Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 21st కరెంట్ అఫైర్స్
Breaking Barriers Book:‘బ్రేకింగ్ బారియర్స్‘ పుస్తకావిష్కరణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత చీఫ్ సెక్రటరీ కె.మాధవరావు ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ నవంబర్ 19న హైదరాబాద్‌లో జరిగింది. బ్రేకింగ్ బ్యారియర్స్ పేరిట ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఐఎఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్స్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనతో కలసి పనిచేసిన పలువురు అధికారులు ప్రసంగించారు. సీపీఎం నేత బీవీ రాఘవులు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ న్యాయవాది చంద్రయ్య, ఎమెస్కో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దళితవాడలో పుట్టి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమైందని వక్తలు కొనియాడారు.
Success Story : 70 ఏళ్లలో పది పాస్.. ఈ పెద్దాయన ఆశయం ఏమిటంటే..
JNU Researchers: మలేరియా అంతానికి ‘అలిస్పోరివిర్’
ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు. అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అరి్టమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని డాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అరి్టమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి!
Gandhi Mandela Award: దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్ గంజ్‌లో నవంబర్ 19న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పురస్కారం ప్రదానం చేశారు. యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాందీ, నెల్సన్ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది.
Also read: Godwit Bird Record : 11 రోజుల్లో నాన్–స్టాప్‌గా 13,558 కిలోమీటర్ల ప్రయాణం
Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
సీనియర్ అధికారి అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మేలో రిటైరైన సుశీల్ చంద్ర స్థానంలో ఆయన్ను నియమిస్తూ కేంద్రం నవంబర్ 19న ఆదేశాలు జారీ చేసింది. 1985 ఐఏఎస్ బ్యాచ్ పంజాబ్ కేడర్ అధికారి అయిన గోయల్ ఈ నెల 18వన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2025 ఫిబ్రవరిలో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి2027 డిసెంబర్ వరకు దాకా కొనసాగుతారు.
Chief Justice of India: వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం.. సీజేఐ
వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. పెండింగ్ కేసులను తగ్గించే క్రమంలో వివాహ వివాదాలకు చెందిన బదిలీ, బెయిలు పిటిషన్లు చెరో పది చొప్పున అన్ని కోర్టులు విచారించాలని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయించామని సీజేఐ తెలిపారు. ‘‘ఫుల్ కోర్టు సమావేశంలో ప్రతి బెంచ్ రోజూ కుటుంబ వ్యవహారాలకు చెందిన పది బదిలీ పిటిషన్లు చేపట్టాలని నిర్ణయించాం. ఆ తర్వాత రోజూ పది బెయిలు సంబంధిత కేసులు.. శీతాకాల సెలవులకు ముందు పరిష్కరించాలని నిర్ణయించాం. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వివాహ వివాదాలకు సంబంధించి ప్రస్తుతం 3 వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 13 కోర్టులు రోజూ పది బదిలీ కేసులు తీసుకుంటే రోజుకు 130 కేసులు చొప్పున వారానికి సుమారు 650 కేసులు పరిష్కరించొచ్చని సీజేఐ ఉదాహరించారు. శీతాకాల సెలవులకు ముందుగా ఈ బదిలీ కేసులు కొలిక్కి వస్తాయని తెలిపారు. అన్ని కోర్టులూ బెయిలు, బదిలీ పిటిషన్లు విచారించిన తర్వాత సాధారణ కేసులు విచారిస్తాయన్నారు. న్యాయమూర్తులు అర్ధరాత్రి వరకూ దస్త్రాలు చూడాల్సి వస్తుండడంతో వారిపై భారం తగ్గించాలని, అనుబంధ జాబితా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు.
Hwasong-17 monster missile:హ్వాసంగ్–17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
అమెరికా బెదిరింపులను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా నవంబర్ 18న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్–17ను పరీక్షించింది. ఉత్తర తూర్పుతీరంలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అది కిమ్ సర్కార్ రూపొందించిన దీర్ఘశ్రేణి క్షిపణేనని.. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్తుందని పేర్కొంది.
అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ తన భార్య రి సోల్ జుతో పాటు కుమార్తెతో కలిసి దీన్ని తిలకించారు. కిమ్ కూతురి ఫొటోలు బయటికి రావడం ఇదే మొదలు. ఆమె పేరు, వయసు వంటి వివరాలేవీ తెలియలేదు. గాయని రి సోల్ జును కిమ్ 2009లో పెళ్లాడారు. వీరికి ముగ్గురు పిల్లలంటారు. ప్రజల్లో తన కుటుంబ పాలన పట్ల సానుకూలతను పెంచుకునేందుకు గానీ, తన వారసత్వాన్ని ప్రకటించుకునే ప్రయత్నం గానీ అయి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. 1948లో కిమ్ తాత కిమ్–2 సంగ్ హయాం నుంచి వారి కుటుంబ పాలన అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది.
IPS Success Story : ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్.. ఐపీఎస్ పాస్.. కానీ లక్ష్యం మాత్రం ఇదే..
Asian Cup Table Tennis 2022: చరిత్ర సృష్టించిన మనిక బత్రా
ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా అద్భుతం చేసింది. ఈ టోర్నీ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్‌లో నవంబర్ 19న జరిగిన మహిళల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో 44వ ర్యాంకర్ మనిక 11–6, 6–11, 11–7, 12–10, 4–11, 11–2తోప్రపంచ 6వ ర్యాంకర్ హినా హయాటా (జపాన్)పై సంచలన విజయం సాధించింది. కాంస్యం గెలిచిన మనిక బత్రాకు 10 వేల డాలర్ల (రూ. 8 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. అంతకుముందు సెమీఫైనల్లో మనిక 8–11, 11–7, 7–11, 6–11, 11–8, 7–11తో మిమా ఇటో (జపాన్) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. ‘ఈ విజయం నాకెంతో గొప్పది. మేటి క్రీడాకారిణులను ఓడించినందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో జరిగే టోర్నీలలోనూ ఇదే జోరును కనబరుస్తా’ అని మనిక వ్యాఖ్యానించింది.
Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. మోదీ ప్రత్యేక అభినందనలు
ప్రఖ్యాత సినీ నటుడు, నిర్మాత చిరంజీవి (67)కి అరుదైన గౌరవం దక్కింది. నవంబర్ 20న గోవాలో ప్రారంభమైన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ‘ఇండియా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్–2022’అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవికి ట్విట్టర్‌లో అభినందనలు తెలియపారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో 150కిపైగా చిత్రాల్లో నటించారని, గొప్ప డ్యాన్సర్‌గా అభిమానులను అలరించారని కొనియాడారు. అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. 1978లో సినీ రంగంలో అడుగుపెట్టిన చిరంజీవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2006లో దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ చిరంజీవిని వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిరంజీవి 2012 నుంచి 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు.
చిరంజీవిని అభినందించిన మోదీ..
చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 అవార్డు రావడం పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ట్వీట్‌లో మోదీ ప్రస్తావిస్తూ.. 'చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూరగొన్నారు'. అంటూ పోస్ట్ చేశారు. ఇఫి వేడుకలు నవంబర్ 29 వరకు జరగనున్నాయి. మంచి కంటెంట్‌తో రూపుదిద్దుకున్న దాదాపు 280 చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందిస్తారు.
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44 మంది మృతి
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో నవంబర్ 21న (సోమవారం) భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 44 మంది మృతి చెందగా, దాదాపు 300 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందన్నారు.
COP27: ‘పరిహార నిధి’కి సై.. కాప్–27లో కీలక ఒప్పందం
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్ నగరంలో నిర్వహించిన భాగస్వామ్య పక్షాల సదస్సు(కాప్–27) నవంబర్ 20న ముగిసింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలన్నీ దశలవారీగా తగ్గించుకోవాలంటూ భారత్ ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది. వాతావరణ మార్పులు, తద్వారా సంభవించే విపత్తుల వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తూ ఒప్పందానికి రావడం చరిత్రాత్మకమని భారత్ అభివరి్ణంచింది. ఇలాంటి ఒప్పందం కోసమే ప్రపంచం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం కాప్–27 సదస్సు శుక్రవారమే ముగిసిపోవాలి. కానీ, కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంతోపాటు ‘లాస్ అండ్ డ్యామేజీ ఫండ్’పై చర్చించాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని పలు దేశాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఒక రోజు ఆలస్యంగా ముగిసింది. కాప్–27 అధ్యక్షుడు సమీ షౌక్రీ ముగింపు ఉపన్యాసం చేశారు.
