Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 22nd కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu November 22nd 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Indonesia Earthquake:ఇండోనేసియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం 
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో నవంబర్‌ 21(సోమవారం) భారీ భూకంపం సంభవించింది. ఎన్నో భవంతులు నేల మట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మొత్తంగా 162 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్‌ రిద్వాన్‌ కమిల్‌ చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.  మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. సియాంజుర్‌ పట్టణంలో ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్‌ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు విగతజీవులయ్యారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులుపెట్టారు. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. జాతీయ విపత్తు దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను స్థానికులు పికప్‌ ట్రక్కులు, బైక్‌లపై ఆస్పత్రులకు తరలించారు. అధిక జనాభా ఉన్న జావా పట్టణంలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి చేరి భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. ఆగకుండా వస్తున్న క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రోగులను రోడ్లపై, ఆరుబయట పార్కింగ్‌ ప్రాంతాల్లోనే చికిత్సచేస్తున్నారు. రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యాలతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రి, పాఠశాల సహా పలు భవంతులు నేలకూలాయి. ఆస్పత్రి కూలి ఎక్కువ మంది చనిపోయారని వార్తలొచ్చాయి.  

Indonesia Earthquake


రిక్టర్‌ స్కేల్‌పై 5.6 గా నమోదు
రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం పశ్చిమ జావాలోని సియాంజుర్‌ రీజియన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. సియాంజుర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ‘మూడుసార్లు భూమి కంపించింది. మొదటిసారి ఆగకుండా పది సెకన్లపాటు కుదిపేసింది’ అని స్థానికులు తెలిపారు. ‘భవంతి ఊగిపోతున్నపుడు 14వ అంతస్థులో ఉన్నాను. మెట్లు దిగి కిందికొచ్చేటపుడు పై ప్రాణాలు పైనే పోయాయి’ అని మహిళా లాయర్‌ మయాదిత చెప్పారు. భూకంపం తర్వాత సైతం 1.8 నుంచి 4 తీవ్రతతో దాదాపు 25 సార్లు ప్రకంపనలు కనిపించాయని ఆ దేశ భూకంపాలు, జియోఫిజిక్స్‌ ఏజెన్సీ తెలిపింది. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులైన 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  27 కోట్ల జనాభా గల ఇండోనేసియాలో భూకంపాలు, అగ్నిప‌ర్వతాలు బద్ధలవడం, సునామీలు సర్వసాధారణం. 2004లో హిందూ మహా సముద్రం అడుగున ఏర్పడి విలయం సృష్టించిన భారీ భూకంపం వెనువెంటనే సునామీ ధాటికి 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.  

➤ కేవలం రూ.80 పెట్టుబడి పెట్టి.. రూ.1600 కోట్లల‌కు పైగా సంపాదించాం.. ఈ ఐడియాతోనే..
Pak Investigative Website: పాక్‌ ఆర్మీ చీఫ్‌కు.. వేల కోట్ల అక్రమాస్తులు!
పాక్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా బాధ్యతలు చేపట్టాక ఆయన కుటుంబం దేశ విదేశాల్లో రూ.1,270 కోట్ల మేర ఆస్తుల్ని పోగేసుకున్నట్లు ‘ది ఫ్యాక్ట్‌ ఫోకస్‌’ అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఈ నెలాఖరున జనరల్‌ బజ్వా పదవీ విరమణ చేయాల్సి ఉండగా వెలువడిన ఈ కథనం అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కథనంపై సైన్యం స్పందించనప్పటికీ, వ్యక్తిగత ట్యాక్స్‌ రికార్డులు అనధికారికంగా, చట్ట విరుద్ధంగా వెల్లడి కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 


