Eva Perón: అర్జెంటీనా ధీర వనిత ఎవా పెరోన్... పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషి నేటికీ ఆదర్శనీయమే.. పెరోన్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆర్టికల్
ఎవా పెరోన్... ఈ పేరు నేటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ, తన అభ్యుదయభావాలు, పోరాట పటిమ 1940వ దశకంలో ప్రపంచాన్ని చుట్టేశాయి. దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశం... నేటికీ ఆమెను ఓ గొప్ప యోధురాలుగా భావిస్తుంది. ఆమె చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అర్జెంటీనా వాసులు చెబుతారు.
ఎవా పెరోన్ ఓ సాధారణ కుటుంబంలో మే 7, 1919లో పుట్టారు. నటిగా తన కెరియర్‌ను ప్రారంభించారు. సమాజంలో నేటికి మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదు. కానీ, ఆమె 1940ల్లోనే ధీర వనిత అనిపించుకున్నారు. తనకు నచ్చిన పంథాలోనే నడిచారు. తాను నమ్మిన భావాలను ఆచరించారు. అంతిమంగా ఆమె నిర్ణయాలు అర్జెంటీనా ముఖచిత్రాన్నే మార్చాయని చెప్పుకోవచ్చు.
దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీలకు ముందుగా గుర్తుకు వచ్చేది పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు.. కార్మికులు, రైతులే. ఎన్నికలు ముగియగానే వారి బాధలను పట్టించుకునే వారే ఉండరు. కానీ, 1940ల్లోనే పేద, మధ్య తరగతి ప్రజల బాధలు, కార్మికుల దుర్భర జీవితాలు, రైతులు పడుతున్న ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం కోసం తీవ్రంగా పెరోన్ కృషి చేశారు. వారి దుర్భర జీవితాలను గట్టెక్కించాలని శ్రమించారు. దారిద్య్రం నుంచి వారిని బయట పడేసేందుకు తీవ్రంగా పాటుపడ్డారు. ఇందుకోసం 1949లో పెరోనిస్టా ఫెమినిస్ట్ పార్టీని కూడా ఆమె స్థాపించారు.
ఇప్పటికీ కొన్ని అరబ్ దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేకపోవడాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కానీ, 1940వ దశకంలో మహిళలకు సమాజంలో సమాన గౌరవంతో పాటు, కచ్చితంగా ఓటు హక్కు ఉండాలని తీవ్రంగా పోరాటం చేసి, సాధించారు ఎవా పెరోన్. ఆ దేశంలోని సామాజిక సమస్యలపై చురుకుగా స్పందించడంతో పాటు, వాటి పరిష్కారానికి చొరవ చూపేవారు. కార్మికులు, రైతులతో సమావేశమై వారి బాధలు స్వయంగా తెలుసుకుని, వాటిని తీర్చేవారు. కార్మికులు, రైతులకు అనుకూలమైన చట్టాలు చేయడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు.
అలాగే అర్జెంటీనా దేశంలో అణగారిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు ఆమె స్వయంగా ఫౌండేషన్ స్థాపించి విరాళాలు స్వీకరించారు. అలా వచ్చిన విరాళాలతో దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, పేద పిల్లల కోసం కిండర్ గార్టెన్లు నిర్మించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమెలా ఆలోచించి.. పేద, బడుగు, బలహీన వర్గాలకు నిజమైన ఆర్థిక చేయూతనిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై కొంతమంది, కొన్ని వ్యతిరేక అభిప్రాయాలను వెళిబుచ్చుతున్నారు. వీటిని నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. ఆర్థికంగా వెనకబడిన అణగారిన, పేద వర్గాల కోసం ఏపీ ప్రభుత్వం విన్నూత్నమైన పనులు చేపట్టింది. పేదలను పేదరికం నుంచి దూరం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ఆర్థికంగా చేయూతనందించిన విషయం.. గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పథకాలు చాలా ప్రభావవంతంగా అమలవుతున్న తీరును మెచ్చుకుని తీరాల్సిందే.
ఆర్థిక సాయం, సబ్సిడీలు ఎందుకు.. అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పటికీ ఎంతమంది నిరుపేదలు.. దుర్భర జీవితం అనుభవిస్తున్నారో అలాంటి వారికి అర్థం అవుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వ చర్యలతో లబ్ధిదారులు సంతృప్తి పడినప్పుడు రాజకీయ విమర్శలను పట్టించుకోనవసరం లేదు.
ఒక ప్రభుత్వం తాను చెప్పిన ప్రతి పని చేస్తూ వెళుతున్నప్పుడు అది సమాజానికి మంచిదే అవుతుంది. ఇచ్చిన వాగ్దానాలను ఎలా ఎగ్గోట్టాలో ఆలోచించే నాయకులనే మనం ఇంతవరకు చూశాం. కానీ, తాను చేసిన ప్రతి వాగ్దానాన్ని త్రికరణశుద్ధితో అమలు చేస్తున్న తీరుని తప్పకుండా మనం మెచ్చుకుని తీరాల్సిందే. కానీ, కొంతమంది ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై, ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలపై పెదవి విరుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయరవుతోందంటూ అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని మనం రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంది. రాజకీయ లబ్ధి కోసమే రాజకీయ నాయకులు ప్రవర్థిస్తారు... కాబట్టి, వారి తీరును చూసి మనం ఆశ్చర్యపోనవసరం లేదు.
తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి నిజంగా దృఢ సంకల్పం, నిబద్ధత కలిగిన నాయకుడిని ఇలాంటి విమర్శలు ఏ మాత్రం అడ్డుకోలేవు. తాము అధికారంలో ఉన్న సమయంలో పరిశ్రమలు తెచ్చాం, మౌలిక సదుపాయాలు కల్పించాం.. అంటూ తప్పుడు ప్రచారం చేస్తే వారికి తాత్కాలికంగా లబ్ధి చేకూరుతుందేమో.. కానీ, దీర్ఘకాలికంగా చేసిన అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు.
ఆకలితో అలమటిస్తున్న బిడ్డకు అన్నం పెట్టాలి. వృద్ధులకు, అనారోగ్యంతో బాధ పడుతున్నవారికి ఆసరా కావాలి. చదువుకుంటున్న విద్యార్థికి తన భవిష్యత్తు కోసం తక్షణ సహాయం కావాలి. ఎందుకంటే జీవితాలు, జీవనోపాధి కేవలం భవిష్యత్తు అవకాశాలతో మనుగడ సాగించలేవు. వర్తమానంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి భవిష్యత్తులో నిష్ఫలంగా మిగిలిపోతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా ఉన్నాయి. వీటిని రాజనీతిజ్ఞులు కూడా గమనిస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు కొన్ని రోజులే మనుగడలో ఉంటాయి. ఎవా పెరోన్ లాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల జాబితాలో నిలవాలంటే నిజాయితీతో కూడిన నిబద్ధత, ఎంతో పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఎవా పెరోన్ కేవలం 33 సంవత్సరాలు మాత్రమే జీవించింది. కానీ, ఆమె చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. అర్జెంటీనాపై ఆమె చెరగని ముద్ర వేశారు.
స్టోరీ ఇన్‌పుట్స్ - రాణి రెడ్డి