తలవంచిన బడా దేశాలు
పరిహార నిధి కోసం భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బడా దేశాల నిర్వాకం వల్ల తాము బలవుతున్నామని వాపోతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులు విషయంలో సంపన్న దేశాలదే ప్రధాన పాత్ర. పరిహార నిధి ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అమెరికా సహా పలు సంపన్న దేశాలు తొలుత వ్యతిరేకించాయి. ప్రపంచంలో ఎక్కడ విపత్తులు చోటుచేసుకున్నా చట్టప్రకారం తామే పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళనే ఇందుకు కారణం. కానీ, చైనా సహా ఇతర చిన్నదేశాలు, ద్వీప దేశాలు గట్టిగా గొంతెత్తడంతో బడా దేశాలు తలవంచక తప్పలేదు. పరిహార నిధిపై ఒప్పందం కుదరకుండా తాము కాప్–27 నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని పేద దేశాలు తేలి్చచెప్పడం గమనార్హం.
పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి
చమురు, గ్యాస్ సహా శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించుకోవాలన్న భారత్ సూచన పట్ల కాప్–27లో అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) తదితర దేశాలు అంగీకారం తెలపడం కీలక పరిణామం అని చెప్పొచ్చు. అయితే, దీనిపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. పర్యావరణ విపత్తులు పెచ్చరిల్లుతుండడంతో సమీప భవిష్యత్తులోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పునరుత్పాక ఇంధన వనరులపై ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కాప్–27లో నిపుణులు సూచించారు. బొగ్గు వాడకాన్ని నిలిపివేస్తూ స్వల్ప ఉద్గారాల ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని షెర్మ్–ఎల్–షేక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్’ పిలుపునిచ్చింది. వ్యవసాయం, ఆహార భద్రత విషయంలో క్లైమేట్ యాక్షన్‌పై కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. కాప్–27లో ఆయన మాట్లాడారు. కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను కేవలం సన్న, చిన్నకారు రైతులపైనే మోపకూడదని చెప్పారు. కాప్–27 నిర్ణయాలు, ఒప్పందాలపై ఆఫ్రికా నిపుణుడు మొహమ్మద్ అడోవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
➤ బీసీసీఐ సెలక్షన్ కమిటీ రద్దుకు.. కారణాలివే..! భారత క్రికెట్ చరిత్రలో..
Science and Technology: మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు
ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్‌టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఒక వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్‌సైట్‌లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్‌సైట్, యాప్ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగి్వస్టిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్‌టీటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ గిరినాథ్ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్‌టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది.
PM Kisan: మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్‌లో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబి్ధదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబి్ధదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబి్ధదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్‌లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
Donald Trump: ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్ ఖాతా.. ఎలాన్ మస్క్ ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ట్విట్టర్ ఖాతా మళ్లీ వచ్చేసింది. గతంలో రద్దు చేసిన ఆయన ఖాతాను పునరుద్ధరించినట్లు సోషల్ మీడియా కంపెనీ ‘ట్విట్టర్’ నూతన యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ కుటుంబంలో ట్రంప్‌ను చేర్చుకోవాలా? వద్దా? అనేదానిపై ప్రజాభిప్రాయం సేకరించామని తెలిపారు. మెజారిటీ జనం సానుకూలత వ్యక్తం చేశారని, అందుకే ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 2021 జనవరిలో ట్విట్టర్ నుంచి ట్రంప్‌ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ వద్ద డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడ్డారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ గెలిచినట్లు అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్) ప్రకటించేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే అప్పటి ట్విట్టర్ యాజమాన్యం ట్రంప్ ఖాతాను రద్దు చేసింది. ‘‘ప్రజలు ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. ఆయన ఖాతాను పునరుద్ధరించాం’’ అంటూ ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో ట్రంప్‌నకు స్వల్ప మెజారిటీ లభించినట్లు వెల్లడించారు. ఇందులో మొత్తం 1,50,85,458 ఓట్లు పోలయ్యాయి. 51.8 శాతం మంది ట్రంప్‌నకు మద్దతుగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా ఓటువేశారు.
➤ కేవలం రూ.80 పెట్టుబడి పెట్టి.. రూ.1600 కోట్లలకు పైగా సంపాదించాం.. ఈ ఐడియాతోనే..
