహార వృథాలో మొదటి పది దేశాలు

దేశం

ఆహార వృథా(ఏటా.. టన్నుల్లో)

చైనా

9,16,46,213

ఇండియా

6,87,60,163

యూఎస్‌ఏ

1,93,59,951

జపాన్‌

81,59,891

జర్మనీ

62,63,775

ఫ్రాన్స్‌

55,22,358

యూకే

51,99,825

రష్యా

48,68,564

స్పెయిన్‌

36,13,954

ఆస్ట్రేలియా

25,63,110

 

United Nations: ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్‌ ఎన్నికైంది. ఐక్యరాజ్యసమితికి ఉన్న ఆరు కీలక విభాగాల్లో ఆర్థిక, సామాజిక మండలి ఒకటి. ఐరాస సర్వప్రతినిధి సభ నుంచి ఎన్నికైన 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించిన.. సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జీవోస్‌ కమిటీ, కమిషన్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక హక్కుల కమిటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది. ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

మొదటి ప్రపంచయుద్ధం (1914–1918) ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉండేది. అయితే ఈ సంస్థ రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలువరించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాపాడటానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్టోబర్‌ 24, 1945న ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అక్టోబర్‌ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.

రష్యాది నరమేధమే: బైడెన్‌
ఉక్రెయిన్‌లో రష్యా అకృత్యాలు ముమ్మాటికీ నరమేధమేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని గానీ జాతిని గానీ మతపరమైన సమూహాన్ని గానీ పూర్తిగా గానీ పాక్షికంగా గానీ ధ్వంసం చేయడాన్ని, అందుకు ప్రయత్నించడాన్ని నరమేధంగా ఐరాస ఒప్పందం నిర్వచిస్తోంది. సదరు ఒప్పందంలో అమెరికా కూడా భాగస్వామి. ఈ నేపథ్యంలో ఆ పదాన్ని వాడితే దాన్ని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుంది.

కొనసాగుతున్న బాంబుల వర్షం
ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా బాంబుల వర్షం కొనసాగుతూనే ఉంది. ఖర్కీవ్‌లో ఓ కలినరీ స్కూల్‌పై భారీ దాడి జరిగింది. బుచాలో 700 మందికి పైగా మరణించారని, 200 మంది దాకా ఆచూకీ లేకుండా పోయారని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఇప్పటిదాకా 403 మృతదేహాలను ఖననం చేసినట్టు చెప్పింది.​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 13 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Apr 2022 06:40PM

Photo Stories