Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 13 కరెంట్ అఫైర్స్
Economic Crisis in Sri Lanka: విదేశీ రుణాల చెల్లింపులను నిలిపివేసిన దేశం?
విదేశీ మారక నిల్వలు అత్యంత క్షీణదశకు చేరుకోవడంతో విదేశీ రుణాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (డిఫాల్ట్) శ్రీలంక ఏప్రిల్ 12న ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిల్ అవుట్‌ప్యాకేజీ పెండింగ్‌లోనే ఉన్నందున వాటిని తీర్చలేమంటూ చేతులెత్తేసింది. అంతర్జాతీయ బాండ్లు, ద్వైపాక్షిక రుణాలు, సంస్థాగత రుణదాతలు, వాణిజ్యబ్యాంకుల చెల్లింపులకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని తెలిపింది. ఐఎంఎఫ్‌తో ఒప్పందంపై అంగీకారం కుదిరేవరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. విదేశీ ప్రభుత్వాలతో సహా బహిర్గత రుణదాతలు వారి వడ్డీలను అసల్లో కలుపుకోవచ్చని(క్యాపిటలైజింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్) లేదా లంక రూపాయల్లో చెల్లింపునకు అంగీకరించవచ్చని ఆర్థిక శాఖ సూచించింది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరిగిపోతోంది. ప్రజలు నిరసనలతో రోడ్లపైకి వస్తున్నారు. ప్రస్తుతం లంక విదేశీ రుణ భారం దాదాపు 5100 కోట్ల డాలర్ల పైచిలుకుంది. 2022 ఏడాదిలో 700 కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి ఉంది. జనవరిలో ప్రభుత్వం 50 కోట్ల డాలర్ల బాండ్ చెల్లింపులను సెటిల్ చేసింది. జూలైలో మరో 100 కోట్ల డాలర్ల బాండ్ పేమెంట్లు చెల్లించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశీ రుణాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (డిఫాల్ట్) ప్రకటించిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : శ్రీలంక
ఎందుకు : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపుదాల్చడంతో..
Tennis Player: ఆటకు వీడ్కోలు పలికిన బెల్జియం క్రీడాకారిణి?
గతంలో రెండుసార్లు రిటైర్మెంట్ (2007, 2012) ప్రకటించి ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్ స్టార్ కిమ్ క్లియ్‌స్టర్స్ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆట నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ఏప్రిల్ 13న తెలిపింది. 2021 ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియ్‌స్టర్స్ తన కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను (2005, 2009, 2010–యూఎస్ ఓపెన్; 2011–ఆస్ట్రేలియన్ ఓపెన్) నెగ్గింది. తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన క్లియ్‌స్టర్స్ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ నెగ్గిన క్లియ్‌స్టర్స్ 523 మ్యాచ్‌ల్లో గెలిచి, 131 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ. 186 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించింది.
సానియా మీర్జా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
చార్ల్స్‌టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ-2022లో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న చార్ల్స్‌టన్ నగరం వేదికగా ఏప్రిల్ 10న జరిగిన ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 2–6, 6–4, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాగ్దా లినెట్ (పోలాండ్)–ఆంద్రియా క్లెపాచ్ (స్లొవేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓడిన సానియా–హర్డెస్కా జోడీకి 25,900 డాలర్ల (రూ. 19 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.Commonwealth Games : 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న దేశం?
2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) ఆర్గనైజింగ్ కమిటీ ఏప్రిల్ 12న ప్రకటించింది. 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆస్ట్రేలియా దేశం ఆతిథ్యమివ్వనుందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా(ఆస్ట్రేలియా) రాష్ట్రంలోని మెల్‌బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్‌లాండ్ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు.
టి20 క్రికెట్ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్‌గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ ఈవెంట్లు లేవు. సీజీఎఫ్ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్‌కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్ (1962), బ్రిస్బేన్ (1982), గోల్ట్‌కోస్ట్ (2018)లలో మెగా ఈవెంట్స్ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్ కామన్వెల్త్ గేమ్స్ పోటీలు కూడా జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2026 కామన్వెల్త్ క్రీడలను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) ఆర్గనైజింగ్ కమిటీ
ఎక్కడ : మెల్‌బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్‌లాండ్ నగరాలు, విక్టోరియా రాష్ట్రం, ఆస్ట్రేలియా
National Panchayati Raj Day: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను అవార్డులను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు దక్కాయి.
ఏపీ గెలుచుకున్న అవార్డుల వివరాలు ఇలా..
దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వస్తీకరణ్ పురస్కారాలు:
- ఉత్తమ జిల్లా పరిషత్ (1): తూర్పుగోదావరి
- ఉత్తమ మండల పరిషత్‌లు (4): పెద్దమండ్యం(ఉమ్మడి చిత్తూరు జిల్లా), సబ్బవరం (ఉమ్మడి విశాఖపట్నం జిల్లా), మద్దికెర తూర్పు (ఉమ్మడి కర్నూలు జిల్లా), రేగిడి ఆమదాలవలస (ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా)
- ఉత్తమ గ్రామ పంచాయతీలు (8): మంగళంపేట (ఉమ్మడి చిత్తూరు జిల్లా), మినుములూరు (ఉమ్మడి విశాఖపట్నం జిల్లా), కలిగిరి, అనుమ సముద్రం (ఉమ్మడి నెల్లూరు జిల్లా), ఏడిద (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా), అనంతపురం రూరల్ (అనంతపురం జిల్లా), చేబ్రోలు, దమ్మనవారిపాలెం (ఉమ్మడి గుంటూరు జిల్లా)
ప్రత్యేక కేటగిరీలో అవార్డులు గెలుచుకున్న గ్రామ పంచాయతీలు
- గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఉత్తమ గ్రామ పంచాయతీ: మాబగం (ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా)
- చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ: యెక్కోలు (ఉమ్మడి నెల్లూరు జిల్లా)
- నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారం: కొత్త మూలపేట (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)
73వ రాజ్యాంగ సవరణ..
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వాలు ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు/అధికారులకు ఏప్రిల్ 24న అవార్డులు అందజేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పాలి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ అవార్డుల కింద కేంద్రం జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 నుంచి రూ.16 లక్షలు అందజేయనుంది.
Russia-Ukraine War: రష్యాలో ఏటా ‘విక్టరీ డే’ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రష్యా సైన్యానికి కొత్త సారథిగా రష్యా దక్షిణ మిలటరీ జిల్లా కమాండర్ అలెగ్జాండర్ డివోర్నికోవ్ నియమితులయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ విజయానికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9ని విక్టరీ డేగా జరుపుకుంటారు. ఆ నాటికి ఉక్రెయిన్‌పై విజయాన్ని పుతిన్‌కు కానుకగా ఇవ్వాలని అలెగ్జాండర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
వొస్తోచ్నీ స్పేస్ లాంచ్ స్టేషన్ ఏ దేశంలో ఉంది?
పాశ్చాత్య దేశాల ఆంక్షల దాడిని రష్యా విజయవంతంగా తట్టుకుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆంక్షలు అంతిమంగా వాటికే బెడిసికొడతాయన్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకోతో కలిసి ఆయన ఏప్రిల్ 12న తూర్పు రష్యాలోని వొస్తోచ్నీ స్పేస్ లాంచ్ స్టేషన్‌ను సందర్శించారు. రష్యా వ్యతిరేక స్థావరంగా మారిందంటూ ఉక్రెయిన్‌పై మండిపడ్డారు. మరోవైపు రష్యాలోని ప్రధాన బ్యాంకులు, 400 మంది వ్యక్తులను కూడా ఆంక్షల పరిధిలోకి తెస్తున్నట్టు జపాన్ ప్రకటించింది. నోకియా కంపెనీ కూడా రష్యా మార్కెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్రెయిన్‌లోని రష్యా సైన్యానికి కొత్త సారథిగా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : ఏప్రిల్ 09
ఎవరు : అలెగ్జాండర్ డివోర్నికోవ్
ఎందుకు : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం ఘోరంగా నేపథ్యంలో..
Hubble Space Telescope: జోవియన్ గ్రహాలు అని ఏ గ్రహాలను పిలుస్తారు?
గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్‌పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి. అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది.
స్టెల్లార్ డిస్క్‌లు అని వేటిని అంటారు?
ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్‌లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు.
తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు.
Tennis: సాలినాస్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన జంట?
భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో పదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్వెడార్‌లోని సాలినాస్ నగరం వేదికగా ఏప్రిల్ 10న ముగిసిన సాలినాస్ ఓపెన్ టోర్నీ-2022లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’ లో రెండో సీడ్ అరగాన్ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాలినాస్ ఓపెన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలిచిన జంట?
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట
ఎక్కడ : సాలినాస్, ఈక్వెడార్
ఎందుకు : ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’ లో రెండో సీడ్ అరగాన్ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీపై విజయం సాధించినందున..
Formula One: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఫెరారీ డ్రైవర్?
ఫార్ములావన్ తాజా సీజన్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ రెండో టైటిల్ సాధించాడు. మెల్‌బోర్న్ వేదికగా ఏప్రిల్ 10న జరిగిన సీజన్ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో లెక్‌లెర్క్ (మొనాకో) విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ తో ప్రారంభించిన లెక్‌లెర్క్ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు.
రన్నరప్ తెలంగాణ
జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏప్రిల్ 10న జరిగిన ఫైనల్లో తెలంగాణ 82–131 పాయింట్ల తేడాతో ఇండియన్ రైల్వేస్ జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల ఫైనల్లో తమిళనాడు 87–69తో పంజాబ్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఫెరారీ డ్రైవర్?
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ (మొనాకో)
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు :58 ల్యాప్‌ల రేసును లెక్‌లెర్క్ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచినందున..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 07 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్