NASA:చంద్రుని చెంతకు ఓరియాన్‌.. చరిత్ర సృష్టించిన నాసా మిషన్‌ 
పలు అడ్డంకుల్ని, బాలారిష్టాల్ని దాటుకుంటూ నాసా ఇటీవల ఎట్టకేలకు ప్రయోగించిన ఓరియాన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రున్ని చేరి చరిత్ర సృష్టించింది. అది చందమామకు వెనకవైపుగా 128 కిలోమీటర్ల సమీపానికి వెళ్లిందని నాసా నవంబర్‌ 21న ప్రకటించింది. దీన్ని అత్యంత కీలకమైన ముందడుగుగా అభివర్ణించింది. నాసా విడుదల చేసిన వీడియోల్లో చంద్రుడు అతి భారీ పరిమాణంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాడు. అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్‌ రాకెట్‌ ద్వారా నవంబర్‌ 16న ఓరియాన్‌ను నాసా ప్రయోగించడం తెలిసిందే. ఇందులో మనుషులను పోలిన మూడు డమ్మీలను పంపారు. 50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో మిషన్‌ తర్వాత చంద్రున్ని చేరిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇది విజయవంతమైతే తర్వాతి మిషన్లో మనుషులను, 2024లో మూడో మిషన్లో వ్యోమగాములను పంపనున్నారు. సరిగ్గా ఓరియాన్‌ చంద్రునికి అత్యంత సమీపానికి చేరిన సమయానికే అరగంట పాటు దాన్నుంచి కమ్యూనికేషన్‌ పూర్తిగా తెగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఒక దశలో గందరగోళం నెలకొంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే శుక్రవారం మరో ఇంజన్‌ను పేల్చడం ద్వారా ఓరియాన్‌ను చంద్రుని కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశపెడతారు. చంద్రునిపై దిగకుండా దాదాపు వారంపాటు అది కక్ష్యలోనే గడుపుతుంది. అనంతరం డిసెంబర్‌ 11న భూమికి తిరిగి రావాలన్నది ప్లాన్‌.  

DRDO Recruitment 2022: పది, ఇంటర్‌ అర్హత‌తో 1061 పోస్టులు... రాత పరీక్ష ఇలా..
ISRO:‘గగన్‌యాన్‌’లో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష సక్సెస్‌ 
ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్‌యాన్‌’కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే మన ఆ్రస్టొనాట్లను సురక్షితంగా భూమ్మీదికి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాచూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్‌ మెయిన్‌పారాచూట్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్‌ ఫైర్‌ రేంజ్‌ (బీఎఫ్‌ఎఫ్‌ఆర్‌) నుంచి విక్రం సారాబాయి స్పేస్‌ సెంటర్‌ పర్యవేక్షణలో నవంబర్‌ 19న నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్‌ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్‌–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్‌ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్‌ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్‌యాన్‌ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్‌ సెంటర్‌ పేర్కొంది. ‘‘గగన్‌యాన్‌ క్రూ మాడ్యూల్‌ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్‌ కవర్‌ సపరేషన్‌ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్‌ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్‌ పారాచూట్లు విచ్చుకుంటాయి. ఆ్రస్టొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది.  డీఆర్‌డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు. 

Job Layoffs : ఉద్యోగాల కోత మొద‌లైంది.. ఈ ప్ర‌ముఖ సంస్థ‌లో కూడా భారీగా..
New Zealand:న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు 
ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ చెప్పారు. దేశ సుప్రీంకోర్టు కూడా 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో న‌వంబ‌ర్ 21న‌(సోమ‌వారం) ఆమె ఈ ప్రకటన చేశారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్‌లోని 75% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో ‘16 ఏళ్లకే ఓటు’ ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. కాగా, 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన‌ దేశాల్లో ఆ్రస్టియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్‌ ఉన్నాయి.  


Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ బాధ్య‌త‌లు
కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా అరుణ్‌ గోయల్‌ నవంబర్‌ 21న బాధ్యతలు స్వీకరించారు. 1985 పంజాబ్‌ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గోయల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న అరుణ్‌ గోయల్‌ ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. నవంబర్‌ 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. 

Success Story : 70 ఏళ్ల‌లో ప‌ది పాస్‌.. ఈ పెద్దాయ‌న ఆశ‌యం ఏమిటంటే..​​​​​​​
Health Ministry: అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
 
కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్‌ సెంట్లు(బీఎంఎస్‌), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్‌)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్‌ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్‌ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్‌ఎల్‌ఈఎంలో ఉన్న మందులను ఎన్‌పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు.  

