Skip to main content

Modi-Putin Talks Highlights: 21వ భారత్‌–రష్యా శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది?

Modi-Putin

21వ భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిసెంబర్‌ 6న ఢిల్లీకి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ద్వెపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం, అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం, మధ్య ఆసియా ప్రాంతంలో పెను సవాళ్లపైనా అగ్రనేతలు సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. ‘‘అజేయ శక్తిగా ఆవిర్భవించిన భారత్‌.. మాకు స్నేహహస్తం అందించే ఆత్మీయ నేస్తం. కాల పరీక్షను తట్టుకుని నిలబడిన చెలిమి మాది’’ అని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులు 38 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇంధనం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యం పెరగాలన్నారు.

2+2 చర్చలు..

పుతిన్‌–మోదీ చర్చలకు కొద్ది గంటలకు ముందే భారత్‌ – రష్యా రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 చర్చలు జరిగాయి. చర్చల్లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి జై శంకర్‌ – రష్యా రక్షణ మంత్రి జనరల్‌ సెర్గీ షోయిగు, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లు పాల్గొన్నారు.

నాలుగు రక్షణ ఒప్పందాలు..

రాజ్‌నాథ్, సెర్గీ షోయిగు ఆధ్వర్యంలో ఇండియా–రష్యా ఇంటర్‌–గవర్నమెంటల్‌ కమిషన్‌ ఆన్‌ మిలిటరీ అండ్‌ మిలిటరీ–టెక్నికల్‌ కోఆపరేషన్‌(ఐఆర్‌ఐజీసీ–ఎం–ఎంటీసీ) 20వ సమావేశం జరిగింది. సైనిక పరికరాల ఉమ్మడి ఉత్పత్తిని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకోవడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాల వివరాలు ఇలా..

  • భారత సైనిక దళాల కోసం రూ.5వేల కోట్ల విలువైన ఆరు లక్షలకుపైగా 7.63x39 మిల్లీమీటర్ల ఏకే–203 రకం రైఫిళ్లను.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ దగ్గర్లోని ఇండో–రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో సంయుక్తంగా ఉత్పత్తి చేయడం.
  • సైనిక సహకార ఒప్పందాలను మరో పదేళ్లు రెన్యువల్‌ చేయడం.
  • కలష్నికోవ్‌ సిరీస్‌ చిన్న ఆయుధాల తయారీలో సహకారంపై 2019 ఒప్పందంలో సవరణలకు ఆమోదం.
  • ఐఆర్‌ఐజీసీ–ఎం–ఎంటీసీ ప్రోటోకాల్‌కు సంబంధించిన నియమ నిబంధనలకు అంగీకారం.

చ‌ద‌వండి: ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021 ప్రారంభం

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
21వ భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు
ఎప్పుడు : డిసెంబర్‌ 6
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌
ఎక్కడ    : ఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Dec 2021 07:37PM

Photo Stories