Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 28th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu November 28th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నవంబర్‌ 26న ప్రయోగించిన 44 మీటర్ల ఎత్తయిన పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ 1,117 కేజీల ఎర్త్‌ ఆబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ఓషన్‌శాట్‌–03(ఈవోఎస్‌6) సహా మొత్తం 1,171 కేజీల తొమ్మిది ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. భిన్న బరువుల ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి చేర్చేందుకు తొలిసారిగా రాకెట్‌లో రెండు ఆర్బిట్‌ చేంజ్‌ థ్రస్టర్ల(ఓసీటీ)ను వాడారు.  నుంచి 87వదికాగా, పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో ఇది 56వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ సంస్థకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, బెంగళూరుకు చెందిన పిక్సెల్‌ ఇండియా వారి ఆనంద్‌ శాటిలైట్, హైదరాబాద్‌కు చెందిన ధృవస్పేస్‌ వారి కిలోన్నర బరువైన రెండు థైబోల్ట్‌ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. మొదట 742 కి.మీ.ల ఎత్తుకు వెళ్లి అక్కడ ఓషన్‌శాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత కిందకు దిగొచ్చి 516–528 కి.మీ.ల ఎత్తులో విస్తరించిన సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో వేర్వేరు స్థాయిల్లో మిగతా వాటిని ప్రవేశపెట్టారు. ఇందుకోసం వేర్వేరుగా రెండు ఆర్బిట్‌ ఛేంజ్‌ థ్రస్టర్లను వాడారు. భారత్‌–భూటాన్‌ సంయుక్తంగా తయారుచేసిన ఐఎన్‌ఎస్‌–2బీ ఉపగ్రహాన్నీ ఇక్కడి కక్ష్యలోనే ప్రవేశపెట్టారు. ఆస్ట్రోకాస్ట్‌ ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన స్పేస్‌ఫ్లైట్‌ వారి పేలోడ్లను వాడారు. 
విజయవంతంగా కక్ష్యలోకి..
ఓషన్‌శాట్‌–3 నుసముద్రాల మీద అధ్యయనం కోసం ప్రయోగించామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ‘‘చేపల వేటకు అనువైన ప్రాంతాల గుర్తింపు, భారత తీర, సముద్రప్రాంత భద్రత, తుపాన్ల గమనాలు తదితరాల కోసం ఓషన్‌శాట్‌ను ప్రయోగించాం. ఇండియా–భూటాన్‌ సంయుక్తంగా తయారు చేసిన ఐఎన్‌ఎస్‌2బీలోని పేలోడ్లు మానవ వనరులు, డిజిటల్‌ టెక్నాలజీని మరింతగా పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయి. ఉపగ్రహాలన్నీ విజయవంతంగా కక్ష్యల్లోకి చేరాయి’’ అన్నారు. ఐఎన్‌ఎస్‌–2బీ ఉపగ్రహ ప్రయోగాన్ని భూటాన్‌కు మన బహుమతిగా విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అభివర్ణించారు. స్పేస్‌ సైన్స్‌ విషయంలో భూటాన్‌కు మరింత సాయమందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. మరోసారి ఘనవిజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. 

6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Avian Flu: అమెరికాలో ఎవియన్‌ ఫ్లూ.. 5 కోట్ల కోళ్లు బలి
అమెరికాలో ఎవియన్‌ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్‌ ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది. 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్‌ దేశాల్లో కూడా ఎవియన్‌ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్లో పలు సూపర్‌ మార్కెట్లు ఒక్కో కస్టమర్‌ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్‌ పెడుతున్నాయి. 

Mumbai Terror Attacks: మారుణ హోమానికి 14 ఏళ్లు..
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పద్నాలుగేళ్ల క్రితం 2008 నవంబరు 26న పాకిస్థాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమం ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా 26/11 అటాక్ చరిత్రలోనే ఓ చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. పాకిస్తాన్‌ వైపు సముద్ర మార్గంలో దొంగచాటుగా ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రమూకలు ముంబై విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా 300 మంది వరకు గాయపడ్డారు. ఈ అటాక్‌లో మన సైనికులు టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి ఇంకేంతో మంది ప్రాణాలను కాపాడి.. వారు అమరులయ్యారు. ఈ దాడుల్లో నేలకొరిగిన అమాయక పౌరులను, భద్రతా బలగాలను జాతి కృతజ్ఞతతో స్మరించుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ‘ఈ దాడుల్లో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఎందరో భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. వారందరికీ నా నివాళులు’అని తెలిపారు. 