    
Areez Khambatta:‘రస్నా’ అరీజ్‌ కన్నుమూత 
దశాబ్దాలుగా రుచికరమైన చౌక డ్రింకుగా పేరొందిన ‘రస్నా’ వ్యవస్థాపక చైర్మన్‌ అరీజ్‌ పిరోజ్‌షా ఖంబట్టా (85) నవంబర్‌ 21న(సోమవారం) గుండెపోటుతో అహ్మదాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య పెర్సిస్, సంతానం పిరూజ్, డెల్నా, రుజాన్, కోడలు వినైషా ఉన్నారు. దశాబ్దాల క్రితమే తండ్రి ఫిరోజా ఖంబట్టా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని అరీజ్‌ భారీ సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలో రస్నా 60 దేశాలలో విస్తరించడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద కాన్సెంట్రేట్‌ తయారీ కంపెనీగా ఆవిర్భవించింది. 
పరిశ్రమకు అందించిన విశిష్ట సేవలకు గాను అరీజ్‌ పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి హోమ్‌ గార్డ్, సివిల్‌ డిఫెన్స్‌ మెడల్, పశి్చమి స్టార్, సమర్‌సేవా, సంగ్రామ్‌ మెడల్స్‌తో పాటు జాతీయ పౌర పురస్కారం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఆయన నెలకొలి్పన ట్రస్టులు, ఫౌండేషన్‌లు .. హెల్త్‌కేర్, విద్య తదితర రంగాల్లో పనిచేస్తున్నాయి. 
1970లో..: చిన్న ప్యాకులలో అందించడం ద్వారా 1970లలో రస్నా సాఫ్ట్‌ డ్రింకుల మార్కెట్లో వేగంగా ఎదిగింది. దాదాపు 18 లక్షల రిటైల్‌ ఔట్‌లెట్లలో అమ్ముడవుతోంది. 1980–90లలో రూపొందించిన ‘ఐ లవ్యూ రస్నా’ ప్రకటన ఎంతో మందిని ఆకట్టుకుంది. చౌకగా రూ.5 విలువ గల రస్నా ప్యాకెట్‌తో 32 గ్లాసుల సాఫ్ట్‌ డ్రింకును తయారు చేసేందుకు వీలు కలి్పంచడం ద్వారా మార్కెట్లో భారీగా విస్తరించింది. రస్నాకు 9 తయారీ ప్లాంట్లు, 5,000 పైచిలుకు స్టాకిస్టులు ఉన్నారు. రుచిపరంగా రస్నాకు పలు అంతర్జాతీయ అవార్డులు సైతం లభించాయి. కొన్నేళ్ల క్రితమే అరీజ్‌.. కుమారుడు పిరుజ్‌ ఖంబట్టాకు రస్నా పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం పిరూజ్‌ గ్రూప్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 


Murali Mohan Rao: రచయిత ‘ఇలపావులూరి’ హఠాన్మరణం 
కథా, నవలా రచయిత, రాజకీయ విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహన్‌రావు(62) నవంబర్‌ 21న(సోమవారం) గుండెపోటుతో మృతిచెందారు. బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. తన తండ్రి సుబ్బారావు రచించిన హనుమత్‌ శతకం మూడో ముద్రణ గ్రంథ ఆవిష్కరణకు, అన్న నాగేంద్ర మనోహర్‌ కుటుంబం, మురళీమోహన్‌రావు కుటుంబం ఆదివారం అద్దంకి వచ్చాయి. కార్తీక మాసం కావడంతో కొత్తపట్నం సముద్ర తీరానికి వెళ్లి సముద్ర స్నానం చేసి అద్దంకి పట్టణంలోని తన ఇంటికి వెళుతుండగా గుండెపోటు రావడంతో ఒంగోలు కిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాన్ని హైదరాబాద్‌లోని నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 
మురళీమోహన్‌రావు స్వగ్రామం అద్దంకి మండలం వేలమూరిపాడు. అయితే అద్దంకి పట్టణంలో స్థిరపడ్డారు. తండ్రి సుబ్బారావు తెలుగు పండిట్‌గా పనిచేసి పలు గ్రంథాలు రచించారు. మురళీమోహనరావు.. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లి రేస్‌ కోర్టులో స్టెనోగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. 
నాలుగు సినిమాలకు కథలు.. 
మురళీమోహన్‌రావు కథా, నవలా రచయితగా, సినీ మాటల రచయితగా ప్రఖ్యాతి పొందారు. హాస్యరస ప్రధాన కథలను ఎక్కువగా రాసేవారు. 250 కథలు, 6 సీరియల్‌ నవలలు రాసి పలు అవార్డులు పొందారు. ఆయన కథలు, నవలలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సినీ రంగాలకు సంబంధించి 1,500 వరకు వ్యాసాలు రాశారు. కితకితలు, ఎలుకా మజాకా వంటి నాలుగు సినిమాలకు కథలు, సూర్యుడు సినిమాకు మాటలు అందించారు. ఆయన రాసిన 20 కథలను కన్నడలోకి అనువదించారు. ‘సాక్షి’తో పాటు పలు టీవీ చానల్స్‌లో వక్తగా, చర్చా వేదికల్లో పాల్గొని రాజకీయ విశ్లేషకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు.


