Skip to main content

Today Current Affairs: ఎల్‌ఐసి చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి

వివిధ పోటీ ప‌రీక్ష‌ల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌తీ రోజు రాష్ట్రీయ‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ‌, క్రీడలు త‌దిత‌ర అంశాల‌పై క‌రెంట్ అఫైర్స్‌ను అంద‌జేస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ టాప్ టెన్ క‌రెంట్ అఫైర్స్ మీకోసం...
Life Insurance Corp of India Chairman Siddhartha Mohanty
Life Insurance Corp of India Chairman Siddhartha Mohanty

1. ఎన్నికల ప్రమాణపత్రంలో ఆస్తుల వివరాల సమాచారం తప్పుగా ప్రకటించినందుకు అరుణాచల్‌ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే దసాంగ్లు పుల్‌ (45) ఎన్నిక చెల్లదంటూ గువాహాటి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దసాంగ్లు.. అరుణాచల్‌ మాజీ సీఎం కలికో పుల్‌ మూడో భార్య. ఆమె 2019 ఎన్నికల్లో హయిలియాంగ్‌ స్థానం నుంచి నెగ్గారు. అయితే ఆమె చేతిలో ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థి దసాంగ్లు ఎన్నికను న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఎన్నికల ప్రమాణ పత్రంలో దసాంగ్లు.. తన భర్త పేరిట ముంబయి, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించక‌పోవ‌డంతో తాజా తీర్పు వ‌చ్చింది. 
2. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితంలోని అపోహలు, తెలియని నిజాలను వెల్లడిస్తూ వాజ్‌పేయీ : హిందూ హక్కుల ఆరోహణ పేరిట కొత్త పుస్తకం మే 10వ తేదీన ఆవిష్కృతం కానుంది. న్యూ ఇండియా ఫౌండేషన్‌ సాయంతో పికడోర్‌ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అభిషేక్‌ చౌధరి రచించిన ఈ పుస్తకం రెండు భాగాల్లో విడుద‌ల కానుంది. రెండోభాగం వాజ్‌పేయీ శతజయంతి సందర్భంగా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
3. సామాజిక స్థలాలను సుందరంగా, వినూత్నంగా తీర్చిదిద్దిన వార్డులు, నగరాలను గుర్తించడం.. వాటిని పోత్సహించడం లక్ష్యంగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘నగర సుందరీకరణ పోటీ’ని ప్రారంభించింది. సులభంగా చేరుకోవడం, సౌకర్యాలు, కార్యకలాపాలు, సుందరీకరణ, పర్యావరణ హితం అయిదు అంశాల ఆధారంగా ఈ పోటీలో అందమైన బహిరంగ ప్రదేశాలను ఎంపిక చేస్తామని మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆఖరు తేదీ జులై 15. 
4. హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్‌ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించింది. పెద్ద పులి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్‌బరా నేషల్‌ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. కాగా.. కలెసర్  నేషనల్ పార్కు వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. 
5. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్‌ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్‌ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు.

Pakistan PM

షరీఫ్‌ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. 
6. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర‌వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు.

cm jagan

ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దీనికోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.
7. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. కివీస్‌పై విజయం పాక్‌కు వన్డేల్లో 500వది కావడం విశేషం. వన్డే క్రికెట్‌లో 500 విజయాలు నమోదు చేసిన మూడో జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి.

pakistan cricket team

ఆస్ట్రేలియా ఇప్పటివరకు 978 మ్యాచ్‌లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్‌లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. 
8. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)  చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. 2024 జూన్‌ వరకు  మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. సిద్ధార్థ మొహంతి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కి సీఎండీగా ఉన్నారు. అయితే 2021 ఫిబ్రవరిలో ఎల్‌ఐసీ ఎండీగా  నియమితులయ్యారు. 1985లో ఎల్‌ఐసీ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు మొహంతి. 
9. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది.

Trai

ట్రాయ్‌ ప్రకటనతో ఫోన్‌ వినియోగదారులు ఫేక్‌, ప్రమోషనల్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్‌, మెసేజ్‌ల బెడద తప్పనుంది.
10. ఆసియా యూత్‌ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ను భారత్‌ మెరుగ్గా ఆరంభించింది. తాష్కెంట్‌లో ప్రారంభమైన ఈ పోటీల్లో తొలి రోజైన గురువారం ఒక్కో స్వర్ణ, రజత పతకాలతో పాటు రెండు కాంస్యాలూ ఖాతాలో చేరాయి. అబ్బాయిల 1500 మీటర్ల పరుగులో ప్రియాన్షు పసిడి, రాహుల్‌ వెండి పతకాలు నెగ్గారు. 3 నిమిషాల 57.37 సెకన్లలో రేసు ముగించిన ప్రియాన్షు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 3 నిమిషాల 59.43 సెకన్ల టైమింగ్‌తో రాహుల్‌ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

sports

అమ్మాయిల 5 కిలోమీటర్ల నడకలో ఆర్తి (24:29.14ని) కాంస్యం అందుకుంది. చైనా అథ్లెట్లు యాంగ్‌ (22:32.61ని), బిలింగ్‌ (22:56.30ని) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల లాంగ్‌జంప్‌లో ముబాసినా మహమ్మద్‌ (5.90మీ) కంచును కైవసం చేసుకుంది.

Published date : 28 Apr 2023 06:21PM

Photo Stories