UNESCO Awards: గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు

Golconda Fort


ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునె­స్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్‌ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్‌) కింద కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి  ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’కు ఎంపికయ్యాయి. 
దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్‌షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్‌ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది.  
ముంబై మ్యూజియంకు చోటు.. 
ఏసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్‌ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌’. ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్‌లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్‌ మెరిట్‌ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్‌ టెంగ్‌ ఫాంగ్‌ చారిటబుల్‌ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 

First Indian Private Rocket : ఇస్రో చరిత్రలో తొలిసారిగా నింగిలోకి ప్రైవేట్‌ రాకెట్‌.. మిషన్‌ సక్సెస్‌..
40 ఎకరాల విస్తీర్ణంలో..
40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో  పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్‌ అనురాధ నాయక్‌ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్‌ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. 

Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సుప్రీంకోర్టులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. 2023 జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్‌ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.  ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్‌ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్‌ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 
మృతులకు నివాళి.. 
2008 నవంబర్‌ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్, జస్ట్‌ఈజ్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్ట్, ఎస్‌3వాస్‌ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది.  

Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేర‌య్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..

E-Court Project: ప్రజల చెంతకు కోర్టులు.. సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవ సంద‌ర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్‌ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ చంద్ర‌చూడ్ అన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్‌ మొబైల్‌ యాప్‌ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్‌ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్‌ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. 
జడ్జిలపై గురుతర బాధ్యత 
ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందన్నారు.  న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు.

Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం.. మన్‌కీ బాత్‌లో మోదీ  

Narendra modi


‘విక్రమ్‌–ఎస్‌’ రాకెట్‌ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. నవంబర్‌ 27వ తేదీ 95వ ‘మన్‌కీ బాత్‌’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. 
‘స్పేస్‌’లో ప్రైవేట్‌ పాత్ర భేష్‌
స్పేస్‌ టెక్నాలజీలో ప్రైవేట్‌ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్‌ సెక్టార్‌లో నవంబర్‌ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో డిజైన్‌ చేసి, రూపొందించిన తొలి రాకెట్‌ ‘విక్రమ్‌–ఎస్‌’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్‌ టెక్నాలజీలో భారత్‌ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్‌ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్‌ ప్రయోగం ప్రైవేట్‌ స్పేస్‌ సెక్టార్‌లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్‌–ఎస్‌ ప్రయోగం భారత్‌–భూటాన్‌ సంబంధాలకు బలమైన నిదర్శనం.
దేశమంతటా జీ20 కార్యక్రమాలు  
శక్తివంతమైన జీ20 కూటమికి భారత్‌ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్‌ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి.
యువత పరుగును ఆపడం కష్టం   
మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్‌ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవలే యాపిల్‌ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరం.. మన యువత పరుగును ఆపడం ఇక కష్టం. 

 నాన్న నిర్ల‌క్ష్యం.. అన్న త్యాగం.. ఇవే న‌న్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌.. కానీ
ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం  
సంగీత రంగంలోనూ భారత్‌ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్‌ సెంటర్‌’ను స్థాపించిన జతిన్‌ లలిత్‌ సింగ్, జార్ఖండ్‌లో ‘లైబ్రరీ మ్యాన్‌’గా గుర్తింపు పొందిన సంజయ్‌ కశ్యప్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.  