Ramamurthy: చేనేత బంధు రామమూర్తి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్‌ వీవర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.రామమూర్తి(82) న‌వంబ‌ర్ 21న‌ హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు. ఆయన జీవిత చరమాంకం వరకు చేనేత కులాల ఐక్యతకు, బీసీ కులాల సంఘటితానికి కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన అనేక పోరాటాలు, కార్యక్రమాలను నిర్వహించారు. 1979–1980లో ఏపీ ఎన్‌జీవో ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ సంఘాల ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారు. ఎన్నో కో–ఆపరేటివ్‌ బ్యాంకుల ఏర్పాటునకు మార్గనిర్దేశం చేసిన రామమూర్తి.. హైదరాబాద్‌లో స్వయంగా భావనా బ్యాంక్‌ను స్థాపించారు. రాష్ట్ర స్థాయి కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకుల ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా సేవలందించారు. బ్యాంకింగ్‌ ఫ్రాంటియర్స్‌ సంస్థ ఆయనకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఇచ్చి సత్కరించింది. జర్నలిస్టుగా, ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 ప్రాంతంలో చేనేత రంగంలో వచ్చిన సంక్షోభానికి స్పందించి రాజ్యాధికార సాధన ద్వారానే చేనేత వృత్తి రక్షణ, జీవనోపాధి అనే నినాదంతో సంఘటిత పరిచారు. డాక్టర్‌ శీరం శ్రీరామచంద్రమూర్తి, కాలేపు సత్యనారాయణ మూర్తి వంటి అనేక మంది చేనేత రంగ ప్రముఖులతో కలిసి 1992లో ఆంధ్రప్రదేశ్‌ వీవర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్‌ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రామమూర్తి అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఆయన చొరవతోనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక జీవోలిచ్చాయి. 2018లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్‌ వీవర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌.. రామమూర్తికి చేనేత బంధు పురస్కారంతో సత్కరించింది.


ATP Finals: ఆరోసారి విజేతగా జొకోవిచ్‌.. ఫెడరర్‌ రికార్డు సమం

Novak Djokovic


పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ‘ఏటీపీ ఫైనల్స్‌’లో సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆరు టైటిల్స్‌తో స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఇటలీలోని ట్యూరిన్‌ నగరంలో న‌వంబ‌ర్ 20న‌ జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 7–5, 6–3తో మూడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై గెలిచాడు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు టెన్నిస్‌ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ లభించింది. అతను 47 లక్షల డాలర్లు (రూ. 38 కోట్ల 35 లక్షలు) గెల్చుకున్నాడు. గతంలో జొకోవిచ్‌ 2008, 2012, 2013, 2014, 2015లలో ఈ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు. 


Vijay Hazare Trophy 2022 : వరుసగా ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌
దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌తో న‌వంబ‌ర్ 21న‌ తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్‌ ‘ఏ’ క్రికెట్‌(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 

ఈ మ్యాచ్‌లో సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ జగదీశన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వరుసగా ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా జగదీశన్ నిలిచాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) వదిలించుకున్న ఎనిమిది క్రికెటర్లలో నారాయణ్‌ జగదీశన్‌ ఒకడు.

సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి?​​​​​​​
Champions Chess Tour: అర్జున్‌కు ఆరో స్థానం 
చాంపియన్స్‌ టూర్‌ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్‌ లో అర్జున్‌ 0.5–2.5తో భారత్‌కే      చెందిన ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయాడు. ప్రజ్ఞానంద కూడా ఆరు పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో అతనికి ఐదో ర్యాంక్‌ దక్కింది.   ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే) 20 పాయింట్లతో విజేతగా నిలిచాడు.

Published date : 22 Nov 2022 06:03PM

Photo Stories