FIFA World Cup 2022:అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్
అనేక సంవత్సరాల వివాదాల తర్వాత.. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 ఎట్టకేలకు నవంబర్ 20న ఖతార్‌లో ప్రారంభమైంది. అల్ బైత్ స్టేడియం వేదికగా వేలాది మంది ప్రేక్షకులు, నిర్వాహకులు, ఫిఫా అధికారులు, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమల్ అల్ థానీ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. ‘మనల్నందరినీ కలిపే ఈ క్షణం మనందరినీ విడదీసే ఘటనలకంటే ఎంతో గొప్పది... అయితే ఇది ఈ ఒక్క రోజుకు పరిమితం కాకుండా శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఏమేం చేయాలి’... హాలీవుడ్ స్టార్ మోర్గన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో ప్రేక్షకులను అడిగిన ఈ ప్రశ్నతో విశ్వ సంబరానికి విజిల్ మోగింది. ఖతర్ దేశం అంచనాలకు తగినట్లుగా అద్భుతమైన ప్రారం¿ోత్సవ వేడుకలతో ప్రపంచ అభిమానుల మనసులు దోచింది. తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. అల్ బైత్ స్టేడియం మధ్యలో ఫ్రీమన్ ఆద్యంతం తన వ్యాఖ్యానంతో రక్తి కట్టిస్తుండగా... భిన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు కట్టి పడేశాయి. ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఖతర్ ‘యూ ట్యూబర్’ ఘనిమ్ అల్ ముఫ్తాతో ఫ్రీమన్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఘనిమ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ అడగ్గా... ఖురాన్‌లోని కొన్ని పంక్తులతో ఘనిమ్ సమాధానమిచ్చాడు. కొరియా ప్రఖ్యాత గాయకుడు జుంగ్ కూక్, ఖతర్ సింగర్ ఫహద్ అల్ కుబైసి కలిసి వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘డ్రీమర్స్’ను ఆలాపించినప్పుడు 60 వేల సామర్థ్యం గల స్టేడియం దద్దరిల్లింది. సాంప్రదాయ కత్తి నృత్యం ‘అల్ అర్దా’ ప్రదర్శించినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. వరల్డ్ కప్ మస్కట్ ‘లయీబ్’ను, టోర్నీలో పాల్గొంటున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా ప్రదర్శించారు. డిసెంబర్ 18న ఈ టోర్నీ ముగియనుంది.
92 సంవత్సరాల ఫుట్‌బాల్ ప్రపంచకప్
చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే ‘డ్రా’తో సంతృప్తి పడటం జరిగింది. కానీ నవంబర్ 20న ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచ్ మాత్రం నిరాశను మిగల్చగా... నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో బోణీ కొట్టి శుభారంభం చేసింది.
FIFA World Cup : ఫిఫా చరిత్రలో మరిచిపోలేని ఐదు వివాదాలు ఇవే..
అల్ ఖోర్: గతంలో ఏనాడూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతర్ జట్టు ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారి బరిలోకి దిగింది. ఈ మెగా టోరీ్నకి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి సాగుతున్నా ఆతిథ్య జట్టు మాత్రం మైదానంలో ఆశించినస్థాయిలో మెరిపించలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్ 2–0 గోల్స్‌తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను ఇనెర్ వాలెన్సియా (16వ నిమిషంలో, 31వ నిమిషంలో) సాధించడం విశేషం. ఈ గెలుపుతో ఈక్వెడార్‌కు మూడు పాయింట్లు లభించాయి.
Arjuna Award: 2017 నాటి ‘అర్జున’ అందుకున్న పుజారా
భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత తనకు ప్రకటించిన ‘అర్జున’ అవార్డును అందుకున్నాడు. క్రికెట్లో రాణిస్తున్న అతన్ని 2017లోనే భారత ప్రభుత్వం ఆ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఏడాది అందుకోలేకపోయాడు. ఢిల్లీలో ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న అతనికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘అర్జున’ పురస్కారం బహూకరించారు. దీనిపై స్పందించిన పుజారా తనను ప్రోత్సహించిన బోర్డు (బీసీసీఐ)కు, తన ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
ఫార్ములావన్ విజేత వెర్‌స్టాపెన్
ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ 2022 ఫార్ములావన్ సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్‌లో చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల ఈ రేసును వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 27 నిమిషాల 45.914 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ రెండో స్థానంలో, పెరెజ్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్ మొత్తం 15 రేసుల్లో విజేతగా నిలిచి 454 పాయింట్లతో టాప్ ర్యాంక్‌తో ముగించాడు. అంతేకాకుండా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్ రికార్డు నెలకొల్పాడు.