Mahatma Gandhi Statue: ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం 
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి భారత్‌ మహాత్మాగాంధీ విగ్రహాన్ని బహూకరించింది. డిసెంబర్‌ 14వ తేదీన విదేశాంగ మంత్రి జై శంకర్‌ భద్రతా మండలి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్‌ సుతార్‌ ఈ శిల్పాన్ని మలిచారు. ఈయనే గుజరాత్‌లో నర్మదా  నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని డిజైన్‌ చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మక నార్త్‌లాన్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఐరాసలో భారత్‌ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఆవరణలో భారత్‌ 1982లో  ఇచ్చిన ఏకైక కానుక 11వ శతాబ్దం నాటి నల్లరాతి సూర్య విగ్రహం, జర్మనీ అందజేసిన బెర్లిన్‌ గోడలో ఒక భాగం, దక్షిణాఫ్రికా బహూకరించిన నెల్సన్‌ మండేలా కాంస్య విగ్రహం, పాబ్లో పికాసో వేసిన గుయెర్నికా చిత్రం తదితరాలున్నాయి.

Black Hole: కృష్ణ బిలం వినిపించింది! 
అంతరిక్షంలో ఉండే కృష్ణ బిలాలు(బ్లాక్‌ హోల్స్‌) గురించి మనకు తెలుసు. వాటిలో నుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాలు అన్న సంగతి తెలియదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు ఈ విషయంలో కొంత పురోగతి సాధించారు. బ్లాక్‌ హోల్‌ నుంచి చిన్నపాటి ప్రతిధ్వనులను రికార్డు చేసి, స్పష్టమైన శబ్దంగా మార్చారు. ఇందుకోసం సొనిఫికేషన్‌ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. సంబంధిత శబ్దంతో కూడిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇది భూమికి 7,800 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న వీ404 సైగ్నీ అనే బ్లాక్‌హోల్‌కు సంబంధించినదని వెల్లడించారు. నాసా విడుదల చేసిన వీడియోకు సోషల్‌ మీడియాలో భారీ స్పందన లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే 40 లక్షల మందికిపైగా జనం వీడియోను తిలకించారు. కృష్ణ బిలం శబ్దం కొత్తగా ఉందంటూ నెటిజన్లు పోస్టు చేశారు. ఇసుకపై నుంచి దూసుకొచ్చే సముద్ర అలల ధ్వనిలా ఉందని కొందరు పేర్కొన్నారు.   

World Boxing Championships: బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు  

boxing chompianship


ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బృందం రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం న‌వంబ‌ర్ 26వ తేదీ స్పెయిన్‌లో ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ మొత్తం 11 పతకాలు సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు బరిలోకి దిగిన భారత బాక్సర్‌ కీర్తి మహిళల ప్లస్‌ 81 కేజీల విభాగం ఫైనల్లో 0–5తో సిలోనా డార్సీ (ఐర్లాండ్‌) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. ఈ టోర్నీలో 73 దేశాల నుంచి 600 మంది బాక్సర్లు పోటీపడ్డారు.   

World Boxing Championship: వన్షజ్, దేవిక, రవీనాల‌కి స్వ‌ర్ణం 
ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్‌, మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో వన్షజ్‌ 5–0తో దెముర్‌ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్‌ మెకీ (ఇంగ్లండ్‌)పై, రవీనా 4–3తో మేగన్‌ డెక్లెయిర్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్‌ 1–4తో యుటా సకాయ్‌ (జపాన్‌) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

➤ GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌లో.. క‌రెంట్ అఫైర్స్‌, జీకే పాత్ర‌.. 

Indian Olympic Association: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష  
దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నిక కానుంది. 58 ఏళ్ల ఉష న‌వంబ‌ర్ 27వ తేదీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసింది. ఈ పదవికి ఎవ‌రూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో పీటీ ఉష ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. అయితే ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే డిసెంబ‌ర్ 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి.  

Guinness Record: ‘గిన్నిస్‌ బుక్‌’లో నరేంద్ర మోదీ స్టేడియం 

Narendra modi stadium


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడి యం ‘గిన్నిస్‌ బుక్‌’ ప్రపంచ రికార్డుల్లోకెక్కింది. 1,10,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో ఈ స్టేడి యాన్ని నిర్మించారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) కంటే 10,000 సీట్లు ఎక్కువ. ఆసీస్‌ అధికారిక లెక్కల ప్రకారం ఎంసీజీ సామర్థ్యం 1,00,024 సీట్లు. అయితే ఈ ఏడాది మే 29న రాజస్తాన్‌ రాయల్స్, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ను ప్రత్యక్షంగా 1,01,566   మంది చూశారు. ఇలా అత్యధిక ప్రేక్షకులతో మోదీ స్టేడియం ‘గిన్నిస్‌ బుక్‌’ రికార్డులో నిలిచింది.   

