Telangana: 2031 నాటికి జనాభా 3.92 కోట్లు..
ఇందులో 1.97 కోట్ల మంది పురుషులు, 1.95 కోట్ల మంది మహిళలు ఉంటారని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.50 కోట్లుగా ఉన్న తెలంగాణ జనాభా.. 2021 నాటికి 3.77 కోట్లకు చేరిందని వివరించింది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విశేషాలను వెల్లడించింది. శనివారం హైదరాబాద్‌లోని అర్థగణాంకశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో గత కొన్నేళ్లకు సంబంధించిన పలు గణాంకాలను, ప్రస్తుతం వివిధ రంగాల్లో పురోగతి, భవిష్యత్ అంచనాలను వివరించారు.
‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’ నివేదికలో 2020–21 గణాంకాలివే..
● రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం 905.4 మిల్లీమీటర్లుకాగా.. 2020–21లో 1,322.5 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణంతో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ.
● 2014–15లో 66,276 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. 2020–21 నాటికి 1.45 లక్షల కోట్లు దాటింది. అంతకుముందటి ఏడాదితో పోలిస్తే ఈసారి 7.99 శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయి. ఈ రంగంలో ప్రస్తుతం 6,28,615 మంది ఉపాధి పొందుతున్నారు.
● 2020–21లో 1,04,23,177 ఎకరాల్లో వరి సాగయింది. వానాకాలంలో 52,51,261 ఎకరాల్లో, యాసంగిలో 51,71,916 ఎకరాల్లో వరి వేశారు. ఆ తర్వాత అత్యధికంగా మొక్కజొన్న 6.39 లక్షల ఎకరాల్లో, జొన్నలు 2.24లక్షల ఎకరాల్లో సాగుచేశారు.
● మొత్తంగా 2,18,51,471 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇందులో వానాకాలంలో 96,31,057 టన్నులు, యాసంగిలో 1,22,20,414 టన్నులు వచ్చింది. ఇందులో 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
● రాష్ట్రంలో మొత్తం రూ.11,886.70 కోట్ల విలువైన 485.17 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీశారు. రూ.806 కోట్ల విలువైన 239 లక్షల టన్నుల సున్నపురాయి ఉత్పత్తి చేశారు. అన్నిరకాల ఖనిజ వనరులు కలిపి 29,962 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి.
● ఉపాధి విషయానికి వస్తే.. 2020–21లో మొత్తం 12.7 లక్షల మందికి పలు వ్యాపార/వాణిజ్య సంస్థల ద్వారా ఉపాధి లభించింది. ఇందులో దుకాణాల్లో పనిచేసేవారు 5.72 లక్షలుకాగా.. వాణిజ్యసంస్థల్లో 5.76 లక్షలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో 1.22లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
● 2020–21లో మొత్తం 66,555 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. 57,007 మిలియన్ యూనిట్లు వినియోగించారు. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో విద్యుత్ వినియోగం 39,519 మిలియన్ యూనిట్లు మాత్రమే.
2020–21లో వివిధ ఉత్పత్తుల లెక్కలివీ..
పాలు: 57,65,166 లక్షల లీటర్లు
మటన్: 5,09,943 లక్షల టన్నులు
చికెన్: 4,10,407 లక్షల టన్నులు
చేపలు: 3,37,117 లక్షల టన్నులు
రొయ్యలు: 11,734 టన్నులు
కోడిగుడ్లు: 1,584 కోట్లు
● రాష్ట్రంలో రోడ్డెక్కిన కొత్త వాహనాలు 8,22,416. ఇందులో టూవీలర్లు 5.58 లక్షలకుపైగా ఉండగా.. కార్లు/మినీ వ్యాన్లు వంటివి 1.17 లక్షలు, ట్రాక్టర్లు 23,160, రోడ్డు రోలర్లు 61, వ్యవసాయ ట్రాలర్లు 10,891 ఉన్నాయి.
● రవాణా వాహనాల విషయానికి వస్తే.. గూడ్స్ క్యారేజీలు 97,633, 5,836 ఆటోలు, 1,458 క్యాబ్‌లు, 43 విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయి.
● 2020–21లో కొత్తగా రిజిస్టరైన ఆర్టీసీ బస్సుల సంఖ్య 4 మాత్రమే.