Skip to main content

CEPA: భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న దేశం?

Piyush Goyal-Abdulla bin Touq Al-Marri

భారత్‌–యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం ఫిబ్రవరి 18న జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్‌ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మరీ.. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం  మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం..

తాజా ఒప్పందం ప్రకారం.. రెండు దేశాల మధ్య గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్‌ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయి.

సంయుక్త విజన్‌ ప్రకటన..

2021, సెప్టెంబర్‌లో భారత్, యూఏఈ వాణిజ్య ఒప్పంద చర్చలను  లాంఛనంగా ప్రారంభించాయి. తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు ఒక వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్‌ ప్రకటనను విడుదల చేశారు.

100 బిలియన్‌ డాలర్లకు..

ప్రస్తుతం భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్‌ డాలర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్‌వేగా ఉండడం మరో కీలక అంశం.

స్మారక స్టాంప్‌ ఆవిష్కరణ:

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు పీయూష్‌ గోయెల్, బ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మరీ సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశారు.

చ‌ద‌వండి: భారత వెలుపల యూపీఐని అమలు చేయనున్న తొలి దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) చేసుకున్న దేశాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : భారత్‌–యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Feb 2022 04:01PM

Photo Stories