China Protest: తిరగబడ్డ చైనా.. భారీగా వీధుల్లోకి వచ్చి నిరసనలు 

కరోనా కట్టడి పేరుతో జిన్‌పింగ్‌ సర్కారు విధించిన మితిమీరిన ఆంక్షలపై చైనా ప్రజలు తిరగబడ్డారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వీధుల్లోకి వెల్లువెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. స్వేచ్ఛ కావాలంటూ నింగినంటేలా నినదిస్తున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తక్షణం తప్పుకోవాలంటూ ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.  పలుచోట్ల యువతీ యువకులు నేరుగా పోలీసులతోనే బాహాబాహీ తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల క్యాంపస్‌లన్నీ నిరసన కేంద్రాలుగా మారుతున్నాయి. స్టూడెంట్లు కూడా భారీగా రోడ్లెక్కుతున్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు తదితర అడ్డంకులన్నింటినీ బద్దలు కొడుతూ కదం తొక్కుతున్నారు. నిరసనకారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నా ఆందోళనలు నెమ్మదించడం లేదు. మతిలేని లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తేయాలన్న డిమాండ్‌ దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది.  మరోవైపు కరోనా కల్లోలం కూడా చైనాలో నానాటికీ పెరుగుతూనే వస్తోంది. 
మార్మోగుతున్న షాంఘై.. 
చైనాలో అతి పెద్ద నగరమైన షాంఘై ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలకు దిగారు. సీపీసీకి, జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం మారాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘షాంఘైలో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలను కల్లో కూడా ఊహించలేం! అలాంటిది ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం, అధ్యక్షుడు దిగిపోవాలంటూ బాహాటంగా నినాదాలు చేయడం నమ్మశక్యంగా లేదు. ఇది మా జీవితకాలంలో ఎన్నడూ చూడనిది’’ అంటూ స్వయానా నిరసనకారులే ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. బీజింగ్‌లోని ప్రతిష్టాత్మక సిన్‌గువా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తూ ప్రతీకాత్మకంగా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఉరుంఖిలో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం చేతుల్లో ఏళ్లుగా తీవ్ర అణచివేతకు గురవుతున్న ఉయ్‌గర్‌ ముస్లింలు భారీగా పాల్గొంటున్నారు.
అగ్ని ప్రమాదానికి పదిమంది బలి 
కరోనా ఆంక్షలున్న చోట్ల ఇళ్లలోంచి జనం బయటికి రాకుండా అధికారులు బయటి నుంచి తాళాలు వేసి సీల్‌ చేస్తున్నారు. ఈ చర్య జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ రాజధాని ఉరుంఖిలో పది మంది ఉసురు తీసింది. నవంబర్‌ 24వ తేదీ ఓ అపార్ట్‌మెంట్లో అగ్ని ప్ర‌మాదం సంభవించడంతో ఫ్లాట్లలో ఉన్న పది మంది ఎటూ తప్పించుకోలేక పొగకు ఉక్కిరిబిక్కిరై నిస్సహాయంగా చనిపోయారు. దీనిపై వెల్లువెత్తిన జనాగ్రహానికి వెరచి ఉరుంఖిలోనే గాక రాజధాని బీజింగ్‌తో పాటు పలుచోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. జీరో కోవిడ్‌ విధానంపై జనం నుంచి ఇంతటి ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే పార్టీ నియమావళిని సవరించి మరీ వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు ఈ ఉదంతం అగ్నిపరీక్షగా మారింది. 

➤ GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌లో.. క‌రెంట్ అఫైర్స్‌, జీకే పాత్ర‌.. 


 
 
 

Published date : 28 Nov 2022 07:32PM

Photo Stories